• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’

కొల్లూరి సోమశంకర్ by కొల్లూరి సోమశంకర్
March 10, 2026
in సమీక్షలు
0
విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’

సమీక్ష : కొల్లూరి సోమశంకర్

సాహిత్యాన్ని ఫిక్షన్, నాన్-ఫిక్షన్ విభాగాలుగా విభజించించడం మనకు తెలిసినదే. కథలు, కవిత్వం, కావ్యాలు, నవలలు, నాటకాలు వంటివి ఫిక్షన్ కేటరిగిలో చోటు చేసుకోగా, సాహిత్యేతర వ్యాసాలు, పరిశోధక రచనలు, యాత్రా రచనలు, ఆత్మకథలు వంటివి సాధారణంగా నాన్-ఫిక్షన్ విభాగంలోకి వస్తాయి. 

ఫిక్షన్ అయినా, నాన్-ఫిక్షన్ అయినా దేని ప్రయోజనాలు దానికి ఉంటాయి. కాల్పనిక సాహిత్యంలో – ఇతివృత్తాలు, సంభాషణలు, సన్నివేశాల కల్పన, ప్రతీకలు వంటివి రచయితల సృజనాత్మకతని పాఠకులకు పట్టిస్తాయి. మరి నాన్-ఫిక్షన్‌లో సృజనాత్మకతకి తావుండదా అని ప్రశ్నిస్తే, ఉంటుందని, కానీ, ఫిక్షన్‍లో కనబడినంత స్పష్టంగా గోచరించదని జవాబు చెప్పుకోవచ్చు.

అయితే, రాసేవారి ప్రతిభని బట్టి ఒక్కోసారి నాన్-ఫిక్షన్ రచనల్లోనూ సాహితీ సౌరభాలు పరిమళించి, ఈ రెండు విభాగాల మధ్య ఉన్న తేడాని చెరిపేస్తూ overlap అవడం మనం చూస్తూంటాం. కొన్ని ఆత్మకథలు, కొన్ని యాత్రా రచనలు ఇందుకు ఉదాహరణలు.

ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ ఆత్మకథ ‘The Race of My Life’ లోని ‘The Bird and a Melancholic Tree’ అనే అధ్యాయంలోని ఈ పేరా చదివితే, సృజనాత్మక సాహిత్యంలోని విశిష్టతలు ఇందులోనూ కనబడతాయి.

“After the competition, she came up to me and insisted that I accompany her for tea in her hostel, which was fairly close to the stadium. While we talked, my old feelings for her returned, much stronger now than ever before. How could I have forgotten such a beautiful and empathetic young woman? She reproached me, saying, ‘You are like a carefree bird moving from tree to tree, while I am like that melancholic tree, upon which you alighted for a brief moment and then flew off. Have you ever once thought of this miserable tree who finds herself alone and abandoned?’”

ఎంతటి ఉద్వేగం? ఎంత అద్భుతమైన ప్రతీకలు? 

నాయని కృష్ణకుమారి గారి ‘కాశ్మీర దీపకళిక’ లోని ఈ రెండు పేరాలు చదవండి.

“వెండిరేకు నొకదాన్ని భూమి ఉపరితలాన మిక్కిలి నేర్పుతో తాపడం చేసినట్లున్న ఆ సరస్సు నిస్తరంగంగా స్తబ్ధంగా శోభిస్తోంది. ఆకాశంమీద విచ్చలవిడిగా పరచుకున్న మబ్బుముక్కలు తెల్లవీ నీలివీ రకరకాల ఆకారాలు కలిగి ఆ ఆ నీళ్లలో ప్రతిఫలిస్తున్నయ్. వెండిరేకు మీద నీలాలూ ముత్యాలూ పొదిగినట్లు అందాలు చిందిస్తోంది సరస్సు: దూరంగా కొండలవరుస! వాటి అంచుల చివళ్ళు నీళ్లలో కరిగి వాటిమీద గుండుసూదులు గుచ్చినట్లుగా భ్రమ కలిగిస్తున్న పైనె చెట్ల ఆకారాలు కూడా ప్రతిఫలించి నిటారుగా వసుంధరా వక్షస్థలం మీద నిలువవలసిన పర్వతం దన్ను తప్పి సరస్సులోకి ఒరిగిన భ్రమ కలిగిస్తోంది. సౌందర్య ఖని అయిన ఈ భూమిమీద ఎక్కడ చూచినా ఇటువంటి రమణీయ దృశ్యపటలి మనస్సులు ఆహ్లాదంలో ముంచెత్తుతున్నది. ఈ అందమే అన్నమూ నీళ్లుగా మారి జీవన ధారణకు మరో వ్యాపకం అవసరం లేని స్థితిని భగవంతుడు కల్పిస్తే నేనిక్కడే ఉండిపోతాను కాబోలు!” (పేజీ 68)

“కొండ చాళ్ళల్లో నీటి జలలను మళ్ళించి, మళ్ళుకట్టి వరి పండించుకుంటున్నారు మనుషులు. పొలాలకు కంచెలుగా గులాబిపొదలు! విరియబూచిన ఒంటిరేక గులాబి, గుత్తులు గుత్తులుగా నిఁడి పరమేశ్వర చిద్విలాసానికి స్పందించిన హృదయంతో విరగబడి నవ్వుతున్నట్లుగా ఉంది. ఆ విరగబాటు నవ్వే అనుకుంటే దాని అతిశయాన్ని ఎట్లా కొలిచి మాటలలో చెప్పగలను! అనంత ముఖాలుగా ప్రసరించే తన అందాన్ని లోకానికి ఉదారంగా పంచి పెడుతూ పెడసరి యైన దాత నిర్లక్ష్యంగా నవ్వినట్లు, తప్పటడుగులతో పడుతూ లేస్తూ తల్లిని చేరుకోవడానికి సర్వశక్తితో ప్రయత్నాలు చేస్తున్న బిడ్డయొక్క బృహత్ప్రయత్నానికి తల్లి తృప్తిగా మనస్ఫూర్తిగా నవ్వినట్లు, భర్తలో ఉన్న సుగుణ గణ పరిపూర్తికీ గాంభీర్యానికీ ముగ్ధురాలైన భార్య, అద్భుత రసావిష్టయై మ్రాన్పడగా, భర్త లాలనగా నవ్వినట్లు, పరమ భక్తిభావభరితయైన సేవక హృదయాన్ని గ్రహించి వాత్సల్యంతో యజమాని నవ్వినట్లు – ఎన్నో రకాలుగా ఆ పువ్వుల నవ్వులు శోభించసాగినాయ్. నా కళ్ళు ఆ అందాన్ని ఎంత లాగుతున్నా ఇక చాలు అనడం లేదు.” (పేజీ 76)

మరి ఈ పుస్తకాన్ని just a travelogue అని వదిలేయగలమా?

మంచి రచనలు విభాగాల పరిధిలోకి ఒదగకపోయినా పాఠకులకి వచ్చే నష్టమేమీ లేదు. కానీ పొరపాటున ఒక రచనకో/ఓ రచయితకో ఓ కేటగిరి ముద్రవేసి, చదవడం మానేస్తే, అద్భుతమైన పఠనానుభూతిని మిస్ అయ్యే ప్రమాదం మాత్రం తప్పక ఉంటుంది.

మన దేశపు సుప్రసిద్ధ ఆంగ్ల రచయితల్లో రస్కిన్ బాండ్ ఒకరు. అద్భుతమైన పుస్తకాలు రాశారు. దేశవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు – ఆయనకు, ఆయన రచనాశైలికి అభిమానులు. తెలుగులో మాత్రం ఎందుకో రస్కిన్ బాండ్  అంటే బాలల రచయితగా మాత్రమే గుర్తింపు ఉంది. అది కూడా ఆంగ్లంలో చదువుకున్న తల్లిదండ్రులో ఇతర పెద్దలో చదివి వినిపించడం వల్ల! ఆయన పుస్తకాలు తెలుగులోకి ఎక్కువగా అనువాదమైనట్టు కూడా లేదు. అంత మాత్రాన ఆయన ఘనతని తక్కువ చేయడానికి వీల్లేదు.

రస్కిన్ బాండ్ ఆత్మకథ ‘Lone Fox Dancing’ తెలుగు అనువాదం ఇటీవల విడుదలైంది. ప్రసిద్ధ రచయిత, అనువాదకులు శ్రీ దాసరి అమరేంద్ర ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’ పేరుతో అనువదించగా కథాప్రపంచం ప్రచురణలు వారు ప్రచురించారు.

ఆత్మకథలు రచయిత వ్యక్తిగత దృక్కోణం నుండి ప్రత్యేకమైన చారిత్రక సందర్భాన్ని అందిస్తాయి. నేర్చుకోగలిగితే – దృఢ సంకల్పం, తాదాత్మ్యత, వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాలలో శక్తివంతమైన పాఠాలను బోధిస్తాయి. 

ఆత్మకథలు చదవడం వల్ల కలిగే ప్రయోజనమేమిటంటే – ప్రభావవంతమైన వ్యక్తుల జీవితాలు, పోరాటాలు, విజయాల గురించి ప్రత్యక్ష అంతర్దృష్టి లభిస్తుంది. చదువరులు స్వీయ-అవగాహనను పెంపొందించుకుంటారు, తమ లక్ష్యాలను కొనసాగించడానికి ప్రేరణను పొందుతారు. ‘Lone Fox Dancing’ విషయంలోనూ అంతే.

ఈ ఆత్మకథని తనకెందుకు నచ్చిందో చెబుతూ, “ఏదైనా రచన మనకు నచ్చడానికి రెండు కారణాలు ఉంటాయి. ఆ రచనలలోని సార్వజనీనత, ఆ రచన అందించే ఆలోచన, విజ్ఞానం, సంస్కారం మొదటి కారణం” అంటారు అనువాదకులు అమరేంద్ర. తనకి బాగా నచ్చిన పుస్తకాన్ని సమహృదయులకూ అందించాలన్న ప్రయత్నమే ఈ అనువాదం.

 ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’లో రస్కిన్ బాండ్ బాల్యం, యవ్వనం, స్నేహితులు, ఉద్యోగాలు, ప్రయాణాలు, కుటుంబ సభ్యులు, రచయితగా పరిణమించడం వంటివి అద్భుతంగా వివరించారు. నాలుగు భాగాలుగా ఉన్న ఆత్మకథలో ప్రతి భాగం రస్కిన్ బాండ్ జీవితంలోని ఒక నిర్దిష్ట దశని ప్రతిఫలిస్తుంది.

తన ఇతర రచనల్లానే రస్కిన్ బాండ్ ఆత్మకథ కథ కూడా అత్యంత సరళంగా ఉంటుంది. అక్షరాలలో నిలువెత్తు నిజాయితీ ఉంటుంది. సంతోషాలు వేదనలూ ఒద్దికగా పుస్తకమంతా పరుచుకున్నాయి. జీవితమంతా పసిమనసుని కాపాడుకున్న వ్యక్తి కథలో అంతే పసితనం వ్యక్తమవదూ? 

మంచి మనుషులూ, స్వార్థపరుల ప్రవర్తనలు; అర్థాలూ అపార్థాలూ; రేపన్నది ఉందో లేదో, నేడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేయాలనుకునే మనుషుల భోగలాలస; స్వాతంత్ర్యం పూర్వపు, అనంతర స్థితిగతులు; రాజ సంస్థానాలు; బ్రిటీషు అధికారం; సినిమాలు, థియేటర్లు, రచయితలు, ఆంగ్లో-ఇండియన్ కమ్యునిటీ జీవన చిత్రణ; డెహ్రాడూన్, ముస్సోరి, సిమ్లాలలో ప్రకృతిదృశ్యాలు; వీటన్నిమధ్య గడిపిన పరిపూర్ణ జీవితం – ఈ పుస్తకంలో పేజీలయ్యాయి.

నిరాడంబరతే ఆభరణంగా అమరిన గొప్ప రచన ఇది.

రస్కిన్ బాండ్ ఆత్మకథలో పాఠకులను మంత్రముగ్ధులను చేసేవి ఏమిటంటే – తన జీవితాన్ని, ఆయన తన మాటలలో వెల్లడించడం, రచయితగా తొలి అడుగులు, తదుపరి ఆంగ్ల సాహిత్యపు శిఖరాగ్రానికి చేరడం మాత్రమే కాదు;  ఇతర రచనల లాగే కొండలు, చెట్లు, జంతువులు, పిట్టలు వంటి ప్రకృతిదృశ్యాలు, ఇంకా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని స్పష్టంగా వర్ణించడం. ఢిల్లీ నజఫ్‌గడ్ నుంచి కొంచెం లోపలికి గ్రామాల్లోకి నడుస్తూ వెళ్ళి, అక్కడ తాను చూసిన వేణువు ఊదే పిల్లాడిని, రస్కిన్ తర్వాత “The Flute Player”లో పాత్రని చేస్తారు. ముస్సోరిలో మేపుల్ ఉడ్స్‌లో చెట్టుకింద కూర్చుని రాసుకుంటున్నప్పుడు ఆయనతో ఊసులాడిన ఓ కాకి – “A Crow in the House” కథలో పాత్రగా మారుతుంది. 

రెండవ ప్రపంచ యుద్ధ సమయాలు, బోర్డింగ్ బిషప్ కాటన్‌ స్కూల్ లోని స్నేహితులు, దేశ విభజన కారణంగా ప్రజల అవస్థలు, స్వాతంత్ర్యం మరియు భారతదేశ స్వాతంత్ర్యానంతర దృశ్యం గురించి రస్కిన్ బాండ్ ఎన్నో చారిత్రిక వివరాలను ఆత్మకథలో నమోదు చేశారు. 

అలాగే జామ్‌నగర్, ఢిల్లీ, ముస్సోరి, సిమ్లా, డెహ్రాడూన్ వంటి ఊర్లలో కాలక్రమంలో ఏయే మార్పులు వచ్చాయో వివరిస్తారు. లండన్ లోనూ, ఛానల్ ఐలాండ్ లోను గడిపిన కాలంలో తారసిల్లిన మనుషులు, ఎదురైన నిరాశలు, కోల్పోని విశ్వాసాలను చెప్పుకొస్తారు.

బాండ్ తన తండ్రితో ఢిల్లీలో గడిపిన సంవత్సరాలు, తండ్రికి ఉన్న స్టాంపుల సేకరణ అభిరుచి, గ్రామ్‌ఫోన్‌లో పాటలు వినడం, నాన్నతో రస్కిన్ ఆ పాటలకి గొంతు కలపడం వంటివి చదువరులను ఆకర్షిస్తాయి. తండ్రీకొడుకుల సంబంధం నిజంగా భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. తల్లిదండ్రుల వైవాహిక సమస్యలు, తండ్రి వేదన, ఒంటరితనం – సిగ్గరి, సున్నితమనస్కుడూ అయిన రస్కిన్‌పై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. అయినా ఆయన తల్లిని ద్వేషించలేదు. అర్థం చేసుకోడానికి ప్రయత్నించారు. తల్లి కాన్సర్ బారినపడగా ఆమెను చూడ్డానికి రస్కిన్ వెళ్ళినప్పుడు – ఆసుపత్రిలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అత్యంత హృద్యంగా ఉంటుంది. 

ఈ పుస్తకానికి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ‘కుటుంబం అంటే ఇదీ’ అని స్థిరపడిపోయిన సంప్రదాయ భావనను సవాలు చేయడం. ఉదాహరణకు, బాండ్ తన కన్న తల్లి కంటే ఎక్కువగా తన సవతి తండ్రి మాజీ భార్యతో ఎలా ఆనందంగా ఉన్నారో రాశారు. అదే విధంగా, ఆయన తన పెంపుడు కుటుంబం రాకేష్, బీనాతో జీవితాంతం ఉండటానికి ఇష్టపడ్డారు. ఎవరైనా కోరుకుంటే ఎవరైనా ఒక కుటుంబంగా చేసుకోవచ్చని నిరూపించారు. ఈ విధంగా ‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ భావనకు కట్టుబడ్డారాయన.

మనుషులని మనుషులుగా ప్రదర్శించిన రచన ఇది. మనుషుల్లోని అన్ని గుణాలను సహజంగా చెప్పుకొచ్చారు, ఓ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అన్నది రస్కిన్ ఎక్కడా చెప్పరు. కొన్ని సందర్భాలలో ఓ మనిషిలోని దుర్గుణాలు వెల్లడయినట్టే, మరికొన్ని సందర్భాలలో అదే మనిషిలోని మంచితనమూ ద్యోతకమవుతుంది. ఉదాహరణ రస్కిన్ సవతి తండ్రి మిస్టర్ హెచ్. అలాగే కొందరు మనుషులు కఠినాత్ములుగా కనబడతారు. అలా కనబడడం వెనుక కొన్ని బాధ్యతలుంటాయి, చక్కదిద్దాల్సిన పరిస్థితులుంటాయని, కాఠిన్యం అనే ముసుగు వేసుకోకపోతే, మరిన్ని ఇబ్బందులెదురవుతాయని రస్కిన్ అమ్మమ్మ వల్ల తెలుస్తుంది. కాఠిన్యం అనే ముసుగు తొలగినప్పుడు ఆమె ఎంత మృదువైనదో, ఎంత మంచి మనసుగలదో పాఠకులకు తెలుస్తుంది.

అలాగే, ఈ పుస్తకంలో కనబడకుండా, కేవలం పేర్లు వినిపించే మనుషులు ఇద్దరున్నారు రస్కిన్ నాయనమ్మ, రస్కిన్ సవతి సోదరి ప్రమీల. వీరిద్దరి పేర్లు రస్కిన్ చెల్లెలు ఎల్లెన్‌తో ముడిపడి ఉండడం విశేషం. వైకల్యంతో పుట్టిన ఎల్లెన్‌కి జీవితాంతం ఒక తోడు అవసరం! తొలి రోజుల్లో ఆ తోడు నాయనమ్మ కాగా, మలి రోజులో అక్క ప్రమీల ఆ తోడయింది. పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి, కనబడని వీరిద్దరూ పాఠకుల మనసులో నిండిపోతారు.

ప్రకృతినే నివాసంగా మలచుకోడం; సాధారణతకి కాకుండా శ్రేష్ఠతకి ప్రాధాన్యతనివ్వడం; సంకల్పం, పట్టుదల కన్నా ఏ ఆటంకమూ పెద్దది కాకపోవడం; అడవులని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత;  జీవితంలో మార్పు సహజమనీ, ఆ మార్పుల లోని సౌందర్యాన్ని ఒడిసిపట్టుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం – ఈ పుస్తకం మనకి నేర్పే అంశాలు.

పుస్తకం చదవడం పూర్తయ్యాకా, మూల రచయిత రస్కినేంద్ర అనీ, అనువాదకులు అమర్ బాండ్ అని పాఠకులు భావించుకునేంతగా ఈ ఆత్మకథని తనదిగా చేసుకుని అనువదించారు అమరేంద్ర గారు. “ఈ ‘బ్రతుకాట’ను చూసినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడు రస్కిన్ బాండ్ మన మనిషి అవుతాడు. మనమే అవుతాడు..” అంటూ తన ముందుమాటలో అమరేంద్రగారు వ్రాసిన చివరి వాక్యాలు దీన్ని ధృవీకరిస్తాయి.

తోటి అనువాదకుడిగా నాకు స్వల్పంగా అసూయ కలిగేలా ఈ అనువాదం ఉందని చెప్పడానికి నేను సంకోచించను.

ఇప్పటికే హిందీ, మరాఠీలోకి అనువాదమైన రస్కిన్ బాండ్ ఆత్మకథని తెలుగులో చదవడం గొప్ప అనుభవం! అనువాదకులకు, ప్రచురణకర్తకు అభినందనలు.

My concluding remark: “One book you simply cannot afford to miss.”

ఓ ఏకాంతజీవి బ్రతుకాట (ఆత్మకథ)
మూలం: రస్కిన్ బాండ్, అనువాదం: దాసరి అమరేంద్ర
ప్రచురణ: కథాప్రపంచం ప్రచురణలు, తిరుపతి
పేజీలు: 376
వెల: ₹ 500/-
ప్రతులకు: కథాప్రపంచం బుక్స్,
161, వినాయక్ నగర్ క్వార్ట్సర్స్,
డి. టైప్, కె.టి. రోడ్,
ఇస్కాన్ టెంపుల్ దగ్గర, తిరుపతి.
ఆంధ్ర ప్రదేశ్ 517501

ఫోన్: +919908284105
ఈమెయిల్: kathaaprapanchambooks@gmail.com

కొల్లూరి సోమశంకర్
కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ. డిగ్రీతో గ్రాడ్యుయేషన్‌. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్‍పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

Previous Post

నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను

Next Post

రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి

Next Post
రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి

రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి

Discussion about this post

ఈ సంచికలో…

  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..
  • ఆంగ్ల కథ : పిరికి పంద
  • తమిళ కథ : సైకిలు డాక్టరు
  • రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి
  • విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’
  • నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను
  • అనువాద కవిత : మహిళల మధ్య
  • అనువాద కవిత : ఓ  లక్ష్మణా!
  • కన్నడ కథ: బేలా
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com