• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కథ: నది మది

పిన్నంశెట్టి కిషన్ by పిన్నంశెట్టి కిషన్
August 10, 2026
in అనువాద కథలు
0
ఆంగ్ల కథ: నది మది

ఆంగ్లమూలం: గాయ్ డి మోపాసాన్ ‘On the River’ 
తెలుగు అనువాదం : పిన్నంశెట్టి కిషన్

పారిస్ నగర ఉక్కిరిబిక్కిరికి నాలుగు కోసుల దూరాన, సైన్ నది ఒడ్డున పోయిన ఎండాకాలం ఓ ఇల్లు కిరాయికి తీసుకున్న. పగటి ఉక్కపోతల్నుంచి బయటపడి రాత్రులు సేదదీరడానికి, ప్రతి రోజు సాయంత్రం అక్కడికి బయలుదేరుతాను. కొద్ది రోజులకి పక్కింటి వ్యక్తి పరిచమయ్యిండు. అటీటుగా ముప్పై నలభై ఏళ్ల మధ్య వయస్కుడు. అంతటి విడ్డూరం మనిషిని ఇప్పటిదాకా నా జీవితంలో చూళ్లేదు. పడవ నడపడం కేవలం పని కాదు, అతనికో వెర్రి. నీళ్ల అంచున, నీళ్ల పైన లేకపోతే నీళ్ల లోపల.. నీటిచరం లెక్క నిరంతరం తిరిగేటోడు. అతిశయం కాదు కానీ, బహుశా అతను పడవలోనే జన్మించి ఉంటాడు. చివరాఖరికి మాత్రం తప్పక ఆ పడవలోనే మరణిస్తాడు, ఇందులో ఏమాత్రం సంశయం లేదు.

సాయంకాలం వేళ మేమిద్దరం సైన్ నది ఒడ్డున నడుస్తుండగా, ఆయన నీటి జీవితపు ముచ్చట్లు ఏమన్నా చెప్పమన్న. ఆ మాట వినడమే ఆలస్యం… ఒక్కసారిగా, ఊపిరి పోసుకున్న ఉత్సాహంగా ఉరకలెత్తాడు. ముఖ కవళికల్లో మార్పు స్పష్టంగా రంగులు మారి కనిపించింది. కవితాత్మక వాక్ప్రవాహమయ్యాడు. నది ఆవహించి, గుండె గదిల దాగివున్న ప్రగాఢ వాంఛ ఏదో అదుపు చేయలేనంతగా పెల్లుబికి, ఆరాట కెరటంలా ఎగిసిపడ్డాడు.

“మనం నడిచే ఈ నదితో కలబోసుకున్న యాదులు ఎన్నని చెప్పను! పట్నంల ఉండే నీలాంటి వాళ్ళకి నది ముత్తెమంత సుత తెల్వదు. కాంక్రీట్ అరణ్యాలకు భిన్నంగా మత్స్యకారుల దునియా ఎలా ఉంటుందో విను. నది అతనికి మార్మికం, అగాధం, అంతుచిక్కని రహస్యం. ఎండమావుల తాండవం, భూత ప్రేత పిశాచాల్ని ఆడించే ఆట. రాత్రి మాత్రమే కనిపించే, పగటి రూపాలు లేనిది. వింత శబ్దాలు ఏవో వినిపిస్తాయి కానీ ఎక్కణ్ణుంచని గుర్తించలేం, ఎందుకో తెల్వకుండనే గజగజలాడిపోతాం. స్మశానంలో ఒంటరిగా- అది కూడా సమాధి పలకల కప్పులు లేని, తెరిచిన బొందల మీదుగా నడిచేటప్పుడు ఎట్లుంటదో.. రాత్రి పూట నది అట్లా ఉంటది!

పడవ నడిపేటోళ్లకు నదీతలం పరిమితంగానే కనిపిస్తూ ఉంటుంది. అదే రాత్రిళ్ళు—చంద్రుడు లేని చీకటి కాలంలో నది అపరిమితంగా విస్తరించి తోస్తుంది. సముద్ర నావికులకు ఇలాంటి అనుభూతి ఉండదు. సముద్రం తరచుగా… నిర్దయగా ఉంటుంది, అది సత్యం. కానీ దానికో లెక్కా పత్రం ఉంటుంది. ఉగ్రపడేది, గర్జించేది గుర్తుపట్టచ్చు. దానికి నిజాయితీ ఎక్కువ. నది అట్లా కాదు… కడుపు కపటమైంది. సడి-సప్పుడు కాకుంట పారుతది. ఏ లొసుగులు, ఏ లోతులు లోన దాచుకుందో ఎవ్వరికీ తెల్వనివ్వదు. ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు కెరటాల కంటే కూడా… నిశ్శబ్దంగా పారే నది నీళ్లను చూస్తేనే పానం జల్లుమంటది.

కలలు కనే భావుకులు, సముద్రం తన గుండెల్లో అనంత నీలి లోకాల్ని దాచుకుందని చెప్తారు. నీట మునిగిన వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద చేపల మధ్య, అపురూప అడవులు, స్ఫటిక గుహల నడుమ తిరుగుతరని అంటుంటారు. కానీ, ఈ నదికి మాత్రం కేవలం నల్లటి అగాధాలు మాత్రమే ఉన్నాయి… ఎక్కడో అడుగున బురదలో మనిషి కుళ్ళిపోయే చీకటి లోతులు అవి! అయినప్పటికీ, ఉదయ సూర్యుని వెలుగులో నది మెరిసిపోతున్నప్పుడు, గుసగుసలు పోయే రెల్లుగడ్డి నిండిన ఒడ్డును అలలు మెల్లగా ఒరుసుకు పారుతున్నప్పుడు, దాని అందం కనికట్టు చేస్తుంది.”

కవి సముద్రాన్ని వర్ణిస్తూ;

“ఓ అలల్లారా! మీకు తెలిసిన విషాద గాథలు ఎంత దుఃఖభరితమో!
మోకరిల్లి ప్రార్థించే తల్లుల హృదయాల భయాలకు మీరే ప్రతిరూపాలు.
మీరు ఒకరికొకరు ఆ విషాద కథల్ని చెప్పుకుంటూ అలలై దొర్లుతుంటారు.
అందుకే మీ స్వరంలో ఆ వేదన, ఆ నిస్సహాయ నిరాశ నిండి ఉంటుంది.
సాయంత్రం వేళ ఉప్పొంగే పోటు అలలతో మీరు తీరాన్ని తాకుతూ సాగినప్పుడు,
మీ గొంతులో వినిపించే ఆ విషాదరాగం వాటి జ్ఞాపకమే.” అంటాడు.

కానీ నా ఉద్దేశంలో… ఆ సముద్రపు ఘోష వినిపించే భయంకరమైన విషాదాల కంటే, సన్నని రెల్లుగడ్డి పొదలు మార్దవ స్వరాలతో రాత్రి పూట పాడే ఆ ముచ్చట్లే మరీ కపటంగా, భయంకరంగా ఉంటాయనిపిస్తుంది.

ఆ రోజు పొద్దుగూకే యాల, గదంత పొడుగుండే పన్నెండు అడుగుల నా పెద్ద పడవ వేసుకుని ఇంటి ముఖం పట్టిన. మామూలుగా రాత్రి పూట వేటకు పోవుడు అలవాటే! అప్పటికే, తెడ్లు వేసి వేసి ఒళ్లంతా హూనమైపోయింది. కొద్ది ఘడియలు అలసట దీర, పడవను అట్లనే ఆపిన. కనుచూపు మేర రెల్లుగడ్డి మొలిచిన ఆ ప్రాంతం నుంచి చూస్తే… ఓ రెండు వందల మీటర్ల దూరంలో రైలు వంతెన కనిపిస్తున్నది.

అదో అద్భుత రాత్రి! నిండు పున్నమి చంద్రుడు వెలుగుతుండు. వెన్నెల పరిచిన నది.. వెండి చీర కట్టి మెరిసిపోతుంది. చంద్రుని చల్లదనాన్ని పులుముకుని గాలి, మృదువుగా వింజామరలు వీస్తోంది. ఆ ప్రశాంతత పరవశుణ్ణి చేసింది. చుట్ట కాల్చ ఇంపై, లంగరు నీళ్లలోకి దించిన.

పడవ ప్రవాహానుగుణంగా ముందుకు కదులుతూ, లంగరు గొలుసును ఆఖరి దాకా గుంజి ఆగిపోయింది. పడవ వెనుక భాగంలో పరిచిన గొర్రె చర్మం మీద హాయిగా కూర్చున్న. ఒడ్డును తాకుతున్న అలల సప్పుడు, సోకి సోకనట్టు అప్పుడప్పుడు చెవిన పడుతుంది. పొడవైన రెల్లుగడ్డి పొదలు ఏవో ఆశ్చర్య ఆకారాలు దాల్చి, అటు ఇటు ఊగి తూగుతున్నది గమనించిన. ఇక ఇక్కడి నుంచి కదలాల్సిన సమయం ఆసన్నమైందనిపించింది.

నది నిశ్శబ్దాన్ని పులుముకుని ప్రవహిస్తుంది కానీ, ఆ సద్దు లేనితనం సహజంగా లేదు ఎందుకనో. కప్పలు, గోదురు కప్పలు—నిశిరాత్రి పాడే చిత్తడి నేలల సహజ గాయకులు సైతం గొంతు విప్పడం లేదు. అంతా గమ్మత్తు నిశ్శబ్దం…

ఒక్కసారిగా కుడివైపు నుంచి కప్ప ఒకటి బెకబెక మంది. అది నా చెంతనే చేరి అరిచినట్లు ఉలిక్కిపడ్డాను. ఆ తర్వాత, ఏ చప్పుళ్ళు లేవు. సర్వం సద్దుమణిగింది. నన్ను నేను స్థిమితపర్చుకోను, చుట్ట ముట్టించ బుద్దయింది. ఎడతెరిపిలేని పొగ తాగడం అలవాటున్నా, అప్పుడా వాసన వాంతికి వచ్చేలా అనిపించి మానుకున్న. గొంతెత్తి పాట అందుకున్న. కంఠం పలికే దిగులుజీర నాది నాకే విచిత్రంగా వినిపించి, మళ్లీ నిశ్చలంగా ఉండిపోయా. కానీ, పడవ కదలికలు కుదురుగా కూర్చోనివ్వలేదు. పెద్ద కుదుపులకు పడవ తూగినట్లు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు మార్చి మార్చి అలలు ఎగుస్తున్నట్లు అనిపించింది. ఏదో అగుపించని శక్తి నన్ను పైకి ఎత్తి పడేస్తున్నట్లు, పెనుగాలి తుఫానుకు నేను ఎగిరిపోతున్నట్లు తోచింది. నా చుట్టూ ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. అదాటున లేచి నిలబడ్డాను. వెన్నెల పారుతున్న నీళ్లు శాంతాన్ని తాగుతా కనిపించాయి.

నా నరాలు ఉబికి, నదిలా పారడం గ్రహించాను. వెంటనే ఆ చోటు వదలాలని నిర్ణయించుకున్న. లంగరు గొలుసు పైకి గుంజిన. పడవ కదిలింది కానీ గొలుసును ఎదో అడ్డుకుంటుంది. మరింత బలం పెంచి ప్రయత్నించిన, అయినా పైకి రాలేదు. అది అడుగు భాగాన దేనికో ఇరుక్కుపోయింది. తెడ్లు వేసి పడవ దిశను తిప్పి, లంగరు స్థానం మార్చ చూసినా ప్రయోజనం లేకపోయింది. కోపం కట్టలు తెగి గొలుసు పట్టుకు ఝాడించిన. ఇంచుక మందం కదల్లేదు. నీరుగారిపోయి కూర్చుని, నా పరిస్థితి గురించి ఆలోచించసాగాను. అంత లావుపాటి ఇనుప గొలుసును తెంచడమో లేక పడవ నుంచి విడదీయటమో కలలో కూడా జరిగే పని కాదు. అయితే, వాతావరణం ఎంతో అనుకూలంగా ఉండటం వల్ల, తెల్లారేసరికైనా ఏ జాలరో సాయపడడా అనుకున్న. ఇక చేయగలిగింది ఏమీ లేదన్న భావం, నన్ను కాస్త శాంత పరిచింది. నిమ్మలంగ కూర్చుని నా దగ్గరున్న రమ్ సీసా తీసి రెండు మూడు పెగ్గులు లాగించిన. అప్పటికిగానీ, నా తిప్పల మీద నవ్వగలిగే స్థితికి చేరలే. చుట్టూ హితంగా ఉంది, అవసరమైతే ఈ చుక్కల కప్పు కింద ఏ ముప్పు లేకుండా ఓ నిద్ర తీయొచ్చు.

అంతట్ల పడవ పక్కన ‘టక్ టక్’ మని సప్పుడు. సర్రున, ఒళ్లంతా చలి చెమటలు పట్టినయి. పారుకానికి కొట్టుకొచ్చిన ఏ చెక్క ముక్కో తగిలి ఉంటుందని మనసుకు నచ్చజెప్పుకున్నా, లోలోపల ఏదో వింత భయం పెనుభూతమై కమ్మింది. మళ్లీ గొలుసు పట్టుకుని, పానం బిగవట్టి గుంజిన. లంగరు కదలలేదు. అలసిపోయి, అట్లనే కులవడ్డ.

చూస్తుండగానే… తెల్లటి దట్టమైన పొగమంచు నదంతా కమ్ముకుంది. నీళ్లకు అతుక్కుపోయినట్లు ఆవరించిన ఆ మంచు పొర వల్ల… లేచి నిలబడి చూస్తే, కింద నా కాళ్లూ, పడవా అసలు కనిపిస్త లేవు. కేవలం రెల్లుగడ్డి చివర్లు మాత్రం తెల్లటి మంచును చీల్చుకుని పైకి తేలుతున్నయి. కానీ, నడుం పై భాగం నుంచి పైకి చూస్తే దృశ్యం మరోలా ఉంది. దూరాన మైదానమంతా వెన్నెల వెలుగులో తెల్లగా పరుచుకుని ఉంది. ఆ మైదానం మీద, ఆకాశం వైపు పొడుచుకు నిలబడ్డ ఇటాలియన్ పోప్లర్ చెట్ల గుంపులు… నల్లటి భీకర ఆకారాలుగా తోస్తున్నయి. నడుం దాకా ఒక వింతైన, స్వచ్ఛమైన తెల్లటి దూదిపింజల మబ్బుల్లో పాతరేసి నట్లు ఉన్న. ఆ స్థితిల నా బుర్ర పనిచేసుడు బంద్ వడి, మనసున రకరకాల చిత్ర భ్రమలు పుట్టడం షురువైంది. చీకటి ఏట్లో మునిగిన నా పడవను ఎవడో సప్పుడు చేయకుండా ఎక్కుతున్నట్టు భ్రాంతి పుట్టింది. ఆ మంచు చాటు నల్లటి నీళ్లలో ఏవో వింత జీవులు చుట్టూ ఈదుతున్నట్టు అనిపించి, ఊపిరాడనంత పని అయింది. తల చుట్టూ ఏదో ఇనుప పట్టీ బిగించిన రీతి, భారమైంది. గుండె కొట్టుకునే వేగానికి ఊపిరి అందడం లేదు. మైకం కమ్మినట్లుగా… భయం తట్టుకోలేక నీళ్లలోకి దూకి ఈదుకుంటూ వెళ్లిపోదామనుకున్న. కానీ ఆ ఆలోచనే వెన్నులో వణుకు పుట్టించింది. ఈ దట్టమైన మంచులో, కళ్లు కనిపించక, ఒడ్డు ఎటుందో తెలియక, నీటి నాచులో, రెల్లుగడ్డి పొదల్లో చిక్కుకుపోయి తప్పించుకోలేక… శ్వాస అందక, కాళ్ళు ఆడక, ఆ నల్లని నీళ్ల అడుగుకు నాకు నేనుగా దిగబడిపోతున్నట్లు అనిపించింది.

నిజానికి, ఈ రెల్లుగడ్డి, పొదలు లేని సాఫీగా ఉండే ఒడ్డును సురక్షితంగా చేరాలంటే… ప్రవాహానికి ఎదురీదుకుంటూ కనీసం అర కిలోమీటరు దూరమైనా పోవాలి. ఎంత ఈత వచ్చినా… ఈ మందమైన పొగమంచులో దారి తప్పి, ఆ నాచులో చిక్కుకుని, నీళ్లలో మునిగి చావడం నూటికి తొంభై తొమ్మిది పాళ్లు ఖాయం.

నేనుగా స్థిమిత పడ, గట్టి ప్రయత్నమే చేసిన. భయపడొద్దని సంబాళించుకున్న. కానీ సంకల్ప బలానికి భిన్నంగా, లోని ఇంకో తత్వం భయంతో వణికిపోతోంది! అస్సలు భయపడటానికి ఇందులో ఏముందని నన్ను నేను నిలదీసుకున్న. ధైర్యవంతుడైన ‘నేను’ గొంతు లేపి, పిరికివాడైన ‘నేను’ ని ఎగతాళి చేసిండు. మన లోపలే ఇద్దరు విరుద్ధులు ఉంటారన్న సత్యం అప్పుడే తెలిసొచ్చింది. ఒకరు ఒక పని చేయాలని ఆరాటపడితే, ఇంకొకరు దాన్ని వద్దని వారిస్తారు… ద్వంద్వ యుద్ధంలో ఒక్కోసారి ఒకరిది పై చేయి.

వివరించ వీల్లేని ఆ వింత పిచ్చి భయం కాస్త బీభత్సంగా మారింది. మిటకరించక కళ్లు! – రిక్కించి చెవులు! దేనికోసం ఎదురుచూస్తున్నవో తెలియక, నిశ్చలంగా ఉండిపోయాను. కానీ అదేదో రాబోయే ఉపద్రవానికి సంకేతమే అయ్యుంటుంది. ఆ సమయంలో… ఏదైనా ఒక చిన్న చేప నీళ్లలోంచి నాపైకి అట్లా దుంకినా సరే, శరీరం మొద్దుబారి స్పృహతప్పి కింద పడిపోవడానికి సిద్ధంగా ఉంది, అంతకుమించి అసాధారణ కారణం ఏదీ అవసరం లేదు. పరిస్థితి అంతలా తయారయింది.

అయినా, శక్తంతా కూడదీసుకుని ప్రయత్నించి… తిరిగి స్థిమిత పడ్డా. రమ్ సీసా అందుకుని రెండు మూడు గుక్కలు గటగటా తాగిన. అంతల నాకో ఆలోచన వచ్చింది. వెంటనే నలుదిక్కుల తిరుగుతూ గొంతెత్తి అరిచిన. గొంతు పూర్తిగా సొరపోయి, శబ్దమే రానంతగా పూడుకుపోయాక వినిపించింది, ఎక్కడో దూరాన… కుక్క ఒకటి ఊళ పెడుతుంది.

మళ్లీ మరింత రమ్ తాగి, పడవ అడుగున నడుం వాల్చిన. అట్లా ఒకటి రెండు గంటలు గడిచిపోయాయి. నిద్ర పట్టడం లేదు కానీ… తెరిచిన కళ్ల చుట్టూ భయంకరమైన పీడకలలు ముసురుకున్నయి. పైకి లేచి కూర్చోవాలని ఉన్నా, అస్సలు ధైర్యం చాలడం లేదు. లేవాలన్నది క్షణక్షణం వాయిదా వేసుకుంటూ, నన్ను నేనే హెచ్చరించుకున్నా: ‘లే! లేచి నిలబడు!’ అని. అయినా, కదలడానికే గజగజ వణికిపోయాను. చివరకు నేను చేసే చిన్న సవ్వడి సైతం ప్రాణాల్ని హరిస్తాయన్నంత భయంతో, అపరిమిత జాగ్రత్తతో, శరీరాన్ని పైకి లేపుకుని పడవ అంచు నుండి చూసిన. కళ్లు బైర్లు కమ్మినయి, ఈ లోకంలో సాధ్యమేనా! అనిపించే ఊహాతీత అద్భుత దృశ్యం కళ్లముందు సాక్షాత్కరించింది. అదో మాయాలోక ఇంద్రజాలంలా ఉంది. దూర దేశాలు తిరిగి వచ్చిన యాత్రికులు చెబితే మనం నమ్మక కొట్టిపారేస్తామే… అలాంటి అపురూప దృశ్యమది!

నీటి జీవులన్నీ మేల్కొన్నాయి. ఇరుపక్కల కప్పలు భీకరంగా అరుస్తున్నయి. మొదట కుడివైపు వెనువెంటనే ఎడమవైపు, గోదురు కప్పల గొంతుల్లోంచి ఏకబిగిన కర్ణకఠోర లోహ ధ్వనులు నిశీధిని చీల్చుతూ వినబడుతున్నయి. విచిత్రం, ఇప్పుడు నాలో భయం లేశమాత్రం లేదు! నేను అడుగుపెట్టిన ఆ సరికొత్త లోకం ఎంతటి మాయాజాలంతో కూడుకుని ఉందంటే… ఆ క్షణంలో నా కళ్లముందు ఏ అద్భుతం సాక్షాత్కరించినా, ఎంతటి వింతలు విడ్డూరాలు జరిగినా నేను రవ్వంతైనా ఆశ్చర్యపోయే వాణ్ణి కాను, అంతటి అలౌకిక స్థితిలో మునిగిపోయాను.

రెండు గంటల క్రితం నదిని ముంచిన పొగమంచు పొంగు… మెల్లగా ఒడ్డు వైపుకు జరిగి, నదిని తుడిచిన అద్దాన్ని చేసింది. నది ఇరువైపులా పేరిన మంచు, ఆరు ఏడు మీటర్ల ఎత్తున్న తెల్లని గోడలా నిలబడి, వెన్నెల వెలుగులో వెండికొండలా జిగేల్మని మెరిసిపోతున్నది. ఆ రెండు కొండల నడుమ నది రాజరంగ రహదారిలా ప్రకాశిస్తోంది. నా తలపై తారాతీరాన, నీలి కలబోసిన పాలకడలి నడి ఆకాశాన, నిండు పున్నమి చంద్రుడు రాజహంసలా తేలిపోతున్నాడు.

ఆ మాయాపరవశం ఎంతసేపు సాగిందో తెల్వదు కానీ, చూస్తూ చూస్తూ చివరికి నిద్రలోకి జారుకున్న. తీరా కళ్లు తెరిచేసరికి… చంద్రుడు వెళ్లిపోయాడు, ఆకాశం నిండా నల్లటి మబ్బులు కమ్మేసినయి. గాలి వీస్తోంది, నది నీళ్లు దీనాలాపన చేస్తున్నయి. చుట్టూ చిమ్మ చీకటి. సీసాలో మిగిలిన రమ్ గటగటా తాగి, గజగజ వణుకుతున్న పానంతో, ఆ రెల్లుగడ్డి చేసే సవ్వడిని, ఏదో కీడు శంకిస్తున్నట్లుగా వినబడుతున్న ఆ నది భీకర స్వరాన్ని, వింటూ అట్లే ఉండిపోయిన. చీకట్లో ఏదైనా కనిపిస్తుందేమోనని కళ్లింత చేసి చూసిన. నా పడవ కాదు కదా, ముఖం ముందరికి ఎత్తి పట్టుకున్న చేతులు సైతం కనిపించడం లేదు.

మెల్లమెల్లగా చీకటి చిక్కదనం పలచనయింది. అంతల, నా పక్క నుంచి నీడ ఒకటి వేగంగా కదిలి పోతున్నది గమనించి, గట్టిగా అరిచిన. అవతలి నుంచి జవాబు వచ్చింది, అతను జాలరి. ఆయన్ని రమ్మని పిలిచిన. దగ్గరికి వచ్చాక నా తిప్పలు చెప్పిన. అతని పడవను నా పడవకు కట్టేసి వచ్చిండు. కలిసి లంగరు గొలుసును గుంజినం. ఊహూ… కదలలేదు. అంతట్ల తెల్లారింది… కానీ అదొక మసకబారిన బూడిద రంగు ఉదయం! చలి తోడుగా ముసురు పట్టి, కేవలం దుఃఖాన్ని, ఆపదలను మాత్రమే మోసుకొచ్చే దౌర్భాగ్యపు రోజులా ఉందా పొద్దు. ఒడ్డున మరో పడవ కనిపించింది. ఆయన్ని పిలిచాం. అతను మాతో చేయి కలిపిండు. మేమంతా కలిసి పెట్టి గుంజగా… కింద దేనికో గట్టిగా తగులుకున్న లంగరు, మెల్లమెల్లగా పైకి రాసాగింది, మోయలేని బరువేదో మోసుకొస్తున్నట్టు. చిట్టచివరకు, నల్లటి ముద్ద లాంటి ఆకారం పైకి తేలింది. వెంటనే దాన్ని పడవలకి ఇగ్గినం.

చూస్తే… అదొక ముసలమ్మ శవం! మెడకు ఒక పెద్ద బండరాయి కట్టి ఉంది.

పిన్నంశెట్టి కిషన్

మానవీయ దృక్పథం తో సాహిత్య సృజన చేస్తున్న పిన్నంశెట్టి కిషన్ 8 ఫిబ్రవరి, 1962 న వేములవాడ లో జన్మించారు. తండ్రి: అచల పరిపూర్ణ శ్రీకరానంద పిన్నంశెట్టి చెన్నయ్య. తల్లి: శ్రీమతి మంచె లక్ష్మీబాయి. ఎం. ఏ., బీఎడ్., చదివి తూనికలు-కొలతలు శాఖ అధికారిగా పదవీ విరమణ చేశారు. దాదాపు అరవై కథలు, వందకు పైగా కవితలు, కొన్ని విమర్శనా వ్యాసాలు రాశారు.

కథా విభాగంలో “ లేంబాళ వాటిక కథలు “, కవితా విభాగంలో “ నల్ల పద్యం “ సంపుటాలు వెలువడ్డాయి. వేములవాడ నేపథ్యంలో 1970 నుంచి 1990 వరకు గల ఊరి సామాజిక స్థితిగతుల్ని ఆత్మకథనాత్మక శైలిలో “లేంబాళ వాటిక కథలు “ రాశారు. లేంబాళ వాటిక కథలకు గూడూరి సీతారాం కథా పురస్కారం-2024 నకు మరియు పీచర సునీతా రావు స్మారక సాహిత్య పురస్కారం-2025 నకు లభించాయి.
2023 వ సంవత్సరానికి, కథా విభాగంలో లేంబాళ వాటిక కథలు సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం వచ్చింది. “నల్ల పద్యం’’ కవితా సంపుటికి హాసిని రామచంద్ర లిటిరరీ పౌండేషన్, ఖమ్మం వారి పురస్కారం 2024 లభించింది.

Previous Post

తమిళ కథ : ఎస్తర్

Next Post

హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు

Next Post
హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు

హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • హిందీ కవిత: నా చిరునామా
  • ఇంగ్లిషు కవిత : మనోచిత్రం
  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లిషు కవిత :  కోరిక
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!
  • రష్యన్ కథ : శస్త్రచికిత్స
  • కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • హిందీ కథ : లెక్క తప్పింది !

అభిప్రాయాలు

  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply