హిందీ మూలం: సుధా అరోడా
అనుసృజన: ఆర్ శాంతసుందరి
అనుసృజన: ఆర్ శాంతసుందరి
సాధారణంగా ఇళ్ళు
ఇటుకలూ, సున్నం పూత ఉన్న గోడల కట్టడాలే
అవి ఇళ్ళు కావు…
వేళ్లతో సహా పెకలించబడి
తన ఇంటిని వదిలి వస్తుంది ఆడపిల్ల
నాటుతుంది తన కాళ్ళని
మరో వాకిట్లోని గరుకైన మట్టిలో
ఏర్పాటు చేసుకుంటుంది తనకి తానే గాలీ – నీరూ, ఎరువూ
కాళ్ళు మట్టిలో కదలకుండా ఉండేందుకు
అక్కడ పచ్చగా జీవించి ఉండేందుకు
తనని కొమ్మలా విరిచి అంటు పెట్టారు మరి !
ఒక రోజు
అక్కణ్ణించి కూడా విసిరివేయబడింది
కారణం అవసరం లేదు
ఎటువంటి సాకూ అక్కర్లేదు
ఎవరూ అడగరు ఇదేమిటని
రెండు జానలు చెయ్యైనా జాపరు
ఆమెని పడకుండా పట్టుకునేందుకు…
ఆమె మళ్ళీ పెకలించబడిన
తన పాతింటికి వెళ్తుంది
తనని పెకలించిన ఖాళీ జాగాని కప్పేశారని చూస్తుంది
తనని పెకలించినట్టు
ఎక్కడా గుర్తైనా లేకుండా …
అకారణంగా బైటికి తరిమేసిన
ఆ చోటికే వెళ్తుంది మళ్ళీ
వెతికినా కనబడదు తను నాటుకుని పెరిగిన చోటు
ఆ మన్నూ, ఆ తడీ, ఆ ఎరువూ !
జీవితమంతా వెతుక్కుంటూ తిరుగుతూనే ఉంటుంది
ఇటుకలూ సున్నంతో కట్టిన గోడలమధ్య
ఇల్లు ఇక్కడే ఎక్కడో ఉండాలి, అనుకుంటూ.



