• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ : భీమ వచ్చింది

కోడిహళ్లి మురళీ మోహన్ by కోడిహళ్లి మురళీ మోహన్
August 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ : భీమ వచ్చింది

కన్నడ మూలం: నందిని హెద్దుర్గ
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్

“గుండా… గుండా… గుండా…” కుండపోతగా కురుస్తున్న వానను ఏమాత్రం లెక్కచేయకుండా, తలకు పాత టోపీ పెట్టుకుని, చేతిలో పెద్ద గొడుగు పట్టుకున్న సునందమ్మ వెనుక పెరటి తలుపు తీసి గట్టిగా పిలిచింది.

ఒక చూపుతో ఆమె వైపు చూస్తూ, తోకలు ఊపుకుంటూ కూర్చున్న గుండా, రంగా, కాలా అనే మూడు కుక్కలు ఆమె పిలుపుకు ఉలిక్కిపడ్డాయి. ఈ వానలోనే ఇంటివైపు పరుగెత్తాలా, లేక ఇంకొద్దిసేపు అక్కడే వేచి ఉండాలా అన్న సందిగ్ధంలో పడినట్టుగా వాటి తోకలు మరింత వేగంగా ఊగసాగాయి.

ఇంటికి అర ఫర్లాంగు దూరంలో ఉన్న కార్మికుల వరుస ఇళ్ల ముంగిట కూర్చొని, సాయంత్రం పట్టుకొచ్చిన అడవి  పీతను నిప్పుల్లో కాల్చి, దాని కాళ్లను విరిచి, లోపలున్న కొవ్వును పీల్చి తిన్న తర్వాత పారేస్తున్న కాళ్లలో ఒక్క చిన్న ముక్క అయినా కుక్కలకు దొరికితే చాలని అవి ఎదురుచూస్తున్నాయి. 

ఆ కుండపోత వానలో ఒక చేతిలో మజ్జిగ కలిపిన అన్నం ఉన్న పాత్రను పట్టుకుని, మరో చేత్తో చీర అంచును బిగించి, గొడుగును సమతుల్యం చేసుకుంటూ వచ్చిన సునందమ్మ ఓర్పు కోల్పోయినట్టుగా మరోసారి— “రా గుండా… గుండా…” అని పిలిచిన వెంటనే గుండా, దాని తోటి కుక్కలన్నీ ఒక్క గెంతుతో రాకెట్ వేగంలో ఇంటి ఆవరణలోకి చేరుకున్నాయి.

‘వానకు తోడు వరద వచ్చినట్టుగా’  ఆశ్లేష నక్షత్రం మొదలైన తొలి రోజునుంచే ఎడతెరిపిలేకుండా ధారాపాతంగా వర్షం కురుస్తోంది.

తోట దిగువన ఉన్న చెరువులు రెండో రోజుకే పొంగిపొర్లుతున్నాయి. రోడ్డుమీద నుంచి వచ్చిన నీరు తోటలోకి చేరి, లోతట్టు మొక్కలకు కుళ్లు వ్యాధి సోకింది. తాబేళ్లు, కప్పలు, చిన్న నీటి పాములు తోట దారుల్లో ఎక్కడికక్కడ తిరుగుతున్నాయి.

శివేగౌడ తోట అంటే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ “ పెద్దమెరకజమీను” యజమానుల తోటగానే ప్రసిద్ధి. ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఈ తోటలో కాఫీ దిగుబడి అధికంగా వచ్చినా, వర్షాకాలంలో మాత్రం నిర్వహణ ఖర్చు ఐదింతలు పెరుగుతుంది. శివేగౌడ పిల్లలు చదువు పూర్తయ్యాక విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

తండ్రి ఇచ్చిన కొద్దిపాటి భూమిని చెమటోడ్చి సాగు చేసి, చుట్టుపక్కల పది గ్రామాల్లో పేరుపొందిన రైతుగా ఎదిగాడు శివేగౌడ. కష్టపడటంలో ఆయనకు సాటి లేకపోయినా, సమస్యల ముందు మాత్రం కొంచెం బలహీనుడే అని సునందమ్మ నవ్వుతూ చెప్పేది. అయితే సునందమ్మ మాత్రం అలా కాదు. ఆమె ఎంతో దృఢసంకల్పం గల స్త్రీ. 

ఏ ఊరి వాళ్లైనా, భాష రాని కూలీలైనా ఆమె ఎదుట పని విషయంలో రాజీ ఉండదు. డెబ్బై ఐదేళ్ల వయసులోనూ మొత్తం తోట పనిని తన చేతుల్లో ఉంచుకుని సమర్థంగా నడిపిస్తుంది. 

కలుపు తీయడం, మొక్కలకు అంట్లు కట్టడం, ఎరువులు వేయడం—ఏ పనికైనా సునందమ్మ కాంట్రాక్టు నిర్ణయిస్తే అదే ఫైనల్.

“తొంభై ఐదు మొక్కలు అంటే మూడు వరుసలు. మూడు వరుసల పనిని పూర్తిగా చేసి గానీ ఇంటికి వెళ్లకూడదు. పని మానేయడం అసలు వద్దు.” అని కర్ర విరిచినట్టుగా గట్టిగా చెప్పితే, ఎక్కువలో ఎక్కువ రెండు మూడు మొక్కల దగ్గరే కూలీలు కొంచెం మోసం చేయగలరు. 

అదే శివేగౌడగానీ, మేస్త్రీగానీ కాంట్రాక్టు చెప్పితే మాత్రం ఇరవై మొక్కలైనా, అర వరుసైనా మిగిల్చి, దానికి సరిపడా సాకులు కూడా సిద్ధం చేసుకుంటారు.

వర్షంలో చీర తడవకుండా మోకాళ్ల వరకు పైకెత్తుకుని, మూడు పాత్రల్లో సమంగా గంజి పోసి, చిన్న కర్రతో మూడు కుక్కలూ ఒకదాని పాత్రలో మరొకటి తినకుండా ఒక్కొక్కటికి ముందుగానే తేలికగా ఒక దెబ్బ వేసింది సునందమ్మ. గేటు మూసి, షెడ్ తలుపు జరిపి, చాంబర్‌లోకి చేరుతున్న నీటిలో పేరుకుపోయిన చెత్తను కాలితో తొలగించి తిరిగి వచ్చేలోపే కుక్కలు తమ వాటా తినేసి, ఇంకో పాత్రలో ఏముందా అని తొంగిచూస్తున్నాయి.

బలంగా వీచే గాలికి నేలను తాకి మళ్లీ పైకి లేస్తున్న కొబ్బరి, పోక, సిల్వర్ ఓక్ చెట్లు… నిరంతరం గగ్గోలు పెడుతున్న కీటకాల గుంపు… షెడ్‌పై వాన చినుకులు మోగిస్తున్న తాళవాద్యంలా వినిపించే శబ్దం… ఎనిమిది దిక్కుల నుంచీ వినిపిస్తున్న వర్షధ్వని… విశ్వమంతా ప్రళయంలో మునిగిపోయిందేమో అనిపించేలా ఉంది.

సునందమ్మ జారకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ బావి దగ్గరకు వెళ్లి ఒకసారి లోపలికి వంగి చూసి, ఏదో విచిత్రమైన ఆందోళనతో ఇంట్లోకి వచ్చింది. ఆమెను కిటికీ గుండా గమనించిన శివేగౌడ ఏదో జరిగిందని ఊహించాడు.

మూడు మంచాలు వేసిన ఆ గదిలో కిటికీ ఎదురుగా ఉన్న మంచం శివేగౌడది. మెడవరకు దుప్పటి కప్పుకుని, మంకీక్యాప్ ధరించి బయట కురుస్తున్న వాననే చూస్తున్నాడు. చీకటికి అలవాటు పడుతున్న కొద్దీ అతని చిన్న కళ్లూ మరింత చిన్నవయ్యాయి. లోపలికి వస్తున్న భార్యకు వినిపించేలా, “ ఏమయింది సునందా?” అని అడిగాడు.

కుక్కలకు ఆహారం పెట్టి, ముఖం కడిగి, దేవుడి దీపం వెలిగించి లోపలికి వచ్చిన సునందమ్మ, “బావి నిండిపోయి, నీరు పొంగి పారుతోంది” అంది.

వారం రోజులుగా కురుస్తున్న వర్షంలో అది ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ బావిలోకి ఎంత వేగంగా నీరు చేరుతోందో, అంతే వేగంగా పైకి పొంగిపారుతుంది. నిలకడ నీటితో నిండే బావైతే ప్రమాదం తక్కువ. కానీ ప్రవాహజలంతో నిండే బావైతే ఒక్కసారిగా ఉప్పొంగి ప్రమాదకరంగా మారుతుంది. వారి బావి కూడా అలాంటిదే. అందుకే ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం.

“మిరియాల బస్తాల దగ్గర నీరు చిమ్ముతోంది. వాటిమీద టార్పాలిన్ కప్పి వచ్చాను.” అని చెప్పిన భార్యను చూస్తూ శివేగౌడ మెల్లిగా, “ఇప్పటికి ఎనిమిది రోజులు కావాల్సింది కదా…” అన్నాడు.

పదిహేను రోజుల ఆశ్లేష వర్షంలో ఎనిమిది రోజులు గట్టిగా కురిస్తే, తర్వాత కొంత విరామం వస్తుందని గ్రామస్తుల నమ్మకం. కానీ ఈసారి అలాంటి సూచన కనిపించడం లేదు. శివేగౌడ ఎందుకు ఆందోళన చెందుతున్నాడో సునందమ్మకు తెలుసు. పిల్లలు ఎంత చెప్పినా వినకుండా, గత రెండేళ్లుగా పండించిన మిరియాలన్నింటినీ ఇంటి అటకపై నిల్వ ఉంచాడు. 

ధరల అంచనాలు చెప్పేవాళ్లు వచ్చే ఏడాది మిరియాల ధర బంగారం ధరతో సమానమవుతుందని చెప్పగానే, ఎంతమంది వారించినా వినకుండా శివేగౌడ మొత్తం తొమ్మిది టన్నుల మిరియాలను ఇంటి అటకపై నిల్వ చేశాడు. 

సాధారణంగా పదిహేను టన్నుల వరకు పంట పండించే వారికి తొమ్మిది టన్నులు పెద్ద విషయం కాకపోయినా, అంత బరువును పునాది అంత బలంగా లేని ఆ పాత మట్టి గోడల ఇల్లు తట్టుకోగలదా అన్న భయం వర్షం వేగం పెరిగిన కొద్దీ అతని మనసులో మరింత బలపడసాగింది. యాభై మంది పడుకునేంత విశాలమైన అటకంతా బరువు సమానంగా పడేలా బస్తాలను పేర్చినా, ఈ ఉన్మాద వర్షంలో ఏమవుతుందోనన్న ఆందోళన ఎంత ధైర్యవంతుడి గుండెను అయినా వణికిస్తుంది. 

గత ఏడాది ఎవరో ఒకరి గోదాములో నిల్వ ఉంచిన మిరియాలు దొంగిలించబడ్డాయని వార్త రావడంతో, శివేగౌడ తన ధాన్యాగారంలో ఉన్న పంట మొత్తాన్ని అటకపైకి మార్చించాడు.

బావి నుంచి పొంగిపొర్లుతున్న వరద నీరు అటకకు ఆనుకొని ఉన్న ఆ పాత పెద్ద గోడ పక్కగానే ప్రవహిస్తూ ముందుకు వెళ్లాలి. గత ఏడాదే ఆ గోడలో చిన్న పగులు కనిపించినా, శివేగౌడ దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఇంటి దిగువన ఉన్న కార్మికుల వరుస  ఇళ్ల దగ్గర చిన్న చిన్న వాగులు నిండిపోయి చెరువులో కలుస్తూ, చెరువు కట్ట పొంగి తెగిపోతున్న శబ్దం భయపెట్టేంత గట్టిగా వినిపిస్తోంది.

ఈ మధ్యాహ్నానికి ఆశ్లేష వర్షం రెండో పాదంలోకి ప్రవేశించింది. సంప్రదాయం ప్రకారం ఈ సమయానికి వర్షం తీవ్రత తగ్గాల్సి ఉంది. కానీ ఈసారి మాత్రం అలాంటి సూచన కనిపించలేదు.

ఇద్దరు పిల్లలూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. “ఈ వృద్ధ దంపతులు ఇలా ఒంటరి గ్రామంలో కష్టపడుతూ ఎందుకు ఉండాలి? దగ్గర పట్టణంలో ఒక ఇల్లు కొనుక్కొని హాయిగా ఉండకూడదా?” అని బంధువులూ, మిత్రులూ తరచూ చెప్పేవారు. కానీ ఈ వృద్ధ దంపతులకు మాత్రం ఈ జీవితం ఎప్పుడూ భారంగా అనిపించలేదు.

సాయంత్రం దీపం వెలిగించి, “వాన తగ్గాలి” అని ఐదు అగరబత్తులు వెలిగించిన సునందమ్మ గదిలోకి వచ్చినా, వర్షం హోరులో శివేగౌడకు ఆమె అడుగుల చప్పుడు కూడా వినిపించలేదు.

“అటక మీదికి ఒకసారి వెళ్లి చూసి వచ్చి ఉండాల్సింది. చెప్పినా వినలేదు. ఇప్పుడు మాత్రం వెచ్చగా దుప్పటి కప్పుకుని కూర్చున్నారు.” అని మందలించిన స్వరంలో సునందమ్మ అన్నా, భర్త ఇంకా ఎక్కువగా భయపడతాడేమో అన్న ఆందోళన కూడా ఆమె మనసులో ఉంది. బావి నుంచి ఉప్పొంగుతున్న నీటి గర్జన, గేటు దాటి లోపలికి వస్తున్న వరదనీరు—ఈ రెండింటినీ కిటికీ దగ్గర నుంచి చూస్తూ చూస్తూ శివేగౌడ నుదుటి ముడతలు మరింత లోతుగా మారాయి.

యాభై సంవత్సరాల క్రితం ఆస్తి పంచుకున్నప్పుడు చేతిలో ఉన్న డబ్బుకు తగినట్టుగా ఆ ఇల్లు కట్టుకున్నారు. పునాదికి రెండు వరుసల రాళ్లు, వాటి మీద మరికొన్ని రాళ్లు, ఆపై ఇటుకలు, మట్టితో పగలు-రాత్రి శ్రమించి కట్టిన ఇల్లు అది. అప్పట్లో ఇద్దరూ యౌవనంతో ఉత్సాహంగా ఉన్నారు.

ఇల్లు కట్టిన పదేళ్ల తరువాత గోడలకు సిమెంట్ పూత వేయించారు. వెనుకవైపు ఉన్న చిన్న నిర్మాణం పట్టుపురుగుల పెంపకానికి తాత్కాలికంగా కట్టించుకున్న షెడ్.

ఇంటి వెనుక కాఫీ తోటలను ఆనుకుని అర కిలోమీటరు పొడవునా వరుసగా కొండలు విస్తరించి ఉన్నాయి. చిన్న వర్షం పడినా ఇంటి చుట్టూ నీటి ఊటలు ఉబికి, చెరువులు, బావులు పొంగిపొర్లుతాయి. అలాంటిది ఎనిమిది రోజులుగా కురుస్తున్న ఈ కుండపోతలో ఇంటి ఆవరణంతా ఎక్కడ చూసినా నీటి ప్రవాహాలే కనిపిస్తున్నాయి.

ఆరు నెలల్లో ఎలాంటి కొత్త ఇల్లు అయినా కట్టించుకునే ఆర్థిక స్థోమత శివేగౌడకు ఉంది. అయినా ఈ పాత ఇల్లు వారి చెమటతో నిర్మించిన జీవిత జ్ఞాపకాల నిలయం. “మీకోసం కొత్త ఇల్లు కడతాం” అని పిల్లలు చెప్పిన ప్రతిసారీ, “మేమున్నంతవరకు ఈ ఇంట్లోనే ఉంటాం” అని మాట మార్చేస్తారు. పిల్లలు కూడా ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకుని మౌనంగా ఉంటారు.

ఇన్ని సంవత్సరాల అనుభవంలో వర్షం ఇంతగా పడటం కొత్త కాదు; కానీ ఈసారి దాని ఉధృతి మాత్రం అసాధారణం. “ఇలా ఎందుకు కురుస్తోంది?” అన్న ప్రశ్నకు ఎవరికీ సరైన సమాధానం లేదు. అయితే పిల్లలు మాత్రం పశ్చిమ కనుమల్లో చేపడుతున్న పైప్‌లైన్ ప్రాజెక్టు కారణంగానే అడవుల్లో మార్పులు వచ్చి, గాలుల దిశ మారి, ఈ విచిత్రమైన వర్షాలకు దారితీసిందని చెప్పేవారు. కారణం ఏదైనా, దాని దుష్పరిణామాలను అనుభవించాల్సింది మాత్రం ఇక్కడి వారే.

మూడు రోజులపాటు కూలీలు పనికి రావద్దని సునందమ్మ మొన్ననే కార్మికులకు శెలవు ప్రకటించేసింది. మెరక తోటలో గాలి, వర్షాల వల్ల ఇప్పటికే ఎన్నో పెద్ద చెట్లు నేలకొరిగాయి. మొన్న రాత్రి వినిపించిన భయంకరమైన విరిగిన శబ్దం వందేళ్ల నాటి మామిడి చెట్టు భారీ కొమ్మ విరిగిపడటమేనని కూలీలు చెప్పారు. ఇలాంటి సమయంలో తోటలో పని చేయడం అంటే ప్రమాదాన్ని స్వయంగా ఆహ్వానించుకున్నట్టే.

రాత్రి ఎనిమిది గంటల సమయంలో గాలి మరోసారి ఉధృతమైంది. ఇంటి ముందు బలంగా పెరిగిన సపోటా చెట్టు పెద్ద కొమ్మ విరిగి, దాని చివర విద్యుత్ తీగపై పడటంతో ఆ తీగ తెగి కింద పడింది. ఇంటి పక్కనే జరిగిన ఆ పెద్ద శబ్దానికి శివేగౌడ భయంతో దుప్పటి తొలగించి బయటకు వెళ్లబోతుండగా, సునందమ్మ అడ్డుకుంది.

“పడింది విద్యుత్ తీగ. ఏం జరిగిందో తెలియకుండా బయటకు పరుగెత్తకండి. వాన తగ్గాక చూద్దాం.” అని చెప్పడంతో శివేగౌడ ఆందోళన మరింత పెరిగింది. కూలీలు తిరిగే దారి అదే కావడం ఇప్పుడు అతన్ని పట్టి పీడిస్తున్న విషయం. సునందమ్మ కిటికీ తెరిచి బయట పరిస్థితిని పరిశీలించి, “చూద్దాం ఉండండి” అంటూ భర్తను సమాధానపరిచింది. తర్వాత ఫోన్‌లో మిగిలిన కొద్దిపాటి చార్జ్ ఉపయోగించి దిగువ వరుస ఇళ్లకు కాల్ చేసి—

“వాన ఆగే వరకు ఎవరూ ఇంటి దగ్గరకు రావద్దు. విద్యుత్ తీగ తెగి పడింది. కుక్కలను కూడా అక్కడే కట్టేసి ఉంచండి.” అని చెప్పి మళ్లీ కిటికీ బయటికి చూసింది.

బావి నుంచి పొంగిపొర్లుతున్న నీరు ఇప్పుడు మరింత ఉన్మాదంగా మారింది. గోడకున్న పగులు కూడా ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

అంతలోనే…

కుండపోత వాన శబ్దాన్ని, బావి నుంచి ఉప్పొంగుతున్న నీటి గర్జనను, గాలి హోరును, పురుగుల కీచురావాలను ఛేదిస్తూ, మూడు ఫర్లాంగుల దూరంలో ఉన్న కొడగుల కుటుంబం ఇంటి వైపు నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. శివేగౌడ ముఖం మరింత మసకబారింది.

“కొడగు అమ్మ చనిపోయినట్టుంది…” అని ఎక్కడో లోతైన బాధతో అన్నాడు. 

“చావాల్సిన వయస్సు ఎప్పుడో దాటిపోయింది ఆమెకి. కానీ మీరు ఇలా రాతి స్తంభంలా నిలబడి ఉంటే ఎలా?” అని సునందమ్మ మందలిస్తూ అటకపైకి వెళ్లే మెట్లను ఎక్కడం ప్రారంభించింది.

చిన్ననాటి నుంచీ శివేగౌడకు కొడగు అమ్మతో ఎంతో అనుబంధం. ఆమె ఆరుగురు పిల్లలతో పాటు శివేగౌడనూ తన సొంత కొడుకులా ప్రేమించింది. అలాంటి ఆమె ఈ భయంకరమైన వర్షపు రోజున కన్నుమూసింది. చివరి కార్యక్రమాలు కూడా సక్రమంగా జరుగుతాయో లేదో అన్న ఆలోచన శివేగౌడను కలవరపెట్టింది. బయట వ్యాపిస్తున్న గాఢాంధకారాన్ని అతను మరోసారి చూస్తూ నిలిచిపోయాడు. 

అవసరానికి మించిన వేగంతో చీకటి కమ్ముకుంటోంది. దానికంటే వేగంగా గాలి వీస్తోంది.

పెద్ద పెద్ద వానచినుకులు గాలి ఉద్ధృతికి చెదిరిపడి, కిటికీలు, తలుపుల చిన్న చిన్న సందుల గుండా లోపలికి చొరబడి ఇంటినంతా తడిపేస్తున్నాయి.

“ఒక్కసారి ఇక్కడికి వస్తారా?” అని సునందమ్మ పిలిచింది.

ఆమె స్వరంలోని ఆందోళన శివేగౌడ గుండెను తాకింది. వణుకుతూ మెట్లు ఎక్కసాగాడు. “ఇది నేనే నా చేతులారా తెచ్చుకున్న కష్టం. ఏదైనా ప్రమాదం జరిగితే…? ఆమెకేదైనా అయితే…?” అనే ఆలోచనలు అతన్ని వెంటాడుతున్నాయి.

” సునందా…” అని పిలవాలనుకున్నా గొంతు సహకరించలేదు. వణుకుతున్న కాళ్లతో పైకి చేరుకుని, భార్య నిలబడి ఉన్న చోటికి నడిచాడు.

ముందే చెప్పినట్లుగా, అది యాభై మంది పడుకోగలిగేంత విశాలమైన అటక.

సునందమ్మ మూలన టార్చ్ వెలుగు చూపిస్తూ,

“ఇక్కడికి రండి… ఇక్కడ చూడండి…” అంది.

ప్రతి అడుగు మణుగుల బరువులా అనిపిస్తోంది. నడవడమే కష్టంగా మారింది. భార్య చూపించిన దిశగా చూసిన శివేగౌడ ఒక్కసారిగా తల తిరిగినట్టై, అక్కడ పేర్చిన మిరియాల బస్తాలపై అలసిపోయిన మనిషిలా వాలిపోయాడు.

విశాలమైన అటక చివరి మూలభాగం కొద్దిగా క్రిందికి వంగిపోయింది!

అంటే…

ఇప్పుడే…

ఈ అటకను మోస్తున్న గోడ మొత్తం కూలిపోతుంది. దాని వెంట పైకప్పు, దానికి ఉన్న భారీ దిమ్మె కూడా కూలిపోతుంది.

ఆ శిథిలాల కింద తామిద్దరూ సమాధి అవుతారు.

“ఇవే మన జీవితంలోని చివరి క్షణాలేమో…” అని శివేగౌడ మనసులో అనుకున్నాడు. “కనీసం ఇక్కడి నుంచి కిందికి దిగేంత సమయమైనా దేవుడు ఇస్తాడా?”

” సునందా…”

ఎందుకో తెలియదు. భార్యను చివరిసారి మనసారా పిలవాలనిపించింది.

కానీ గొంతులోంచి మాట రాలేదు. బావి నుంచి పొంగిపొర్లుతున్న నీటి శబ్దం క్షణక్షణానికీ పెరుగుతోంది.

శివేగౌడ చుట్టూ ఒకసారి చూశాడు. నిన్నటివరకు బంగారు పంటలాగా కనిపించిన ఆ మిరియాల బస్తాలు, ఈ క్షణంలో మాత్రం యమదూతల్లా కనిపిస్తున్నాయి.

“సునంద… ఆమెకేదైనా జరిగి నేను ఒక్కణ్ణే బ్రతికితే…? ఆమె నన్ను క్షమిస్తుందా? పిల్లలు క్షమిస్తారా? ఆ తర్వాత నేను ఎలా బ్రతుకుతాను?” అని అతని హృదయం భయంతో, పశ్చాత్తాపంతో వణికిపోయింది.

ఇలాంటి ఆలోచనలతో శివేగౌడ మనసు కలత చెందుతుండగా, తన భయాన్ని బయటపడనీయకుండా నిలబడిన సునందమ్మ నెమ్మదిగా అటక కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూసింది.

అప్పుడే ఒక్కసారిగా “ధూప్!” అనే పెద్ద శబ్దం వినిపించింది. శివేగౌడ ఉలిక్కిపడి వణికిపోయాడు.

తన కాళ్ల కిందనున్న అంతస్తు నేల, ఆ పెద్ద గోడ విచిత్రమైన గర్జనతో కూలిపోతున్నట్లు అనిపించింది. చుట్టూ పేర్చిన మిరియాల బస్తాలు ఒకదానిపై మరొకటి పడిపోతూ తనను కప్పేస్తోంది.

“సునందా… సు…” అని ఆమె చేతి వేలైనా అందుకోవాలని ప్రయత్నిస్తూ, బస్తాల భారాన్ని తోసుకుంటూ ఆమెవైపు చేయి చాచాడు.

అంతలో సునందమ్మ కిటికీ దగ్గర నుంచి గట్టిగా అరిచింది—

“వినండి… భీమ గేటు పగలగొట్టి లోపలికి వస్తోంది!”

అంటే… ఇదంతా కల మాత్రమే. గోడ కూలలేదు. అటక కూలిపోలేదు. మిరియాల బస్తాలు పడిపోలేదు. తన ప్రాణం పోలేదు.

అన్నింటికంటే ముఖ్యంగా, సునందమ్మ తన ఎదుటే సురక్షితంగా నిలబడి ఉంది.

శివేగౌడ తేరుకుని లేచి కిటికీ దగ్గరకు వెళ్లాడు. సునందమ్మ తన చేతిలోని టార్చ్ వెలుగును దూరంగా ఉన్న గేటు వైపు ప్రసరించింది. అక్కడ భీమ—ఆ భారీ ఏనుగు—విరిగిపోయిన గేటును నెమ్మదిగా దాటి లోపలికి వస్తోంది. భీకరంగా కురుస్తున్న వర్షం, ప్రళయంలా వీచే గాలి, ఉప్పొంగి పారే వరద, విరిగి పడుతున్న చెట్ల గర్జన—ఇవేవీ దాని ప్రశాంతతను భంగపరచలేకపోతున్నట్లుంది. ఒక అడుగు వేసి, చాలాసేపటి తర్వాత మరో అడుగు వేస్తూ ఎంతో నెమ్మదిగా ముందుకు సాగుతోంది.

“భీమా… మా తండ్రీ…” 

శివేగౌడ స్వరం ఇంత బలహీనంగా వినిపించడం సునందమ్మ ఎప్పుడూ వినలేదు.

“ఏది జరగాల్సి ఉంటే అది పాతాళంలో దాక్కున్నా జరుగుతుంది. రండి, కిందికి వెళ్దాం…”

అని గట్టిగా చెప్పిన భార్యను చూసి శివేగౌడ నెమ్మదిగా మెట్లు దిగసాగాడు. అంతలో కొడగుల  ఇంటి వైపు నుంచి తుపాకీ పేలిన శబ్దం మరో రెండుసార్లు వినిపించింది.

గదిలోకి వెళ్లి కిటికీ తెరిచి, “భీమా…” అని పిలిచిన సునందమ్మ. “రండి ఇక్కడికి…” అని మరోసారి ఉద్వేగంగా పిలిచింది.

ఏనుగు అనే జీవి అలాంటిదే.

మొదట భయాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో దైవదర్శనంలాంటి అనుభూతినీ ప్రసాదిస్తుంది. భయంతో పాటు భక్తినీ, ఆందోళన మధ్యలోనూ ఆప్యాయతనూ మేల్కొలుపుతుంది.

ఇప్పుడు భీమ, వారి కిటికీకి వంద అడుగుల దూరంలో నిలబడి, బావి నుంచి ఉప్పొంగుతున్న వరదనీటినే చూస్తోంది.

“అయ్యో… భీమా… ఇక్కడికి రావద్దురా తండ్రీ… విద్యుత్ తీగ తెగి పడిపోయింది.” అని శివేగౌడ ఆర్ద్రతతో హెచ్చరించాడు.

పోయినసారి పక్క తోటలో విద్యుత్ కంచె దాటబోయి చనిపోయిన ఏనుగు, దాని కుటుంబం పడిన దుఃఖం, దానికి తాము చేసిన అంత్యక్రియలు—ఆ జ్ఞాపకాలన్నీ అతని హృదయంలో ఇంకా చెరిగిపోలేదు.

ఇప్పుడు గోడ పక్కగా ఉద్ధృతంగా పారుతున్న వరదనీరు, కాస్త వంగిపోయిన అటక, కూలిపోవచ్చన్న ప్రమాదం—ఇవేవీ అతనికి గుర్తుకురావడం లేదు. ఈ ప్రళయవర్షంలో తమ క్షేమం తెలుసుకోవడానికి భీమానే వచ్చిందన్న భావనతో ఆ వృద్ధ దంపతులు ఆనందంతో నిండిపోయారు.

భర్త ఆనందాన్ని చూసిన సునందమ్మ ప్రేమగా మందలించింది— “వెళ్లు భీమా… ఈ కుండపోత వానలో నీకేం పని? ఎక్కడైనా పెద్ద చెట్టు కింద నిలబడు. ఈ వానే చాలదన్నట్టు నువ్వూ ఇక్కడ నిలబడకు.”

ఏనుగుల వినికిడి శక్తి మనుషుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. గాలిలో ప్రయాణించే శబ్ద తరంగాలనే కాదు, నేల కంపనాలను కూడా అవి గ్రహిస్తాయి. వాన శబ్దం నిజంగానే తగ్గిందో, లేక భీమ రావడంతో తమకు అలా అనిపించిందో శివేగౌడకు అర్థం కాలేదు.

అతడు చేతులు జోడించి ప్రార్థించాడు— ” మమ్మల్ని క్షేమంగా  కాపాడు స్వామీ,  వినాయకా! రేపు నీకోసం నాలుగు పనసకాయలు తెచ్చి పెడతాను. వచ్చి తిను.”

కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఆ వృద్ధ దంపతులను భీమా రెండు నిమిషాల పాటు నిశ్శబ్దంగా చూసింది. “కాపాడు గణపతీ…” అని శివేగౌడ మరింత వినయంతో ప్రార్థించాడు.

భీమా తిరిగి ఒక అడుగు ముందుకు వేసి, వెంటనే రెండు అడుగులు వెనక్కి వేసింది. తర్వాత ఇంటివైపు తిరిగి చూసి, తొండాన్ని ఎత్తి భూమ్యాకాశాలు దద్దరిల్లేలా ఘీంకరించింది. కింద కార్మికుల వరుస ఇళ్ల వద్ద కట్టేసి ఉంచిన కుక్కలన్నీ ఒక్కసారిగా మొరగసాగాయి.

కొద్దిసేపటి తరువాత భీమ విరిగిపోయిన గేటును మళ్లీ జాగ్రత్తగా దాటి నెమ్మదిగా వెనుదిరిగింది.

సునందమ్మ దేవుడి గదిలోకి వెళ్లి దీపంలో నెయ్యి పోసి నమస్కరించి వచ్చింది. ఐదు ఆరు నిమిషాల తరువాత వర్షం కొద్దిగా తగ్గినట్లు అనిపించింది. శివేగౌడ టార్చ్ వెలిగించి బయట చూసాడు. తోట చివర మలుపు దగ్గర, తమ ఇంటివైపు తిరిగి చూస్తూ భీమ ఇంకా నిలబడి ఉంది.

కోడిహళ్లి మురళీ మోహన్

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.

Previous Post

ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!

Next Post

హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

Next Post
హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • హిందీ కవిత: నా చిరునామా
  • ఇంగ్లిషు కవిత : మనోచిత్రం
  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లిషు కవిత :  కోరిక
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!
  • రష్యన్ కథ : శస్త్రచికిత్స
  • కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • హిందీ కథ : లెక్క తప్పింది !

అభిప్రాయాలు

  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply