మూలకథ: సోమర్ సెట్ మామ్
అనువాదం: పాలెపు బుచ్చిరాజు.
ఆఫీసు పని పూర్తి చేశాడు జార్జి మూన్. కానీ వెంటనే వెళ్ళిపోవడం ఇష్టం లేక అక్కడే కూర్చున్నాడు. వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి? క్లబ్బుకి. అక్కడా అందరూ చేరే వేళయింది. వెళ్తే ఒక్కొక్కరూ వారి తరఫున డ్రింక్సు ఆఫర్ చేస్తారు. అందరినీ కాదనలేడు కదా! కొందరయితే, గత ముఫ్ఫై సంవత్సరాలుగా పరిచయం ఉన్నవాళ్ళు. వాళ్ళతో అతనెప్పుడో విసుగెత్తి పోయాడు. కాని ఇక ఆఖరి సారిగా వాళ్ళని చూస్తున్నానన్న భావం మాత్రం మనసుని కెలుకుతోంది. ఈ రాత్రి వారు తనకి ‘ఫేర్ వెల్ డిన్నరు’ ఇస్తున్నారు. బహుమతిగా ‘వెండి టీ సెట్టు’ ఇస్తున్నారట. ప్రతివాడు ఇంతో అంతో ఉపన్యాసం దంచుతాడు. వెళ్లిపోతున్నందుకు విచారం వెలి బుచ్చుతారు. శేషజీవితం ఆనందంగా గడవాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
తరవాత తను సమయోచితంగా సమాధానం ఇస్తాడు. ఆ సభలో చదవడానికి అతను ప్రత్యేకంగా ఒక వ్యాసం తయారు చేశాడు. తానా వూరు వచ్చింది మొదలు నేటి వరకు జరిగిన మార్పులు, ముఖ్యాంశాలు అందులో పొందు పరిచాడు. జిల్లా మేజస్ట్రీట్ గా తన విధి నిర్వహణలో వారంతా సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పాడు.
ఆ ఊరిలో అన్ని వర్గాలవారికి ఆతనంటే భయము, భక్తీ కూడా ఉన్నాయి. కార్మిక వర్గం వారయితే ముందు రోజునే వారి బాధ్యతని తీర్చేసుకున్నారు. అతనేనాడూ ధనిక వర్గాలు పేదల్ని పీడించనివ్వలేదు. అతను పేదల పాలిట కల్పవృక్షమని పొగిడారు. ధనిక వర్గానికి అతనంత ఇష్టుడు కాకపోయినా పార్టీ విషయంలో వారు సుముఖంగానే ఉన్నారు.
అందరిలానే అతను రోజూ క్లబ్బుకి వెళ్లి టెన్నిసు ఆడేవాడు. అతని వయసుకైతేనేం, హోదాకైతేనేం గౌరవం ఇచ్చి, యువతరం అతనక్కడ ఉన్నంతసేపు తైతక్కలాడేవారు కాదు. ఒకరిద్దరు అలా చేసినా, ప్రక్కనున్న పెద్దలు వారిని వారించేవారు. క్రమశిక్షణ అంటే అతనికంత ఇష్టం. ఆ కారణంగా అతనక్కడ సంఘంలో గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్నాడు. ఏమైతేనేం, అతనూ ఇలా కనుమరుగవగానే అంతా అతన్నిమరిచిపోతారు. సాధారణ ప్రజల ఆరాధనా భావం అంతంత మాత్రమే కదా!.
ఈ ఆలోచన రాగానే అతను విషాదంగా నవ్వుకున్నాడు. జీవితాన్ని అతనొక కష్టమైన లెక్కల పేపరుగా పరిగణించాడు. అన్నీ సాల్వు చేయడం అతి కష్టం. కాని కుస్తీపట్టి కొన్నిటికైనా ఫలితాన్ని సాధిస్తే, కలిగే ఆనందం చాలు జీవితానికి. రిటైర్మెంట్ వయసు వచ్చినా, ముసలితనం ఇంకా దరిదాపులకి కూడా రాలేదు. ఇక నెమ్మదిగా ఏ పల్లెటూళ్లోనో స్థిరపడి ముసలివాళ్ళ కంపెనీలో పేకాడు కుంటూ సమయాన్ని వృధా చేయాలి. ఏమిటో! ఉద్యోగంలో ఉన్నంత కాలం, రిటైర్మెంటులో ఆనందం ఉందని భ్రమించడం, తీరా రిటైరయ్యాక, కాలం ఎలా గడపాలో తెలియక నిరాశ పొందడం. పెద్ద ఇంట్లో నౌకర్లు, చాకర్ల మీద అధారిటి చలాయిస్తూ, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతూ గడిపినవాడు, వాటన్నిటికి దూరమై, చిన్న ఇంట్లో ఇరుక్కుని, మధ్యవర్గం వారితో, తానెవరో, ఎంత బాగా బ్రతికాడో తెలియకుండా, వారెవరూ తనని గుర్తించని పరిస్థితుల్లో జీవించడం దుస్సాధ్యమే!
మూన్ అన్యమనస్కంగా చేయి చాపి, బల్ల మీద ఉన్న సిగరెట్టు పెట్టెలోంచి ఒక సిగరెట్టు తీసి ముట్టించాడు. ఇంతలో నౌకరు వచ్చి ఎవరో వచ్చారని ఒక చీటీ చేతికిచ్చాడు. అది చదువుకుని లోపలి పంపమని చెప్పాడు. వచ్చిన వాడు టామ్ సఫరీ. ఒక పెద్ద రబ్బరు ఎస్టేటు మేనేజరు. రాత్రి జరగబోయే సన్మాన సభకి అతనే నాయకత్వం వహిస్తున్నాడని విన్నాడు. బహుశా ఆ విషయమై ఏదో మాట్లాడాలని వచ్చి ఉండాలి. లేకపోతే ఇప్పుడిలా అతను తనని కలిసే ఆవసరం ఏముంటుంది? నిజానికి ఈ మధ్యనే అతనితో తన పరిచయం దెబ్బ తింది కూడా. అతని ఎస్టేటులో ఒక కార్మికుడితో వచ్చిన తగాదాలో, ఈయన మీద జరిమానా విధించాడు తను. సంఘంలో గౌరవంగా బతుకుతున్న అతను అప్పటి నుంచి, తన మీద ద్వేషం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని మూన్ అతన్ని డిన్నరుకి ఆహ్వానించాడు కూడా. కాని అతను రాలేదు సరికదా, క్లబ్బులో కనిపిస్తే కూడా తప్పించుకు తిరగ సాగాడు. అటువంటిది, ఈ రోజు సభలో అతనే నన్ను పొగుడుతూ మాట్లాడాలి. సభా గౌరవం పాటించడం కోసం.
టామ్ సఫరీ లోపలి రాగానే, లేచి నిలబడి, కరచాలనం చేసి, కుర్చీ చూపిస్తూ “ఎలా ఉన్నారు?” అని అడిగాడు జార్జి మూన్. అతను జవాబు చెప్పి కూర్చుంటూ, “ఇలా అర్థాంతరంగా నా రాక మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు.” అన్నాడు. అతను భారీ కాయుడు. మధ్య వయస్కుడు.
మూన్ మాట్లాడక పోవడంతో, తనే మొదలు పెట్టాడు. “నేనిక్కడికి వచ్చింది అంత సంతోషించ వలసిన కారణం ఏమీ కాదు. ఈ రాత్రికి నేనూ, నా శ్రీమతీ డిన్నరుకి రాలేమని, మమ్మల్ని క్షమించమని కోరుదామని వచ్చాను. మన మధ్యనున్న దూరాలు కాని, ఆ కోర్టుకేసు కాని దానికి కారణాలు కావని, మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని మనవి చేసుకుంటున్నాను. అప్పుడు మీరు నిర్దయగా ప్రవర్తించి, నన్ను కోర్టులో శిక్షించిన మాట నిజమే. కోర్టులో ఫైను చెల్లించవలసి వలసి వచ్చినందుకు నాకేమీ బాధలేదు. కాని, సంఘంలో పరువు ప్రతిష్టలకు భంగం కలిగినందుకు బాధపడ్డాను. ఏమైతేనేం, జరిగింది జరిగిపోయింది. ఈ రోజు మీరు పదవీ విరమణ చేసి శాశ్వతంగా ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. కనుక ఆ విషయాలన్నీ గుర్తు ఉంచుకోవడం నా అభిమతం కాదు.’’
“మీరింతగా చెప్పాలా! ఫేర్ వెల్ పార్టీకి మీరు నాయకత్వం వహిస్తున్నారని తెలిసినప్పుడే మీ దొడ్డ మనసునర్థం చేసుకున్నాను నేను. కాని, మీరిద్దరూ రాకపోతే ఈ పార్టీకి నిండుతనం రాదు.“
“మేమూ చాలా బాధ పడుతున్నాం. కాని పరిస్థితులు అలా వచ్చాయి. మేము అసహాయులం. మా ఇద్దరికీ దగ్గర మిత్రుడు ‘నోబీ క్లార్క్ ‘ హఠాత్తుగా మరణించినట్లు తెలిసింది.”
“అయ్యయ్యో! అతను మీకు బాగా సన్నిహితుడు కదా! “
“అవును. మేము ప్రాణ స్నేహితులం” టామ్ కళ్ళలోంచి నీళ్ళు కారసాగాయి.
బాగా లావుగా ఉన్న వాళ్లకి ఏడుపు త్వరగా వస్తుంది. అనుకున్నాడు జార్జి. అతన్ని చూసి, “అలాంటప్పుడు మీరు పార్టీకి ఎలా రాగలరు? పోనీలెండి. ఏం చేయగలం. ఇంతకీ ఆయన ఎలా పోయాడో తెలిసిందా?”
“ఏమో! ఆ దంపతులిద్దరూ ఈ మధ్యనే సెలవు మీద వెళ్ళారు. పేపర్లో చూసింది తప్ప, వివరాలేమీ తెలియవు. నాకు తెలిసినంత వరకు అతనికి ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏమీ లేవు.”
“గుండె పోటు అయి ఉండవచ్చు. ఎన్నేళ్ళ వయసాయనది?”
“నా వయసే. సుమారు సుమారు నలభై ఉండవచ్చు. “
“పాపం. చాలా చిన్న వయసే!”
ఈ క్లార్క్ ప్రక్కనే ఉన్న మరొక ఎస్టేటుకి మేనేజరు. జార్జికి కూడా అతన్ని ఒకటీ రెండు సార్లు చూసినట్టు జ్జాపకం. నల్లగా మొద్దులా ఉంటాడు. ముఖంలో ఎక్కడా మృదుత్వం గోచరించదు. కాని అతని నవ్వులో ఏదో ఆకర్షణ ఉంది. అది నచ్చిన వాళ్ళు అందులో మునిగిపోవచ్చు. ఎదుటి వాళ్ళని విసిగించకుండా ఎంత సేపయినా మాట్లాడగలడు. అతని భార్య కూడా చాలా మంచిమనిషి. క్లబ్బులో కలిసే ఆడవాళ్ళందరిలోనూ ఆమె అందగత్తె. జార్జి దృష్టిలో.
“పాపం! అతని భార్య ఎలా తట్టుకుందో ఈ షాక్ కి.”
“ఆమెను తలచుకుంటే మా హృదయాలు తరుక్కుపోతున్నాయి. మీదు మిక్కిలి ఆమె ఇప్పుడు గర్భవతి కూడా.”
ధారాపాతంగా ఏడుస్తున్న సఫరీని చూస్తుంటే జార్జికి జాలివేసింది.
“మీరంతలా బాధపడకూడదు. కష్టాలు మనుషులకి కాక మానులకి వస్తాయా? అదీకాక వర్షం రాకడ ప్రాణం పోకడ, ఎవరూ చెప్పలేరంటారు.. మీరు మనసుని అదుపులో పెట్టుకోవాలి.” అంటూ సాంత్వన వాక్యాలు పలికాడు.
నిజానికి అతను ఏం చెప్పాలని వచ్చాడో ఆ పని పూర్తి అయింది. కాని సఫరీ లేచి వెళ్ళే ప్రయత్నంలో లేడు. అతని మనసుని ఇంకా ఏదో బాధిస్తోంది. యజమాని చేత అనవసరంగా చావుదెబ్బలు తిన్న శునకంలా, నిశ్శబ్దంగా కుర్చీలో కూలబడి ఉన్నాడు. కొంతసేపటికి అతను జార్జి కళ్ళలోకి రెప్పవాల్చకుండా సూటిగా చూడసాగాడు.
“అదే బాధ అయితే ఫరవాలేదు. ఎలాగో భరించే వాడిని.” అని ఆగాడు.
సమాధానం చెప్పకుండా, జార్జి అతన్ని పరీక్షగా చూశాడు.
“నేను అనవసరంగా మీ సమయాన్ని వృధా చేస్తున్నానేమో!” అన్నాడతను ఉన్నట్టుండి.
“ఫరవాలేదు. నాకిప్పుడు మించిపోయే పనులేమీ లేవు. చెప్పండి. “
సఫరీ కిటికిలోంచి బైటికి చూస్తూ అన్నాడు. “ఈ విషయంలో అసలు మీ సలహా తీసుకోవాలా వద్దా? అని ఆలోచిస్తున్నాను. “
“అడగండి. సంకోచం ఎందుకు?”
“ఇది కేవలం నా స్వంత విషయం మరి.”
“ఇది మనిద్దరి మధ్యనే ఉంటుందని మాట ఇస్తున్నాను.”
“మీమీద ఆ నమ్మకం నాకుంది. కాని ఇది మీతో చర్చించాక మీ ముఖం చూసే ధైర్యం నాకుండదు. మీరు రేపే ఇక్కడి నుంచి వెళ్లి పోతున్నారు కనక కొంత నయం. అవునుకదా!”
“ముమ్మాటికి నిజం.”
“అయితే వినండి.”
సఫరీ ప్రారంభించాడు. అతనిలో విచారం ఉంది. మాటలు వచ్చీ రానివాడిలా మాట్లాడుతున్నాడు. చెప్పినవే మళ్లి చెప్పుతున్నాడు. ఒక వాక్యం మొదలు పెట్టి, చెప్పి, చెప్పి ఎక్కడ ఆపాలో తెలియక సగంలో ఆగి పోతున్నాడు. మూన్ సిగరెట్టు తరవాత సిగరెట్టు కాలుస్తూ అతను చెప్పేది వింటున్నాడు. ఆ కథనంలో ఆయన ఒక రబ్బరు ఎస్టేటు మేనేజరు జీవితాన్ని కళ్ళముందు కట్టినట్టు చూడ గలుగుతున్నాడు.
![]()
రోజురోజుకి తరుగుతున్న ఆదాయంలో ఎస్టేటుని సంబాళించుకోవడం అంత తేలికైన పనికాదు. ఉదయమే లేచి అతను ఓవర్సీర్ ని వెంట బెట్టుకుని, తోటలో రౌండ్స్ కి వెళ్తాడు. గట్టులు పుట్టలు దాటుకుంటూ కూలీలు ఎలాపని చేస్తున్నారో చూస్తాడు. ఏ చెట్టు ఎక్కడుందో, ఎప్పుడు ఏ చెట్టు నుంచి రబ్బరు పాలు తీయాలో అతని కంతా తెలుసు. తిరిగి వచ్చి, కొంతసేపు ఆఫీసు పని చూసుకుంటాడు. మధ్యాహ్న భోజనం అయ్యాక, కాస్త కునుకు తీసి, సాయంత్రం ‘టీ’ కాగానే భార్య ’వయొలెట్’ తో కలిసి క్లబ్బుకి వెళ్తాడు. స్నేహితులతో టెన్నిసు, బ్రిడ్జి ఆడతాడు. రాత్రి ఎనిమిదింటికి డిన్నరు, నిద్ర. ఇది అతని దినచర్య.
ఆ రోజు సఫరీ ఒంటరిగానే క్లబ్బుకి వెళ్ళాడు. క్లార్క్ దంపతులు ఉన్నపుడు ఆమె కూడా తనతో క్లబ్బుకి వచ్చేది. కాని వారు లేకపోవడంతో అక్కడ తనకేమీ తోచదని ఆమె వెళ్ళడంలేదు. పేపర్లో క్లార్క్ మరణ ఉదంతం తెలిశాక, ఎక్కువ సేపు క్లబ్బులో గడపకుండా ఇంటికి వచ్చేశాడు సఫరీ.
మామూలు కంటే తొందరగా ఇంటికి వచ్చిన భర్తని చూసి వయొలెట్ “ఏ మయింది? గెలిచావా?” అని అడిగింది. సాధారణంగా అతను ఆటలో గెలిచి వచ్చినపుడు చాలా హుషారుగా ఉంటాడు. కాని ఈ రోజు నీరసంగా “గెలిచానననుకో” అన్నాడు.
“అంటే?”
“అతి కష్టం మీద గెలిచాను. ఆట మీద దృష్టి పెట్ట లేక పోయాను. మనసేం బాగోలేదు.”
“ఏమైనా చెడు వార్తా?”
“చెడు వార్తే మరి. క్లార్క్ చనిపోయాడట.”
క్షణం పాటు వయొలెట్ నిశ్చేష్టురాలయింది. ఆమె ముఖం వివర్ణమయింది.రెప్పవాల్చకుండా భర్తని చూస్తూ ఉండిపోయింది. “ఏమిటి? నువ్వంటున్నది?” గట్టిగా అరుస్తూ అడిగింది.
“అవును. ఈ రోజు పేపర్లో ఉంది ఈ వార్త అన్ని వివరాలతోను. “
వయొలెట్ స్పృహతప్పి నేల కొరిగి పోయింది.
సఫరీ “వయొలెట్! వయొలెట్!” అని అరుస్తూ, మోకాళ్ళ మీద కూర్చుని ఆమె తలను ఒళ్లో పెట్టుకుని, బాయ్ ని పిలిచాడు. నీళ్ళు మొహం మీద చల్లి, నోట్లో చెంచాడు పోశాడు.
ఆమె నెమ్మదిగా తెప్పరిల్లి కళ్ళు తెరిచి చూసింది. “టామ్! ఏమిటి? నువ్వంటున్నది నిజమేనా?”
“ఇందులో అనుమానించదగినది ఏమీ లేదు. “
“లేదు. లేదు. ఇది నిజం కాదు. అబద్ధం.” అని హిస్టరిక్ గా అరుస్తూ సఫరీని దూరంగా తోసేసింది.
“నువ్వు కాస్త తమాయించుకోవాలి. ఇది నిజంగా మనకి తీరని లోటు. మనకున్న సన్నిహితుల్లో అతను ముఖ్యుడు. “
ఆమె సోఫా కుషన్ల మధ్యలో ముఖం దాచుకుని ఏకధారగా ఏడుస్తోంది. ఆమెను ఊరడించాలని , ప్రక్కనే కూర్చుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోబోయాడు సఫరీ. ఆమె కోపంగా అతన్ని వెనక్కి తోసేసింది.
“దూరంగా ఉండు. నన్ను ముట్టుకోకు. భగవాన్! ఓహ్! హేరీ! నా హేరీ! నేనిప్పుడెం చేసేది? ఎలా భరించేది?” అని ఏడవ సాగింది.
ఆమె క్లార్క్ ని ‘హేరీ’ అని తలచుకోవడం ఆశ్చర్యం అనిపించింది సఫరీకి. నిజానికి అతని పేరు ‘హెరాల్డ్’. కాని అందరూ అతన్ని ‘నోబీ క్లార్క్’ అనే పిలుస్తారు. ఇప్పుడామె ప్రవర్తన కూడా అసహజంగా అనిపించింది.
అయినా ఓర్పు వహించి, “ కొంచెం నీళ్ళు తాగు. కుదుట పడు. పోయినవాడెలాగూ తిరిగి రాడు.” అన్నాడు ఆమెకు దగ్గరగా జరుగుతూ.
అది విన్న వయొలెట్ కోపంతో అతన్ని వెనక్కి నెట్టేసింది. “వెళ్ళు. నా ఎదుటి నుంచి వెళ్ళిపో! నన్ను ఒంటరిగా ఉండనీ.” అంటూ లేచి ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడి “భగవంతుడా! ఎందుకిలా జరిగింది. ఇప్పుడు నేనేమైపోవాలి. నా ప్రాణాలు పోయినా బాగుండేది.” అని భోరుమని ఏడవ సాగింది.
“వయొలెట్! డియర్! ఏమిటి ఈ ఉన్మాదం?” అన్నాడు సఫరీ.
వయొలెట్ కోపంతో అతని వైపు చూస్తూ లేచి నిలబడి, కాలితో నేలని తన్ని, “ వెళ్ళు! ఇక్కడి నుంచి వెళ్ళిపో!. నన్ను ఒంటరిగా వదలమన్నానా?” అని గట్టిగా అరిచింది.
చేసేదిలేక సఫరీ వెనక గదిలోకి పోయి, ఆలోచిస్తూ ఒక కుర్చీలో కూర్చున్నాడు.
ఇంతలో డిన్నరుకి వేళయింది. వయొలెట్ ని పిలిస్తే ఆమె రాలేదు. నౌకరు చేత ప్లేటు పంపుతే, తిరగ కొట్టింది. అతను తిరిగి అక్కడికి వెళ్లేసరికి ఆమె అలానే కుర్చీలో కూర్చుని ఉంది. అతను మరొక కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చుంటూ “ క్లార్క్ నీకు అంత సన్నిహితుడా?” అని అడిగాడు. ఆమె అతన్ని తేరిపార చూసి మొహం అటు త్రిప్పేసుకుంది.
“చూడు! స్నేహితులు, బంధువులు పోయినప్పుడు దుఃఖం కలగడం సహజం. కాని నువ్వంతగా బాధపదడంలో అంతరార్థం నాకు బోధపడలేదు.” అన్నాడు సఫరీ.
“నాకిది పెద్ద షాక్! విని తట్టుకోలేక పోయాను.”
“నిజమే! కాని నువ్వు అంతగా స్పందించడం అసహజంగా ఉంది.”
“నువ్వంటున్నది నాకేమీ అర్థం కావడం లేదు.” వయొలెట్ పెదవులు వణుకుతున్నాయి.
“నువ్వు అతన్ని ‘హేరీ’ అని పిలడం నేనెప్పుడూ వినలేదు. ఆఖరికి అతని భార్య కూడా అతన్ని ‘నోబీ’ అనే పిలుస్తుంది.”
వయొలెట్ ఏమీ సమాధానం చెప్పలేదు. అలా శూన్యంలోకి దృష్టి సారించి చూస్తోంది.
“ఇలా చూడు. డియర్!”
ఆమె చూపులు అతని వైపు త్రిప్పింది.
“అతను నీ ప్రియుడా?” సూటిగా అడిగాడు సఫరీ.
ఆమె చూస్తున్న కళ్ళు మూసుకుంది. కాని అవి ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి.
“వయొలెట్! నాకు సమాధానం కావాలి.” సాధికారంగా అరిచాడు సఫరీ.
“ఇప్పుడు నేను నీతో మాట్లాడే స్థితిలో లేను. నామీద జాలి లేదా?” అడిగింది వయొలెట్.
“నిజంగానే. ఇప్పుడు నీ మీద జాలి కలగడం లేదు. ఇదేదో ఇప్పుడే తేలిపోవాలి. ఓ గ్లాసుడు మంచి నీళ్ళు కావాలా?”
“నాకేమీ అక్కర్లేదు.”
“అయితే నాప్రశ్నకి సమాధానం?”
“ఈ సమయంలో నువ్వు నన్నిలా బాధ పెట్టడం న్యాయం కాదు.”
“అంటే? ఒక మామూలు స్నేహితుడి చావు వార్త విని నువ్వింత అప్ సెట్ అయ్యాక కూడా మీ మధ్య ఏమీ లేదని నమ్మమంటావా? ఎంత దగ్గరి బంధువు పోయినా, ఎవరూ ఇంత వింతగా ప్రవర్తించరే! మీ అమ్మగారు పోయినప్పుడు నువ్వు బాధపదలేదా? నేను నిన్ను ఓదార్చలేదా? ‘నువ్వే లేకపోతే నేనేమైపోదునో’ అని నువ్వనడం నాకింకా గుర్తుంది”
“ఇది హఠాత్తుగా అనుకోకుండా విన్న వార్త.”
“మీ అమ్మగారి చావు వార్త కూడా ఇలాంటిదే!”
“హేరీ అంటే నాకు చాలా ఇష్టం.”
“ఆహా! ఎంత ఇష్టం అంటే, ఆ ఘోరమైన వార్త విన్న తరవాత నువ్వేమంటున్నావో నీకే తెలియదు. ‘హేరీ! ఇది అన్యాయం. ఇప్పుడు నేనేమైపోవాలి?’ ఇలా”
వయొలెట్ ఒక నిట్టూర్పు విడి చింది. కసాయివాడి కత్తి వేటు నుంచి తప్పించుకునేందుకా అన్నట్టు, తల ఇటూ అటూ త్రిప్పసాగింది.
“నేనొక ఏమీ తెలియని ఫూల్ ననుకోకు వయొలెట్! మీ ఇద్దరి మధ్యా ఏమీ లేకుండా నువ్వింతగా ఎందుకు బాధపడాలి?”
“నీ ఇష్టం. నువ్వలా అనుకోవచ్చు. నన్నెందుకింత చిత్రవధ చేస్తావు?”
సఫరీకి తెరలు తెరలుగా కోపం ముంచుకు వస్తోంది. ఒక్కసారి విసురుగా వచ్చి, ఆమెను రెండు చేతులతోనూ పట్టుకుని, “చెప్పు. చెప్పకపోతే నిన్ను చంపేస్తాను.” అన్నాడు.
“చంపేసెయ్యి!”
“వాడు నీ ప్రియుడు. అవునా?”
“ఛీ! కృతఘ్నురాలా!” సఫరీ ఆమె చెంపల మీద ఎడా పెడా వాయించ సాగాడు. అంత బాధని ఆమె భరించింది. ఓపిక నశించే వరకు ఆమెను చావబాది, ఇక కొట్టలేక ఆగాడు సఫరీ. ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అతను చాలా భయపడ్డాడు. ఆమెను ఎత్తుకుని తీసికెళ్ళి సోఫాలో పడుకో బెట్టాడు.
కొంత సేపటికి ఆమె తేరుకుని కళ్ళు తెరిచింది. అతనామెకు క్షమార్పణలు చెప్పుకున్నాడు. “వయొలెట్! నన్ను క్షమించు. నన్నేదో దెయ్యం ఆవహించింది. జీవితంలో ఒక స్త్రీని నేనెప్పుడూ ఇలా కొట్టలేదు. నిన్నింతగా హింసించడం నా అభిమతం కాదు.”
అంత బాధలోనూ వయొలెట్ ముఖం మీద చిరునవ్వు వెలిసింది. “మరిప్పుడు నువ్వేం చేస్తావు?” అని అడిగింది.
“దాన్ని గురించి రేపు ఆలోచిద్దాము. ఈ రోజు నువ్వు విశ్రాంతి తీసుకో. పోయి పడుకో.” అన్నాడు సఫరీ.
“నువ్వింత తెలుసుకున్నావు కాబట్టి మిగిలింది కూడా ఇప్పుడే తెలుసుకోవడం అవసరం. విను.” చెప్పసాగింది వయొలెట్.
![]()
వయొలెట్ తన ధోరణిలో ఏదో చెప్పుకుపోతోంది. అవేమీ సఫరీ మనసుకు ఎక్కడం లేదు. తన ఆలోచనలలో తానున్నాడు. పెళ్లి చేసుకుని, ఇల్లు కట్టుకుని హాయిగా జీవించాలని కలలు కన్నాడు. ఆ సమయంలో ఎవరో వచ్చి, గునపాలతోనూ, పారలతోనూ దానిని పొడిచి ధ్వంసం చేసి, మట్టి కుప్పలు మిగిల్చి పోయినట్టుగా బాధపడ సాగాడు. అదీ తన ప్రాణ స్నేహితుడు క్లార్క్ ద్వారా జరగడం! ఎస్టేటు మేనేజర్లుగా వారికి వివాహాలకి పూర్వమే స్నేహం కలిసింది.
సఫరీ ఒకసారి సెలవులో ఉండగా, వయొలెట్ ని కలుసుకోవడం జరిగింది. బాగా బతికి చికిపోయిన కుటుంబంలోని పిల్ల. అందగత్తె. ఒకింట్లో బేబి సిట్టర్ గా పని చేస్తూ ఉంటే, చూసి, ఆమె దురదృష్టంపై జాలిపడ్డాడు. అది ప్రేమగా మారి క్రమంగా వివాహానికి దారి తీసింది. తరవాత కొంత కాలానికి క్లార్క్ కూడా ‘ఎనిడ్’ ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా మొదట్లో చాలా అందగత్తె అనే చెప్పాలి. కాని, వైవాహిక జీవితంలో ఆమె చాలా కృంగి పోయినట్టని పిస్తుంది. పెళ్ళయిన ఏడాదిలోనే ఒక మగ బిడ్డని కన్నది. కాని, వాడు రెండేళ్ళు బ్రతికి, పోయాడు.
ఇద్దరు మిత్రుల భార్యలు ఒకరినొకరు బాగా ఇష్ట పడ్డారు. ఒకరి ఫ్యాషన్లని ఒకరు అనుకరించేవారు. పెద్ద, పెద్ద పార్టీల సమయంలో, అవసరార్థం, కప్పులు, కంచాలు, వంటి సామగ్రి ఇచ్చి పుచ్చుకునేవరకు వచ్చి, వారి స్నేహానికి మంచి పునాది పడింది. రెండు జంటలు క్లబ్బులో తప్పక కలిసేవి. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. ఆ స్నేహం సఫరీ కి ఎంతో నచ్చింది.
కాల చక్రంలో మూడు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఆ నలుగురి స్నేహం మూడు పువ్వులు ఆరుకాయలుగా వెల్లివిరిసింది. ముఖ్యంగా వయొలెట్, క్లార్క్ లు ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. ఇద్దరు కలిసి గేమ్సు ఆడేవారు. పార్టీల్లో డాన్సు చేసేవారు. ఎప్పుడైనా ఒకరోజు కలుసుకోక పోతే, ఎన్నాళ్ళో అయినట్టనిపించేది. సఫరీ స్నేహంలోని తియ్యదనాన్ని తప్ప మరేమీ పట్టించుకునే వాడు కాదు.
ఒకనాటి రాత్రి వారు క్లబ్బు నుంచి తిరిగి వస్తున్నారు. సఫరీ డ్రైవింగు చేస్తున్నాడు. క్లార్క్, వయొలెట్ లు వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. గతుకుల రోడ్డు కుదుపులకి వారిద్దరి శరీరాలు తగులుతున్నాయి. ఉన్నట్టుండి, క్లార్క్ వయొలెట్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతను కొంచెం మందు మత్తులో ఉన్నాడు. వయొలెట్ అభ్యంతరం తెలపలేదు. నిశ్శబ్దం సాక్షీభూతంగా వారి ప్రేమనొకరి కొకరు తెలియజేసుకున్నారు. ఇంతలో క్లార్క్ దిగే స్థలం వచ్చింది. అతను ‘గుడ్ నైట్ ‘ చెప్పి వెళ్ళిపోయాడు. సఫరీ వయొలెట్ ని ముందు సీట్లోకి రమ్మంటే, “అబ్బా! కాళ్ళు లాగుతున్నాయి. “ అని నిరాకరించింది.
మర్నాడు క్లబ్బులో కలుసుకున్నప్పుడు ఏమీ జరగనట్టు మాములుగానే అందరితోను ప్రవర్తించారు. వయొలెట్, క్లార్క్ లు. కాని వారిద్దరి మధ్యా ఏదో తెలియని క్రొత్త ఆకర్షణ ఒకటి చోటు చేసుకుంది. వారి మధ్య అంకురించిన ప్రేమ వారిద్దరినీ త్వరగా ఏకం కమ్మని తొందర పెడుతోంది. అయితే, వారున్న ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి అవకాశానికి తావులేదు. చూపులతోను, చేతుల కలయికతోను ఆరాటాన్ని సరిపెట్టుకుంటున్నారు. శారీరిక కలయిక ఆ ప్రేమకి ఒక పరాకాష్ట మాత్రమే. తరచూ వారిమధ్య జరిగే సంభాషణలో వారి వారి జీవిత భాగస్వాముల ప్రసక్తికి తావు లేదు. ఒకవేళ ఉన్నా అది వారి మీద జాలికే పరిమితం. ఇలా వారాలు నెలలు గడుస్తున్నాయి.
అప్పుడు, ఆ దంపతుల జీవితాల్ని కలచి వేసే సంఘటన ఒకటి ఎదురైంది. సఫరీ కి దూరంగా ఉన్న మరొక ఎస్టేటుకి బదిలీ అయింది. ప్రస్తుతం చేస్తున్న దానికంటే పెద్ద హోదాగల ఉద్యోగం. జీతం కూడా ఎక్కువ. సఫరీ వెళ్లాలనే నిర్ణయించుకున్నాడు. అది క్లార్క్, వయొలెట్ ల ప్రణయ సామ్రాజ్యానికి గొడ్డలి పెట్టయింది. ఏం చేయాలన్న విషయంలో మాత్రం వారిద్దరిది ఒకటే అభిప్రాయం. ఈ అవాంతరం తప్పనిసరి అయిన పక్షంలో వారి వారి జీవిత భాగస్వాముల్ని వదిలిపెట్టి, వీరిద్దరూ ఏకమై పోవడం. వారి ప్రేమ అనంతంగా సాగిపోవాలంటే గత్యంతరం లేదు.
ఈ విషయంలో వారు సఫరీకి, ఎనిడ్ కి ఎంత మానస సంక్షోభం కలగజేస్తున్నారో అర్థం చేసుకో గలరు. కాని వారు జీవితాంతం ఆనందంగా గడపాలంటే ఇదొక్కటే మార్గం. ఇద్దరూ కలిసి ఒక పథకం వేశారు. దాని ప్రకారం, క్లార్క్ ఏదో బిజినెస్ నెపంతో, సింగపూర్ వెళ్తాడు. వయొలెట్ భర్తతో తన స్నేహితురాలొకామె రమ్మందని సాకు చెప్పి, క్లార్క్ ని అక్కడ కలుస్తుంది. వారిద్దరూ జావా వెళ్లి , షిప్పులో సిడ్నికి వెళ్లిపోతారు. క్లార్క్ సిడ్నిలో ఏదో ఉద్యోగం చూసుకుంటాడు.
వయొలెట్ సఫరీ తో స్నేహితురాలి విషయం ఎత్తినపుడు అతను చాలా సంతోషించాడు. “తప్పకుండా వెళ్లిరా! నీకు కాస్త మార్పు అవసరం. నీ యిష్టం వచ్చినంత కాలం ఉండి రా!” అన్నాడు బుగ్గమీద సుతారంగా చిటిక వేస్తూ. ఆ చేష్ట వయొలెట్ కి హృదయంలో బాకుపోటులా తగిలింది.
నిజమే! నువ్వు నా మాట ఎప్పుడు కాదన్నావు కనక. “ ఆమె కళ్ళలో నీళ్ళు.
“నీకు ఆ మాత్రమైనా చేయలేకపోతే ఎలా? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదా?”
“ఈ ఎనిమిదేళ్ళ సాంగత్యం నీకు ఆనందాన్నిచ్చిందా?”
“నిస్సందేహంగా. ఈ ప్రపంచంలో నా అంతటి అదృష్టవంతుడు లేడనిపించేలా.”
“చాలు. అది చాలు. ఆ సంతోషాన్ని నీ నుంచి ఎవరూ దోచుకోలేరు. “
సఫరీ ఏ స్త్రీ నైనా అలాగే ప్రేమించగలడని, తాను అతనికి దూరమయ్యాక, కొన్నాళ్ళకి అన్నీ మరిచిపోయి, మరొక స్త్రీ -ఆ స్త్రీ ఎనిడ్ కావచ్చు- ని వివాహం చేసుకుని హాయిగా బ్రతకగలడని, మనసుకి నచ్చ జెప్పుకుంది. వయొలెట్. ఏమైనా తన నిర్ణయంలో మార్పు లేదు.
“ఇక్కడ మనకి బాగానే ఉందికదా . మళ్లి మనం ఊరు మారడం దేనికి? డియర్.” అంది వయొలెట్.
“అలా అనకు. ఇటువంటి అవకాశం తిరిగి రాదు. పైగా జీతం కూడా ఎక్కువ.”
“డబ్బే ప్రధానం కాదు కదా! సుఖసంతోషాల మాటేమిటి?”
నిజమే! కాని అక్కడ మనం సుఖంగా ఉండమని ఏముంది? అదిగాక, ఇది బోర్డు డైరక్టర్ల ఆదేశం ఆచరించక తప్పదు. మరో దారి లేదు. ”
వయొలెట్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచింది. అవును. తనకీ మరో దారి లేదు. తను తీసుకున్న నిర్ణయం తప్ప. ఇతరులకి బాధ కలిగేలా ప్రవర్తించడం మంచిది కాదు. కాని తప్పనిసరి పరిస్థితుల్లో అలా ప్రవర్తించక తప్పదు. క్లార్క్ లో చూసిన ప్రత్యేకత వయొలెట్ సఫరీ లో చూడలేకపోయింది. ఈ మనిషి కోసం తన ఆనందాన్ని త్యాగం చేయడం వయొలెట్ కి ఇష్టం లేదు.
వెళ్ళవలసిన రోజు దగ్గరౌతున్న కొద్దీ, వయొలెట్ మనసు ఆనందంతో గంతులు వేయ సాగింది. ఇంతవరకు చూడని ఆనందామృతం క్లార్క్ పరిష్వంగంలో దొరుకుతుందని సంబర పడుతోంది. తన బట్టలు, పుస్తకాలు సర్దడం ప్రారంభించింది. ట్రంకులు ఒకదాని తరవాత ఒకటి నిండుతున్నాయి. ఆ మర్నాడు ప్రయాణం. ఉదయమే లేచి వయొలెట్ బట్టలు సర్దుకుంటూ ఉండగా, బాయ్ వచ్చి ఎనిడ్ వచ్చిందని చెప్పాడు. ఆ సమయంలో సఫరీ ఇంట్లో లేడు.
కొంపతీసి తమ విషయం ఆమెకు తెలిసిపోయిందేమో ననే భయంతో ఆమె ట్రంకు మూతపెట్టి, వరండాలోకి దారి తీసింది. ఎనిడ్ చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా వడిలి పోయినట్టు ఉండే ఆమె ముఖం నిగ్గు దేరి వెలిగిపోతోంది. వయొలెట్ ని చూడగానే మెడ చుట్టూ చేతులు వేసి, నుదిటి మీద ముద్దులు కురిపించింది.
“ఏమైంది? ఎనిడ్! ఏమైంది?” అని అడిగిందామె ఆత్రంగా.
“ఇప్పుడే లేడీ డాక్టరు దగ్గరనుంచి వస్తున్నాను. నా కనుమానంగానే ఉంది. కాని డాక్టరు నిర్ధారణ చేయకుండా ఎందుకని ఆగాను.”
“ఏమిటి? నువ్వనేది. ఏమైనా శుభవార్తా?”
“అవును. ఈ సారి నేను పొరబడలేదు. డాక్టరు చెప్పడం కనీసం మూడో నెల అని.” ఆనందాతిరేకంలో ఎనిడ్– వయొలెట్ ని చుట్టేసింది.
వయొలెట్ కి అది విని మతి పోయింది. తనని తను సంబాళించుకోకపోతే స్పృహ తప్పుతుందనిపించింది. మెల్లగా తమాయించుకుని, “క్లార్క్ కి ఇది తెలుసా?” అని అడిగింది.
“లేదు. ఇంకా చెప్పలేదు. క్రితం రెండు సార్లు మిస్ కేరేజ్ కావడం, అంతకు ముందు రెండేళ్ళ బాబు పోవడం అతణ్ణి హతాశుడిని చేశాయి. పిల్లలంటే అతనికి చాలా సరదా.’’
వయొలెట్ అన్యమనస్కంగానే ఆమెతో మాట్లాడుతోంది. ఎనిడ్ మాత్రం తన ఆశలు, ఆశయాలు, కోరికలు ఏకరువు పెడుతోంది. కాని వయొలెట్ అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఆమె ఆలోచనలు మరోదారిన పరిగెడుతున్నాయి.
“మరి ఎప్పడు చెప్పుదామనుకుంటున్నావు?”
“ఇప్పుడు అతను చాలా బిజీగా ఉంటాడు. లంచ్ టైములో కూడా కుదరదు. అందుచేత రాత్రి డిన్నరు టైములో తీరిగ్గా చెప్పి అతన్ని మురిపిద్డామనుకుంటున్నాను.’’
ఇది విన్నాక వయొలెట్ మనసు కుదుట పడింది. ఈ రాత్రిలోగా ఎనిడ్ కంటే ముందుగా క్లార్క్ ని కలుసుకుని విషయం చర్చించే అవకాశం ఉంది. ఎనిడ్ ని పంపి, తాను క్లార్క్ కి ఫోను చేసింది. ఆ సమయంలో అతనెక్కడుంటాడో ఆమెకు తెలుసు.
“హేరీ! మనం తరచూ కలుసుకునే సంకేత స్థలానికి నువ్వు మూడు గంటలకు రాగలవా?” అప్పుడు హేరీ ఖాళీ గా ఉంటాడు. సఫరీ ఆఫీసులో బిజీ. కనుక అదే సరైన సమయం.
“నువ్వు పిలవడం, ఈ బంటు రాకపోవడమూనా? ఏం? ఏం జరిగింది?”
“అంతా అప్పుడు చెప్పుతాను. తప్పకరా” ఫోను పెట్టేసింది.
క్లార్క్ వెళ్లేసరికి వయొలెట్ అప్పటికే అక్కడ అతనికోసం ఎదురు చూస్తోంది. చూస్తూనే అతని కౌగిలిలో ఒరిగి పోయి, “ హేరీ! నీకు తెలుసా! ఎనిడ్ నెల తప్పింది. ఈ సంగతి నీకామె రాత్రికి చెప్పబోతోంది.”
“నిజమేనా?” ఆశ్చర్యపోతూ అడిగాడు క్లార్క్ .అతను ఒక్కసారిగా దెబ్బతిన్నాడు.
వయొలెట్ అతని చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది. వారిద్దరూ, వారి వారి జీవిత భాగస్వాముల గురించి ఎప్పుడూ చర్చించు కోలేదు. అది అంత ముఖ్యమైనదిగా వారు భావించలేదు. సఫరీతో సహచర్యం ఆమె నెప్పుడూ తృప్తి పరచలేదు. క్లార్క్ ని ఆమె మనసారా ప్రేమించింది. నిరాశా నిస్పృహలు నిండిన హృదయంతో, ఆమె ఏడుస్తూ ఇలా అంది. “ హేరీ! నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మాట నిజమే. కాని ఎనిడ్ నాకు ఏం అన్యాయం చేసిందని? ఇటువంటి తరుణంలో ఆమెనుంచి నేను నిన్నెలా విడదీయ గలను? అది అమానుషం కాదా?’’
“ఏం చేయమంటావు వయొలెట్! నేనీ విషయంలో పశువులా ప్రవర్తించాను ఒప్పుకుంటాను. కాని పరిస్థితులు అలాంటివి. భార్యా భర్తలు ఒక…… ..’’
“ఊరుకో! హేరీ! నిన్ను తప్పు పట్టడం లేదు. నేనే ఈ పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. మనం ఏనాడో కలిసి పారిపోయి ఉండవలసింది. రోజులెప్పుడూ ఒకేలా ఉంటాయనుకోరాదు.’’
ఆమె బాధనతడు గ్రహించాడు. ఏమీ చేయలేక, నేల మీది ఎండుటాకుల మీదకి దృష్టి మరల్చాడు.
ఉన్నట్టుండి “హేరీ! ఇక మనం విడిపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.” అంది వయొలెట్.
“ఏమిటి? నువ్వంటున్నది వయొలెట్!” షాక్ తిన్న వాడిలా అడిగాడు క్లార్క్.
“ఈ పరిస్థితిలో ఆమెను నువ్వెలా వదిలిపెట్ట గలవు? మామూలు రోజుల్లో అయితే ఫరవాలేదు. ఏదో బాధ పడేది. కొన్నాళ్ళకి మరిచిపోయేది. నేటి పరిస్థితి వేరు. ఈ సమయంలో స్త్రీకి మానసికంగాను, భౌతికంగాను ఒకమనిషి సహాయం అవసరం. కేవలం మన స్వార్థంతో ఆమెనీ స్థితిలో వదిలి పెట్టడం అమానుషం.”
“అంటే? ఇప్పుడు నువ్వామెను నాతో ఇంగ్లండు తీసుకు వెళ్ళమనా?”
“అవును నువ్వెలాగూ ప్రయాణం పెట్టుకున్నావు. ఇందు కోసమే అనుకో! అదీ ఒకందుకు మంచిదే! నిత్యమూ నువ్వు నా కళ్ళ ముందు ఉండవు.”
“కాని, వయొలెట్! నువ్వు లేకుండా నేను బ్రతకలేను.”
“బ్రతక గలవు. బ్రతకాలి. బ్రతకక తప్పదు. నేను బ్రతుకుతున్నపుడు నీకేం? ఇంకా నేనే ఒంటరిదాన్ని అవుతాను మీరు వెళ్ళిపోయాక.’’
“వయొలెట్! డియర్! ఇది జరిగే పని కాదు. నేను నమ్మలేకుండా ఉన్నాను.’’
“లాభం లేదు! హేరీ! ఈ విషయంలో వాదించి లాభం లేదు. ఎనిడ్ నాకీ విషయం చెప్పినప్పుడే నేనీ నిర్ణయం తీసుకున్నాను. అందుకే నువ్వామెను కలుసుకునే ముందుగానే నీకీ విషయం చెప్పాలని నిన్ను పిలిచాను. నువ్వు నాకు ప్రాణంతో సమానం. కాని ఆ ప్రాణి నాకేం అన్యాయం చేసిందని? ప్రస్తుత పరిస్థితిలో ఆమెను నీ నుంచి వేరు చేసి ఆ పాపం మూటగట్టుకోలేను. ఇది ఒక దురదృష్టం. కాని పచ్చినిజం. అంతటి దుర్మార్గం నేను ఆచరించలేను.’’
“ఇంతకంటే నేను చచ్చిపోతే బాగుండేది.”
“దానివల్ల ఎనిడ్ కి అన్యాయమే జరుగుతుంది. నాకు కూడా.” విషాదంగా నవ్వింది వయొలెట్.
“భవిష్యత్తు మాటేమిటి? ఆశల్ని, ఆనందాల్ని త్యాగం చేసి, జీవితం అంతా బ్రతకడమేనా?
“తప్పదనుకుంటాను. కాలం చేసిన గాయాల్ని కాలమే మాన్పు తుంది. మన చేతుల్లో ఏమీ లేదు.’’
వయొలెట్ వాచీ చూసుకుంది. “ సఫరీ ఇంటికి వచ్చే వేళయింది. మనం మామూలుగానే సాయంత్రం క్లబ్బులో కలుద్దాం.”
ఆ తరవాత పది రోజుల్లో క్లార్క్ దంపతులు ఇంగ్లండుకి ప్రయాణ మై వెళ్ళిపోయారు.
![]()
జార్జ్ మూన్, సఫరీ చెప్పినదంతా జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి క్లార్క్ దంపతులు వెళ్లేముందు క్లబ్బులో జరిగిన పార్టీకి తనని వాళ్ళాహ్వానించలేదు. కాని అక్కడ ఏమైందో తను ఊహించుకోగలడు. మనసులో అంతటి విషాదాన్ని దాచుకుని, పైకి ఆనందంగా ఉన్నట్టు నటిస్తూ డాన్సు చేస్తున్న వయొలెట్, క్లార్క్ ల మానసిక పరిస్థితిని అర్థం చేసుకో గలడు.
ఒక ప్రక్క ఈ కథ వింటూనే మరొక ప్రక్క తన గత జీవితం గురించి ఆలోచించ సాగాడు జార్జి. ఇక్కడ ఎవరికీ తన కథ తెలియదు. అవును. అది జరిగి పాతికేళ్ళకి పైగానే అయింది.
“మరిప్పుడు ఏం చేయదల్చుకున్నారు?” ఆలోచనల్లోంచి తేరుకుని అడిగాడు జార్జి.
“ఈ విషయంలో మీ సలహా తీసుకోవాలనే ఇక్కడికి వచ్చాను. క్లార్క్ పోయాడు కాబట్టి, నేనిప్పుడు వయొలెట్ కి విడాకులిస్తే ఆమె రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది.’’
“మీరు ఆమెనుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా?”
“గత్యంతరం లేదు.’’
జార్జి ఆలోచనలో పడ్డాడు. “నేనూ ఒకప్పుడు వివాహితుడిననే విషయం మీకు తెలుసనుకుంటాను.’’
“అవును. మీ భార్య పోయిందని విన్నాను.’’
“అది నిజం కాదు. నేను నా భార్యకు విడాకులిచ్చాను. నాకు ఇరవై ఏడేళ్ళ కొడుకు ఉన్నాడు. ఆ మధ్య నేను సెలవు మీద వెళ్ళినపుడు నా భార్యను చూడడం తటస్థించింది.
![]()
ఆ తరవాత జరిగిన కథనం ఇలా వినిపించాడు జార్జి మూన్.
వారు థియేటర్ లో కలుసుకున్నారు. ప్రక్క ప్రక్కనే కూర్చున్నా అతనామెను గుర్తుపట్టలేదు. ఆమే గుర్తుపట్టి, “ఎలా ఉన్నావు జార్జ్?’ అని అడిగింది. “మనం కలుసుకుని చాలా కాలం అయింది కదూ!’’ అంది.
“ఆనవును” జార్జి పొడిపొడిగా సమాధానం చెప్పాడు. ఆమె తను గుగుర్తించలేనంతగా మారిపోయింది. బాగా లావెక్కింది. వయసు పైబడిన విషయం బాగా తెలుస్తోంది.
“ఏం చేస్తున్నావు?’’
“ఏదో నడుస్తోంది.”
“మంచి ఉద్యోగమే చేస్తున్నావని విన్నాను..”
“అవును. కాని త్వరలోనే రిటైరు కాబోతున్నాను.”
“అప్పుడేనా! నీకంత వయసు ఉన్నట్టు కనిపించదు. నీ బాడీని చక్కగా మెయిన్‌టెయిన్ చేశావు. నేను చూడు ఎంత లావెక్కానో. ఏం చేయను? ఇప్పటికీ అయిస్ క్రీము, ఆలుగడ్డలు వదిలిపెట్టలేను.’’
షో పూర్తయ్యాక విడిపోతూ, “మనం ఒకసారి కలుసుకుని మాట్లాడుకోవాలి.” అన్నాడు జార్జి మర్యాద కోసం.
“ఓ! నువ్వెప్పుడంటే అప్పుడే. నేను సిద్ధం.” అందామె.
జార్జి మర్నాడు బెర్క్లి రెస్టారెంటులో లంచ్ కి ఆహ్వానించాడామెను.
వారి విడాకుల తతంగం పూర్తవగానే ఆమె తను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుందని విన్నాడు జార్జి. ఆమె ధరించిన బట్టలు తీరు చూస్తూ ఉంటే బాగానే బ్రతుకుతున్నట్టుగా ఉంది. చక్కగా మాట్లాడగలదు. నిండుగా నవ్వగలదు. హుషారుగా ఉంటుంది.
“నువ్వు మళ్లి పెళ్లి చేసుకోలేదు కదూ!” అడిగిందామె.
“లేదు.”
“మొదటి వివాహం సుఖాంతం కానంతలో రెండోది కూడా అలాగే జరగాలని ఏమీ లేదు. నువ్వు మళ్లి పెళ్లి చేసుకుని ఉండవలసింది.”
“నాకేమీ సమస్యలు లేవు. నీ జీవితం ఎలా ఉందని ఆడిగే పని లేదు. నిన్ను చూస్తూ ఉంటేనే తెలుస్తోంది సుఖంగా ఉన్నావని.’’
“నేను బాగానే ఉన్నాను. నా భర్త జిమ్ నన్ను బాగానే చూసుకుంటాడు. ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ముఖ్యంగా బెట్టీ అంటే నాకు చాలా ఇష్టం.’’
“బెట్టీ? ఎవరు?”
“నా కూతురు. రెండేళ్ళ క్రిందటే పెళ్ళయింది. త్వరలోనే నేను అమ్మమ్మను కాబోతున్నాను.’’
“అంటే, మనం ముసలివాళ్ళం అయిపోతున్నామన్న మాట.’’
ఆమె చిన్నగా నవ్వింది. “బెట్టీకి ఇప్పుడు ఇరవై రెండేళ్ళు . జార్జ్! నువ్వు నన్ను లంచ్ కి పిలిచి మంచిపని చేశావు. ఎప్పుడో జరిగిన దానిని మనసులో పెట్టుకుని ద్వేషం పెంచుకోవడం మంచిపని కాదు.’’
“అది మూర్ఖత్వం.”
“మనిద్దరికీ పడేది కాదు. మంచిదయింది. తెలుసుకుని ముందుగానే విడిపోయాం.”
అతనామె మాటలకి చిన్నగా నవ్వాడు. ఆమె ఇంకా ఎందరి గురించో, ఏమేమో మాట్లాడుతోంది. విడాకుల కోర్టు, కొడుకు పెంపకం బాధ్యత జార్జికే అప్పగించినా మగవాళ్ళు పిల్లల్ని బాగా పెంచలేరని తనే దగ్గర ఉంచుకుని పెంచడం, వాడిప్పుడు పెద్ద వాడై న్యూజిలాండులో ఫార్మింగ్ చేయడం వగైరా. జార్జి ఎప్పుడూ కొడుకుని చూడనే లేదు. దారిలో తటస్థపడినా పోల్చుకోలేడు. అవేమీ అతను పట్టించుకోలేదు.
ఆమె టైము చూసుకుని, “జార్జ్ ! ఇక నేను వెళ్ళాలి. మంచి లంచ్ ఇచ్చావు. కృతజ్ఞురాలిని. నిన్ను ఇంతకాలానికి చూశాను. చాలా సంతోషంగా ఉంది” అంది.
అతను టాక్సీని పిలిచి ఆమెను ఎక్కించాడు.
![]()
జార్జ్ మూన్ చెప్పడం ఆపి సఫరీతో అన్నాడు. “ఆమె వయసులో ఉన్నపుడు చాలా అందంగా ఉండేది. చాలా ఆకర్షణీయంగా ఉండేది. అందుకే నేనామెను పెళ్లి చేసుకున్నాను. కాని యువకులంతా ఆమె చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా తిరుగుతూ ఉండేవారు. ఎవరో ఒకరు ఆమెను ఆకర్షించరని నమ్మకం ఏమిటి? ఆఖరికి ఒకసారి ఆమె దొరికిపోయింది. చేసేది లేక నేనామెకు విడాకులిచ్చాను. కాని తరవాత ఆలోచిస్తే నేను చేసింది తప్పని నాకే అనిపించింది. సఫరీ! విను. ఏ మాత్రం ఆలోచన ఉన్న వాడినైనా, నేను ఆమె ప్రవర్తనని చూసీ చూడనట్టు ఊరుకుని ఉంటే, నా జీవితాన్ని ఆమె మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చేసి ఉండేది. ఆమె చాకచక్యం అటువంటిది.
కానీ మరి సంఘంలో గౌరవం, మర్యాద?”
“అవన్నీ మనకనవసరం. మన వ్యక్తిగత జీవితం ఆనందంగా గడిస్తే చాలదూ? ఆమె మరొకడితో తిరిగి నంతలో మన గౌరవం సంఘంలో తగ్గి పోతుందా? మనమేమీ సంఘానికి మూలస్తంభాలం కాము. నా భార్య అంటే నాకిష్టం. ఆమె నాకు కావలసిన ఆనందాన్ని ఇస్తోంది. అంత కంటే కావలసింది ఏముంది? మరి నాకూ పరాయి స్త్రీలతో సంబంధాలు ఉన్నాయే! నేను మడి కట్టుకుని కుర్చున్నానా? ఆమె ద్వారా నాకు కావలసిన సుఖసంతోషాలు లభిస్తున్నపుడు, అది నా ఒక్కడికే పరిమితం కావాలనుకోవడం నా స్వార్థం కాదా?’’
“మీ లాంటి పెద్ద మనిషి ఇలా మాట్లాడడం నేనెప్పుడూ ఊహించ లేదు.’’
“బహుశా ఈ నగ్న సత్యాన్ని మీ ముందు ఇంతగా విడమర్చి చర్చించిన వాడిని కూడా నేనే అంటే వింత కాదేమో.’’
“అంటే? ఈ రోజు మళ్లి అవకాశం వస్తే మీ పాత భార్యతో మరోలా ప్రవర్తించి ఉండేవారా?”
“ఈ రోజు నేను ఇరవై ఏళ్ల వాడినై ఉంటే, ఆ రోజులాగే తెలివి తక్కువగా ప్రవర్తించి ఉండేవాడిని. కాని ఈ నాటి అవగాహన, అనుభవం తో, నేను నిన్న మీరు ఏం చేశారో అదే చేసి ఉండేవాడిని.’’
“అంటే? వయొలెట్ ని క్షమించమని మీ ఉద్దేశ్యమా?”
జార్జ్ నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు. “లేదు. క్షమించడం అనేది మీరిప్పటికే చేశారు. నేను చెప్పేదేమంటే, మీరు చావు తప్పి కన్ను లొట్టవోయినట్టుగా ప్రవర్తించారని.’’
సఫరీ, జార్జ్ ని బాధగా చూశాడు. “మీకు అసలు పరిస్థితులు తెలియవనుకుంటాను. క్లార్క్ నాకు తమ్ముడి వంటివాడు. అతనికీ ఉద్యోగం అభిమానం కొద్దీ నేనే వేయించాను. నేనే పెళ్లి చేసుకోకపోతే వయొలెట్ ఏ ఇంట్లోనో ఆయాగా పని చేస్తూ ఉండేది. నేను చేసిన త్యాగం అంతా వృథా అయిపోయిందని విచారిస్తున్నాను. సహాయం చేసిన వాళ్ళనే వెన్నుపోటు పొడవడం నీచం అని మీకనిపించడం లేదా? ఇది కేవలం నమ్మక ద్రోహం కాదా?” అన్నాడు.
“మీరు మరీ సెంటిమెంటల్ గా అవుతున్నారు. కృతజ్ఞతాభావం అనేది మనం అడిగితే వాళ్ళిచ్చేది కాదు. మీరు ఒక మంచిపని ఎందుకు చేస్తున్నారు? అందులో మీకు ఆనందం లభిస్తోంది కాబట్టి. దాని పని అక్కడితో సరి. ఎదుటి వాళ్ళు మనకి జీవితాంతం ఋణపడి ఉండాలనుకోవడం అవివేకం. అది లభిస్తే మంచిదే! డివిడెండు వచ్చిన షేర్ల మీద బోనసు కూడా వచ్చినట్టు. రాకపోతే మాత్రం విచారించ కూడదు. అదీ ఇదీ కూడా కావాలని ఆశించకూడదు.’’
సఫరీ నిరుత్సాహపడ్డాడు. ఆని దృష్టిలో వయొలెట్ చేసిన పనికి విడాకులు తప్ప మరో మార్గం లేదు. కాని ఇంత పెద్ద మనిషి ఇలా ఆలోచిస్తున్నాడంటే కారణం అంతు పట్టలేదతనికి. దేనికైనా హద్దు ఉంటుంది. కాని అది దాటి పోయినప్పుడు, ఆత్మగౌరవం దెబ్బ తిన్నపుడు కూడా జార్జి లాంటి పెద్ద మనిషి ఇవ్వవలసిన సలహాయేనా ఇది? ఏమో! అతన్ని అర్థం చేసుకోవడం కష్టం.
“మిస్టర్ సఫరీ! ఇలా చూడండి. క్లార్క్ ఎలాగూ పోయాడు. అతని విషయంలో అసూయా ద్వేషాలు అనవసరం. జరిగిన కథ అంతా మీకూ నాకూ తప్ప ఎవరికీ తెలియదు. నేను రేపే ఇక్కడి నుంచి బిచాణా ఎత్తేస్తున్నాను. గతం గతః అని చల్లగా ఊరుకోరాదూ!”
“కాని వయొలెట్ విషయం నన్ను బాధిస్తూ ఉంటుంది.’’
“నాకు తెలిసినంత వరకు ఆమె అంత చెడ్డది కాదు. మీకెప్పుడైనా ఆమె ప్రవర్తన అలా అనిపించిందా?”
సఫరీ విసుగెత్తి పోయాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. “లేదు! ఆమె ఈ ప్రపంచంలోకల్లా అందగత్తె. చాలా మంచి మనిషి. నేనే దుర్మార్గుడిని.’’ అతని కళ్ళలో నీరు కార సాగింది. “నేను కోరుకునేదల్లా ఇప్పుడు నేను చేసే దానిలో తప్పులేకుండా ఉండాలి.’’
“తప్పులేని పని ఆమెను క్షమించడం.”
సఫరీ ముఖాన్ని రెండు చేతులతోనూ కప్పుకున్నాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక పోతున్నాడు. “ఏమో! ఎంతకాలమూ నేను మాత్రమే త్యాగం చేస్తున్నాను. నా కోసం త్యాగం చేసిన వాళ్ళెవరూ లేరు. నా గుండెలు బద్దలయినా ఫరవాలేదు. నేను మాత్రం మంచి పనులే చేస్తూ ఉండాలి..” మండలతో కళ్ళు తుడుచుకున్నాడు.
ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి, “నేనామెను క్షమిస్తున్నాను.” అన్నాడు.
“నేనే మీరయితే దీనిని గురించి ఇంత రాద్దాంతం చేయను. ఎందుకంటే వయొలెట్ కూడా మిమ్మల్ని క్షమించవలసి ఉంటుంది.”
“అవును. నేనామెను చితక బాదాను. అందుకు నేను సిగ్గు పడుతూనే ఉన్నాను.’’
“నా ఉద్దేశం అది కానే కాదు. బహుశా అది ఆమెకు మంచినే చేసింది. మీరేదో త్యాగం చేశా నంటున్నారు. కాని దాని నామె అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. ఆడవాళ్ళు అంతలోనే అన్ని విషయాలు మరిచిపోగలరు.’’
సఫరీ నోరు వెళ్ళబెట్టుకుని అతని వైపు చూస్తూ ఉండి పోయాడు. “మీరు చాలా విచిత్రమైన మనిషి. ఒక్కొక్కసారి మేకులా గట్టిగా ఉంటారు. అంతలోనే ఎంతో మానవత్వం చూపిస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకుందా మనుకుంటూ ఉండగానే మరొక బాంబు షెల్ విసురుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే మీరు ఎందులోనూ మంచిని చూడలేరు. మీకు హృదయం లేదు.’’
“మంచిని గురించి నేనంత ఆలోచించలేదు.” నవ్వుతూ అన్నాడు జార్జి. “కాని, మనకిష్టం లేనపుడు కూడా, నిజాన్ని నిజంలా అంగీకరించడంలోను, దానిని జీర్ణించుకోగలగడంలోనూ, మానవ మనస్తత్వాన్ని ఉన్నదున్నట్టుగా అంగీకరించడంలోనూ, హృదయం లేదంటే, – నిజంగానే నాకు హృదయం లేదు. మానవ నైజం అంత తేలిగ్గా అర్థం అయేది కాదు. కాని జీవితంలో ఓర్పుని, సహనాన్ని అలవర్చుకుంటే, ఏడుస్తూ కూర్చోవడం కన్నా, ఆనందంగా గడపడమే మేలనిపిస్తుంది.’’
సఫరీ లేచి వెళ్ళిపోయాడు. భార్య మీది కోపంతో వచ్చిన భర్తని సమాధాన పరచి పంపడం తనకి క్రొత్త కేసు. అందుకు జార్జికి ఆనందంగా ఉంది. నెమ్మదిగా లేచి, ఓ చుట్ట ముట్టించి, బైట ఎండలోకి నడిచాడు.
![]()

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.




Discussion about this post