• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’

రంగనాధ రామచంద్రరావు by రంగనాధ రామచంద్రరావు
August 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’

కన్నడ మూలం: కావ్య కడమె
అనువాదం: రంగనాథ రామచంద్రరావు

కుడిచేతిలో పట్టుకున్న చిన్న కత్తిని ఎడమ చేతి నరం మీద కదిలిస్తూ కూర్చున్న ఆమె ముందుకు సాగలేకపోయింది. సిక్యారోస్ అనే నైట్‌క్లబ్బుకు చెందిన త్రీ బై త్రీ ఆ టాయ్‌లెట్ స్టాల్ లోపల ఎవరో పక్కన నిలుచుని నన్ను ఆపుతున్నట్టుగా ఉంది. అదే మొదటిసారి నా సొంత దేహం మీద నియంత్రణ కూడా నా దగ్గర లేదని నాకు అర్థమై బాధ కలిగింది.

మోకాలికి కాస్త పైకి వచ్చే నారింజ రంగు కాక్‌టేల్ డ్రెస్సు ఒకసారి సర్దుకున్నాను. ఈ డ్రెస్సు వేసుకున్నప్పుడంతా రోహిత్ ఈ రంగు నీకు బాగా నప్పుతుంది అని మెచ్చుకోవటం గుర్తొచ్చి కడుపులో ఎవరో గుద్దినట్టు కళ్ళల్లో నీరు పొంగింది. మనసులోని దుఃఖమంతా దేహానికి బదిలీ అయినట్టు అనిపించి పొట్ట నొక్కుకొని, “అయ్యో, అమ్మా, అమ్మా” అని పరితపించాను. రెండు రోజుల క్రితం సేవ్ చేసుకున్న తొడలు- మోకాళ్ళ నుంచి సన్నటి రోమాలు పైకి లేస్తుండడం చూసి మరింత జుగుప్స కలిగింది.

నేను ఈ స్థితిలో ఇలా టాయిలెట్ సీట్‌మీద కూర్చొని గంట గడిచిపోయిండోచ్చేమో. ఉదయం పదకొండుకు ఆఫీస్ నుంచి నా డెస్క్‌లోని సామానులంతా కార్డ్ బోర్డ్ బాక్సులో నింపుకొని వచ్చినదాన్ని, రోజంతా పక్క మీదే పడుకున్నాను. “ఇకపై నీ సేవల అవసరం మా కంపెనీకి లేదు. ఇప్పటికే మÖడుసార్లు వార్నింగ్ ఇచ్చాం. యూ ఆర్ లక్కీ. ఎగ్జిట్ ప్యాకేజీలో మీ అర్హతకన్నా ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వడానికి కంపెనీ నిర్ణయించుకుంది” అన్నాడు లూయిస్ ఆ రోజు ఉదయం తన క్యాబిన్‌కు పిలిపించుకుని. నా అర్హత గురించి అతను అలా మాట్లాడినప్పుడు నాకు కోపం తలకెక్కి అతని ముఖం మీద ‘ఫక్ యూ’ అని చెప్పి తలుపు తలుపులను దఢాలున వేసి బయటకు వచ్చాను. నేను తలుపు వేసిన రభసకు ఆఫీసులో ఉన్న వారందరూ ఒకసారి నన్ను చూసి లోపల జరిగింది ఊహించారు. ఆరోజు రోహిత్ కూడా అక్కడ ఉంటే అదే కోపంతో అతని చెంపకు ఫట్‌మని ఒకటిచ్చి వచ్చేదాన్నేమో. అయితే అతను న్యూయార్క్ నుంచి మా స్యాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీస్‌కు బదిలీ చేయించుకుని వెళ్లి నెలవుతూ వచ్చింది. ఆ ఆమె, ఏమిటా పేరు, శ్వేత.. శ్వేతా కూడా రోహిత్‌తోపాటు స్యాన్‌ఫ్రాన్సిస్కోకు షిఫ్ట్ అయింది.

అప్పటికే అర్ధరాత్రి ఒకటి అని ఎక్కడో చూసినట్టు అనిపించింది కదా? ఇంకొక గంటకు ఈ క్లబ్‌కూడా మూస్తారుకదా. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలి? అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అక్కడి చీకటిని- ఒంటరితనాన్ని భరించే ధైర్యం కలగలేదు. అక్కడ ఇంకా రోహిత్ జ్ఞాపకాలు ఉన్నాయి. అతను ఉదయం చాయ్ తాగుతున్న కప్పు, ఉపయోగిస్తున్న టవల్, అతనికి చిన్నదైందని నాకు ఇచ్చిన ‘ఐ లవ్ న్యూయార్క్’ అని రాసి ఉన్న టీషర్ట్… ఇంకా ఏమేమో. అక్కడికి వెళ్లి సాధించేదేముంది? ఇక్కడే దీన్ని ముగించాలని మరొకసారి ఆ ప్యాకెట్ నైఫ్ పిడిని బలంగా ఒత్తి పట్టుకున్నాను. కత్తి శరీరంలో నా కాటుక మెత్తిన బుగ్గలను చూసి బాధ పొంగు కొచ్చింది.

ఏదో చేయబోయి ఇంకేమో జరిగినట్టు, ఒక దుఃఖం మరవటానికి ప్రయత్నించి ఇంకోటి తెచ్చుకున్నట్టు అయింది. డాన్స్ ఫ్లోర్ మీద ఒత్తొత్తి డాన్స్ చేస్తున్న ఒకడ్ని దగ్గరికి లాక్కొని ముందుగా ముద్దు పెట్టుకున్నది నేనే. రెండు గ్లాసుల శెరీ, ఒక కంటేనర్ వోడ్కా తాగింది కాస్త తలకెక్కి ఉండొచ్చేమో? అయితే ఆ అతను ఒకసారి ముద్దు పెట్టిన సాకుతో తర్వాత వదలే లేదు. ముద్దు పెడుతూనే డ్యాన్స్ ఫ్లోర్ అంచుకు తీసుకొని పోయాడు. భుజాల మీదున్న అతని చేతులు నెమ్మదిగా నిమురుతూ కిందకి దిగి దిగి పిరుదులను పట్టుకున్నాయి. రకరకాల చుట్టూ తిరుగుతున్న లైట్లు, మెరుపు రేఖలు, ఆర్భాటమైన సంగీతానికి సర్దుకొని మత్తు ఎక్కిస్తున్నాయి. తల భారమంతా తేలికపడినట్టు అనిపించింది.

అతను హఠాత్తుగా నన్ను ఎత్తుకొని బాత్రూం స్టాల్ వైపు నడిచినప్పుడు తర్వాత జరగబోయే కృత్యం గురించి నాకు ఒక అంచనా ఉంది. పైగా “వై నాట్?” అనే పిచ్చి ధైర్యం కలిసింది. రోహిత్ తోడుగా ఉన్నప్పుడు ఇలా చేయడం సాధ్యముండేదా? ఇప్పుడ దొంగ ముండా కొడుకు ఎవరో ఆడదాని మెడలోని చమట వాసనను పీల్చుతూ పడుకొని ఉండనీ. నేనిక్కడ మజా చేస్తున్నానని అనుకొని నవ్యాను.

“డోంట్ లాఫ్” అనే గంభీరమైన ధ్వని అతన్నుంచి వచ్చింది. టాయిలెట్ స్టాండ్ వెలుతురులో మరో విధంగా కనిపిస్తున్నాడు. ఇతను ఇంత పొడుగ్గా ఉన్నాడు. భుజాలు చాలా బలిష్టంగా ఉన్నాయి. బయట డాన్స్ ఫ్లోర్ మీద దృష్టికి రాలేదుకదా. అతని ఎడమ భుజం మీద జంతువు నిప్పులు కక్కుతున్న ఒక జంతువు పచ్చబొట్టు ఉంది. దాన్ని నేను ముట్టుకుంటుండగానే అతను నన్ను తిప్పుకొని, టాయిలెట్ సీట్ మీద వంచి, నిలిపి నా ప్యాంటి తొలగించాడు. అతనెక్కడ ముందుకు సాగుతున్నాడూ అర్థం కాగానే , “నో నాట్ దేర్” అని అతనిని అరిచాను. అతను ఏమీ ప్రతిస్పందించకుండానే, “నో నాట్ ఇన్ ద యాస్” అని స్పష్టంగా చెప్పాను.

నా రెండు చేతులను వీపు వెనక్కి తిప్పి పట్టుకొని ఒక చేతిలో కాండోమ్ ప్యాకెట్‌ను పంటితో కొరికి తొడుక్కోవడం దృష్టికి వచ్చింది. ఇంకొకసారి తిరిగి “నాట్ దేర్” అన్నాను. నా కళ్ళల్లో ఏర్పడగలిగిన దైన్యాన్ని తలుచుకొని అసహ్యించుకున్నాను.

“బిచ్, నౌ యూ టెల్ మీ వాట్ టు డూ” అంటూ నాలోకి దూర్చాడు. భరించలేని బాధతో తల తిరిగినట్టు అయింది. తల తిరిగినట్టయి ఒళ్లంతా చెమటలు పట్టింది. అక్కడ అలా నిర్జీవంగా నిలబడటం తప్ప నాకు మరో దారి లేదు. రోహిత్ పదేళ్ల మా ప్రేమలో ఎన్నోసార్లు దీనికోసం అడిగినప్పటికీ నేను ఒక్కసారి కూడా అనుమతించలేదు. ఈ ఇతను ఎవరో, పేరూ తెలియనివాడు, ఆ గీత ఉల్లంఘించాడు. నేను ద్వేషిస్తున్నాను అని నమ్ముకున్న రోహిత్ స్పర్శ గుర్తుకొచ్చి కలవర పడ్డాను. ఇప్పుడు ఏడిస్తే ఈ వ్యక్తికి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది అని పెదవులు బిగపట్టుకున్నాను.

ఆ లోపలే అతను నన్ను ముందుకు చెప్పి ముందుకు వచ్చాడు. “నో నో, కాండోమ్ అయినా మార్చు. కావాలంటే నా దగ్గర కాండోమ్ ఉంది” అన్నప్పటికీ చెవిలో వేసుకున్నట్టు కనిపించలేదు. అలాగే ముందుకు తోసుకొచ్చాడు. మురుగు కాలువలో మునిగి లేచినట్లయింది. “ఐ టోల్డ్ యూ, నాట్ టు టెల్ మీ వాట్ టు డూ” అంటూ తన అరక్షణంలోనే పని ముగించి తిరిగికూడా చూడకుండా అతను వెళ్లిపోయాడు.

వాడి విసిరేసిన టాయిలెట్ పేపర్‌లా అనిపించి వాంతికి వచ్చినట్టయింది. అతను వెళ్ళిన వెంటనే గబగబా గడియ వేశాను. బయట వాష్ బేసిన్‌లో అతను ముఖం కడుక్కోవడం, హ్యాండ్ డ్రైయర్‌తో చేతులు డ్రై చేసుకోవడం వినిపిస్తోంది. ఏదో ఆలోచనలో ఉన్నట్టు ఉఁ ఉఁ ఉఁ అని గొణుక్కుంటున్నాడు. అద్దం ముందు అర క్షణం నిలుచొని తర్వాత తలుపులు తెరుచుకొని నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

అంగుళం అంగుళంగా నీళ్లలో మునుగుతున్నట్టు అనిపించింది. ఇదే పాతాళం, దీనికన్నా కిందకి దిగడానికి సాధ్యం కాదనిపించింది. అలా అనుకుంటూనే వెనుకటి నిమిషానికన్నా ఈ నిమిషం ఎక్కువ లోతుకు కూలిపోతున్నాను. తాగిన దంతా ఎప్పుడో దిగిపోయినప్పటికీ ఎవరో సుత్తితో కొట్టినట్టు తల పగిలిపోతుంది. ఈ ప్రపాతం చివరకు చేరుకోదేమో అనే భయం వేసింది. ఎంత ముడుచుకుని కూర్చున్నా చలి తాకుతున్నది చర్మపు బయటి పొరకు కాదు. లోపలి పొరకు అని అవగాహన కలిగి మరింత హింస కలిగింది.

ఇంతగా షాక్ కావలసినదేమి జరగలేదు. ఇంటికి వెళ్లి, స్నానం చేసి, ఇదంతా ఒక పీడకల అని మరిచిపోయి పడుకుందామని కూడా ఒకసారి అనిపించింది. అయితే శరీరంలోని ఒక్కొక్క అంగుళాన్ని ఎత్తి పెట్టడానికి చేతకాలేదు. రాతి ముక్కలు లేచి బురదగా మారిన దారిని ఇదే గడ్డిపరుపు అని కల్పించుకోవడం సాధ్యమా? ఆ అనుభవం కలిగింది.

ఇదే మొదటిసారి ఊహలో ఏర్పడిన చిత్రంకన్నా వాస్తవమే భయానకమైనదనే అవగాహన కలిగింది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితి వస్తే ఆ పరిస్థితి వస్తే దాని పట్ల ధైర్యంతో ఉన్నట్టు ఊహించుకున్నాను. నేను ఈ దేహం మాత్రమే కాదు. శరీర ఉల్లంఘన వల్ల మనసు చైతన్యాన్ని గాయపరచడం సాధ్యం కాదని పేజీల కొద్దీ ట్వీట్ చేశాను. అయితే ఈ నిజమైన కీడును థియరీలతో దాటటానికి సాధ్యం కావడం లేదు. ఒక అపరిచితమైన వ్యక్తితో సంభోగపు వేడి తలలో ఏర్పడుతున్నప్పుడు మాత్రం రమ్యమైనదని అర్థం కావడానికి నేను ఈ భయంకరమైన అనుభవాన్నే దాటి రావలసి వచ్చిందా?

ఇప్పుడేం చేయాలో అర్థం కాలేదు. ఏడ్చి ఏడ్చి న నియంత్రణలో లేకుండా గొంతు నుంచి ‘గోక్ గోక్’ అనే వెక్కిళ్లు మాత్రం వస్తోంది. అలా అయినప్పుడంతా మొత్తం ప్రాణమే సమతుల్యం తప్పిన పిల్లిలాగా బెదిరిపోయి నిరాశ ఒత్తుకొని వచ్చేది. మళ్లీ అదే ఏడుపు. అవే వెక్కిళ్లు. సెల్ఫ్ పిటి. నేను ఏ తప్పుకు ఈ శిక్ష అనుభవించాలి? ఇలా బొద్దింకలా కుళ్లి కుళ్లి ఏడుస్తూ కూర్చున్న నా పట్ల నాకు జుగుప్సా పొంగుకు వచ్చింది. “ముగించాలి, అన్నిటినీ ముగించాలి” అని అనుకున్నా, నిస్సహాయతతో ఇంకొకసారి ఒక మూలుగు శబ్దం చేస్తూ బయటికొచ్చింది.

“యూ ఓకే దేర్?” అని పక్కని స్టాల్ నుంచి మృదువుగా గోడ మీద చప్పుడుతో పాటు తేలివచ్చిన కంఠధ్వని నుంచే ఈ స్థలానికి ఇతరులు కూడా వచ్చి పోతుంటారని నాకు అర్థమైంది. ఇన్ని సంవత్సరాల అనుభవంలో నేను గమనించిన ప్రకారం నైట్ క్లబ్ రెస్ట్‌రూమ్‌లకు వెళ్లేవారు ఎప్పుడూ ఈ విధమైన తొందరలో ఉంటారు. వెంటనే లిప్ గ్లాస్ పూసుకోవడంలోనో, కనురెప్పలకు మస్కారా దిద్దుకోవడంలోనో, కాంప్యాక్ట్ పౌడర్ను నాజూకుగా ముఖానికి అద్దుకోవటంలోనో, అపరిచితులతో ప్యాడునో, ట్యాంపానో, చివరికి కాండోమ్‌నో అడిగి తీసుకొని మాయమైపోతారు. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళటం వారి మెదడులో నమోదు కాలేదేమో. బయటి ఆర్భాటమైన సంగీతానికి, రింగులు రింగులుగా తిరిగే వెలుతురు అలలకు అలాంటి సమ్మోహన శక్తి ఉంటుంది కదా!

నేను జవాబివ్వకుండా ఉండటం చూసి ఇంకొకసారి టక్‌టక్‌మని అదే గోడ మీది చప్పుడుతోపాటు మళ్లీ అదే స్వరం దూరి వచ్చింది. “ఎస్, ఐ యామ్ ఓకే, థాంక్స్” అని మాత్రమే చెప్పినప్పటికీ ఆ స్వరం నాదని నమ్మలేనంతగా మారిపోయి ఉంది. అవతల వైపున్న ఆమెకూ అది తెలిసిపోయినట్టు కనిపించింది.

“యూ నీడ్ ఎనీ హెల్ప్?” అంది.

“వద్దు” అన్నాను .

ఏడుస్తున్న నన్ను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్న ఆమె మీద కోపం వచ్చింది. అదే కోపంలో “కెన్ యు ప్లీజ్ లీవ్ మీ అలోన్” అని అన్నాను. అవతలి వ్యక్తి మౌనం వహించింది. ‘అబ్బా శని తొలగిపోయింది కదా, నా పాటికి నన్ను వదిలి వేయడానికి కుదరదా?’ అనే మనసులోని గొణుక్కున్నాను. ఆ తర్వాత ఆమె ఫ్లష్ చేయటం, స్టాల్ గడియ తీసి బయటికి రావడం, వాష్ బేషన్లో చేతులు కడుక్కోవడం ఆ చప్పుళ్ల వల్లనే తెలిసింది. ఇంకేమీ తలుపుల గుండా బయటికి వెళుతుందని అనుకుంటున్నంతలో మళ్లీ ఆమె స్వరం తోసుకొని వచ్చింది.

“నేను ఇక్కడ తలుపుకు ఇవతల నిలుచున్నాను. నీకు ఎప్పుడు బాగా అనిపిస్తుందో అప్పుడే బయటికి రా” అంది. ఈమె నన్ను ఏమనుకుంటోంది? ఈమె, ఈమె తాళానికి తగినట్టు డాన్స్ చేస్తాననుకుందా? ఇప్పుడు కలిగిన అనుభవం చాలదా? ఈమె నుంచి నేను కొత్త పాఠం నేర్చుకోవాలా? అనే ఆలోచనలు తలలో కదిలిపోయాయి. ఆ తర్వాత ఐదు నిమిషాలు గడిచినప్పటికీ ఆమె ఇంకా నిలుచునే ఉన్నట్టు అర్థమైంది. ఎక్కువగా శబ్దం చేయకుండా నేనున్న స్టాల్ తలుపునే చూస్తూ చేతులు కట్టుకొని నిలుచుని ఉన్నట్టు ఆమె ఆకృతి కళ్ళ ముందుకొచ్చింది.

“ఆగు, నీ పనిచెప్తా” అని కోపంతో లేచాను. ఆ అతని మీదున్న కోపమంతా ఈమె మీద తీర్చుకోవాలనిపించింది. కుడిచేతిలో ఉన్న కత్తి అలాగే ఉంది. కోపంగా చూస్తూ గడియ తీశాను.

అప్పుడే, అప్పుడే నేను క్లారాను మొదటిసారి చూశాను. ఆ క్షణాన్ని నేనెప్పటికీ మరవలేనేమో.

సుమారు నలభై ఏళ్ల ఆఫ్రికన్-అమెరికన్ స్త్రీ ఆమె. గొంతు మాత్రమే విని నా ఊహలో ఏర్పడిన చిత్రం కన్నా కాస్త లావుగా ఉంది. నీలం రంగు చుక్కల పొడుగు స్కర్ట్, దాని మీద మెరూన్ రంగు సాదా స్వెటర్ ధరించిన ఆమె ఈ నైట్ క్లబ్ ఆవరణానికి పొందిక లేని వ్యక్తిలా కనిపించింది.

నన్ను చూసి ఆమెకూ అలాంటి ఆశ్చర్యం కలిగిందేమో. గంటల నుంచి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. నల్లరంగు కన్నీటిని సృష్టిస్తున్నానేమో అనేలా బుగ్గల వెంబడి కాటుక పొడుగ్గా కరిగి ప్రవహించి మేకప్ అంతా మాసిపోయింది. చప్పున చూడగానే మేకప్ పూసిన చర్మం నుంచి లోపలి మనసు కాంతి అన్నది చీల్చి చూపించేలా కనిపిస్తుంది.

నన్ను చూడగానే అంతా అర్థమైనట్టు తీరుగా ఉన్న ఆమె కనుబొమ్మల్లో అలలు ఎగిసిపడ్డాయి. “ఓ హనీ” అంటూ రెండు చేతులను చాపింది. ఆమె స్వరంలోని మృదుత్వం వల్ల నాకు గడ్డి పరకల ఆసరా దొరికినట్టయి, నాలో గడ్డకట్టినదేదో కరిగిపోయినట్టు అనిపించింది. కోపాన్ని మోసుకున్న ముఖం మీది తెరతొలగి కన్నీరు పొంగి వచ్చింది. ఆమె వైపు తేలిపోతున్నట్టు నడిచి వణికే స్వరంతో, “ఐ… ఐ వాంట్ టు డై… బట్ ఐ కాంట్ డూ ఇట్” అంటూ చేతిలోనే కత్తిని ఆమె చేతికిచ్చి, ఆమె బాహువుల్లో చేరుకున్నాను. “ఓ హనీ, దట్స్ ఓకే హనీ” అంటూ ఆమె నా వీపు నిమురుతుండగా ఇంకొకసారి నా దుఃఖపు చెలియలి కట్ట తెగింది. ఆమె మెత్తటి కాటన్ బట్టల ముందు నా ఒంటిమీద మెరుస్తున్న సిఫాన్ స్కర్ట్ నిర్జీవంగా ముడుచుకున్నట్టుగా ఉంది.

అలా ఎంత సమయం గడిచిపోయిందో నాకు తెలియలేదు. నేను డ్యాన్స్ ఫ్లోర్లో కాలు పెట్టిన క్షణం నుంచి ఇప్పటిదాకా ఎంత సమయం గడిచివుండొచ్చు? అంతా పదినిమిషాల లోపల జరిగిపోయుండొచ్చు లేదా ఐదారు గంటలే దొర్లిపోయి ఉండొచ్చు. డిజైన్ అందంగా ఉందన్నట్టు ఎడమ చేతికి కట్టుకున్న ఆగిపోయిన గడియారంలా నా లోపలి కాలమూ ఆగిపోయింది.

క్లారా నా భుజాలు చుట్టి, పట్టుకొని బాత్రూం నుంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆర్భాటపు సంగీతం మళ్లీ చెవులను తాకటంతో బెదిరాను. అయితే ఆమె డాన్స్ ఫ్లోర్ ఉన్న వైపు తీసుకొని వెళ్లకుండా, కుడివైపున ఆఫీసులు ఉన్న వైపుకు తిరిగింది. ఒకే విధంగా వరుసగా నిలుచున్న ఐదారు తలుపులు కనిపించాయి. ఈ నైట్ క్లబ్‌కు ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ ఒక్కసారికూడా బిల్డింగ్ ఈ భాగానికి నేనెప్పుడూ రాలేదు.

బయటికి అట్టహాసం ఈ లోపలి గదులకు చేరటం లేదు. మేము అక్కడ నడుస్తుండగానే నడుము వరకు జుట్టును ఉంగరాలు ఉంగరాలుగా దిగవిడిచిన సుమారు పద్దెనిమిదేళ్ల యువతి అవునో కాదో అన్నట్టు మెడను ఊపి, ఆ కదలికలోనే ‘హలో’ అని పలకరించి వెళ్లింది. క్లారా ‘హెడ్ క్యాషియర’ అని తెల్లటి అక్షరాలతో రాయబడిన నీలం రంగు తలుపు ముందాగి తాళం తెరిచింది. తాగటానికి నీళ్లిచ్చింది. మొదటి చుక్క గొంతులో దిగటానికి కష్టమైనప్పటికీ తర్వాత జన్మలో నీటిని చూడని దానిలా బాటిల్లోని నీళ్లంతా తాగి పూర్తిచేశాను.

జరిగినదంతా సంక్షిప్తంగా నా నోటి నుంచి వచ్చింది. ఆమెకు ఎంత అర్థమైందో తెలియదు. ఎందుకంటే మాటలు వేగంలో నేను పెరిగేటప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వస్తున్న ఒక వీధి పిల్లి పట్ల వివరించిన విధానం గుర్తుంది. ఆ ఆ బూడిద రంగు పిల్లి మీద అక్కడక్కడ తెల్లటి వృత్తాలు ఉన్నాయి. ఒకసారి దాని చెవి పట్టుకొని కాంపౌండ్ బయటికి విసిరినప్పుడు రోడ్డు మీద వస్తున్న స్కూటర్‌కు దాని ముందరి కాళ్లు చిక్కుకొని నుజ్జు నుజ్జు అయ్యాయని చెబుతూ ఏడ్చేశాను.

ఆమెకు నా పరిస్థితి చూసి జాలి కలిగివుండాలి. మాటల మధ్యన నన్ను ఆపింది. “రా, మొదట ఆసుపత్రికి వెళ్లి తర్వాత పోలీసులకు కంప్లయింట్ ఇద్దాం. ఇలాంటి వాటికి చాలా ఆలస్యం చేయకూడదు” అంది. ‘అసాధ్యం’ అన్నాను. ‘ఈ విషయాన్ని మరిచిపోతాను. అదృష్టానికి ప్రాణానికి ఏమీ హాని కలగలేదు కదా. ఐ వాంట్ టు హీల్. ఐ వాంట్ టు గో హోమ్” అని వెనుకడుగు వేశాను.

“ఇప్పుడు నీకు అలా అనిపించడం సహజం. ఆ తర్వాత పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది”

కేసు వేస్తే మళ్లీ అదంతా గుర్తు చేసుకోవాలి. అతన్ని ఎదుర్కోవాలి.

“లేదు, ఆ వ్యక్తిని ఇంకెప్పుడు చూడడానికి నాకు సాధ్యం కాదు. ఇంకొక విషయం ఉంది…” అని నేనే మొదట అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టటం, ఆ తర్వాత అతను రెస్ట్ రూమ్‌కి నన్ను ఎత్తుకొని పోతున్నప్పుడూ నేను వ్యతిరేకించకుండా ఉండటం చెప్పాను.

“సో వాట్, బాత్రూం స్టాల్‌లో నువ్వు అతనికి ‘నో’ అని చెప్పావు కదా?”

“నాలుగైదు సార్లు చెప్పాను”

“నాలుగో లేదా ఐదో? బాధపడకు. అయితే ఇలాంటి వివరాల స్పష్టత ముఖ్యం”

“నాలుగు. నాలుగు సార్లు చెప్పాను. అయితే అక్కడ ఇంకెవరూ లేరు. నేను అతను ఇద్దరమే ఉన్నాం. దాన్ని ఎలా నిరూపించడం?”

“అక్కడ ఎవరున్నారు, ఎవరులేరు అన్నది నీకు ముఖ్యం కాదు. తర్వాత సాక్షులు దొరకవచ్చు. అంతే. నువ్వు ‘నో’ అన్నప్పటికీ ముందుకు సాగాడు కదా? ఫోర్స్ ఉపయోగించాడు కదా? అతను గిల్టీ అవునో కాదో మనం నిరూపించవలసిన అవసరం లేదు”

అరగంట క్రితమే పరిచయమైన క్లారా నువ్వు అనేటప్పుడు మనం శబ్దాన్ని ఉపయోగించినప్పుడు ఆమెను ఎక్కడ నిలపాలో అర్థం కాలేదు.

“చూడు, మీ సహాయానికి థాంక్స్. అయితే నాకు ఇదంతా పబ్లిక్ చేయడం ఇష్టం లేదు. ఐ యామ్ హర్ట్. ఐ నీడ్ టు గో హోమ్” అని మళ్ళీ కొంచెం కఠినంగానే అన్నాను.

“నిన్న ఇంటికి పోవద్దని ఎవరు చెప్పారు? ఇలా చేద్దాం. కంప్లయింట్ ఫైల్ చేయడం వద్దు. అయితే ఆసుపత్రికి వెళ్లి ఫారెన్సిక్ రిపోర్టయినా తయారుచేద్దాం. నువ్వు ‘ఎస్’ అని సంతకం చేసేవరకు ఎవరికీ దీన్ని పబ్లిక్ చేసే హక్కు లేదు” అని అంటూ “నీ నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు కాదు” అని సంకోచంతోనే ఆ వాక్యాన్ని చేర్చింది.

“డబ్బు సమస్యేమీ లేదు” అని మొదలుపెట్టిన ఆమెకు ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు. ఆ రోజే ఉద్యోగం పోగొట్టుకున్నప్పటికీ అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. రోహిత్‌తోపాటు ఉన్న నాలుగు సంవత్సరాల ఇంటి సగం రెంట్ తప్ప ఇంకేమీ ఖర్చు కాకుండా జీతం ముక్కలు భాగం అలాగే మిగిలివుండేది. అయితే ఆ వివరాలన్నిటికీ ఈ సందర్భంలో ఏం అర్థం మిగిలింది? ఈ అపరిచితుల దగ్గర దాన్నంతా పంచుకోవచ్చా?

“ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి విషయాలన్నీ ఆలస్యం చేసినకొద్దీ సమస్యే. అప్పటికే అర్ధరాత్రి రెండయింది. మరో ఐదు నిమిషాల్లో నైట్ క్లబ్ కూడా క్లోజ్ అవుతుంది. నేనే తీసుకొని వెళతాను రా” అని బయలుదేరడానికి సిద్ధమైంది.

“వద్దు, వద్దు ఐ కెన్ డ్రైవ్” అనే గబుక్కున లేచి నిల్చున్నాను. చురుక్కుమని బాధల చుట్ట ఒకటి బొడ్డు లోపల నుంచి సర్రున జరిగినట్టయి ముఖం బాధతో ముడుచుకు పోయింది. మనసుకున్న దృఢత్వం శరీరానికి ఉండలేదు. ఆ క్షణం నుంచి క్లారా చెప్పిన దానికంతా ఎక్కువ అడ్డు చెప్పకుండా ఒప్పుకున్నాను.

నా కారును ఆమే డ్రైవ్ చేసుకుంటూ సెయింట్ పీటర్స్ అనే ఆసుపత్రికి తీసుకెళ్ళింది. కౌంటర్లో నా ఐడి, మెడికల్ ఇన్సూరెన్స్ కార్డును తీసి ఇచ్చాను. మిగిలినవన్నీ ఆమే ముందు నిలబడి చూసుకుంది.

ఫోరెన్సిక్ పరీక్ష అనే నాలుగు గంటల నరకాన్ని అనుభవించేటప్పుడు మాత్రం క్లారాను మనస్సులో బాగా తిట్టుకున్నాను. “ఈ శని దొరకక పోయివుంటే ఈ సమయానికి స్నానం చేసి విశ్రాంతిగా ఇంట్లో పడుకొనివుండేదాన్ని” అని తిట్టుకున్నాను.

నాకోసం నిర్ణయింపబడిన నర్స్ తాను క్యారోలిన్ అని పరిచయం చేసుకుంది. దేహంలో ఎక్కడెక్కడో కాటన్ పుల్లలను దూర్చి శాంపిల్స్ సేకరించింది. పెద్దదైన కాగితం సీట్ మీద నిలబెట్టి దేహంలోని అణువణువునూ బ్రష్‌తో ఒకసారి దులిపింది. ఒక్కొక్క భాగం ఫోటోలను తీసుకుంది. ఎండొస్కోపీ ద్వారా దేహంలోపలి కొన్ని భాగాల ఫోటోలు తీసుకుంది.

నా భుజం వెనుక భాగంలో రెండు పంటి గుర్తులున్నాయి. పిర్ర మీద ఒకచోట గోటితో గీరినట్టు గాయపు మరక ఉంది. వీపు మీద నా బట్టలోంచే కనిపిస్తున్న గాయం ఉంది. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇలాంటి సూక్ష్మాలు ఎలా నా కలలో నమోదు కాలేదా?

అన్ని ముగిసిన తర్వాత క్యారోలిన్ ప్రథమ చికిత్సనూ నిర్వహించి, “వీ ఆర్ డన్. నా సలహా ఏమిటంటే ఈ ఘటనలో ఒక డైరీలో తూచా తప్పకుండా రాసి పెట్టు. తర్వాత కావాలన్నా ముఖ్యమైన విషయాలు గుర్తుండవు. నీ రేప్ కిట్టు కూడా సిద్ధమయ్యింది. రెడీ అనిపించినప్పుడు నువ్వొకసారి వచ్చి సంతకం చేస్తే చాలు. తర్వాత విషయాలన్నీ మేము చూసుకుంటాం” అంది.

రేప్ అనే పదం విన్న వెంటనే మానసికంగా కుంగిపోయాను. బాల్యంలో మాత్రమే అలా నిరాటంకంగా, తేలికగా విన్నటువంటి, కన్నడ సినిమాలలో హాస్యం కోసం ఉపయోగిస్తున్న పదం. ఎవరో దాని గురించి జోకు వేసినప్పుడు నవ్వు పొంగించిన శబ్దం. ఈ సందర్భంలో విన్నప్పుడు గుండెనే చీల్చి వేసింది.

ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అప్పటికే తెల్లవారు జాము ఆరుగంటల సమయం.

క్లారాకు అపార్ట్ మెంట్ అడ్రస్ చెప్పి కారులోనే నిద్రపోయాను. లిఫ్ట్‌లోనూ గోడకు ఒరిగే నిలుచున్నాను. లిఫ్ట్‌లోని ఈ గాజు గోడలు ఎప్పుడూ ఇలా వెచ్చగా ఉన్నాయా? మొదట్లో ఎప్పుడూ ముట్టుకున్నట్టు గుర్తులేదు. లిఫ్ట్ పైకి వెళుతున్నప్పుడు కడుపులో ఏదో కలిచివేసినట్టు లోపలి నుంచి మళ్లీ ఏదో తోసుకొచ్చింది. క్లారా ఒకసారి తలూపి “బీ స్ట్రాంగ్” అంది.
ఆ తర్వాత రోజులను క్లారా ప్రసక్తి లేకుండా చెప్పడానికి నాకు సాధ్యమే కాదు. మధ్యాహ్నం ఆమె రాక కోసం ఎదురుచూస్తూనే ఉదయంతా కిటికీ లోంచి చూపులు సారిస్తూ కూర్చునేదాన్ని. మొదట్లో డెలివరీ బాయ్స్, పోస్ట్‌మాన్, ఒక్క అపార్ట్‌మెంట్‌వాడు ఇలా ఏ మగవాడి గొంతు విన్నప్పటికీ ఆసరా కోసం దేన్నైనా పట్టుకోవాల్సి వచ్చేది.

ఆ తర్వాత క్లారా రోజూ వచ్చేది. ఒక్కరోజు కూడా వదలకుండా వచ్చింది. “యÖ షుడ్ గెట్ ఔట్ మోర” అంటూ సమీపంలోని ఫార్మర్స్ మార్కెట్‌కు, స్ట్రీట్ ఫేర్ల్లకు తీసుకెళ్లింది. అప్పుడు కారులోనో, ఇంట్లోనో, రెస్టారెంట్‌లోనో, పార్క్‌లోనో దొరికిన ఏకాంతంలో అప్పుడప్పుడు ఆగి ఆగి ఆమె దగ్గర మాట్లాడసాగాను.

“పది సంవత్సరాల ప్రేమ మాది. ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జతకూడిన మా ఇద్దరిని చూసి స్నేహితులంతా ‘గాయ్స్ మీరింకా చాలా ప్రపంచాన్ని చూడాల్సివుంది’ అని తమాషా చేశారు. ఆరు నెలల క్రితం అదే స్నేహితులను పిలిచి మా సంబంధం పది సంవత్సరాలు పూర్తి చేసుకుందని పార్టీ ఇచ్చాం”

“ఇలా న్యూయార్క్‌లోనే సెటిల్ కావాలన్నది రోహిత్ కలకదా. డిగ్రీ రోజుల్లోనే అతని గదిగోడ మీద న్యూయార్క్ స్కైలైన్ చిత్రపటం ఉండేది. చికాగోలో ఇద్దరమూ ఎం.ఎస్. చేసేటప్పుడు కూడా ఆ కలను కాపాడుకుంటూ వచ్చాం”

“బాల్యంలో అమ్మను చాలా ద్వేషిస్తుండేదాన్ని. అలాగే రాత్రికి రాత్రి సూట్‌కేస్ నింపుకొని వెళ్లేటప్పుడు ఆమెకు పడుకున్న నా పట్ల ఏమీ అనిపించకుండా పోయింది కదా అని దుఃఖం కలుగుతుండేది. అమ్మానాన్నల సంబంధంలో ఏమేమి చీలికలు ఉన్నాయో ఎవరికి తెలుసు. ఆ విషయం గురించి ఎప్పటికీ ఎవరినో అడగలేక పోయాను”

“నాన్న మరో సూట్ కేసులో నా బట్టలన్నీ నింపుకొని బెంగళూరు నుంచి ధారవాడలోని నానమ్మ ఇంట్లో నన్ను వదిలి మధ్యాహ్నం ట్రైన్‌కి వెళ్ళిపోయారు. అప్పుడు నా వయస్సు ఏడో, ఎనిమిదో సంవత్సరాలు ఉండాలి. అప్పటినుంచి ధారవాడలోని నారాయణపురంలో ఉన్న నానమ్మ ఇల్లే నా ఇల్లయింది”

“నానమ్మకు ఎక్కడెక్కడి నుంచో మొక్కలను తెప్పించి పెరటి నిండా పువ్వులను పెంచే పిచ్చి. మల్లెలు, నిత్య కళ్యాణి, కనకాంబరం, గన్నేరు, మందారాలు, రజనిగంధ ఏది ఉందో ఏది లేదో మా ముంగిట్లో. ఒకసారి బటన్ గులాబీ/క్రిసాంతిమమ్ అనే పువ్వు విత్తనం కోసం నానమ్మ మంగళూరు వరకు వెళ్లివచ్చారు అంటే పూల పట్ల ఆమె ఆసక్తి అర్థమవుతుంది”

“తాతయ్య మాత్రం ‘ఉదయ’ అనే టీవీ చానల్ అభిమాని. అందులో ప్రసారమవుతున్న పాత కన్నడ సినిమాలను, రోడ్డులో వెళ్తున్న వారికి వినిపించేలా పెట్టేవారు. ఇప్పటికీ ఏ కన్నడ సినిమా పేరు అడిగిన దాని కథ, డైలాగులు నా మనసులోంచి తోసుకొస్తాయి.

“అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ముండ, మానం లేనిదానా, చెడు ప్రవర్తనదానా, పియ్య తినేదానా, దిక్కులేనిదానా, బిచ్చగత్తె, వ్యభిచారి, కులట, వీధి బసివి మొదలైన పదాలన్నీ ప్రయోగించేవారు. దాన్నుంచి నాకేమీ కోపం వచ్చేదికాదు. పియ్య తినేవారిని అలా కాకుండా ఇంకెలా పిలుస్తారో చెప్పండి అని నేనూ ఒకసారి తాతయ్య, నానమ్మల దగ్గర చప్పట్లు కొట్టించుకున్నాను”

“ఆమె ఎవరో శ్వేత. పోయిన సంవత్సరమే వచ్చి అతని టీమ్‌లో జాయిన్ అయింది. గొప్ప అందగత్తె కాదు. అలా అనకూడదన్నది నిజమే. అయితే ఏదో ఒక కోణంలో నాలాగే కనిపిస్తోంది. ఆ విషయాన్ని నా టీమ్‌లోని బ్రాడ్ నా దగ్గర చెప్పాడు. ఈ విషయాన్ని రోహిత్‌తో చెప్పుకున్నప్పుడు, “అవునా, నేను గమనించలేదు కదా” అని కళ్ళు విప్పార్చాడు. దొంగ వెధవకు ఆ విషయం చెప్పటమే తప్పయిందేమో!”

“ఇప్పటికీ కళ్ళు మూసుకొని కూర్చుంటే పెరట్లో నానమ్మ గునపం తీసుకొని మట్టి తవ్వడం, రాజ్‌కుమార్ సినిమాల పక్క వాయిద్యపు నేపథ్యంలో వినిపిస్తోంది. ఇప్పుడు ఆ ఇల్లే లేదు. ఆ ఇంటిని నేలమట్టం చేసి కాంప్లెక్స్ కడుతున్నారు. అయితే పెంకులు కప్పిన ఆ ఇంటి చల్లదనం మాత్రం దేహపు కణాల్లో చేరిపోయింది చూడు”

“ఆ నైట్ క్లబ్ నాకేమీ కొత్త కాదు. ఇక్కడికి వచ్చిన నాలుగు సంవత్సరాల నుంచి రోహిత్‌తోపాటు వారానికి రెండుసార్లు వెళుతున్న క్లబ్ అది. నేను అడగకుండానే నాకిష్టమైన వైన్ అందించే బార్‌గర్ల్ లోలా మొదలు పాటల ప్లేట్లను గిరగిరా తిప్పి చిత్ర విచిత్రమైన సంగీతాన్ని సృష్టించే డీజే బాక్సర్ వరకు అందరూ ముఖం చూడగానే పలకరిస్తున్నట్టు చిరునవ్వులు చిందించేవారే. అయితే ఇదొక్కసారి మాత్రం అందరూ అపరిచితులనిపించారు కదా”

“ఏదో ఒక చిన్న ఘర్షణనే జ్ఞాపకం పెట్టుకుని ‘ఇట్స్ ఓవర్’ అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్లిపోయేటప్పుడు అతని చేతిలో ఉన్న చిన్న బ్యాగులు చూసి రెండు రోజుల్లో తిరిగి వస్తాడని అనుకున్నాను. చూస్తే కబోర్డ్‌లో ఉన్న అతని బట్టలు, పుస్తకాలు, షూలు, అన్నీ అప్పటికే మాయమయ్యాయి. ఇది ఇప్పటికిప్పుడే నిర్ణయించుకున్నది కాదు. చాలా రోజులుగా ఆలోచించి, ఉపాయంగా ఒక్కొక్క సామగ్రిని సాగించి ముందుకు సాగారని అర్థమైంది. మరుసటి రోజు ఆఫీసులో అతనూ, ఆమెకూడా మా స్యాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీస్‌కి బదిలీ చేయించుకున్నారని తెలిసింది”

నేను మాట్లాడగానే తేలిక పడినట్లు క్లారా వినగానే దగ్గరయింది. ఆమె గురించి నాకు ఎక్కువ సమాచారం తెలియదు. నేనైతే కట్టలు తెగినదానిలా మాట్లాడు తున్నాను. ఆ సమయంలో క్లారా ఏమి చేర్చినప్పటికీ నేను పట్టించుకునేదాన్ని కాదేమో. ఆమె గురించి నేను ఎక్కువగా అడగడానికి ప్రయత్నించలేదు. ఆమె అడ్డ పేరు ఫోర్డ్ అని మాత్రం తెలుసు. అది ఎందుకు గుర్తుందంటే ఫోర్డ్ కారువాళ్లకి, మీ వంశస్థులకు ఏదైనా సంబంధముందా అని పిచ్చి మొద్దులా అడిగాను.

ఒక్కోసారి నా మాటలు కూడా హద్దులు దాటుతాయి. నువ్వెందుకు రోజు నన్ను చూడడానికి వస్తున్నావు? ఏదైనా కారణం ఉండాలికదా అందుకే ఆమెను పీడించేదాన్ని.

“నీకు ఇప్పుడు సపోర్ట్ కావాలి. నువ్వు ఆ షాక్ నుంచి బయటకు వచ్చే వరకు వస్తాను”

“అంటే నాకు పిచ్చి పట్టిందని అంటున్నావా? నాకేమీ సపోర్ట్ అవసరం లేదు. రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు” అని అకారణంగా గొడవ పెట్టుకున్నాను.

ఒకసారైతే ఆమెకు నా మీద ఆకర్షణ కలిగిందని నాకు అనుమానం కలిగింది.

“నాతో పడుకోవాలి అని నువ్వు ఎదురు చూడటం లేదుకదా?” అనే నా ప్రశ్నకు క్లారా కంగారు పడింది.

“ఇంకేమీ? ఏ కారణం లేకుండా ఇలా అపరిచితులకు దగ్గరవుతారా? నా శరీరం మీద కోరిక ఉంటే అదంతా వదిలేయ్” అని అరిచాను.

“నీకెందుకు అలా అనిపిస్తుంది? ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ టు లైఫ్. దానికోసమే నేను నీతోపాటు ఉన్నాను”

“అంటే నేను ఇప్పుడు చనిపోయానా?”

ఆ రోజు మాత్రం చాలాసేపు కూర్చోకుండా క్లారా లేచిపోయింది. నేను ఆమె వెనకే వెళ్లి తలుపు వేశాను.

అది చాలాదన్నట్టు ఆమె పేరును ఇంటర్‌నెట్‌లో వెతికే ప్రయత్నం చేశాను. ఏ సోషల్ మీడియా సైట్లలోనూ ఆమె పేరు లేదు. ఆమెపేరు, అడ్డపేరు సాధారణమైనవి కావటం వల్ల ఎవరు ఎవరిదో చిత్రాన్ని చూసినా తప్ప ఈమె ముఖం మాత్రం కనిపించలేదు.

గూగుల్‌లో ఒక ఇరవై పుటల కిందకి వెళ్లిన తర్వాత క్లారా ఫోర్డ్ అనే యువతి మీద ఇరవై ఏళ్ల క్రితం వర్జీనియా కాలేజీ డార్మ్ రూమ్‌లో అత్యాచారం జరిగింది అనే వార్త దొరికింది. అది నాకు దొరికిందో నేనే వెతికి తీశాను ఎవరికి తెలుసు? ఆ పేరు, అడ్డ పేరు ఎంత సాధారణంగా ఉన్నాయంటే ప్రతి వీధిలోని ఒక్కొక్క క్లారా ఫోర్డ్‌లను వెతికి తీయవచ్చు. ఆ వార్తలోని సత్యాసత్యాలను క్లారా దగ్గర నిర్ధారణ చేసుకునే ధైర్యం నాకు కలగలేదు.

అయినా క్లారా వచ్చింది. కాస్త నిద్రపోయి లేచిన తర్వాత వెనుకటి రోజు మాటలు పదును పోగొట్టుకొని ఉండేవి. ఆమె వచ్చిన వెంటనే నేనే సిగ్గుతో తలవంచుకొని సారీ చెప్పేదాన్ని. ఉదయం పదకొండుకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు క్లబ్ తెరిచేవరకు నాతోపాటు ఉండేది. మధ్యాహ్నం భోజనాన్నీ ఇద్దరం కలిసే చేసేవాళ్ళం.

ఆ రోజు తర్వాత నేను తాగడం వదిలేశాను. వైన్ రుచిలోనో, ఆ తర్వాత వచ్చే త్రేన్పులోనో, అప్పటి జ్ఞాపకం తిరిగి వచ్చి హింసగా అనిపించేది. సంతోషంతో ఇష్టపడి తాగడానికీ, మితిమీరి తాగటానికీ వ్యత్యాసం ఉందని అంది. నువ్వు రెడీ అనిపించినప్పుడు మా నైట్ క్లబ్‌కూ రావడానికి మొదలు పెట్టు. ఒక చెడు అనుభవం కలిగిందని అటువైపు తిరగడమే వదిలిపెడితే ఆ తర్వాత ఇల్లొదిలి బయటకు వెళ్లడానికీ కూడా కష్టమవుతుందని చెప్పింది.

ఆ రోజు తడి అంతా, పాదాలకు అంటుకున్నట్టయి ముడుచుకొని పోతుండేదాన్ని. “ఇంకొకరిని ఎలా క్షమించాలి క్లారా? అన్ని బలహీనలతోపాటు నన్నయినా నేను ఎలా స్వీకరించాలి? చెప్పు క్లారా?” అంటూ ఏడుపు ఒత్తుకుంటూ వచ్చేది. ఆమె ఏమీ జవాబు చెప్పేది కాదు. తోడుగా ఉండటం కన్నా ఓదార్పు ఇంకోటి లేదని ఆమెకు తెలిసివుండాలి.

చివరికి ఆ సంఘటన జరిగి ఒకటిన్నర నెల చివరలో ఒక సాయంత్రం కాఫీ తాగుతూ క్లారాతో “నేను రెడీ” అని అన్నాను.

“నైట్‌క్లబ్‌కు రావడానికి?”

“కాదు”

“మరి?”

“లెట్స్ ఫైల్ ద కంప్లయింట్ అండ్ డ్రాగ్ దట్ భాస్టర్డ్ టు ద కోర్ట్”

నేను అనుమతి ఇవ్వగానే మిగిలినవన్నీ గబగబా మొదలయ్యాయి. అందరి ఐడిలు, సిసిటీవీ ఫుటేజ్‌లు, ఫోరెన్సిక్ కిట్ స్యాంపుల్స్, రిపోర్టులు సంఘటన వివరాలను సవివరంగా రాసిపెట్టిన డైరీ అన్ని మరుగున ఉన్నవి బయటకు వచ్చాయి. లాయర్లు నియమింపబడ్డారు. ఫెడరల్ చట్టం పదవ నిబంధన ప్రకారం నా కోరిక మేరకు నాకు ఒక గుప్త నామం ఇచ్చారు.

అప్పటినుంచి మ్యాన్ హ్యాటన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపల అడుగు పెట్టినప్పుడు నేను ‘ఆనంది జాదవ్” అయ్యాను. “కేసు జ్యూరీకి వెళ్ళకపోతే చాలు. ఇలాంటి విషయాలలో చీటీ ఎంపికైన పన్నెండు మంది ఏమని నిర్ణయిస్తారో ఊహించడం కష్టం” అనే మాటలన్నీ కేస్ మీటింగులలో వచ్చిపోయాయి.

తర్వాత అతను వచ్చాడు. ఒకసారి మాత్రం అతనివైపు చూసి, తలెత్తి, నిటారుగా, రాయిలా కూర్చున్నాను. పేరులేని అతనికొక పేరు వచ్చింది. పిల్లలతో, అతని భార్య రెస్టారెంట్ చైన్ ఒకదానిలో పనిచేస్తోంది. ఇతను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తెలిసింది. ఈ వ్యక్తిగత విషయాలన్నీ ఏ దృష్టితో చూడాలన్నదే నాకు స్ఫురించలేదు.

అతని వైపు లాయర్లు నైట్ క్లబ్ సీసీటీవీ ఫుటేజ్‌ను అనేకసార్లు తిప్పి తిప్పి చూపించారు. “మిస్ ఆనందే సెక్స్ ఇనిషియేట్ చేయలేదని మేమెప్పుడూ చెప్పలేదు. మేము చెబుతున్నది బాత్రూం స్టాల్ లోపల జరిగిన సంఘటన గురించి. మా క్లయింట్ నాలుగుసార్లు స్పష్టంగానే చెప్పారు”

“సరిపోయింది. అంటే ఇకపై బాత్రూంలో కూడా సిసిటీవీ పెట్టాలి అని మీరు చెబుతున్నారు?”

కోర్టు మొత్తం చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వింది.

“వద్దు, మీరు చూపిస్తున్న కెమెరానే ఫార్వర్డ్ చేసి చూద్దాం. ఈ క్రియ ఇద్దరి సమ్మతితోనే జరిగింది అనేటట్టయితే పది నిమిషాల తర్వాత ఇతను మాత్రమే ఎందుకు ఒంటరిగా బయటికి రావాల్సి వచ్చింది? నా క్లయింట్‌ను చూడు, అతను బయటికి వచ్చిన యాభైఐదు నిమిషాల తర్వాత అదే క్లబ్ హెడ్ క్యాషియర్ భుజాలకు ఆనుకుని ఉబ్బిన కన్నులలో ఎలా నడుచుకుంటూ వస్తోందో”

“అది మాకు సంబంధించింది కాదు. సెక్స్ ముగిసిన ఆడవాళ్లకు బాత్రూంలో ఏమేమి పని ఉంటుందో గౌరవనీయమైన కోర్టు ముందు వివరంగా చెప్పనవసరం లేదు?”

మరొకసారి సభ కంపించింది.

పీడకల ఒకటి పదే పదే వేధిస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి అనుభవం కలిగింది. అయితే లాయర్లు, క్లారా నన్ను అనేకసార్లు ఈ సన్నివేశాలకు నన్ను తయారు చేశారు. మళ్లీ కోర్టులో కన్నీళ్లు కనిపిస్తే కేసు మనకు వ్యతిరేకంగా తిరిగే అవకాశం ఎక్కువ అని వాళ్ళు హెచ్చరించారు.

డేట్ ఇచ్చినప్పుడంతా కోర్టు రూముకు వెళ్లికూర్చుని వచ్చేదాన్ని. ఆరోపికానీ, ప్రతివాది కానీ, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కోట్లు వేసుకుని తగినట్లుగా డ్రెస్ వేûసుకుని, మేకప్ చేసుకొని రావడం చూస్తే విచిత్రంగా అనిపించేది. మా వైపు లాయర్లూ, వారి వైపు లాయర్లూ తమ జీవితాలే ఈ ఒక్క కేసు మీద ఆధారపడి ఉందేమో అన్నట్టు వాదిస్తున్నారు. ఎవరెవరో సాక్షులుగా వచ్చిపోయారు. ఆరోజు క్లారా ఆఫీస్ ఎదురుగా దాటిపోయిన ఉంగరాల జుట్టు సన్నటి అమ్మాయి కూడా కటకటాల్లో నిలుచొని సాక్ష్యం చెప్పి వెళ్ళింది.

మా కేసులోని చాలా పెద్ద లోపం ఏమిటంటే అతని ఒక్క చుక్క వీర్యం నా శరీరం మీద కానీ, బట్టల మీద కానీ దొరకలేదు. భుజం మీద కొరికిన గుర్తులో అతని డిఎన్ఎ దొరికింది. అయితే దానివల్ల ఎక్కువగా ప్రూవ్ చేయడానికి సాధ్యం కాదన్నది మా లాయర్ల చింత. మా లాయర్ సిండి, “ఆరోజు అతను కాండోమ్ వాడకపోయి ఉంటే ఆ బాస్టర్డ్‌ను ఇరవై ఏళ్లు జైల్లో కుళ్లిపోయేలా చేసేదాన్ని” అని అంది. ఆమె అసిస్టెంట్ భూషణ్, “ఆరోజు మీరు ఒకసారి ధైర్యం చేసి అతను విసిరిన చెత్తబుట్టలోని కాండోం సేవ్ చేసి పెట్టి, ఫారెన్సిక్ రిపోర్ట్‌తోపాటు ఇచ్చారో అనుకోండి, ఆ కథ మరోలా ఉండేది. అతను చాలా చలాకీ. లేకపోతే అంత జాగ్రత్త వహిస్తాడా?”

అతని క్రిమినల్ బుద్ధిని మెచ్చుకొని మాట్లాడుతున్న భూషణ్ మాటలకు వాస్తవానికి నాకు కోపం నెత్తికెక్కిండాలి. అయితే ఎందుకో ఆ సందర్భంలో అతని మాటలకు కిసుక్కున నవ్వు వచ్చేసింది. నేనే నవ్వడం చూసి మీటింగ్ రూమ్‌లో ఉన్న ఇతరులు కూడా నవ్వారు. తారు వేసిన రోడ్డులో రోలర్ను నడిపి నడిపి గట్టిపరిచినట్లు ఈ మధ్యన ఆ ఘటన గురించి మనసు తటస్థంగా ఉండటం నేర్చుకుంది. వందలాది సార్లు చెప్పినదే చెప్పి, మాట్లాడిందే మాట్లాడి మొత్తం పరిస్థితికొక క్లినికల్ అయినా భావరాహిత్యం ఒదగటం మంచికో చెడ్డకో నాకు అర్థం రాలేదు.
అదే కారణంగా వారి వైపు లాయర్లు ప్లీ బార్గేన్ అంటూ వచ్చినప్పుడు మా లాయర్లు మీద పడి సెటిల్ చేసుకోవడానికి తయారయ్యారు.

“వచ్చేవారం తీర్పుంది. ఇది అతని మొదటి నేరం కావడం వల్ల, మన పరంగా గట్టి సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఈ ప్లీ భార్గేన్ అంగీకరించడమే మంచిదని అనిపిస్తుంది. ఇరవై వేల డాలర్ల కాంపన్సేషన్ ఆఫర్ చేశారు. దాన్ని కావాలంటే మాట్లాడి ఇంకా పెంచవచ్చు. పైగా ఆరు నెలలు కమ్యూనిటీ సర్వీస్ చేయడానికి, సెక్సువల్ హెరాస్మెంట్ మీద కోర్స్ తీసుకోవటానికి నిందితుడు ఒప్పుకున్నాడు. నన్ను అడిగితే ఇది గుడ్ ఆఫర్. మరో రెండు రోజుల్లో డిసైడ్ చేసి చెప్పు” అని సిండి వాయిస్ మెయిల్ పెట్టింది.

అంటే నా బాధకు వెల కట్టింది ఇరవై వేల డాలర్లు అన్నట్టుంది. అంత కాకపోతే ఇంకెంత? నూరు వేల డాలర్లా? ఒక మిలియనా? పది మిలియన్లా? ఎంత డబ్బు ఇస్తే ఆరోజుటి ఆ గాయం నా మనసు నుంచి పూర్తిగా వెళ్లిపోవచ్చు? అతను జైలుకు పోతే ఆ బాధ మరుగున పడుతుందా? ఎన్ని రోజులు? ఆరు నెలలా? ఒక సంవత్సరమా? పది సంవత్సరాలా? మరణశిక్ష విధించి అతను చనిపోతే? అప్పుడా? దీనికంత ఎలా తర్కబద్ధమైన ముగింపును వెతకడం? మనసు పిండినట్లయి క్లారాతో చెప్పుకున్నాను.

సిండి పంపిన డాక్యుమెంట్ల మీద క్లారా ఒకసారి చూపులు సారించింది.

“ప్లీ బార్గేన్ అంటే కోర్టు బయట సెటిల్ చేసుకోవడం అని అర్థం కాదు. దయచేసి రేప్ చార్జ్‌లను వదులుకోండి అని అతనే సెక్సువల్ హెరాస్మెంట్ చార్జ్‌కు తప్పొప్పులను రాసి ఇచ్చాడు. అది అతని పేరుతోపాటు ఎప్పటికీ ఉంటుంది. ఇలాంటి కేసులలో జడ్జి ఎలా తీర్పు చెబుతాడో ఊహించడం కష్టం. అతనికీ అదే భయం వేధించి ఉండాలి. అన్నిటికీ మించి నీ నిర్ణయం ముఖ్యం. వాళ్లు చెబుతున్నారని నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు”

ఎందుకో అర్థం కాలేదు. ఇదంతా ఒకసారి ముగిసిపోతే చాలు అని నాలో కలిగిన జగుప్స నుంచో, వచ్చేనెల జాయిన్ కావాల్సిన నా కొత్త ఉద్యోగం కారణంగానో, పెరుగుతున్న లాయర్ ఫీజు చూసి ఏర్పడిన భయం వల్లనో, క్లారా చెప్పిందనో లేదా దూరంలో, దూరదూరంలో కేసు కోర్టులో నిలవకపోతే ఇది కూడా కాకుండా పోతుందేమో అనే భావం నా మనసులో ఏర్పడటం వల్లనో తెలియదు. రెండు రోజుల తర్వాత సిండికి ఫోన్ చేసి అంగీకారం సూచించాను. వెంటనే ఇంకొక సారికూడా కోటు వేసుకుని కోర్టు రూమ్‌కు వెళ్లి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈ లాయర్ల వాదనలు వినవలసిన అవసరం లేదనే అవగాహన కలిగి చాలా సంతోషం కలిగింది.

ఆరోజు మధ్యాహ్నం క్లారా, నేను ఇటాలియన్ రెస్టారెంట్‌కు వెళ్లి మంచి భోజనం చేశాం. ఎందుకు అని వేలు పెట్టి చూపించలేని, కాస్త సిగ్గు పడేలాంటి నిశ్చింత నాలో ఏర్పడడం అబద్ధం కాదు. ఇంటికి తిరిగిగొచ్చినప్పుడు చాలా రోజుల నుంచి నిద్ర చూడనిదానిలా కళ్ళు లాగడం మొదలైంది. సోఫాలోనే కూలబడిన నన్ను లోపలికైనా వెళ్లి పడుకో అని క్లారా లేపి బెడ్‌రూమ్‌కు తీసుకెళ్లి పక్క మీద పడుకోబెట్టి పెట్టింది. “నాకు ఆలస్యమైంది, రేపు కనిపిస్తాను” అని వెళ్లబోతున్న ఆమెను నిద్ర కళ్ళతోటే చెయ్యి పట్టుకుని ఆపాను.

“క్లారా, థాంక్స్” అన్నాను.

“అలాంటిదేమీ జరగలేదు హనీ” అంది.

అర నిమిషం మా మధ్యన మౌనం కమ్ముకుంది.

“క్లారా, కన్నడలో ఒక సినిమా ఉంది. చాలా పాతది. ‘భక్త కుంబార’ అనేమో దాని పేరు ఉండాలి. రాజ్‌కుమార్ నటించిన సినిమా. అందులో బోర బతుకంతా దేవుడి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఏవేవో కష్టాలను తెచ్చుకుంటాడు. చివరికి ఒకసారి జీవితాన్నే ఇస్తాను అన్నప్పుడు ఆ దేవుడే మనిషి రూపంలో ప్రత్యక్షమై బోర సేవా చేసుకుంటాడు” అని నిద్రలోనే వాగాను. నేనేమి చెప్పానో అది ఆమెకి ఎంత అర్థమైందో తెలియదు. అయితే చివరి వాక్యం చెప్పేటప్పుడు నా కంఠం ఆర్ద్రం కావటం ఆమె దృష్టికి వచ్చివుండాలి. కొద్దిసేపు తల నిమురుతూ పక్కనే కూర్చుంది.

“అవునా? యూట్యూబ్లో దొరుకుతుందా ఈ నీ సినిమా?”

“దొరకవచ్చు. అయితే సబ్ టైటిల్స్ ఉండకపోవచ్చు”

“మీ భారతీయ సినిమా చూడడానికి సబ్ టైటిల్స్ అక్కరలేదు. నటనలోనే అన్ని అర్థమయిపోతాయి” అని తుంటరిగా నవ్వింది.

ఇప్పటికీ అనిపిస్తుంది, నిద్ర నుంచి మేల్కొన్నప్పుడల్లా ఇంక రాదు, ఇంకేమీ వెళ్ళిపోతుంది, ఇంకెప్పుడూ కనిపించకుండా ఈమె మాయమవుతుంది అని. అయినా మెలకువ వచ్చినప్పుడు “ఐయామ్ హియర్! వాంట్ సమ్ కేక్?” అంటూ మెయిన్ డోర్ తెరవడం వినిపిస్తుంది. వంటింట్లో చాయ్ పాత్ర శబ్దం అవుతుంది. బాల్కనీలోని మల్లెల పరిమళం ఇంట్లోకీ వ్యాపిస్తుంది. ఇక పడుకున్నది చాలు, రాత్రంతా కళ్ళు తెరుచుకొని కూర్చోవాలని ఉందా అని లేని కోపం తెచ్చుకున్న కంఠం వినిపిస్తుంది. మరొక రోజు మొదలవుతుంది.

మరి అక్కడ ఆమె ఉంది. ఈమె… ఈ ఈమె… ఈమె క్లారా… ఈ క్లారా నా స్నేహితురాలు.

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

Previous Post

ఉర్దూ కథ : పీరున్

Next Post

తమిళ కథ : ఎస్తర్

Next Post
తమిళ కథ : ఎస్తర్

తమిళ కథ : ఎస్తర్

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • హిందీ కవిత: నా చిరునామా
  • ఇంగ్లిషు కవిత : మనోచిత్రం
  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లిషు కవిత :  కోరిక
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!
  • రష్యన్ కథ : శస్త్రచికిత్స
  • కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • హిందీ కథ : లెక్క తప్పింది !

అభిప్రాయాలు

  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply