హిందీ మూలం : డా. యశోధర భట్నాగర్
తెలుగు అనువాదం : డా. వి.ఎల్. నరసింహం శివకోటి
కారు దిగి హడావుడిగా లిఫ్ట్ వైపు కదిలాను. లిఫ్ట్ బటన్ నొక్కాను. కానీ అది కిందకి వచ్చేవరకు ఆగలేక మొదటి అంతస్తు కి లిఫ్ట్ ఎందుకులే అని గబగబా మెట్లెక్కుతూ ఫ్లాట్ నెంబరు 103 కి చేరుకున్నారు. ఈ ఫ్లాట్ నాకు కొత్త ఏం కాదు. ఇంతకు ముందు ఎన్నో సార్లు వచ్చాను. అయితే ఇవాళ పరిస్థితి వేరు. నా మనసు మనసులో లేదు. పెద్దక్కని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు కొట్టుకుపోతోంది.
కావాలనే కాలింగ్ బెల్ నొక్కకుండా తలుపు తట్టాను. తలుపు దానంతట అదే తెరుచుకుంది.
పెద్దక్క …. పెద్దక్క అంటూ అక్క గదిలోకి వెళ్ళాను.
అయ్యో! ఇదేంటి ఎప్పుడూ శుభ్రంగా కళకళలాడుతూ సువాసనలు వెదజల్లే పెద్దక్క గది ఇవాళ మందుల వాసనతో ఆసుపత్రి గదిలా ఉంది? ఆసుపత్రిలో ఉండే మంచంలాంటి మంచం. దానిమీద తెల్లటి దుప్పటి. సైడ్ టేబులు మీద ఎప్పుడూ తాజా పువ్వులతో ఉండే ఫ్లవర్ వాజ్ లో ఇవాళ ఎండిపోయిన పువ్వులు నిర్జీవంగా తలలు వేలాడేసి ఉన్నాయి.
ఫ్లవర్ వాజ్ పక్కన చాలా వరకు స్థలాన్ని రకరకాల ఆకారాల్లో ఉన్న మందుల సీసాలు, టాబ్లెట్ ప్యాకెట్లు ఆక్రమించేసుకున్నాయి.
తలగడని ఆనుకుని కళ్ళు మూసుకుని నిద్రపోతున్న వడలిపోయిన ఆకులాంటి పెద్దక్క ముఖం చూస్తే ఏదో మంచు పర్వతం మీద తపస్విని మోక్షం కోసం తపస్సులో లీనమైనట్టు ఉంది.
“పెద్దక్కా!” ఉద్వేగాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ పెద్దక్క భుజం మీద మెల్లగా చెయ్యి వేశాను.
“వచ్చావా?” – ఆమె తడి ఆరిపోయిన పెదవుల మీద సన్నగా చిరునవ్వు మెరిసింది.
తడిబారిన కళ్ళతో నవ్వడానికి ప్రయత్నిస్తూ పెద్దక్క వైపు చూశాను.
“ఏమైపోయావు ఇన్నాళ్ళు? ఇప్పటి వరకు రాకపోతే ఇంక నేను పోయాకనే …”
“ఛ ఊరుకో! ఏంటి ఆ అపశకునం మాటలు?” అంటూ ఆమె పెదవుల మీద చెయ్యి ఉంచాను.
“ఎవరీమె?” పెద్దపెద్ద కళ్ళు చక్రాల్లా తిప్పుతూ నర్సు, బిట్టూ కూతురు మినీని అడుగుతోంది.
బహుశా ఈ ప్రశ్న పెద్దక్క చెవిన పడ్డట్టు ఉంది.
వడిలి పోయిన పెద్దక్క ముఖంలో లేత గులాబి రంగు పరుచుకుంది – “నా చెల్లెలు, పిన్ని కూతురు. అమెరికాలో ఉంటుంది.”
పెద్దక్క గొంతు కూడా కాస్త స్వరం పెరిగినట్టు అనిపించింది.
“నా పెళ్ళిలో ఇదే మా ఆయనకి ఏకైక మరదలు పిల్ల.”
“అయ్యో అక్క, అదేం మాట, నీకు ఇంకా కజిన్స్ ఉన్నారు కదా… పెద్దమ్మ కూతుళ్ళు, పిన్నమ్మ కూతుళ్ళు…” పెద్దక్కకి గుర్తుచేశాను.
“హయ్యో, అసలు పని అంతా నెత్తినేసుకుని చేసిందే నువ్వు. వంటల దగ్గర, వడ్దనల దగ్గర ఒకచోట అని ఏం చెప్పేదిలే. అంతా నువ్వే అయ్యి చూసుకున్నావు. బావ గారి చెప్పులు దాచింది కూడా నువ్వే. ఈయన అయితే ఎప్పుడూ ‘నాకు ఉన్నది ఒక్కర్తే గారాల మరదలు’ అంటూ ఉండేవారు.”
పది నిమిషాల క్రితం వరకు స్పృహలో లేనట్టు నిద్రమత్తులో ఉన్న పెద్దక్క ముఖంలో ఒక్కసారి తెలియని ఉత్సాహం …. తేజస్సు.
“నువ్వు కాపురానికి వెళ్తూంటే నిన్ను పట్టుకుని ఎంత ఏడిచానో గుర్తుందా? ఏడ్చి ఏడ్చి నా కళ్ళు వాచిపోయాయి కూడా.”
“అవునే. మరి ఇప్పుడు ఎలా పంపిస్తావు నన్ను? ఏడవకు. ఈసారి మాత్రం ఏడుస్తూ పంపకు. నవ్వుతూ సాగనంపు.” అంటూనే పెద్దక్క గొంతు పూడుకుపోయింది.
“ప్లీజ్ అక్క, అలా మాట్లాడకు.” అంటూ పెద్దక్కని గట్టిగా కౌగిలించేసుకున్నాను. ఎముకల మూటని కౌగిలించుకున్నట్టు అనిపించింది.
“నాకు ఇంకా ఎన్ని విస్తర్లు మిగిలి ఉన్నాయో ఆ భగవంతుడికే తెలియాలి. ఆ పిలుపు కోసమే ఈ ఎదురు చూపులు. క్యాన్సర్ చివరి దశలో ఉన్నాను. ఈ పసిదాన్ని ఎవరు చూసుకుంటారన్న బాధ తప్ప నాకు మరేం దిగులు లేదు. ఈ పసిదాని ముఖం చూసే బహుశా నాకు ఇంకా ఈ సంసార బంధాల నుండి ముక్తి దొరకట్లేదు అనుకుంటా.”
“కోడలు ఎక్కడకి వెళ్ళినట్టు?” మనసు ఏదో కీడు శంకిస్తూండగా అడిగాను.
“ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చావు కదా, నీకు ఇక్కడి సంగతులు ఏం తెలియవు. ఒక సునామీ ఈ ఇంటి సంతోషాలని అన్నింటినీ తనలోకి లాగేసుకుంది.”
మినీ పెద్ద-పెద్ద కళ్ళు కిందకి వాలిపోయాయి. మినీని చూస్తే ఎనిమిది-తొమ్మిదేళ్ళ పసి మనసుకు కూడా ఎంతో పెద్దరికం వచ్చినట్టు, ఎన్నో విషయాలని అర్థం చేసుకుంటున్నట్టు అనిపించింది.
“కొడుకు పెళ్ళి విషయంలో, మనల్ని అర్థం చేసుకుని, మనలో కలిసిపోయే అమ్మాయి అయితే చాలు, అందం అంత ముఖ్యం కాదు” అనుకున్న సంగతి నీకు తెలిసిందే కదా!
అవునవును. చక్కటి రూపవతి అయిన పెద్దక్క, అందగాడైన తన ఒక్కగానొక్క కొడుకుకి సాదాసీదా, ఒక మోస్తరు అందగత్తెతో పెళ్ళి నిశ్చయించింది అని తెలిసినప్పుడు నేను నిజంగానే ఆశ్చర్యపోయాను.
సంబంధం కుదిరిన పదిహేను రోజులకే బిట్టూ-నేహాల పెళ్ళి ఎలాంటి హంగు-ఆర్భాటాలు, కట్న కానుకలు లేకుండా జరిగిపోయింది. విశాలమైన పెద్దక్క మనసుని అభినందించకుండా ఉండలేకపోయాను కూడా.
“ఏం చెప్పమంటావు? మేం చాలా మోసపోయాం. నేహా డిగ్రీ చదివింది అని చెప్పారు. కానీ ఆమె ఇంటర్ ఫెయిల్. సరేలే, చదువుది ఏముంది అని సరిపెట్టుకున్నాం. ఇప్పుడు మన ఇంటి కోడలు, మనమే చదివించుకుందాం అనుకున్నాం. అయితే ఆమె ఆగడాలకి హద్దు లేకుండా పోయింది. ఆమెకి బిట్టూ మీద చాలా అనుమానం.”
“అయ్యో బిట్టూ ఎంత అమాయకుడు? వాణ్ణి అనుమానించిందా?”
“ఏం చెప్పాలి? నేహాది అంతా రెటమతం. రోజంతా ఆఫీసులో కష్టపడి అలసిపోయి ఇంటికి కాస్త ఆలస్యంగా వస్తే చాలు, ఇల్లు పీకి పందిరి వేసేది. చాకుతో చెయ్యి కోసుకుని, పోలీసు స్టేషనుకి వెళ్ళి మా మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇది చాలదు అన్నట్టు అదనపు కట్నం కోసం వేధిస్తున్నామని మా మీద నిందలు మోపింది. మా ముగ్గురికీ ఆ రోజు పోలీసు స్టేషనులోనే తెల్లవారింది, పరువు ఎలాగూ పోయింది. ఆమెకి ఎలాంటి నదురు-బెదురు లేదు కానీ, మేం సమాజానికి భయపడిపోయాం. పోలీసు స్టేషను నుండి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ మా ఇంట్లోకే మేం దొంగల్లా రావాల్సి వచ్చింది. చెయ్యని నేరానికి తల దించుకోవాల్సి వచ్చింది.”
నలుగురూ నాలుగు రకాల మాటలన్నారు. కొన్ని మా చెవిన పడ్డాయి. కొన్ని మా చేత బలవంతంగా చెప్పించారు. మా ఇల్లంటే అందరికీ ఏదో వేళాకోళం అయిపోయింది.
మర్నాడే నేహ ఈ చంటిపిల్లని ఇక్కడే వదిలేసి పుట్టింటికి ఫరీదాబాద్ వెళ్ళిపోయింది. కనీసం కన్నపేగు అయినా కదల్లేదు. చంటిపిల్లకేసి మళ్ళీ తలతిప్పి చూస్తే ఒట్టు. ఈ ఇంటిని, చంటి పిల్లని వదిలి వెళ్ళి ఎనిమిదేళ్లు అయిపోయింది.
“ఆ తర్వాత మా మీద ఎన్నెన్ని నిందలేసిందో లెక్క లేదు. ఫరీదాబాదు కోర్టులో ఇప్పటికీ విడాకుల కేసు నడుస్తోంది.”
చెప్తూ చెప్తూ పెద్దక్క ఆయాసపడుతోంది.
“సరే పెద్దక్క, ఊరుకో, విశ్రాంతి తీసుకో.”
నర్సు ఆమెను కాస్త లేపి మంచినీళ్ళు తాగించింది.
“నా జీవితంలో విశ్రాంతి ఎక్కడ మిగిలింది చెల్లీ?”
నర్సు ఆమెకి రెండు వైపులా రెండు తలగడలు పెట్టింది.
పెద్దక్క మంచం పక్కన ఉన్న బెల్ మోగించింది. వెంటనే పనిమనిషి హాజరయింది.
“శోభ, వడ్డించెయ్యి. చాలా ఆకలేస్తోంది.”
ఆమె ఆశ్చర్యపోతూ, “ఇదిగో అమ్మ, ఇప్పుడే వడ్డిస్తున్నా” అంటూ వంటింట్లోకి పరుగెట్టింది.
కుదమట్టంగా ఉన్న పాతిక-ముప్పై ఏళ్ళ శోభని చూడగానే ‘కలుపుగోలు మనిషి’ అనిపించింది.
మెరుపు వేగంతో రెండు ప్లేట్లలో అన్నం వడ్డించి తీసుకొచ్చింది.
పెద్దక్క వణుకుతున్న చేతులు చూసి ‘నన్ను తినిపించమంటావా?’ అని అడిగాను.
“ఈ చేతుల్లో చాల బలం ఉంది చెల్లాయ్… ఏదో నువ్వు వచ్చిన ఆనందం పట్టలేక అంతే” అంటూన్న పెద్దక్క కళ్ళు మెరిశాయి… వాడిపోయిన ముఖం వికసించింది.
“వంట బ్రహ్మాండం శోభ! మజ్జిగ పులుసు, మెంతి వంకాయ కూర, అద్భుతం.” – అన్నాను.
“వంట అంతా అమ్మగారు నేర్పించిందే.” అంటూ శోభ నవ్వేసింది.
“వెళ్ళు, వెళ్ళి ఆ రవ్వ లడ్డు కూడా తీసుకురా” అంటూ శోభని వంటింట్లోకి పంపి, పెద్దక్క నా వైపు చూసింది.
“పెద్దక్క! నువ్వు ఏం మారలేదు, అస్సలు ఏం మర్చిపోలేదు. నాకు ఇష్టమైన మజ్జిగ పులుసు, మెంతి వంకాయ కూర, రవ్వ లడ్డు…”
“చాలా మారిపోయిది..ఇదిగో నన్ను చూడు ….”
ఎప్పుడైనా నా ముఖం నేను అద్దంలో చూసుకుంటే ఉలిక్కిపడతాను. అసలు ఇది నేనేనా అనిపిస్తుంది. ఏ అందం చూసి, మీ బావ గారు నా వెంట పడి మరీ పెళ్ళి చేసుకున్నారో, ఆ అందం అంతా ఏమయిపోయిందా అనిపిస్తుంది. అదృష్టవంతులు …. ఆయన నన్ను ఇలా చూడకుండానే …. ఇంక పెద్దక్క నోట మాట రాలేదు. గొంతు పూడుకు పోయింది. మెల్లగా తల మీద నుండి జారిన చెంగు మళ్ళీ పైకి కప్పుకుంది. కీమో థెరిపీ తర్వాత ఇప్పుడిప్పుడే వస్తున్న వెంట్రుకలతో చిన్న జడ అల్లడం కూడా కుదరక అలాగే వదిలేశారు.
ఆమె నల్లటి ఒత్తైన జడని ఈ మాయదారి రోగం మింగేసింది. నల్లటి త్రాచుపాము లాంటి పొడవాటి జడ పిరుదుల వరకు ఉండేది. ఆ బరువు మొయ్యలేక పెద్దక్క అప్పుడప్పుడు – “ఈ దిక్కుమాలిన జడతో వేగలేకపోతున్నాను. బరువుకి మెడలు గుంజేస్తున్నాయి. ఎప్పుడో కత్తిరించి పడేస్తాను” అంటూ ఉండేది.
మళ్ళీ నా కళ్ళు చెమ్మగిల్లాయి.
“ఇక్కడ ఎన్నాళ్ళు నీ ప్లాన్? ఇదిగో చూసావుగా. నా దగ్గర ఉంటే ఇలాగే ఏడుపులు… ఇల్లంతా ఏదో దుఃఖపు తెర పరచుకున్నట్టు ఉంది.”
“నేను మళ్ళీ రేపే బయలుదేరాలి అని చెప్పడానికి నోరు పెగల్లేదు.”
గోడమీద పూల మాల వేసి ఉన్న బావగారి ఫోటో కేసి చూస్తూ ఉండిపోయాను.
“వెళ్ళు, వెళ్ళి ఆ ఎదురుగా ఉన్న బెడ్రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకో.”
“బెడ్రూమ్ లో ఎందుకు? నేను ఇక్కడే నీ పక్కనే కూర్చొంటాను” అని మంచం పక్కన ఉన్న సోఫాలో కూలబడ్డాను.
గది అంతా ఒక రకమైన మౌనం. కానీ ఆ మౌనం కూడా ఎన్నో కబుర్లు చెబుతున్నట్టు ఉంది. మెదడులో ఎన్నో ఆలోచనల బాణాలు… ఇంటి ప్రతి మూల ఏదో దురదృష్టాన్ని కథలు కథలుగా చెబుతున్నట్టు ఉంది. బిల్డింగుని ‘ఇల్లు’ గా మార్చేది ఇంటి కోడలే! అందుకే ఆమెను ‘గృహలక్ష్మి’ అంటారు.
“పెద్దక్క, అసలు కోడలు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు?”
పెద్దక్క కళ్ళు మూసుకుని ఉంది, కానీ నిద్రపోలేదు. బహుశా తను కూడా ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్నట్టు ఉంది.
“యోగ్యుడైన మొగుడు, చక్కదనాల చుక్క లాంటి కూతురు, మంచి అత్తగారిల్లు, అయినా ఆమెకి ఇవేం నచ్చలేదు. మా కొంపని కూల్చే వరకు ఆమెకి నిద్ర పట్టలేదు. రోజుకొక పంచాయితీ. బహుశా ఆమెకి అదే ఇష్టం అనుకుంటా. తన జీవితం నరకం చేసుకుంటూనే మిమ్మల్ని కూడా నరకంలోకి తోసేసింది.”
కాసేపు ఆగి, మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది –
“వంటింట్లో అడుగు పెట్టేది కాదు. ఎప్పుడూ బయట నుండి ఆర్డర్లు పెట్టుకునేది. అయినే మేం పట్టించుకోలేదు. ఏదో ఒక వంకన రోజుకొక రకం గొడవ పెట్టుకునేది.” పెద్దక్క గొంతు చాలా పీలగా వస్తోంది.
నేను చెవి ఒగ్గి ఒక్కొక్క మాట శ్రద్ధగా వింటున్నాను.
“వదిలెయ్ అక్క, నువ్వు ప్రశాంతంగా నిద్రపో.”
“అలసిపోయాను. కానీ ఏదీ వదల లేక పోతున్నాను. గడిచిన నిన్నని, నేటిని, రాబోయే రేపటి రోజుని, ఈ దేహాన్ని….. దేన్నీ వదల లేకపోతున్నాను. నన్ను పీల్చి పిప్పి చేస్తున్నట్టు అనిపిస్తోంది. ‘ఈ ఇంటిని, కుటుంబాన్ని నాశనం చేసి కానీ నిద్రపోను’ అని శపథం చేసి మరీ వెళ్ళింది. కోర్టుల చుట్టూ తిరుగుతూ అంతా సర్వనాశనమే అవుతోంది – డబ్బు, పరువు-ప్రతిష్ఠ, ఆరోగ్యం…”
మినీని చూడు …. తల్లి ఉండీ, తల్లిలేని పిల్లలా పెరుగుతోంది. నీ బావగారు ఒంట్లోని చక్కెరనే అరిగించుకోలేని మనిషి, ఈ కుటుంబంలో కరిగిపోయిన చేదుని కూడా తట్టుకోలేకపోయారు.
బిట్టూ, ఎన్ని నిందలు వేసినా పడ్డాడు కానీ తన శీలాన్ని శంకిస్తే తట్టుకోలేకపోయాడు. నిట్టనిలువునా కూలిపోయాడు.
మీ బావ గారు, కోడలు ఎన్ని మాటలు అన్నా పడ్డారు కానీ …. ఆయన తనని వంకర చూపు చూస్తున్నారు, చెడు దృష్టితో చూస్తున్నారు అంటే మాత్రం కృంగిపోయారు.
మాటిమాటికీ కోర్టులో హాజరవ్వడం … అవే తప్పుడు నిందలు మోపడం … ఈ పరిస్థితులు అన్నీ కలిసి ఆయన్ని లోపల లోపల తినేశాయి.
“ఆ రాత్రి ఆయనకి కాళరాత్రి అయ్యింది. రాత్రి పడుకుంటే, తెల్లవారి మళ్ళీ లేవనే లేదు. నిద్రలోనే …. శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. హార్ట్ ఫెయిల్… నా కొంప మునిగిపోయిందే చెల్లీ ….” అంటూ బావురుమంది.
మీ బావ గారు బాగానే వెళ్ళిపోయారు …. ఇవన్నీ వదిలించుకుని. నాకు ఆ అదృష్టం కూడా లేకపోయె! మమ్మల్ని చూడు. ఈ రోజుకీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. బిట్టూ అప్పుడప్పుడు ఫరీదాబాదు కోర్టుకి వెళ్ళొస్తూ ఉంటాడు. ఆరోగ్యం బాగోలేక, మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చామని నా మాటలు మాత్రం వీడియో కాల్ లో రికార్డు చేస్తున్నారు.
మా సంగతి సరే. ఈ పసిపిల్ల ఏం పాపం చేసినట్టు? నోరు తెరిచి ఏం చెప్పదు కానీ, ఎంత నలిగిపోతోందో నాకు తెలుసు. పిల్ల చూస్తే పెద్దది అవుతోంది. రోజులు చూస్తే బాగోలేవు. ఇన్నాళ్ళూ నేనే మంచి చెడు చెబుతూ వస్తున్నాను. నా తర్వాత ఈ పిల్లని ఎవరు చూసుకుంటారు?” అంటూ పెద్దక్క వెక్కివెక్కి ఏడ్చేసింది.
“నానమ్మ! ప్లీజ్ ఏడవకు. నువ్వే చెప్పావు కదా కన్నీళ్ళు మనకి ‘ఎనిమీస్’ అని, అవి మనల్ని ‘వీక్’ చేసేస్తాయి అని” మినీ తన చిట్టి చేతులతో నాయనమ్మ కళ్ళు తుడవబోతే, పెద్దక్క కన్నీళ్ళు ఆపుకుని, మనవరాలి తల నిమిరింది.
పరిస్థితులు, మినీలో వయసుకి మించిన గాంభీర్యం తీసుకొచ్చినట్టు అనిపించింది. మినీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమె ఉంగరాల జుట్టులో వేళ్ళు పెట్టి రింగులు-రింగులు తిప్పుతూంటే ఆమె నవ్వుతూ గట్టిగా నన్ను వాటేసుకొంది.
“చాక్లెట్ తింటావా?”
“ఓ తింటా..” అంటూ తల ఊపింది.
పర్సులో నుండి చాక్లెట్ తీసి ఇస్తే దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ తింది. కాసేపాగి చూస్తే, చేతులు, బుగ్గలూ అంతా చాక్లెట్ అంటుకుని ఉంది.
నేను ఆమె నుదుటిన ముద్దు పెట్టాను.
“లవ్ యూ నానమ్మ!” మినీ ప్రేమ నా మనసు లోతుల్లోకి ఇంకిపోయింది.
మినీ నాతో అంతలా కలిసిపోవడం చూసి పెద్దక్క చాలా సంతోషించింది.
“చూడవే, మన వాళ్ళు-పరాయి వాళ్ళు, మిత్రులు-శత్రువులు ఇలా అందర్నీ చూశాను. ఎవరి కోసం నేను
పడి-పడి చాకిరీ చేసానో, నా వాళ్ళు అనుకుని డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టానో వాళ్ళల్లో ఒక్కరు కూడా మీ బావ గారు పోయాక ఈ గుమ్మం తొక్కితే ఒట్టు. ఇవాళ నా అనే ఒక్క మనిషి పలకరింపు కోసం తహతహలాడి పోతున్నాను. వచ్చి కలవడం మాట పక్కన పెడితే, పొరపాటున ఒక్క ఫోను చేసిన పాపాన పోలేదు ఎవ్వరూ. బహుశా నేను ఎప్పుడు ఛస్తానా అని ఎదురు చూస్తూ ఉండొచ్చు. అప్పుడు కచ్చితంగా వస్తారు. మొసలి కన్నీరు కారుస్తారు. కానీ ఇప్పుడైతే నేను ఒంటరిగా ఏడుస్తున్నాను.”
“ఈ దిక్కుమాలిన రోగాన్ని తట్టుకోగలుగుతున్నాను కానీ ఒంటరితనాన్ని తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా గాఢ నిద్ర కోరుకుంటున్నాను… నా పిచ్చి కానీ మనం కోరుకున్నవి అన్నీ జరుగుతాయా! మినీ ఇంకాస్త పెద్దిది అయ్యే వరకు నాకు ఈ అంపశయ్య తప్పేలా లేదు… ఏమంటావు?”
పెద్దక్క ముఖంలో ఒక రకమైన పెంకితనం కనిపిస్తోంది. నా కళ్ళకి ఆమె ‘జీవిత పోరాటంలో అలుపెరగని సిపాయి’లా కనిపించింది.
మళ్ళీ గది అంతా మౌనం పరచుకుంది. అయితే ఈ సారి ఈ మౌనం దిగులు కాదు, ఒక బలమైన ‘ఆత్మ స్వీకృతి’. పరిస్థితులని మనస్పూర్తిగా అంగీకరించడం. బయట కుక్కలు మొరుగుతున్నాయి. ఆ నిశ్శబ్ద రాత్రి కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది.
నేను మెల్లగా లేచి శోభతో – “పిల్ల పక్క కూడా ఇక్కడే, నా పక్కనే …. ఈ చిన్న నానమ్మ పక్కనే వెయ్యి.” అన్నాను.
“సరే అమ్మా! పిల్ల కూడా అదే అడుగుతోంది” అంది శోభ.
కాసేపటికి మినీ నన్ను గట్టిగా కౌగిలించుకుని నిద్రపోయింది.
నేను మెల్లగా లేచి పెద్దక్క వడలిపోయిన చేతిని నా చేతుల్లోకి తీసుకుని – “అక్కా, నువ్వు ఒంటరి దానివి కాదు. నీకు నేను తోడున్నాను. ధైర్యంగా ఉండు” అన్నాను.
పెద్దక్క మెల్లగా కళ్ళు తెరిచి నావైపు చూసి నా వాగ్దానాన్ని ప్రేమతో స్వీకరించినట్టు చిన్నగా నవ్వింది.
పెద్దక్క చెంపల మీద రెండు కన్నీటి చుక్కలు ….
రాత్రి గడుస్తోంది. గడియారంలో పెద్ద ముల్లు-చిన్న ముల్లు నిశ్శబ్దంగా కదులుతున్నాయి. పెద్దక్క ఊపిరి మెల్లగా, స్థిరంగా వినిపిస్తోంది. ఆమెకి కాస్త ఉపశమనం కలిగినట్టు అనిపించింది.
తెల్లవారుతూనే కిటికీలో నుండి వెలుతురు నన్ను నిద్ర లేపింది. పక్షుల కువకువలు, చల్లటి గాలి తరంగాలు, ఉదయ భానుడి లేత కిరణాలు – ఇవన్నీ కలిసి దిగులు మేఘాలని ఆ గదిలో నుండి తరిమేసినట్టు అనిపించింది. అయినా, ఇంకా ఏదో ఒక మౌనం అక్కర్లేని అతిథిలా ఆ గదిలో కాళ్ళు చాపుకుని కూర్చొన్నట్టు ఉంది.
“పెద్దక్క!” అంటూ నేను ఆమె నుదుటిని తాకి చూశాను … చల్లగా … ప్రశాంతంగా…! ఎంతో ప్రశాంతంగా ఉంది. ముఖం పై ఒక చిన్న చిరునవ్వు. ఆమె ఏదో ప్రయాణానికి బయలుదేరినట్టు …. ఆ ప్రయాణంలో తన బాధలు అన్నీ వదిలేసినట్టు ….. గొప్ప ప్రయాణంలా… చివరి ప్రయాణంలా…
నేను పెద్దక్క చెయ్యి పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాను.
శోభ నా చెయ్యి గట్టిగా పట్టుకుని – “పెద్దమ్మ గారు నిజంగానే గాఢ నిద్రలోకి జారుకున్నట్టు ఉన్నారు” అని భోరుమంది.
నాకు కన్నీళ్ళు ఆగటం లేదు.
“పెద్దక్క …. పెద్దక్క!”
నా ఏడుపుకి మినీ ఉలిక్కి పడి లేచింది.
“నానమ్మ! నానమ్మ!”
నేను ఏడుస్తున్న కళ్ళతో మినీ వైపు చూసి, రెండు చేతులూ చాచి మినీని గుండెలకి హత్తుకున్నాను.
“మినీ, డోంట్ వర్రీ. ఐ యాం యువర్ నానమ్మ. ఐ యాం దేర్ ఫర్ యూ అండ్ విల్ బి విత్ యూ…!”
![]()
డా. యశోధర భట్నాగర్
గ్వాలియర్ లో జన్మించిన డా. యశోధర భట్నాగర్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్సు), డా. హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుండి హిందీ సాహిత్యంలో ఎం.ఏ., పట్టాలు, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ హిందీ విద్యాపీఠం, బృందావనం నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. సెంట్ మేరీస్ కాన్వెంట్ స్కూలు నుండి హిందీ శాఖ అధ్యక్షులుగా పదవీ విరమణ చేసిన డా. భట్నాగర్ ఇప్పటి వరకు మూడు లఘు కథానిక సంకలనాలు, మూడు కవిత సంకలనాలు, ఒక యాత్రా కథనాల పుస్తకం ప్రచురించారు. వీరి రచనలు ప్రముఖ జాతీయ స్థాయి పత్రికల్లో అచ్చయ్యి పాఠకుల మన్ననలు అందుకున్నాయి.
హిందీ లఘు కథానికల రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్న డా. భట్నాగర్ తమ సాహితీ సేవకు గాను సాహిత్య అకాడమీ, మధ్యప్రదేశ్ సంస్కృతి పరిషత్తు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రఖ్యాత ‘జైనేంద్ర కుమార్ జైన్ పురస్కారం’, ‘కృతి సమ్మాన్’, ‘డా. గాయత్రీ దేవీ సమ్మాన్’, ‘పండిత్ శివ శరణ్ ద్వివేదీ స్మృతి కవిత సమ్మాన్’, ‘కృతి కుసుమ్ సమ్మాన్’, ‘డా. ఎస్.ఎన్.తివారీ స్మృతి సమ్మాన్’, ‘శ్యామ్ సుందర్ వ్యాస్ సమ్మాన్’,
‘సుష్మా స్వరాజ్ అవార్డు’ సహా మరెన్నో పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు.
వీరి లఘు కథానికలు, తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ, బంగ్లా, ఒడియా, పంజాబీ, మరాఠీ, అవధీ, భోజపురీ, నేపాలీ వంటి పలు భాషల్లోకి అనువదించబడ్డాయి.
మొబైల్ : 9425306554
డా.వి.ఎల్.నరసింహం శివకోటి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎమ్.ఏ. (ఫంక్షనల్ హిందీ & ట్రాన్సలేషన్) (గోల్డుమెడల్), ఎమ్.ఫిల్., (హిందీ) (గోల్డుమెడల్), పిహెచ్.డి., (హిందీ) పట్టాలు పొందిన డా. నరసింహం శివకోటి హిందీ-తెలుగు భాషల మధ్య పరస్పర అనువాదం, తులనాత్మస సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను ‘ప్రభాత్ కిరణేఁ’, ‘అనావరణ్’ శీర్షికన తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రచురించారు. అలాగే, ప్రముఖ హిందీ కవి శ్రీ నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను తెలుగులోకి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ హిందీ రచయిత్రి శ్రీమతి మమతా కాలియా గారి రెండు నవలికలను ‘పరుగు’, ‘అదే నీవు, అదే నీవు’ శీర్షికన తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ఎంపిక చేసిన హిందీ లఘు కథానికలను తెలుగులోకి అనువదించి ‘తోలుబొమ్మలు’ శీర్షికన ప్రచురించారు. వీటితోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలను తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజరు (రాజభాష) గా సేవలు అందిస్తున్నారు.
మొబైల్ : 8247069811 ; ఈ-మెయిల్ : sivakoti.litt@gmail.com



