• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

తుళు కథ : నాకూరు

రంగనాధ రామచంద్రరావు by రంగనాధ రామచంద్రరావు
May 25, 2026
in అనువాద కథలు
0
తుళు కథ : నాకూరు

మూలం: డా. వసంతకుమార్ పెర్ల
అనువాదం: రంగనాథ రామచంద్రరావు

నాకూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో నేను చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల గుండా సాగిపోయే రైల్వేను దక్షిణ విభాగమని పేరు పెట్టడం జరిగింది. ఈ మధ్యన పశ్చిమ డివిజన్ నుంచి బదిలీ మీద వచ్చిన నాకు నా రాష్ట్రానికి, నా ప్రాంతానికి మళ్లీ వచ్చిన సంతోషం ఒకవైపున ఉంటే, నా ప్రజలతో కలిసి మెలిసి ఉండే అవకాశం దొరికినందుకు తృప్తి, ప్రశాంతతలు కూడా దొరికాయి.

మూడు రాష్ట్రాల ముఖ్య కార్యాలయాలను ఒక్కొక్కసారి సందర్శించి పరిశీలించడంలోనే ఆరు నెలలు గడిచిపోయాయి. ఫీల్డ్ విజిట్ అంటే అంత సులభమా? పైగా పాలనలో రాజకీయ ఒత్తిడి. అక్కడక్కడ ప్రమాదాలు. మొత్తానికి తలనొప్పి…

స్టెనో ఇంటర్ కామ్ ద్వారా, “సార్ ఈ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. లోపలికి పంపమంటారా?” అని అడిగింది.

“ఎస్, పంపండి” అన్నాను.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రావడానికి కారణం కొత్తగా నిర్మిస్తున్న ‘మంగళూరు- హాసన’ ట్య్రాక్‌లో ఉండే నాకూరు వంతెన ప్రారంభోత్సవం చేసే రోజును నిర్ణయించడం కోసం.

ఆ వంతెన నిర్మాణం రైల్వేకు, ఇంజనీర్లకు ఒక సవాలుగా ఉండేదని విన్నాను. ఆ వంతెనే ఏమిటి? ‘మంగళూరు- సకలేశపుర’ ట్య్రాక్ నిర్మాణ కార్యకలాపాల పొడవునా కఠినమైనది.

“సార్, మొత్తం ట్య్రాక్ ఓకే. నాకూరు వంతెనలో ఏవో కొన్ని పనులు మిగిలివున్నాయి. అవి కూడా ఈ వారం పూర్తవుతాయి. మీరు ప్రారంభోత్సవం చేయాలి. ఏ రోజు ప్రారంభోత్సవం చేయాలో ఆ రోజును నిర్ణయించాలి” అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫైలు తెరిచి నా ముందు పెడుతూ అన్నారు.

“ఈ వారం చెన్నై టూర్ ఉంది. అత్యవసరమైన పని. వచ్చే శుక్రవారం పెట్టుకోవచ్చుకదా!” అని క్యాలెండర్ చూసి ఆ రోజున వేరే ఎలాంటి కమిట్మెంట్ లేదని నిర్ధారించుకొని స్టెనోకు చెప్పడం మంచిదని, ఇంటర్ కామ్ బెల్ నొక్కాడు. ఆమె వచ్చింది. “వచ్చే శుక్రవారం వంతెన ప్రారంభోత్సవానికి నాకూరుకు వెళ్ళాలి. ఆరోజు ఏదైనా అపాయింట్మెంట్ ఉందేమో చూసి చెప్పండి. లేకపోతే నాకు ప్రోగ్రాం ఫిక్స్ చేయండి” అన్నాను.

ఆమె డైరీ చూసి “అపాయింట్మెంట్లు ఏమీ లేవుసార” అంది.

“సరే, అలాగైతే వచ్చే శుక్రవారం నిర్ణయించండి”

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫైల్లో సంతకం తీసుకొని వెళ్ళిపోయారు.

నా జ్ఞాపకాలు నలభై ఐదు సంవత్సరాల వెనక్కి పరుగు తీశాయి. నాకు నాకూరు గయ, అక్కడి అడవి, అడవి జంతువులు, ఆగకుండా కురుస్తున్న వర్షం, కుమారధారా నదినర్తన ఒక్కొక్కటీ నా హృదయఫలకం మీద చిత్రాల్లా కదిలాయి.

‘పాముకు పాలు పోస్తే ఏమిటి ఫలం?” అని దాసులవారు పాడారు. పాముకు పాలు పోస్తే ఫలం ఉంటుందో లేదో తెలియదు. అయితే నాకూరుగయకు పాలు పోసే సంప్రదాయం పూర్వం నుంచీ వస్తోంది.

ఆవు దూడను ఈనిన పదకొండవ రోజున ‘శుద్ధి దినం’ అని చుట్టుపక్కల ఉన్న పది ఊర్ల జనం మొదట పిండిన పాలను నాకూరు గయకు సమర్పిస్తారు. అది గోపాలకృష్ణ దేవుడి సన్నిధి అనే నమ్మకమొకటి, గయ నీటి సమృద్ధిలా ఆవు పొదుగులోనూ నురుగు పాలు పొంగి రావాలని మొక్కుబడి ఒకటి. అమాయకత్వం, స్వచ్ఛమైన నమ్మకం కలిగిన జనం ఈనాటికీ మొదట పిండిన పాలను నాకూరు గయకు తెచ్చి పోస్తారు. అదొక మొక్కుబడి. లేత అరటి ఆకులో ఒక పావు బియ్యం, ఆకు-వక్కలు, పోక చెట్టు ఆకులు పెట్టి – దానిమీద నుంచి పాలను ధారగా పోసి గయలో తేలిపోయేలా చేస్తారు. కానుకల సొమ్మును ఆకులో పెట్టివుంటారు. అలాగే నీటిలో తేలుతూ గయ సుడిగుండంలో గిర్రున తిరుగుతూ కొద్దిసేపట్లోనే కేంద్ర భాగానికి సాగి గిరగిరా తిరుగుతూ నీటి అడుగుకు దిగే చోద్యం, నమ్మకం కలిగిన భక్త జనులకు గోపాలకృష్ణుడి దివ్య సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది. మొక్కుబడిని అతను స్వీకరించాడనే జనం భావిస్తారు.

నాకూరు గయ లోతును చూసినవారు లేరు. తీవ్రమైన వేసవిలోనూ దానిలోని నీళ్లు ఎండిపోవు. సుమారు వంద మీటర్ల పొడవు వెడల్పులలో నదిలోపల ఉన్న లోతైన బావి అది. వర్షాకాలంలో నది వరద వల్ల నిండి ప్రవహించేటప్పుడు అంతగా కనిపించదు. వరద నీరు తగ్గుతున్నట్టే గయ కూడా తన గంభీరమైన దట్టమైన నీలిరంగు నీళ్లు, మరలా సుడిగుండం వల్ల వెంటనే దృష్టికి వస్తుంది.

గతంలో ఒకసారి కొందరు సాహసవంతులైన యువకులు దాని లోతు చూడటానికి అత్యంత పొడవైన పగ్గం చివరన రాయి కట్టి నీటిలోకి దిగవిడిచారట. పగ్గం లోలోతుకు దిగుతూ ఇటు చివరన పట్టుకున్న యువకుడిని లోపలికి లాక్కున్నట్టు అయిందట. తమ సాహసాన్ని యువకులు సగంలోనే వదిలిపెట్టి పారిపోయారట. పవిత్రమైన గయ లోతు పరీక్షించకూడదు, దేవుడికి వ్యతిరేకంగా పోవడం వల్లనే ఇలా జరిగిందని జనం మాట్లాడుకున్నారు.

ఈ ఘటన వల్ల నాకూరు గయ మహాత్మ్యం, ప్రతిష్ఠ పెరిగాయి. ప్రజల్లో భక్తి శ్రద్ధలు పెరిగాయి.

వర్షాకాలంలో కుమారధార ఆర్భాటాన్ని వర్ణించడం సాధ్యం కాదు. ఎత్తైన ప్రదేశం నుంచి వేగంగా ప్రవహించి వచ్చే నది గర్జించే శబ్దం కొన్ని మీటర్ల దూరం వరకూ వినిపిస్తుంది. కూకటివేళ్లతోపాటు పెరుక్కుని వచ్చే చెట్లు గయలో దడదడమని కొట్టుకుంటూ మూడు నాలుగు రోజులపాటు గిరగిరా తిరుగుతుంటాయి. గయ సుడిగుండం వల్ల వాటికి ముక్తి లేదు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు

ఉన్నట్టుండి అలాగే వరద నీరు ఎక్కువై ఆకర్షణ ఇంకా తీవ్రమైనప్పుడు ఏదో ఒక గడియలో చెట్టు గయ నుంచి తప్పించుకుంటుంది ఆ తర్వాత చాలా వేగంగా నది ప్రవాహంలో సాగి ఎక్కడో ఒడ్డున చిక్కుకుంటుంది.

నాకూరు గయ నదిలో ఉన్న ఒక లోతైన నీటి మడుగు అయినప్పటికీ తన చుట్టూ ఒక చరిత్రను నిర్మించుకుంది. అద్భుతాన్ని ఒడిలో మోసుకుంది. ఎలాంటి భౌతిక కట్టడపు నిర్మాణం కూడా లేని ప్రాకృతిక స్థలమొకటి ఈ విధంగా భక్త జనుల శ్రద్ధా భక్తులకు కేంద్రమైందని అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే మరి.

మహాత్మ్యం ఎక్కువ కావడానికి ఇంకా ఒక కారణం ఉంది. ప్రాయానికి వచ్చిన ఆవు ఎంత కాలమైనా గర్భం దాల్చకపోతే; ఆవు దూడను ఈనిన తర్వాత నాకూరు గయకు దాని పాలును నైవేద్యంగా పెడతామని మొక్కుకుంటే చాలు. మరుసటి సంవత్సరం ఆవు గర్భం ధరించి దూడను ప్రసవిస్తుంది. మేయటానికి పోయిన ఆవు రెండు మూడు రోజులైనా కొట్టానికి తిరిగి రాక, ఎక్కడో అడవిలో దారి తప్పి కనుమరుగై పోయివుంటే నాకూరు గయకు పాలు పోస్తానని మొక్కుకుంటే చాలు, ఫలితం కనిపిస్తుంది.

నాకూరు గయ నిగూఢ రహస్యం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గర్భం నిలవని ఆవులు ఉంటే గయకు పాలు పోస్తామని మొక్కుకుంటే చాలు. నెల లోపల ఆవు గర్భం ధరిస్తుందట. పెళ్లయి పిల్లలు కలగకపోతే దంపతులు నదిలో స్నానం చేసి గయలో మొక్కుకుంటే పిల్లలు పుడతారట. ఒంట్లో చెడు రక్తం చేరి, చర్మ రోగాలు ఉంటే నదిలో స్నానం చేసి గయలోని దేవుడి చేపలకు ధాన్యపు గింజలు వేస్తే బాగవుతుందట. బావులు తవ్వి, సరిగ్గా నీరు పడకపోతే, దొరికిన కొంచెం నీటినైనా గయకు తెచ్చి అభిషేకం చేస్తే, బావిలో ఊట పెరుగుతుందట… ఇలా నాకూరు గయ గురించి ఉన్న నమ్మకాలు అందరికీ తెలిసినవే.

గోపాలకృష్ణ దేవుడి దేవస్థానం పునాదులతోపాటు నాకూరు గయలో మునిగి పోయినప్పుడు అక్కడ సాన్నిధ్యం లేదని ఎవరు మాత్రం చెబుతారు? గోపాలకృష్ణ దేవుడు గయ లోతుల్లో ఉండటం వల్ల అతని అర్చన కోసం అక్కడ పాలు పోస్తారు; పాలు శ్రీకష్ణుడికి చేరాలని.. లేకపోతే ప్రజలకు వేరే పని ఏమీ లేదా?

గయ గర్భంలో గోపాలకృష్ణుడి సన్నిధి ఉందని ఎలా తెలుస్తుంది?

అదొక చరిత్ర. ఆ నోట ఆ నోట తెలిసి వచ్చిందేమిటంటే`పాలిచ్చే ఒక ఆవు రోజూ మధ్యాహ్న సమయంలో గయ తీరానికి వచ్చి పొదుగు నుంచి పాలు కురిపిస్తుందట. అది గయ నీటిలో కలిసి దేవుడిని అభిషేకిస్తుందట.

పశువులు మేపే ఒక కుర్రవాడికి ఇంకొక విచిత్రం కనిపించిందట. పాలిచ్చే పశువొకటి ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయంలో గయ నీటి లోపల దిగి కొద్దిసేపట్లో తిరిగి వచ్చేదట. కుర్రవాడికి ఆశ్చర్యం వేసింది. ఆవు ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవటానికి దాని తోక పట్టుకొని తాను నీటి లోపలికి దిగినాడట. చాలా లోతులో దిగిన తర్వాత ప్రకాశవంతంగా వెలుగుతున్న దేవస్థానం కనిపించిందట. చుట్టూ ప్రాకారమున్న గోపురం. గర్భగుడి. శుద్ధంగా, కొత్తగా ఇప్పుడిప్పుడే పూజకు సిద్ధమై ఉన్నట్టు కనిపిస్తుందట. ఆవు గర్భగుడిలో ప్రవేశించి, శ్రీకృష్ణుని విగ్రహం మీద యథేచ్ఛగా పాలు కురిపించి తిరిగి వచ్చిందట. కుర్రవాడు తోక పట్టుకొని పైకి వచ్చి ఊరంతా ఆ విషయాన్ని ప్రచారం చేశాడట.

మా బాల్యంలో ఇవన్నీ మాకు రోమాంచం కలిగించే కథలు. మేము నాకూరు వదిలినప్పుడు నాకు ఆరో ఏడో వయస్సు ఉండొచ్చు. అక్కడి కథలన్నీ దేవాసుర లోకపు అద్భుతమైన ఘటనల్లా మనసులో నిలిచిపోయాయి. ఏదో యక్షగంధర్వ లోకంలో రమ్యమైన కథలుగా నా బాల్యపు రోజులను సంపద్వంతం చేసిన నాకూరు, అక్కడి గయ నా పాత జ్ఞాపకాల పెట్టెలో అమూల్యమైన ఆభరణమైంది.

నాకూరు గయ రుద్ర రమణీయతను అధిగమించేలా ఉంది అక్కడి అడవి. దట్టమైన అడవి మధ్య మైలుకొక్కటన్నట్టు ఇళ్ళున్నాయి. పగటి పూట పులి దాడుల సంచారం. వరిపొలాలలో వ్యవసాయం చేసి పంటను సరిగ్గా ఇంట్లో నింపుకోవడానికి లేదు. కారణం పందుల బెడద. కంకులు వస్తుండగానే గుంపులు గుంపులుగా పందులు పొలం మీద దాడి చేసి పంటనంతా పాడు చేసేవి. పందులు వచ్చిపడ్డాయంటే పొలాన్ని మేసి ముగించాయని అర్థం. పశువులను, దూడలను మేపటానికి అడవిలో వదలటానికి లేదు. ఏ క్షణంలో పులులు దాడి చేస్తాయో దేవుడికే తెలుసు!

ఒక వెన్నెల రాత్రి ఇంటి ఎదుట ఉన్న పొలంలో ఐదారు అడవి దున్నపోతులు దాడి చేసి మేస్తుండటం నాన్న కిటికీ నుంచి చూపించారు. నల్లటి శరీరంతో రాక్షసాకారంతో ఆ జంతువులు ఏమాత్రం చిన్న అలికిడి అయినా చాలు, తలెత్తి చెవులు రిక్కించి, గాలిని వాసన చూస్తూ అటు ఇటు చూసేవి. మనుషులను చూస్తే కొన్నిసార్లు వెన్నంటి వచ్చి, కిందికి పడదోసి తొక్కి అవి చంపిన సంఘటనలూ ఉన్నాయి. నాన్న గుళ్ళు నింపిన తుపాకీ తీసుకొని చప్పుడు చేయకుండా తలుపు తెరిచి ముంగిట్లోకి వెళ్ళాడు. మాకు భయం వేసింది. కిటికి నుంచి చూస్తూ ఉన్నాం. ముంగిలి చివరి నుంచి నాన్న గురిపెట్టి తుపాకితో ఢాం…ఢాం… అని పేల్చడం వినిపించి ఒళ్ళు వణికింది. ఎంతసేపైనా నాన్న ఇంట్లోకి రాలేదు.

చాలాసేపటి తర్వాత వచ్చాడు. ‘సరిగ్గా గురి పెట్టి పేల్చాను. ఒక జంతువు మర్మస్థానానికి గుండు తగిలింది. అది చాలా దూరం పరిగెత్తి అక్కడే కూలిపోయింది. మిగిలినవి అడవిలోకి పరుగుతీసి కనుమరుగయ్యాయి” అన్నారు. నాన్న గురిపెట్టి కాల్చి చీకట్లోనే కూర్చున్నాడు. అడవి జంతువు కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత కూలబడటం చూశాడు. చాలాసేపటి వరకు అది కదలకుండా పడివుండటం చూసి అది చనిపోయిందని నిర్ధారించుకొని కొద్ది దూరం నుంచి టార్చ్ లైట్ వేసి చూశాడు. జంతువు చనిపోయింది నిజమే.

మరుసటి రోజు ఉదయమే నలుగురైదుగురు ముసల్మానులు ఇంటికి వచ్చారు. వారికి వెనుకటి రాత్రి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. గుండు శబ్దం తీవ్రత, ఆ తర్వాతే మౌనం మొదలైనవి విని, అడవి జంతువో, పందినో పడిందని వారికి స్పష్టమైంది. అబ్బా! వారిదెంత సూక్ష్మబుద్ధి. వాళ్లు ఆ జంతువును చీల్చి, కోసి, మాంసాన్ని సమానంగా పంచుకున్నారు. దాని కొమ్మును నాన్న కావాలని అడిగాడు. దానికి అంటుకున్న రక్తమాంసాలంతా తొలగించి, కడిగి, శుభ్రం చేసి, మా ముంగిట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కొమ్ము సైజు చూసి, ఆ జంతువు శరీరం సైజును ఊహించొచ్చు. ఆ కొమ్ముకు అడవి దున్న ముఖం చేయించి నాన్న ఇంటి చావడి గోడకు అలంకారంగా తగిలించాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల కాలం నాన్న ఇంటికి వచ్చినవారి ముందు తన జంతువు వేట సాహసపు కథను చెప్పేవాడు. పదేపదే నాన్న అదే విషయాన్ని చెబుతున్నారని అనిపించినా మేమూ అందులో పాత్రధారులు కావడం వల్ల ప్రతిసారి కూడా రోమాంచం చెందేవాళ్ళం.

ప్రత్యేకత ఏమిటంటే, ఆ ఘటన జరిగి సుమారు నలభై ఏళ్ళు గడిచినప్పటికీ, ఆ జంతువు కొమ్ము మా ఇంట్లో కొంచెం కూడా పాడవకుండా ఇప్పటికీ అలాగే ఉంది. బాల్యంలో గడిపిన మా మలెనాడు జీవితానికి సాక్షిగా నిలిచింది.

ఒక సాయంత్రం మేము పిల్లలం ముంగిట్లో ఆడుకుంటున్నాం. నాన్న దగ్గరలోని కడబ పేటకు వెళ్లారు. నాకూరు నుంచి కడబ పేట రెండు మూడు మైళ్ల దూరం. పేట అంటే పెద్ద పేట కాదు. రోడ్డు పక్కన నాలుగైదు అంగళ్లు, నాలుగైదు ఇండ్లు. అంతే. నడిచి వెళ్లాలంటే అడవి దారి. పగటిపూట వెళ్లడానికే భయం వేసేది. ఇక రాత్రి అయితే అడగాలా?

తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడుతుందని నాన్న టార్చ్, తుపాకీ తీసుకొని వెళ్లేవాడు.

సాయంత్రం సుమారు ఆరుగంటల సమయం. మేము ముంగిట్లో ఆడుకుంటున్నట్టే ఇంటి ముందు భాగంలోని పొలం గట్టుమీద ఒక పెద్దపులి కనిపించింది. ఒళ్లంతా చారలు చారల—. పెద్ద తోకను ఎత్తి గాలిలో కదిలిస్తూ ఉంది. మమ్మల్ని చూసి నిర్లక్ష్యమైన చూపులు విసిరి, నాలుకను తడుపుకుంది! మూడు నాలుగు సార్లు గర్జించింది. గాండ్రిస్తున్న గొంతు లోపలి నుంచి గర్జించిన శబ్దపు తీవ్రత ఎంతగా ఉందంటే మేము నిలుచున్న నేల అదురుతోంది.

మాకు ఏం చేయాలో తోచలేదు. పులిరాజు వైభవాన్ని చూస్తూ నిలుచున్నాం. మా మీద దాడి చేస్తే? అడవి జంతువులు ఊరకూరకే ఆక్రమణ చేయవు. మేము గెలికితే మాత్రమే ఒంటిమీద దాడి చేస్తాయని చిన్నాన్న అన్నాడు. ఇంట్లో ఉన్న తుపాకిని తీసుకొని నాన్న వేటకు వెళ్లారు. ఏం చేయాలి?

ఒక ఐదు నిమిషాలు పులి మమ్మల్ని చూస్తూ నిలుచుంది. మేము పులిని, అంతలో చిన్నాన్న, చిన్నమ్మ, అమ్మ కొట్టంలో ఉన్న పశువులను మెల్లగా విడిపించి ఇంట్లోకి తోలారు. ఆవులకు పులివాసన దొరికింది. ఆవులు ఒళ్ళు విరుచుకుని బెదిరిపోయి నిలుచున్నాయి. చిన్నమూలుగు ద్వారా అవి తమ భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి, అవి తమ బిడ్డలను హెచ్చరిస్తున్నాయి.

పది నిమిషాల తర్వాత పులి రాజు గంభీరంగా అడుగులు వేస్తూ నెమ్మదిగా అడవి వైపు వెళ్లిపోయాడు. మేము నెమ్మదిగా నిశ్చింతగా నిట్టూర్పు విడిచాం.

ఇది జరిగే ఐదు పదినిమిషాల్లో పులి కొట్టం వెనుక భాగానికి వచ్చి గర్జించిన శబ్దం వినిపించింది. అప్పటికే చీకటి పడింది. పెద్దవాళ్లు ఈ అడవిలో పులి గర్జన చాలా సాధారణమని అనేవారు. అయితే పిల్లలమైన మేము చాలా భయపడ్డాం.

సుమారు పది నిముషాల తర్వాత పులి గర్జన ఆగిపోయింది. అడవిలోకి వెళ్లిపొయిండొచ్చు అని అన్నారు చిన్నాన్న. ఆ మాట వాస్తవం అన్నట్టు చాలా దూరం నుంచి పులి గర్జన క్షీణంగా వినిపించింది. అది మా ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయివుండొచ్చు.

రాత్రి ఎనిమిది గంటల సమయంలో నాన్న టార్చ్ లైట్ వేస్తూ ఇంటికి వచ్చాడు. మేము పులి వచ్చిన విషయాన్ని చెప్పటానికి ఆత్రుతగా ఉన్నాం. చిమ్నీ దీపపు మందకాంతిలో నీడల్లా కూర్చున్న మేము చురుకయ్యాం, నేను ముందు నేను ముందు అంటూ పులి ఇంటి ముందుకొచ్చిన విషయం తెలిపాం. నాన్న “అదే పులి అయ్యుండొచ్చు, నేను వస్తున్న దారిలో కనిపించింది” అని అన్నాడు.

“మీ మీద దాడి చేయలేదా?” అని అడిగింది మా అక్క.

“అది కొంచెం దూరంలో ఉంది. దాని కళ్ళు మెరుస్తుండటం చూశాను. వెన్నెల్లో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. టార్చివేసి చూస్తే పులి” అన్నాడు నాన్న.

అడివిలో అడవిమృగాల మధ్య జీవిస్తున్నవారికి అడవిమృగాల ఎదురుపడటం సహజంగానే ఉంటుంది. దానికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. వాటికి మనం ఇబ్బంది కలిగించకపోతే, అవి మన జోలికి రావనే సత్యాన్ని తెలుసుకుని ఉంటారు.

అడవి మృగాల పట్ల నాకు అంతగా భయం లేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. చిన్నప్పుడు నుంచి నేను వాటిని ప్రత్యక్షంగా చూశాను. వాటి గురించి వివరాలను పెద్దవారి నుంచి విన్నాను. వాటి ప్రవర్తన, అలవాట్లు తెలుసుకున్నాను.

నేను చిన్నప్పుడు చాలా తుంటరివాడినట. ఇంట్లో నన్ను చూసుకోవడం కష్టమై ‘వీడిని పాఠశాలలో చేర్చుదాం’ అని అమ్మ పట్టు పట్టిందట. నాన్నకూ అదే కరెక్ట్ అనిపించింది. అక్కలు పాఠశాలకు వెళుతున్నప్పుడు, వీడు కూడా వెళ్ళనీ అని పాఠశాలలో చేర్చారు.

పాఠశాల అంటే అది ఒక గడ్డి వేసిన గుడిసె. నాలుగవ తరగతి వరకు పాఠం చెబుతారు. పిల్లలందరినీ కలిపితే ఇరవై, ఇరవై రెండు మంది ఉన్నారు. వెదురు తడికెలు కట్టి తరగతులను వేరు చేశారు.

పొలం గట్టున కొండ కింద సుమారు ఒక కిలోమీటర్ నడిస్తే పాఠశాల కనిపిస్తుంది. అక్కలతోపాటు వదులైన నిక్కరు వేసుకొని, జారిపోతున్న దాన్ని పైకి లాక్కుంటూ పాఠశాలకు వెళ్లేవాడిని.

పొలం గట్టుమీద వెళ్లేటప్పుడు ప్రతిరోజు ఒక పెద్ద తెల్లటి కోడె పొలంలో మేస్తుండటం చూసేవాడిని. దాని మెడకు వెదురు కర్ర కట్టారు. అది మేసేటప్పుడు అది టణటణమని శబ్దం చేసేది. అడవి జంతువులాగే పెరిగిన ఆ దృఢమైన తెల్లటి కోడె ఎప్పుడు మా మీద దాడి చేస్తుందో అనే భయం మా గుండెల్లో శాశ్వతంగా చోటుచేసుకుంది.

మల్బరీ గడ్డితో చేసిన చిన్న గుడిసెలాంటి పాఠశాలలో నేల మీద కూర్చొని ఒకటవ తరగతి లోని అ, ఆ, ఇ, ఈ`నేర్చుకున్నాను. పక్కనే ఒక బోయవాళ్ల ఇల్లు ఉండేది. అక్కడి కోళ్లు ‘కోక్కోక్కో’ అని పాఠశాల ప్రాంగణమంతా పరిగెడుతుండేవి. మేము కొన్నిసార్లు కోళ్ల వెనుక పరిగెత్తేవాళ్ళం. ‘క్కో క్కో క్కో’ అంటూ కోడి పిల్లల గుంపును పరిగెత్తించడమే ఒక అందం. అప్పుడు టీచర్లు వచ్చి మమ్మల్ని కసిరేవారు.

ఇంటికి వడ్లు దంచడానికి కొందరు ఆడవాళ్లు వచ్చేవారు. పాటలు పాడుతూ వాళ్లు వడ్లు దంచేవారు. వారి పాటలను మేము అనుకరిస్తూ ముంగిట్లో మేము ఆడుకునే వాళ్లం.

ఒక ఉదయం నాన్న పొలానికి బయలుదేరినప్పుడు నన్ను కూడా పిలుచుకొని పోయారు. ఎముకలు కొరికే చలి ఉన్నప్పటికీ నాన్నతో కొత్త సాహసం చేయడానికి బయలుదేరిన వాడిలా ఉత్సాహంతో బయలుదేరాను.

అడవికి అనుకున్నట్టుగా ఉండే భాగంలోని పొలంలో పైరు అడ్డంగాపడి చెల్లాచెదురు అయింది. అప్పుడప్పుడే పాలు నిండిన కంకుల చివరి భాగం కిందికి వాలసాగింది. పందుల బెడద లేకపోతే ఈ సంవత్సరం మంచి పంట వస్తుందని నాన్న అనేవాడు. ఏ ముహూర్తంలో నాన్న అలా అన్నారో, ఆ మాటలు బహుశా పందులకు వినిపించివుండొచ్చు.

గత రాత్రి పందుల గుంపు పొలంలో దూరి ఇష్టం వచ్చినట్లు తిని, కిందపడి దొర్లుతూ, పంటనంతా చెల్లాచెదురు చేసి, పొలాన్నంతా పాడు చేశాయి. చేతికొచ్చిన ముద్ద నోటికి అందకుండా పోయింది.

నాన్నకు చాలా దుఃఖం కలిగింది. ‘పొలంలోని పంట పాడైపోయింది కదా బాబు’ అన్నాడు నాన్న. దాన్ని అర్థం చేసుకునే వయస్సు నాకు లేదు. ‘ఎలా నాన్న?’ అని ప్రశ్నించాను. ‘చూడు పైరంతా నాశనం అయిపోయింది. పందులు పొలంలో పడి దొర్లాయి’ అన్నాడు నాన్న. ‘ఎన్ని పందులు వచ్చాయి నాన్న?’ అని నేను అడిగాను. “ఏడో ఎనిమిదో గుంపుగా వచ్చివుండాలి. ఇటు చూడు, చాలా అడుగుల గుర్తులున్నాయి’ అన్నాడు. ‘ఒంటరిగా రావుకదా నాన్న?’, ‘ఒక్కోసారి అరుదుగా ఒంటరిగానూ వస్తుంటాయి. ఒంటరిగా ఉన్న పందిని ‘బర్గాల’ అంటారు. అది చాలా ప్రమాదకారి. ఎదురుగా వచ్చిన వారిని పొడిచి, చీల్చి వేస్తుంది. ‘బర్గాల’ పంది పులిని కూడా ఓడిస్తుంది. అది చాలా ప్రమాదకరం. దాన్ని చంపటం కూడా కష్టం. ఎలాంటి ప్రయత్నానికి అది దొరకదు’ అని నాన్న వివరించాడు. అయితే జ్ఞాపకాల్లో ఉండిపోయింది, ఇంతే.

ఇంటి నుంచి కింది లోయలో మా పోక తోట ఉంది. నా తండ్రి, చిన్నాన్న, నలుగురైదుగురు మందిని తీసుకొని కొండను, బండలను పగులగొట్టి, సమతలం చేశారు. కుంబళ, నీర్చాలు వైపు నుంచి మంచి వంగడపు పోక మొక్కలను తెచ్చి నాటి తోటను పెంచారు. నాలుగైదు సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు. పంట అప్పుడప్పుడే రావడం మొదలయ్యింది.

తోట నుంచి కిందికి దిగితే అడవి, మరి కొంత కిందికి దిగితే నది, కుమార ద్వారా నది. అక్కడికి మేము అంటే, ఇంటి వాళ్ళమంతా చేరి స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవటానికి వెళ్లేవాళ్లం. అక్కడే తీరానికి దగ్గర, నదిలో ఉన్నది నాకూరు గయ. నదిలో గయ కింద లేదా పైన వేసవిలో నీళ్లు నిండివున్న చిన్న చిన్న మడుగులలో మేము స్నానం చేసి బట్టలు ఉతుక్కునేవాళ్లం. మొరటైన అందమైన మెరిసే చిన్నచిన్న గులక రాళ్ళను వెతికి ఇంటికి తెచ్చేవాళ్లం.

నదికి వెళ్లి వచ్చేటప్పుడంతా చాలాసార్లు మేము పులి, జింక, దుప్పి, నెమలి, పంది` మొదలైన జంతువులను దూరం నుంచి చూశాం. నల్లమూతి కోతులకు రాళ్లు విసరి వాటితో ఆడుకున్నాం.

ఒకసారి నల్లమూతి కోతుల పెద్ద గుంపొకటి తోటమీద పడ్డాయి. అవి అరటికాయలు, కొక్కు మొదలైన పంటలను తిని నాశనం చేశాయి. మేము తోటలోకి వెళ్లినప్పుడు నల్లమూతి కోతులు ఉండటం నాకు తెలియదు. తోటలో అవి కిచకిచమని అరుస్తూ కోలాహలం రేపి, చెట్టు నుంచి చెట్టుకు దూకుతూ,ఎగురుతూ, పరుగెతత్తుతుండటం చూసి, ‘రారా చిన్నా’ అంటూ అక్కలిద్దరూ ఇంటి వైపు పరుగు తీశారు. నేను వారివెనుకే పరిగెత్తాను. నా పెద్దక్కకు తొమ్మిదేళ్లు. చిన్నక్కకు ఏడేళ్లు. నాకు ఐదో, ఆరో ఉండొచ్చు. అక్కలతోపాటు పరిగెత్త లేక నేను వెనుకపడ్డాను. నల్లమూతి కోతులు నా వెంటపడి వస్తున్నాయనే ఆలోచన నాకు. అందువల్ల భయంతో పరిగెత్తుతున్నాను. ఇంటి దగ్గరకు వస్తుండగా అక్కడో ఎత్తయిన దిన్నె. పెద్దవాళ్ల సహాయం లేకుండా నాకు దాన్ని ఎక్కడం సాధ్యం కాదు. నేను బెదిరి అక్కడ అరుస్తూ నిలబడ్డాను. తర్వాత అమ్మ వచ్చి నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లింది. బాల్యంలోని అలాంటి జ్ఞాపకాలన్నీ ఇప్పుడు ఇంకా తాజాగా ఉన్నాయి.

నాకూరు నా మనసులో స్వప్నలోకపు గంధర్వ నగరంలా తాజాగా ఉండిపోయింది. తర్వాత అప్పుల బాధ భరించలేక మేము ఆస్తిని అమ్ముకుని, వేరే చోటికి వలసపోయాం. తర్వాత స్కూలు`కాలేజీ చదువులు ముగించి నేను ఉద్యోగంలో చేరాను. ఉద్యోగంలో చేరినా బాల్యంలో గడిపిన నాకూరు మనసులో మధురమైన భావాలను కాపాడుకుంది. అక్కడికి ఒకసారి వెళ్లాలి. అక్కడంతా తిరిగి అక్కడి పరిసరాలను ఒకసారి కళ్లారా చూసిరావాలి అనే కోరిక మనసు మూలల్లో చోటు చేసుకుంది.

ఆ కోరికను ‘గయ’ అనే ఫాంటసీ కథ ఒకటి ఇప్పటికీ సజీవంగా ఉంచింది. ఏమిటి దాని రహస్యం? ఏమిటి అక్కడి మహాత్మ్యం? అక్కడి పొలం, తోటలు, మైదానం ఇప్పుడు ఎలా ఉన్నాయి? అక్కడి అడవి ఎలా ఉంది? ఇప్పటికీ అక్కడ అడవిమృగాలు ఉన్నాయా? బాల్యంలోని పరిసరాలు-ప్రకృతి ఇప్పటికీ అలాగే ఉన్నాయా?-మొదలైన కుతూహలపు ఆశల్లోనే రోజులు గడుపుతున్నాను.

రైల్వే శాఖలో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరిన నేను దేశంలోని వేరు వేరు భాగాలలో పనిచేసి గత సంవత్సరమే బదిలీ మీద ఇక్కడికి వచ్చాను. ప్రమోషన్ మీద ఈ డివిజన్‌కు చీఫ్ ఇంజనీర్‌గా అధికారాన్ని చేబట్టి ఆరు నెలలు గడిచాయి.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చి ‘సర’ అని పిలిచినప్పుడు వాస్తవ ప్రపంచానికి వచ్చాను.

“ఆహ్వానపత్రిక సిద్ధంగా ఉంది. తమకు ఇచ్చి వెళదామని వచ్చాను” అన్నాడు.

ఆహ్వానపత్రిక చూసిన వెంటనే మళ్లీ నాకూరు గుర్తొచ్చింది. నాకూరు గయ ద్వారా వెళ్లే రైల్వే పట్టాలలో గయ సమీపంలో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవం వచ్చే వారమే. ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానిస్తున్న పత్రిక అది.

పదిహేను రోజుల క్రితమే ఆ డివిజన్ ప్రధాన ఇంజనీర్లు అక్కడి నిర్మాణ పనుల గురించి నివేదిక ఇచ్చారు. “సార్! ‘మంగళూరు-హాసన’ మధ్యన రైల్వే పట్టాలు వేసే పని పూర్తయింది. నాకూరు అనే చోట కుమారధారా నదికి వేయవలసిన వంతెన పనులు మాత్రం కొంచెం మిగిలి ఉన్నాయి. ఇంకొక వారంలో దాని పనులు కూడా పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధం కానుంది”

“ఓహ్! అవును కదా… ఈ ట్య్రాక్ రైల్వేశాఖకు చాలా సవాలుగా ఉండింది. ఈ దారి పొడుగునా కొండలు, గుట్టలు, బండలు, నదులు… మృదువైన మట్టి… తర్వాత పశ్చిమఘట్టపు మరీ ఎత్తైన దారులు. అనేక సొరంగాలు. వర్షకాలంలో విపరీతమైన వర్షం… మొత్తానికి మా శాఖ ఈ పనిని ముగించింది కదా. శభాష్! శభాష్! అయితే రైల్వే ట్య్రాక్ నాకూరు మీదుగా వెళ్ళుతుందని అన్నారు, అవునా? చాలా భాగం అడవి నాశనమై ఉండాలి. ఆ పరిసరాలను నాకు చూడాలనే కుతూహలం ఉంది. ప్రారంభోత్సవానికి ముందే పరిశీలనకు వస్తాను”

“ఆ వంతెన పని చాలా ఇబ్బంది పెట్టింది సార్. వంతెన పక్కనే ఒక గయ ఉంది. మేము మొదట సర్వే చేసిన ప్రకారం వంతెన గయ మీదుగా వెళ్లాల్సి ఉంది. వంతెనకు స్తంభాలు వేయడం కోసం దాని లోతును పరిశీలిస్తే, ఆ గయ అడుగుభాగం దొరకలేదు! ఎంత విచిత్రమైన గయ సార్ అది!”

“ఓహో! బాగుంది… ఆ తర్వాత?”

“మొత్తానికి చాలా లోతులో దాని అడుగుభాగం దొరికింది. అయితే రైల్వే బ్రిడ్జ్‌కు అంత లోతు నుంచి పిల్లర్ వేయడానికి సాధ్యం కాలేదు. అందువల్ల మళ్లీ సర్వే చేసి రైల్వే ట్య్రాక్‌ను సుమారు రెండు వందల మీటర్ల దూరంలో, నది పై భాగంలో వంతెన వెళ్లేలా రీ`ప్లాన్ చేశాం సార్.”

“వెరీ ఇంట్రెస్టింగ్… ఒక నదిలో అంత లోతు కలిగిన మడుగు ఉందా?”

“స్థానికులకు ఆ గయపట్ల చాలా భయభక్తులు ఉన్నాయి సార్. ఆవు కనిపించకపోతే లేదా కొత్తగా దూడను ఈనితే ఆ గయకు మొక్కుకుంటారు. పాలు పోస్తారు. లేత అరటి ఆకులో బియ్యం, కొబ్బరికాయ, ఆకువక్కలు పెట్టి ముడుపు చెల్లిస్తారు. గయలో పెద్ద సుడిగుండం ఉంది. సుడిగుండం అన్నిటినీ లోపలికి లాక్కుంటుంది”

“ఓహ్! వెరీ నైస్, ఒక నదిలో ఇంత లోతైన మడుగు ఉండటం ఆశ్చర్యమే కదా”

“నదీ పాత్రలో ఆ స్థలంలో మృదువైన మన్ను ఉండొచ్చు సార్. చుట్టుపక్కల రాతిబండలు. నది పైనుంచి ప్రవహించి వస్తున్నప్పుడు నీటి వేగం మృదువైన మట్టిని కోసి కోసి లోతైన బావిని సృష్టించింది. చుట్టుపక్కల రాతిబండలే ఉండటం వల్ల సహజంగానే సుడిగుండం ఏర్పడింది. నదీపాత్రలో అదొక భూవైచిత్య్రం, అంతే సార”

“ఇప్పుడు నిర్మించిన వంతెన సురక్షితమైన స్థలంలోనే ఉంది కదా”

“వంతెన స్తంభాల పునాది బండల మీదే ఉంది సార్ ఎలాంటి ఇబ్బంది లేదు.. అయితే గయ వంతెన మీది నుంచి కనిపిస్తుంది సార్… నిజానికి గుండెను వణికిస్తుంది. వర్షకాలంలో దాని రౌద్ర అవతారాన్ని చూడాలి. చూడటానికి భయం వేస్తుంది”

“అవునా? అలాగైతే అందమైన పిక్నిక్ స్పాట్లో మన రైల్వే ట్రాక్ సాగిపోతుందని చెప్పండి”

“అది పిక్నిక్ స్పాట్ కాదు సార్… భయంకరమైన స్థలం”

“అన్నీ నదులలోనూ అలాంటి ఏదో ఒక స్థలం తప్పకుండా ఉంటుంది. అది మన భావోద్వేగంలో పుణ్యస్థలం. కేవలం వ్యవహారికంగా చూస్తే భూ భౌతిక ప్రత్యేకత మాత్రమే”

“భూ భౌతిక ప్రత్యేకతలే కాలక్రమంలో పుణ్యస్థలాలుగా మారి పరివర్తనం చెందుతాయి కదా సార్… ఎక్కడ శక్తి ఉందో అక్కడ భక్తి పుడుతుంది. భక్తి ఉన్నచోట శ్రద్ధ పుడుతుంది”

“నాకూరు గయా అలాంటి ఒక స్థలం అంటారా?”

“మీరు ఒకసారి విజిట్ చేయండి సార్. చుట్టూ ప్రకృతి కూడా మనోహరంగా ఉంటుంది”

“ఒకసారి కాదు రెండుసార్లు విజిట్ చేస్తాను.. ప్రారంభోత్సవానికి ముందు ఒకసారి, ప్రారంభోత్సవం రోజున మరొకసారి”

నేను అదే ఊరిలో పుట్టాను… నా బాల్యంలోని ఆరు సంవత్సరాలు అక్కడే గడిపాను. అది నా పుట్టిన ఊరు- అక్కడి ప్రతి ఒక్క చెట్టు మొక్క రాయి నా జ్ఞాపకాల కోశంలో ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళటానికి మునివేళ్లపై నిలుచున్నానని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. అయితే జూనియర్ అధికారి ముందు నేను భావోద్వేగానికి లోనై అదుపు తప్పడం సరికాదనిపించి నోటి వరకు వచ్చిన మాటలను ఆపుకొని అలాగే మింగేశాను.

“సరే సార్, ఏర్పాట్లు చేశాం. చేస్తూ ఉన్నాం. మీ అమృత హస్తాలతో ప్రారంభోత్సవం జరిగే ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాం”

“ఉండనీయండి. అది కాదు విషయం. ఈ ట్రాక్ మన రైల్వే శాఖకు ఒక గర్వకారణం. ఇన్ని రకాల సవాళ్లను ఎదుర్కొని నిర్మించిన ట్య్రాక్ బహుశా ఇంకెక్కడా ఉండదు”

“నిజం… నిజం.. పర్మిషన్ ఇస్తే నేనింక వస్తాను సార”

“ఎస్, ఇక మీరు బయలుదేరండి”

జూనియర్ అధికారి వెళ్ళిన తర్వాత నా గుండె చప్పుడు పెరిగింది. నాకూరు గయ దగ్గర నిర్మించిన రైల్వే వంతెన ప్రారంభోత్సవానికి నేనే వెళుతున్నాను. నేను పుట్టి, బాల్యంలోని ఆరు సంవత్సరాలు అక్కడ గడిపి, నా స్మృతి కోశంలో ఉండిపోయిన పంది, పులి, అడవి దున్నలు, కోతులు, జింక, దుప్పి, నక్కలు, కుందేళ్లు, నెమళ్లు మొదలైన జంతువులు, పక్షులతో, పగటిపూట సూర్యరశ్మి కూడా దూరని దట్టమైన అడవి, నీటి కొరత ఉండని సమృద్ధమైన, నాకూరుకు వెళ్లే సదవకాశం నాకిప్పుడు తనంతట తానే కలిసి వచ్చింది. కేవలం ఒక అనామధేయ ప్రేక్షకుడిగా కాదు. ఈ డివిజన్ రైల్వే శాఖ ఉన్నతాధికారిగా అభివృద్ధి శకపు ప్రధాన తలుపులు తెరవబోతున్న రైల్వే సంచార ప్రారంభోత్సవం కోసం!

ఇంటికి వెళ్ళినప్పుడు నేను రెండు అంగుళాలు ఎత్తుకు పెరిగాను. కొంచెం ఎక్కువగానే లావయ్యానని అనిపించింది. నన్ను చూడగానే నా భార్య, “రోజూ సాయంత్రం పూట టెన్షన్ మోసుకుని వచ్చేవారు ఈరోజు- చాలా హుషారుగా

ఉన్నారు కదా… అయ్యగారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు”

“వచ్చేవారం నాకూరుకు వెళుతున్నాననే. అక్కడి రైల్వే వంతెన శాఖ ఉన్నతాధికారిగా నేనే ప్రారంభోత్సవం చేయబోతున్నాను”

“మీ ప్రయాణం గురించి వినీ వినీ నాకు తల బొప్పి కట్టింది. పెళ్లి అయినప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎప్పుడు చూసినా టూర్… టూర్… నాకైతే విసుగొచ్చేసింది బాబు”

“ఇది వేరే ఏదో టూర్‌లాంటిది కాదే. నాకూరు నేను పుట్టిన ఊరు. మరీ చిన్నవాడిగా ఉన్నప్పటి ఒకటి రెండు సంఘటనలు నీకు చెప్పాను కదా. దట్టమైన అడవి ఉన్న ఒక ఊరి గురించి…. అక్కడి గయ గురించి…”

“ఆ…ఆ… గుర్తొచ్చింది. పాఠశాలకు వెళ్తున్నప్పుడు తెల్లటి కోడెను చూసి మీరు భయపడి పారిపోవడం… గడ్డి కప్పిన తడికెల పాఠశాల మధ్యలో కూర్చొని చదువుకోవడం…”

“నిజం.. నిజం… నేను ఒకటవ తరగతి చదువుతుండగానే ఆ ఊరిలో నాన్నకు జీవితం దుర్భరంగా అనిపించసాగింది. కఠినమైన పరిసరాలు, అడవిమృగాల దాడులు, నాగరిక సౌకర్యం లేనందుకు కాదు, ఆ పొలంలో వ్యవసాయం చేయడానికి నాన్న చాలా అప్పులు చేశాడు. తర్వాత జమీన్ అభివృద్ధికి మళ్లీ అప్పు చేయాల్సి వచ్చింది. అయితే ఆ పొలంలో చెప్పుకోదగిన ఉత్పత్తి కనిపించలేదు. నాన్న కొండను, బండరాళ్లను పగులగొట్టి స్వయంగా పోక మొక్కలు నాటి తోట పెంచారు. పంట కోసం ఏడెనిమిది సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఇంట్లో తినడానికి ఉన్న నోళ్లు ఎక్కువ. సంపాదించే చేతులు తక్కువ. అప్పులవాళ్ల బాధ భరించలేకపొయారు. చివరికి ఒక రోజు కష్టపడి అభివృద్ధి చేసిన భూమిని అప్పుల వాళ్ళ చేతిలో పెట్టి మా అందరినీ పిలుచుకొని నాన్న, చిన్నాన్న దక్షిణం వైపు బయలుదేరారట. నాకింకా కలలా, అస్పష్టంగా జ్ఞాపకముంది. మేము ఇంటి సామాన్లు అంతా మూటాముల్లే కట్టుకొని బయలుదేరేటప్పుడు నాన్న కంటతడి పెట్టాడు. ఐదారేళ్లు నెత్తురు కారేలా శ్రమించినా ఉపయోగం లేకుండా పోయింది కదా అని”

“అవునండి, అదొక కాలం ఉండేది. జీవనమే చాలా కష్టంగా ఉన్న రోజులు. ఎలాంటి సౌకర్యాలూ ఉండలేదు. అయితే ఇప్పటివరకు ప్రకృతి మధ్య, అన్ని సవాళ్ల మధ్య జీవితం సాగించే సామరస్యమే తెలియలేదు”

“ప్రారంభోత్సవానికి నాతోపాటు వస్తావా? నాకూరు అక్కడి గయ నువ్వు కూడా చూద్దువుగాని. మలెనాడు కొంగులోని అడవి మధ్యనున్న పల్లెను చూసే ఒక మంచి అవకాశం దొరుకుతుంది”

“శివ పూజ మధ్యన ఎలుగుబంటి వచ్చినట్టు కాకూడదు కదా. మీరంతా డిపార్ట్మెంట్‌కు చెందిన ఉద్యోగులే ఉంటారు. నేను మీతోపాటు వచ్చి ఇబ్బంది కలిగించకూడదు. మీకు ఇబ్బంది కలగదు అంటే వస్తాను”

“ఇబ్బంది ఏమీ లేదు. రెండు గంటల ప్రయాణమే కదా… కారులో వెళ్లి వచ్చేటప్పుడు నీవు తోడుగా ఉంటే ఏమీ ఇబ్బంది కలగదు. నా బాల్యంలోని ఏ ఊరిలో గడిపానో నువ్వు చూడు. అక్కడ ఒక పెద్ద గయ ఉంది. అనేక వైచిత్య్రాలను తన ఒడిలో పెట్టుకొని ఉంది”

“సరే అలాగైతే వస్తాను. మీ నాకూరు, అలాగే నాకూరు గయాలను చూస్తాను. ఇప్పుడు లోపలికి రండి. అలసిపోయి వచ్చారు. ఒక కప్పు చాయ్ చేసి తెస్తాను” అని భార్య లోపలికి వెళ్లింది.

నేను సోఫాలో కాలు చాపి కూర్చున్నాను. నెమ్మదిగా టై విప్పి, షూ విడిచి, సాక్సులు తీసి, ఇక ప్యాంటు, షర్టు తీసిపెట్టి, ఇంట్లో వేసుకునే బట్టలు ధరించి, సాయంత్రం పూట క్రమం తప్పకుండా చేసే పనులలో నిమగ్నమవ్వాలి.

నాకూరు, నాకూరు గయ మనస్సునంత ఆక్రమించి మధురమైన, అనిర్వచనీయమైన సుఖపు అలలను తరంగాలు తరంగాలుగా మనసులో వ్యాపింపజేసింది.

 

 

 

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

Previous Post

కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు

Next Post

హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ

Next Post
హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ

హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ

Discussion about this post

ఈ సంచికలో…

  • బెంగాలీ కవిత: కాగితపు పడవలు
  • కెనడా కవిత : My heart soars
  • ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )
  • హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ
  • తుళు కథ : నాకూరు
  • కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు
  • రష్యన్ కథ : దైవ సంకల్పం
  • జర్మన్ కథ : రొట్టె
  • ఇంగ్లిషు కథ : వెన్నుపోటు
  • ఇంగ్లాండ్ కథ : విషవలయం
  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com