రష్యన్ మూలం : అంతోన్ చేహొవ్
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్
ఏడాదికి వెయ్యిన్నిరెండు వందల రూబుళ్ళు సంపాదిస్తూ తన కుటుంబంతో కలిసి జీవిస్తూ, తన స్థితితో చాలా సంతోషంగా వున్న ఒక సామాన్యుడైన ఇవాన్ ద్మీత్రిచ్ రాత్రి భోజనం చేసిన తర్వాత సోఫాలో కూచుని వార్తాపత్రిక చదవడం మొదలెట్టాడు.
‘‘ఈరోజు నేను వార్తాపత్రిక చూడటం మర్చిపోయాను!’’ అతని భార్య బల్ల సర్దుతూ అంది. ‘‘అక్కడ లాటరీ ఫలితాల జాబితా ఏమైనా వుందేమో చూడు!’’
‘‘అవును. వుంది!’’ అని బదులిచ్చాడు ఇవాన్ ద్మీత్రిచ్. ‘‘కానీ నీ టికెట్టు తాకట్టు దుకాణంలో పోలేదా?’’
‘‘లేదు!’’
‘‘టికెట్టు నంబరెరంత?’’
‘‘సిరీస్ 9, 499, నంబరు 26’’
‘‘అయితే చూద్దాం …9, 499, 26’’
ఇవాన్ ద్మీత్రిచ్ కు అదృష్టం మీద, లాటరీల మీద నమ్మకం లేదు. మామూలుగా ఎప్పుడూ లాటరీ టికెట్ల ఫలితాల జాబితా చూసేవాడు కాదు. కానీ ఇప్పుడు చేయడానికి అతనికి వేరే పనేమీ లేక పోవడం వల్ల, వార్తాపత్రిక చేతిలో వుండటం వల్ల ఫలితాల జాబితాలో నంబర్ల వెంట వేలు కిందికి జరిపాడు. వెంటనే అతని అపనమ్మకాన్ని హేళన చేస్తున్నట్లుగా పైనుంచీ రెండోలైను దాటకముందే 9,499 నంబరు అతని కంటబడింది- తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా, అతడు టికెట్టు నంబరు చూడకుండానే వేగంగా వార్తాపత్రికను మోకాళ్ళ మీదకు జార్చాడు. ఎవరో కడుపు మీద చల్లటి నీళ్ళు చల్లినట్లుగా అతని కడుపులో ఆహ్లాదకరమైన చలి పుట్టింది. అది గిలిగింతలు పెట్టినట్లు హాయిగా వుంది.
‘‘మాషా! 9,499 నంబరు వుంది’’ అని బొంగురు గొంతుకతో చెప్పాడు ద్మీత్రిచ్.
ఆశ్చర్యం, భయం నిండిన అతని ముఖాన్ని చూసి అతడు పరిహాసం చేయడం లేదని ఆమె గ్రహించింది.
ఆమె ముఖం పాలిపోయింది. మడతపెట్టిన టేబుల్ క్లాత్ బల్ల మీద పెడుతూ, ‘‘9, 499?’’ అని అడిగింది.
‘‘అవునవును… నిజంగానే వుంది.’’
‘‘మరి టికెట్టు నంబరు?’’
‘‘అవును టికెట్టు నంబరు కూడా… కానీ, ఆగు… ఏమైంది? మన దగ్గర సిరీస్ నంబరు వుంది కదా! అసలు, చూడు…’’
ఇవాన్ ద్మీత్రిచ్ భార్యవైపు చూస్తూ, ఏదో మెరిసే వస్తువు కనిపించగానే నోరంతా తెరిచి అర్థం కానట్లు అయోమయంగా నవ్వే చిన్న పిల్లాడిలా నవ్వాడు. అతడి భార్య కూడా నవ్వింది: అతడు కేవలం సిరీస్ పేరు చెప్పి అదృష్టం తెచ్చే నంబరు కనుక్కోడానికి తొందర పడనందుకు ఆమె కూడా అతని లాగే సంతోషించింది. దొరకబోయే ఆనందం అనే ఆశతో తనను తాను వేధించుకోవడం- అదెంత మధురంగా వుంటుందో కదా!
‘‘మనం గెలుపు బాటలో వున్నాం’’ చాలాసేపు మౌనం తర్వాత ఇవాన్ ద్మీత్రిచ్ అన్నాడు. ‘‘అంటే మనం గెలిచే అవకాశం వుంది. అది కేవలం అవకాశం మాత్రమే. కానీ ఆ అవకాశం ఇంకా వుంది!’’
‘‘సరే.. ఇప్పుడు చూడు!’’
‘‘ఆగు… నిరాశ పడ్డానికి మనకు తర్వాత ఇంకా సమయం వుంటుంది. అది పైనుండి రెండో వరుసలో వుంది. అంటే మనం 75,000 రూబుళ్ళు గెలిచామని అర్థం.. అది డబ్బు కాదు- అధికారం, పెట్టుబడి! ఇప్పుడు నేను అకస్మాత్తుగా ఫలితాల జాబితా చూస్తాను. అదుగో అక్కడుంది- 26! … విను… ఒకవేళ మనం నిజంగానే గెలిచి వుంటే?’’
ఆ జంట నవ్వడం మొదలెట్టి చాలాసేపు మౌనంగా ఒకర్నొకరు చూసుకున్నారు. సంతోషం సాధ్యమనే ఆలోచన వాళ్ళను కమ్మేసింది. ఆ 75,000 రూబుళ్ళతో తమకు ఏమేం అవసరమో, ఏమేం కొంటారో, ఎక్కడెక్కడికి వెళ్తారో కనీసం కలకూడా కనలేకపోయారు. చెప్పుకోలేకపోయారు. వాళ్ళు కేవలం 9,499, 75,000 అనే అంకెల గురించి మాత్రమే ఆలోచిస్తూ, వాటిని తమ వూహల్లో చిత్రించుకున్నారు. కానీ, అంత సులభంగా సాధ్యపడే ఆ సంతోషం గురించి మాత్రం ఎందుకో ఆలోచించలేదు.
ఇవాన్ ద్మీత్రిచ్ చేతిలో వార్తాపత్రిక పట్టుకుని చాలా సార్లు అటూ ఇటూ పచార్లు చేశాడు. మొదట్లో ఏర్పడిన అభిప్రాయం నుంచి తేరుకున్న తర్వాత కలలుకనడం మొదలెట్టాడు.
‘‘ఒకవేళ మనం గెలిస్తే?’’ అన్నాడతడు. ‘‘అదొక కొత్త జీవితం. కొత్త మలుపు… టికెట్టు నీది. ఒకవేళ నాదే అయివుంటే, అన్నిటికంటే ముందు 25,000 కు ఏదైనా స్థిరాస్థి కొంటాను. తక్షణ ఖర్చులకోసం- అంటే కొత్త ఫర్నిచర్, ప్రయాణాలు, అప్పులు తీర్చడం కోసం 10,000… తక్కిన 40,000 వడ్డీకి బ్యాంకులో దాచిపెడతాను.
‘‘అవును. స్థిరాస్థి కొనడం మంచిదే!’’ అంటూ కాలిమీద కాలేసుకుని కూచుంది భార్య.
‘‘ఎక్కడో తూలాలో, లేదా అర్యోల్ ప్రాంతాల్లో… మొదటి విషయం- దాచా (వేసవి కుటీరం) అవసరం లేదు. అంతేగాక బ్యాంకు నుంచీ ఆదాయం వస్తూనేవుంటుంది.
అతని వూహల్లో రకరకాల చిత్రాలు- ఒక దానికన్నా మరొకటి సున్నితంగా, కవితాత్మకంగా కనిపించసాగాయి. వాటన్నిట్లో అతడు తనను తాను చూసుకున్నాడు. కడుపు నిండా తిని, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, హాయిగా కూడా కనిపించసాగాడు.
అక్కడతను చల్లటి అక్రోష్క (ఒకరకమైన చల్లటి సూప్) సేవించి నది ఒడ్డున వెచ్చని ఇసుక తిన్నె మీద, లేదా తోటలో నిమ్మచెట్టు కింద వెల్లకిలా పడుకుని వున్నాడు… వేడిగా వుంది.. తన కొడుకూ కూతురూ అటూ ఇటూ పాకుతూ ఇసుకలో ఆడుకుంటూ, లేదా గడ్డిలో పురుగులు పట్టుకుంటూ వున్నారు. అతడు ఆలోచనలను కట్టిపెట్టి హాయిగా కునుకు తీశాడు. ఆరోజు, మర్నాడు, ఆ మర్నాడు కూడా తనకు ఏ పనీ లేదనిపించింది. అలా పడుకుని పడుకుని విసుగెత్తి పుట్టగొడుగులు ఏరడానికి పొలాల్లోకి, లేదా అడవిలోకి వెళ్ళాడు. లేదా రైతులు వలలతో చేపలు పట్టడం చూశాడు. సూర్యుడు అస్తమించగానే తువ్వాలు, సబ్బు తీసుకుని స్నానాల గదిలోకి వెళ్ళి నెమ్మదిగా బట్టలు విప్పి, చాలా సేపు తన ఛాతీని అరచేతుల్తో రుద్దుకుని నీళ్ళలోకి దిగాడు. నీటి నురగలో చేపలు తుళ్ళుతున్నాయి. పచ్చని నాచు ఇటూ అటూ వూగుతోంది. స్నానం ముగించిన తర్వాత టీ, జంతికలు… సాయంత్రం పొరుగువారితో కలిసి నడక లేదా షికారు…
‘‘అవును. ఒక ఎస్టేట్ కొంటే బాగుంటుంది.!’’ అంది అతడి భార్య కూడా కలలు కంటూ. ఆమె తన ఆలోచనతో మైమరిచి పోతోందని ఆమె ముఖం చూస్తే తెలుస్తోంది.
వర్షం చల్లని పానీయాలు, భారతదేశ వేసవి తర్వాతిలాంటి శరదృతువును వూహించుకున్నాడు ఇవాన్ ద్మీత్రిచ్. అలాంటి రుతువులో పూర్తిగా చల్లబడటానికి కూరగాయల మడిలో, తోటలో, నదీతీరం వెంబడి చాలాసేపు షికార్లు సాగించాలి. ఆపై ఒక పెద్ద పెగ్గు వోద్కా బిగించి, వూరబెట్టిన కుంకుమపువ్వు కలిపిన, నురుగులు దేరిన కమ్మటి పాలు సేవించాలి. లేదా మెంతి వూరగాయ నంజుకుని మరో పెగ్గు తాగాలి. పిల్లలు తాజా ముల్లంగి, క్యారెట్లు పట్టుకుని తోటలనుంచి పరుగెత్తుకొస్తారు. ఆపై సోఫాలో వాలి తీరిగ్గా ఒక బొమ్మల పత్రిక చదవొచ్చు. తర్వాత ఆ పత్రికతో ముఖాన్ని కప్పుకుని చొక్కా బటన్లు విప్పి కునుకు తీయొచ్చు.
మంచి వేసవి తర్వాత ఒక నిరుత్సాహకరమైన తుఫానులకాలం వస్తుంది. పగలూ రాత్రీ వర్షం కురుస్తుంది. ఆకులు రాలిన చెట్లు కన్నీరు కారుస్తాయి. గాలి తేమగా వుంటుంది. కుక్కలు, గుర్రాలు, కోళ్ళు- అన్నీ తడిసి విచారంగా, బెదురుతూ వుంటాయి. బయట, నడవడానికి వీల్లేకుండా వుంటుంది. ఇంట్లో మూలమూలలా తిరుగుతూ మసకబారిన కిటికీల వైపు చూస్తూ వుండాలి.. విసుగెత్తుతుంది.
ఇవాన్ ద్మీత్రిచ్ ఆగి తన భార్య వైపు చూశాడు.
‘‘మాషా! నేను విదేశాలకు వెళ్తాను!’’ అన్నాడు.
‘‘శరదృతువు చివర్లో విదేశాలకు- దక్షిణ ఫ్రాన్స్ కో, ఇటలీకో లేదా భారతదేశానికో వెళ్తే బాగుంటుందని అతడు ఆలోచించడం మొదలెట్టాడు.
‘‘నేను కూడా తప్పకుండా విదేశాలకు వెళ్తాను!’’ అంది భార్య. ‘‘అయితే టికెట్ నంబరు చూడు!’’
అతనింకా ఆలోచిస్తూనే గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతనికొక ఆలోచన తట్టింది. ఒకవేళ భార్య నిజంగానే విదేశాలకు వెళ్ళిపోతే? ఒంటరిగా ప్రయాణం చేయడం లేదా క్షణికావేశంలో బతికే లేదా బేఫికర్ గా వుండే స్త్రీల సాంగత్యంతో ప్రయాణం చేయడం ఆహ్లాదకరంగానే వుంటుంది. కానీ ప్రయాణమంతా తమ పిల్లల గురించే ఆలోచిస్తూ, మాట్లాడుతూ ప్రతి కోపెక్కూ లెక్కగడుతూ, వణికిపోతూ నిట్టూర్చేవారి సాంగత్యంలో కాదు.
ఇవాన్ ద్మీత్రిచ్ తన భార్య ఒక రైలుపెట్టెలో లెక్కలేనన్ని మూటలు, బుట్టలు, పార్సిళ్ల మధ్య వున్నట్లు వూహించుకున్నాడు. ప్రయాణం కారణంగా వచ్చిన తలనొప్పి గురించి ఎంత డబ్బు ఖర్చయిందోనని నిట్టూర్పు విడుస్తూ వేణ్ణీళ్ళకోసం, శాండ్ విచ్ ల కోసం, తాగునీళ్ళ కోసం నిరంతరం స్టేషన్ కు పరుగెడుతూ- చాలా ఖరీదుకావడం వల్ల మధ్యాహ్న భోజనం ఆమె తినలేకపోయింది…
‘‘ఆమె నా దగ్గర చివరి కోపెక్కు మిగిలేంత వరకూ లెక్కకడుతూ వుంటుంది-’’ అని భార్య వైపు చూస్తూ అనుకున్నాడు. ‘‘అది ఆమె టికెట్టు.. నాది కాదు.! అసలు ఆమె విదేశాలకు ఎందుకు వెళ్లాలనుకుంటుంది? అక్కడ ఆమె చూడనిది ఏముంది? ఆమె అక్కడ కూచుని నన్ను కళ్లెదుటినుంచి అసలు కదలనివ్వదు… నాకు తెలుసు!’’
తన భార్య ముసలిదై అందవిహీనంగా మారి ఒళ్ళంతా వంటగది వాసనతో నిండిపోయినట్లు అతడు తన జీవితంలో మొట్టమొదటిసారి గమనించాడు. అయితే తాను మాత్రం ఇంకా ఆరోగ్యంగా, యవ్వనంగా వున్నట్టు, రెండో పెళ్ళి చేసుకోగలిగే స్థితిలో వున్నట్టు అనిపించింది.
‘‘నిజానికి ఇదంతా శుద్ధ అబద్ధం!’’ అని అతడు అనుకున్నాడు. కానీ, ఆమె విదేశాలకు వెళ్తుంది. అక్కడామెకు ఏం అర్థమౌతుంది? అయినా కూడా ఆమె వెళ్తుంది.. కానీ వాస్తవానికి ఆమెకు నేపుల్స్ అయినా, క్లిన్ అయినా ఏదైనా ఒకటే. ఆమె నాకు అడ్డుగా మాత్రమే వుంటుంది. నేను ఆమెపై ఆధారపడాల్సి వస్తుంది. నాకు తెలుసు… ఆమెకు డబ్బు అందిన వెంటనే ఒక ఆడదానిలా తాళం వేసి దాచేస్తుంది. తన బంధువులకు దోచిపెడ్తుంది. నా విషయంలో ప్రతి కోపెక్కు లెక్క కడుతుంది.
ఇవాన్ ద్మీత్రిచ్ తన బంధువులను గుర్తు చేసుకున్నాడు. తన గెలుపు గురించి తెలియగానే ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అత్తయ్యలు, మామయ్యలు అందరూ బిచ్చగాళ్ళలా ప్రాధేయపడుతూ, గర్వంగా నవ్వుతూ, కపటంగా ప్రవర్తిస్తూ వస్తారు. నీచమైన మనుషులు! ఏదైనా యిస్తే ఇంకా కావాలని అడుగుతారు. నిరాకరిస్తే తిడతారు. చాడీలు చెప్తారు. రకరకాల కష్టాలు కలగాలని కోరుకుంటారు.
ఇవాన్ ద్మీత్రిచ్ తన బంధువులను గుర్తు చేసుకున్నాడు. అంతకుముందు ఉదాసీనంగా కనిపించిన వారి ముఖాలు ఇప్పుడతనికి అసహ్యంగా, ద్వేషపూరితంగా వున్నట్లు అనిపించింది.
‘‘పరమ నీచులు వాళ్ళు!’’ -అనుకున్నాడు.
అతని భార్య ముఖం కూడా అసహ్యంగా, ద్వేషపూరితంగా కనిపించడం మొదలైంది. అతని మనసులో ఆమెపై కోపం ఉప్పొంగింది. ఒక వేళ ఆమె గెలిచి వుంటే తనకు వందరూబుళ్ళు మాత్రమే ఇచ్చి మిగిలినది తాళం వేసి పెట్టేది అనిపించింది.
అతడు తన భార్యను చిరునవ్వుతో కాకుండా ద్వేషంతో చూశాడు. ఆమె కూడా అతణ్ణి ద్వేషంతో, కక్షతో చూసింది. ఆమెకు తన సొంత ఆశల కలలు, సొంత ప్రణాళికలు, సొంత ఆలోచనలు వున్నాయి. తన భర్త దేన్ని గురించి కలలు కంటున్నాడో ఆమెకు పూర్తిగా అర్థమైంది. తాను గెల్చుకున్న దానికోసం ముందుగా ఎవరు చెయ్యి చాస్తారో ఆమెకు తెలుసు.
‘‘ఇతరులను కించపరుస్తూ కలలు కనడం బాగానే వుంటుంది!’’ అని ఆమె చూపులు చెప్పాయి. ‘‘లేదు, నీకు ఆ ధైర్యం లేదు!’’
ఆమె చూపుల్లోని భావం భర్తకు అర్థమైంది. అతని గుండెల్లో ద్వేషం రేకెత్తింది. తన భార్యకు చికాకు తెప్పించడానికి అతడు వార్తాపత్రికలోని నాలుగోపేజీని త్వరగా చూసి, విజయగర్వంతో ప్రకటించాడు.
‘‘సిరీస్ 9499, టికెట్ నంబరు 46, కానీ 26 కాదు!’’
ఆశ, ద్వేషం రెండూ ఒక్కసారిగా మాయమయ్యాయి. వెంటనే ఇవాన్ ద్మీత్రిచ్ కు, అతని భార్యకు తమ గదులు చీకటిగా, ఇరుగ్గా వున్నట్లు, తాము తిన్న భోజనం సంతృప్తి ఇవ్వడానికి బదులు కడుపుపై భారం మోపినట్లు, సాయంత్రాలు సుదీర్ఘంగా విసుగు తెప్పిస్తున్నట్లు అనిపించడం మొదలైంది.
‘‘ఈ దరిద్రమేంటో!’’ అన్నాడు ఇవాన్ ద్మీత్రిచ్- కంగారుగా. ‘‘ఎక్కడ అడుగు పెట్టినా పాదాల కింద కాగితం ముక్కలు. రొట్టెముక్కలు, ఇంకా నానా చెత్త.. గదులు ఎప్పుడూ ఊడవరు! ఛీ.. ఛీ… ఈ ఇల్లు వదిలిపెట్టి పోయి కనిపించిన మొదటి ఆస్పైన్ చెట్టుకు ఉరేసుకుంటాను.’’
-1887లో ప్రచురితం
![]()
కొన్ని వివరణలు:
తూలా: రష్యాలో ఒక పట్టణం
అర్యోల్ : రష్యాలో ఒక పట్టణం
నేపుల్స్: ఇటలీలో ఒక నగరం
క్లిన్: మాస్కో ప్రాంతం అధీనంలో వున్న ఒక నగరం

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.
అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం



