• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

రష్యన్ కథ : దైవ సంకల్పం

admin by admin
May 25, 2026
in అనువాద కథలు
0
రష్యన్ కథ : దైవ సంకల్పం

రష్యన్ మూలం : లియో టాల్ స్టాయ్, (“God Sees the Truth , But Waits”)
అనువాదం : తిరువాయపాటి రాజగోపాల్

వ్లాదిమీర్ అనే చిన్న వూర్లో  ఆక్సియోనోవ్ అనే వ్యాపారి   ఉండేవాడు ; యువకుడు .   రెండు షాపులూ ,  ఒక సొంత ఇల్లూ ఉండేవి అతడికి. ఉంగరాల జుట్టు తో అందంగా , సరదాగా ఉండేవాడు.   పాటలంటే బాగా ఇష్టం ఆక్సియోనోవ్  కి. 

చిన్న వయసు లోనే తాగుడు మరిగిన ఆక్సియోనోవ్ మందు ఎక్కువైనప్పుడు బాగా గలాభా చేసేవాడు. పెళ్లయ్యాక తాగుడు తగ్గించి అప్పుడప్పుడూ మాత్రమే మందు పుచ్చుకునే వాడు.  

ఒక వేసవి కాలం లో ఏదో సంతకు బయలు దేరాలనుకున్న ఆక్సియోనోవ్ ని “ఈ రోజు వెళ్ళకు… నీ గురించి నాకు ఏదో పీడ కల వచ్చింది ”  అని  అతడి భార్య వారించింది. 

“సంతకెళితే నేను బరితెగించి పోతానని నీకు భయం లే….” అన్నాడు నవ్వుతూ భార్య తో ఆక్సియోనోవ్. 

“నా  భయం దేని గురించో చెప్పలేను  గానీ నా కొచ్చిన పీడ కల గురించి మాత్రం నాకు దిగులు గా ఉంది. టౌన్ లో సంత నుండి నువ్వు తిరిగి వచ్చాక నీ తలంతా నెరిసి తెల్లబడి పోయినట్టు కనిపించింది నాకు కలలో” అంది భార్య. 

“అది మంచి సంకేతమేలే …   తీసుకు వెళ్లిన సరుకు అంతా సంత లో అమ్మేసి నీకు కానుకలు పట్టుకొస్తా చూడు..”  అన్నాడు నవ్వుతూ ఆక్సియోనోవ్.

కుటుంబానికి వీడ్కోలు చెప్పి  సంతకు బయలు దేరి వెళ్ళాడు ఆక్సియోనోవ్.

సగం దూరం వెళ్ళాక తనకు తెలిసిన మరో వ్యాపారి కలిశాడు ఆక్సియోనోవ్ ని.  ఇద్దరూ ఆ రాత్రికి ఒకే లాడ్జి లో దిగారు. చెరో కప్పు టీ త్రాగి పక్క పక్క న ఉన్న రెండు గదుల్లోకి ఇద్దరూ నిద్ర పోయేందుకు నడిచారు. 

పొద్దెక్కిందాకా నిద్ర పోవడం ఆక్సియోనోవ్ కి అలవాటు లేదు . ఎండ పడక ముందే, చల్లగా  ప్రయాణం చెయ్యొచ్చని   తన బండి నడిపే వాడిని లేపి గుర్రాల్ని సిద్ధం చెయ్య మన్నాడు .  లాడ్జి వెనకే ఒక కాటేజ్ లో ఉన్న లాడ్జి ఓనర్ కి బిల్లు చెల్లించి  ప్రయాణం కొనసాగించిన  ఆక్సియోనోవ్  ఇరవై ఐదు మైళ్ళు వెళ్ళాక ఒక హోటల్ దగ్గర  గుర్రాలకు మేత కోసం  ప్రయాణం ఆపాడు.                                                                                                                                   కాసేపు సేద తీరి ,  ఫలహారం ఆర్డర్ చేసి హోటల్ బైటకి నడిచి చేతిలోని గిటార్ వాయించడం మొదలెట్టాడు ఆక్సియోనోవ్.

ఉన్నట్టుండి ఒక మూడు చక్రాల బండి గంటల మోత తో అక్కడికి వచ్చి ఆగింది ; అందులోంచి ఒక అధికారి దిగాడు, వెంట ఇద్దరు సైనికుల తో .

ఆ అధికారి  ఆక్సియోనోవ్ దగ్గరికి వచ్చి  ”  నీ పేరేమిటి ,  ఎక్కడ నుండి వస్తున్నావ్  ” అని ప్రశ్నించాడు. 

అధికారి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి ” నాతొ కలిసి ఒక టీ త్రాగుతారా  ” అని అన్నాడు ఆక్సియోనోవ్

కానీ ఆ అధికారి ప్రశ్నించడం ఆపలేదు 

” గత రాత్రి నువ్వు ఎక్కడఉన్నావ్..? ఒక్కడివే ఉన్నావా లేక ఇంకో వ్యాపారస్తుడెవరైనా నీతో ఉన్నాడా  ? ఈ ఉదయం ఆ వ్యాపారి ని నువ్వు చూశావా.. తెల్లారక ముందే నువ్వు అక్కడ నుంచి ఎందుకు బయలుదేరావ్ ? ”   అని అడిగాడు అధికారి. 

తనని ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారని ఆశ్చర్యం వేసినా ఆక్సియోనోవ్ జవాబులు చెప్పాడు .

 ”  నేనేదో దొంగనో , దోపిడిగాడినో అయినట్టు ఇన్ని ప్రశ్నలు నన్ను ఎందుకు అడుగుతున్నారు ; నేను నా వ్యాపారం కోసం ఈ ప్రయాణం చేస్తున్నాను , ఈ ప్రశ్నలు నన్ను అడగవలసిన అవసరం లేదు  ” అన్నాడు.

” ఈ జిల్లా పోలీసు అధికారిని నేను ..నిన్న రాత్రి నువ్వు కలిసిన ఆ వ్యాపారి గొంతు కోయబడి చచ్చాడు ..అందుకే ఈ ప్రశ్నలు…నీ వస్తువులన్నీ సోదా చెయ్యాలి  ”    అని తనతో వచ్చిన ఉద్యోగుల్ని పిలిచాడు ఆ అధికారి .

వాళ్ళు లోపలి వెళ్లి ఆక్సియోనోవ్ లగేజ్ విప్పి సోదా చేశారు . 

ఒక సంచి లోంచి బైటకు తీసిన ఒక కత్తిని తీసి ”  ఎవరిదీ ఈ కత్తి  ” అని గద్దించాడు అధికారి.

రక్తపు మరకలతో ఉంది ఆ కత్తి. ఆక్సియోనోవ్ హడలిపోయాడు.

 ” ఈ కత్తి మీద రక్తం ఎలా వచ్చింది ? ” 

ఏదో చెప్పబోయి , నోట మాట రాక  ” నాకు …నాకు తెలీదు ..నాది కాదు ”  అని గొణిగాడు ఆక్సియోనోవ్ .                  ” గొంతు మీద గాటు తో పడక మీద పడి ఉన్నాడు ఆ వ్యాపారి . అది చెయ్యగలిగింది నువ్వు మాత్రమే , ఆ లాడ్జి గది  లోపల నుంచి తాళం పెట్ట బడి ఉంది , ఇంకెవ్వరూ  లోపల లేరు…. రక్తపు మరకలు ఉన్న కత్తి నీ వద్ద వుంది… నీ ముఖ కవళికలు , నీ ప్రవర్తన నిన్ను పట్టిస్తున్నాయి …చెప్పు .నువ్వు అతణ్ణి ఎలా చంపావ్…ఎంత డబ్బు దొంగిలించావ్ … ” అన్నాడు ఆ అధికారి 

తాను ఆ పని చెయ్యలేదని ఆక్సియోనోవ్ బలంగా అన్నాడు.   తామిద్దరూ కలిసి టీ తాగింతరువాత ఆ వ్యాపారి ని చూడనే లేదని , తన సొంత డబ్బు ఎనిమిది వేల రూబుల్సు తప్ప తనవద్ద  వేరే డబ్బేదీ లేదని , ఆ కత్తి తనది కాదనీ ఆక్సియోనోవ్ అన్నాడు గానీ అతని గొంతు తడారి పోయింది, ముఖం తెల్లబడింది , తానే ఆ తప్పు చేసినంతగా అతడు వణికి పోయాడు.

ఆక్సియోనోవ్ కి సంకెళ్లు తగిలించి బండెక్కించమని అధికారి సైనికులకు ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళు అతడి కాళ్లకు బంధనాలు తగిలించి బండి కేసి తనని లాగేసరికి ఆక్సియోనోవ్ మోకాళ్ళ పైకి కూలబడిపోయి ఏడవడం మొదలెట్టాడు. అతడి దగ్గర ఉన్న వస్తువులు, డబ్బు పోలీసులు స్వాధీనం చేసుకుని టౌన్ లోని లాకప్ లో అతణ్ణి ఖైదు చేశారు. అతడి నడవడిక గురించి వ్లాదిమీర్ లో ఆరా లు తీశారు. అతడు గతం లో తాగి జల్సాలు చేసేవాడు గానీ స్వతహాగా మంచివాడేనని అక్కడి తోటి వ్యాపారులూ ఇతర నివాసితులూ చెప్పారు.

 ఒక వ్యాపారిని చంపి డబ్బు కాజేశాడనే నేరం కింద ఆక్సియోనోవ్ పై కేసు కోర్టు కు వచ్చింది.

ఆక్సియోనోవ్ భార్య కు దిక్కు తోచలేదు. ఆమె బిడ్డలు పసి వాళ్ళు…ఒకడైతే ఇంకా పాలు తాగే చిన్న బిడ్డ. వాళ్ళందర్నీ తీసుకుని ఆమె తన మొగుడు జైల్లో ఉన్న టౌన్ కి వెళ్ళింది.  భర్త ని చూడడానికి ఆమె కు వెంటనే అనుమతి దొరకలేదు గానీ అధికారుల్ని ఎంతో బతిమాలుకున్నాక  ఆమెను పెనిమిటి దగ్గరికి తీసుకెళ్లారు.  వేరే దొంగలు , నేరస్తులతో కలిసి ఖైదీ దుస్తుల్లో కటకటాల వెనక ఉన్న మొగుణ్ణి చూసి తట్టుకోలేక ఆమె స్పృహ తప్పి కిందపడి చాలా సేపటి దాకా కోలుకోలేక పోయింది. 

లేచాక బిడ్డల్ని దగ్గరకు తీసుకుని మొగుడి సమీపానికి వెళ్లి కూచుని ఇంటి దగ్గరి విషయాలేవో చెప్పి  , జరిగిందేమిటి అని భర్తని అడిగింది. ఆక్సియోనోవ్ అంతా చెప్పాడు.

 ” ఇప్పుడు ఏం చెయ్యగలం మనం…? ” అడిగింది భార్య .

”  ఒక అమాయకుడు నాశనం కాకుండా ఆపమని మనం చక్రవర్తి కి మొరపెట్టుకోవాలి ”   అన్నాడు ఆక్సియోనోవ్ 

ఆ పని తాను ఇప్పటికే చేశానని , కానీ ఆ అర్జీ అనుమతించబడలేదనీ అంది భార్య .

 జవాబేమీ లేక తల దించేసుకున్నాడు ఆక్సియోనోవ్ .

అప్పుడు ఆక్సియోనోవ్ భార్య అంది… ” గుర్తుందా నీకు , నాకు కలలో నువ్వు తల నెరిసి కనబడ్డావని నేను చెప్పిన మాట… తీసెయ్యాల్సిన మాట కాదది….ఆ పూట నువ్వు బయల్దేరకుండా ఉండాల్సింది. …భార్య తో నిజం చెప్పు… ఆ పని నువ్వు చెయ్యలేదుగా…? ” చేతి వేళ్ళతో మొగుడి జుత్తు నిమురుతూ అంది భార్య

 ”  అంటే… నువ్వూ నన్ను అనుమానిస్తున్నావా..”  భారంగా అన్న ఆక్సియోనోవ్ తన చేతుల్లో తల దాచుకుని ఏడవ సాగాడు .  అప్పుడు ఒక పోలీసు వచ్చి ఇక భార్యా బిడ్డలూ వెళ్లాలని అన్నాడు.  ఆఖరి సారిగా ఆక్సియోనోవ్ కుటుంబానికి వీడ్కోలు పలికాడు. 

వాళ్ళు వెళ్ళాక , సంభాషణ అంతా గుర్తుకు వచ్చి, తన భార్య కూడా తనని అనుమానించిందని అర్థమయ్యాక         ”  చూస్తుంటే నిజమేమిటో ఆ దేవుడు ఒక్కడికే తెలుసు లా ఉంది…చేసుకునే విజ్ఞాపన ఏదో ఆ భగవంతుడి కే చేసుకోవాలి …దయ చూపమని ఆ పరమాత్మ తో నే మొర పెట్టుకోవాలి ”  అని తనలో తాను అనుకున్నాడు ఆక్సియోనోవ్.

అంతే… ఇంకెవ్వరికీ అర్జీలు పెట్టుకోలేదు ఆక్సియోనోవ్.. ఆశ వదిలేశాడు..  ప్రార్థన మాత్రమే చేసేవాడు.   

కొరడా  దెబ్బలు తగిలించి ,  ఆ పైన గనిలో చాకిరీ చేయించాలని శిక్ష వేశారు  ఆక్సియోనోవ్ కి.  శిక్ష అమలు పరుస్తూ కొరడాతో కొట్టి , ఆ గాయాలు మానిపోయాక ఇతర ఖైదీల తో పాటు ఆక్సియోనోవ్ ని సైబీరియా ఎడారికి తరలించారు. 

ఇరవై ఆరేళ్ళు శిక్ష అనుభవించాడు ఆక్సియోనోవ్ సైబీరియా లో .  అప్పటికి అతడి తల నెరిసి పోయి తెల్ల బడింది. గెడ్డమూ నెరిసి పల్చగా పొడుగ్గా పెరిగింది . అతడి లోని చురుకు ,  చిలిపిదనం మటుమాయమై మనిషి వంగి పోయాడు.  మెల్లగా అడుగులేసేవాడు , తక్కువ మాట్లాడేవాడు , అసలు నవ్వే వాడు కాదు . తరచుగా ప్రార్థన మాత్రం చేసేవాడు.

 బూట్లు ఎలా తయారు చెయ్యాలో జైల్లో ఆక్సియోనోవ్ నేర్చుకున్నాడు.  దాంతో అతడికి కొంత సంపాదన వస్తే అది పెట్టి ‘ మహనీయుల జీవితాలు ‘ పుస్తకం కొన్నాడు . జైల్లో వెలుతురున్నప్పుడు ఆ పుస్తకం చదివేవాడు. తన గొంతు ఇంకా బాగుండడం తో ఆదివారాలు జైలు చర్చి లో బైబిల్ చదివేవాడు , ప్రార్థనా గీతాలు పాడేవాడు .

అతడి అణకువ చూసి జైలు అధికారులు అతడి పట్ల ఇష్టం గా ఉండేవారు. తోటి ఖైదీలు గౌరవంగా అతణ్ణి పితామహుడు అని , ఋషి అని పిలిచేవారు . జైలు అధికారులతో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా విన్నవించుకోవలసి వస్తే అది ఆక్సియోనోవ్ ద్వారానే చేసే వాళ్ళు ; వాళ్లలో వాళ్లకి తగాదాలేవైనా వస్తే , పరిష్కరించి తీర్పు చెప్పడానికి ఆక్సియోనోవ్ దగ్గరికే వచ్చేవాళ్ళు.                                                                                                                 ఇంటినుంచి ఏ సమాచారమూ లేదు ఆక్సియోనోవ్ కి ;  భార్యా బిడ్డలు అసలు బతికి ఉన్నారో లేదో కూడా తెలీదు అతడికి.

ఇలా ఉండగా  ఒక రోజు జైలుకి కొత్తగా శిక్ష పడ్డ ఒక గుంపు చేరింది. పాత ఖైదీలు కొత్తగా వచ్చిన వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళు ఏ ఊళ్ళనుంచి వచ్చారు , ఏ నేరాలకు వాళ్ళు జైలుకొచ్చారు అని అడిగారు. పాత ఖైదీ లతో పాటు కూచున్న  ఆ వచ్చిన వాళ్ళు చెప్పింది విన్నాడు ఆక్సియోనోవ్ .

ఎత్తుగా,  బలంగా , కత్తిరించుకున్న తెల్లటి గెడ్డం తో ఉన్న అరవై ఏళ్ల ఖైదీ తాను ఏ నేరానికి జైలు కు వచ్చాడో చెబుతున్నాడు. 

‘” గుంజకు కట్టేసిన  ఒక గుర్రాన్ని తీసుకెళ్ళినందుకు  దొంగ అంటూ నేరం మోపి నన్ను అరెస్టు చేశారు.  ఇల్లు త్వరగా చేరాలని మాత్రమే నేను ఆ గుర్రాన్ని తీసుకున్నానని , ఆపైన దాన్ని వదిలేశానని , అదీ గాకుండా ఆ గుర్రం సొంత దారుడు నా స్నేహితుడేననీ చెప్పాను.  ‘ అదేం నేరం కాదు గా ‘  అని నేనంటే ‘ ఒప్పుకోలేం ,  నువ్వు చేసింది దొంగతనమే ‘  అన్నారు వాళ్ళు.  నేను ఆ గుర్రాన్ని ఎక్కడ ఎలా దొంగిలించాను అన్నది మాత్రం వాళ్ళు చెప్పలేక పోయారు.  ఒకప్పుడు ,  చాలా కాలం కిందట… నేను  నేరం ఒకటి నిజంగా చేశాను. ఆ పనికి అప్పుడే నేను ఇక్కడికి వచ్చి ఉండాలి. కానీ అప్పుడు నేను దొరికి పోలేదు. ఇప్పుడు మాత్రం చెయ్యని నేరానికి  నన్ను జైలుకు తెచ్చారు.  …ఇంతకు ముందే నేను ఒక సారి ఈ సైబీరియా కు వచ్చాను …కానీ అప్పుడు ఎక్కువ కాలం ఉండలేదు. “

”  ఏ ఊరి వాడివి నువ్వు…” ఎవరో అడిగారు .

 ” వ్లాదిమీర్ మాది . నా పేరు మాకర్ … సెమ్యోనిచ్  అని కూడా పిలుస్తారు నన్ను. “

”  వ్లాదిమీర్ లో వ్యాపార కుటుంబం ఆక్సియోనోవ్ ల గురించి నీ కేమైనా తెలిస్తే చెబుతావా సెమ్యోనిచ్ ? “,  గుంపులోంచి అడిగాడు ఆక్సియోనోవ్ .

”  బాగానే తెలుసు … కలిగిన కుటుంబం అది …వాళ్ళ తండ్రి సైబీరియా లోనే  ఉన్నాడు , మన లానే ఏదో పాపం చేసినట్టున్నాడు …అది సరే గాని తాతా , నువ్వెలా వచ్చావ్ ఇక్కడికి ”  అడిగాడు సెమ్యోనిచ్.

తన దురదృష్టం గురించి మాట్లాడ్డం ఆక్సియోనోవ్ కి ఇష్టం లేదు.  ”  నేను చేసిన పాపాలకు ఇరవై ఆరేళ్ళు గా జైల్లోనే గడుపుతున్నాను ”  అన్నాడు నిట్టూరుస్తూ. 

” ఏం పాపాలు అవి ….? ” అడిగాడు సెమ్యోనిచ్.

” ఈ శిక్ష కు తగినవేనేమో ఆ పాడు పనులు ”  అని మాత్రం అన్నాడు ఆక్సియోనోవ్…

కానీ అతడు దేనికి సైబీరియా కు తేబడ్డాడో అతడి సహచరులు వచ్చిన ఆ కొత్త మనిషి తో చెప్పారు.  ఎవరో ఒక వ్యాపారిని కత్తితో చంపి ఆ కత్తి ఆక్సియోనోవ్ సామాను లో పెడితే అన్యాయంగా అతడికి ఎలా శిక్ష పడిందో చెప్పారు.  

” ఆశ్చర్యంగా  ఉంది …నీ వయస్సెంత ఇప్పుడు…? ”   ప్రశ్నించాడు సెమ్యోనిచ్. 

” ఆశ్చర్యం దేనికి … ఇంతకు ముందే ఆక్సియోనోవ్ ని ఎప్పుడైనా చూశావా  ”  అని అడిగారు ఖైదీలు. 

సెమ్యోనిచ్ సమాధానం చెప్పలేదు ; ” మేం ఇక్కడ కలవడం మాత్రం ఆశ్చర్యకరం ”   అన్నాడు .

వ్యాపారిని చంపింది ఎవరన్నది ఇతనికి ఏమైనా తెలుసేమో అని విస్మయంగా అనుకున్నాడు ఆక్సియోనోవ్.

 ”  ఆ ఘటన గురించి నీకు ఇదివరకే తెలిసి ఉండాలి సెమ్యోనిచ్  , లేదా నన్ను  నువ్వు చూసి ఉండాలి ” అన్నాడు ఆక్సియోనోవ్ .

” వినకుండా ఎలా ఉంటాను ? పుకార్లు చాలానే ఉండేవి  … చాలా కాలం అయింది గా , విన్నది మరచిపోయాను “

” ఆ వ్యాపారిని ఎవరు చంపారన్నది విన్నావా ఇంతకీ …? ”  అడిగాడు ఆక్సియోనోవ్.  

” కత్తి ఎవరి సంచి లో దొరికిందో అతడే చంపి ఉండాలి …ఇంకెవరో దాన్ని అక్కడ పెట్టి ఉంటే పట్టుబడే దాకా అతగాడు  నేరస్తుడు కాడు… అయినా నీ తలకింద ఉన్న సంచి లో ఇంకెవరో ఒక కత్తి ఎలా ఉంచగలరు…?  ఆ పని చేస్తున్నప్పుడు నీకు మెలకువ రావాలి గా …” నవ్వుతూ అన్నాడు సెమ్యోనిచ్.

ఈ మాటలు విన్నఆక్సియోనోవ్ ఆ వ్యాపారిని చంపింది ఖచ్చితంగా ఇతడే అయి ఉండాలి అనుకున్నాడు .

అక్కణ్ణుంచి లేచి వెళ్లి పోయిన  ఆక్సియోనోవ్ ఆ రాత్రంతా మేలుకునే ఉన్నాడు . 

చెప్పలేనంత బాధ వేసింది…మనస్సు నిండా ఏవేవో రూపాలు కదలాడాయి . సంతకు తాను బయలు దేరేముందు చూసిన అతడి భార్య రూపం ఎదురుగా ఉన్నట్టు అనుభూతి చెందాడు.   ఆమె మాటలు , నవ్వు కళ్ళకు  కనబడ్డాయి . ఇద్దరు బిడ్డలు…చిన్న ముసుగు వేసుకుని ఒకరు, తల్లి ఎదకు హత్తుకుని ఇంకొకరు కళ్ళ ముందు కదలాడారు. మంచి వయస్సు లో ఉల్లాసం గా ఉన్న తానూ తనకి స్పష్టం గా కనబడ్డాడు.

పోలీసులు తనని అదుపులోకి తీసుకునే ఆ సమయాన ఆ హోటల్ ఆవరణ లో గిటార్ వాయించుకుంటూ తాను  హాయిగా ఉన్న సన్నివేశం కూడా  కూడా జ్ఞప్తికి వచ్చింది.  తిన్న కొరడా దెబ్బలూ , కొట్టిన ఆ ఉద్యోగీ , చుట్టూ చేరి చూసిన జనం ..అందరూ మనస్సులో కనిపించారు. ఇరవై ఆరేళ్ళ తన జైలు బతుకు, రావడానికి ముందే వచ్చేసిన తన ముసలి తనమూ అన్నీ మనో నేత్రం పై కదలాడాయి.   ఆ జ్ఞాపకాలు ఎంత నరకం అనిపించాయంటే ,  ఇప్పుడే చచ్చి పొతే బావుండును అనిపించేంత.

 ”  అదంతా ఆ దుర్మార్గుడి కారణం గానే ” అనుకున్నాడు ఆక్సియోనోవ్ . తాను పోయినా సరే మాకర్ సెమ్యోనిచ్  పై పగ తీర్చుకోవాలనేంత కోపం వచ్చింది ఆక్సియోనోవ్ కి. రాత్రంతా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు గానీ అతడికి మనశ్శాంతి కుదరలేదు. రోజంతా సెమ్యోనిచ్  దగ్గరికే వెళ్ళలేదు, అతడి కేసి చూడనైనా లేదు. 

పదహైదు రోజులు గడిచాయి. ఆక్సియోనోవ్ కి రాత్రి పూట నిద్ర పట్టేది కాదు. ఏం చెయ్యాలో తెలీక సతమతమయ్యేవాడు .

ఒక రాత్రి వేళ జైల్లో నడుస్తుంటే ఖైదీలు నిద్దర పోయే ఒక అరుగు  క్రింద మట్టి పైకి వచ్చి వస్తుండడం అతడు గమనించాడు. అదేమిటో చూద్దామని ఆగాడు అతడు. ఉన్నట్టుండి అరుగు క్రింద నుంచి మాకర్ సేమ్యోనిచ్ ప్రాకుతూ బైటికి వచ్చి  ఆక్సియోనోవ్ కేసి భయంగా చూశాడు. అతణ్ణి పట్టించుకోకుండా ఆక్సియోనోవ్ ముందుకెళ్ళ బోతుంటే చేయిపట్టుకుని ఆపి , గోడ కింద తాను ఒక  బిలం త్రవ్వుతున్నాని , వెలికి  వచ్చిన మట్టిని తన బూట్లలో దాచుకుని రోజూ బైట ఖైదీలతో పని చేయించడానికి అధికారులు బైటకి తీసుకెళ్లినప్పుడు రోడ్డు మీద పడేస్తున్నా ననీ వివరించాడు  మాకర్ సేమ్యోనిచ్.

” ఇదంతా ఎక్కడా అనొద్దు పెద్దాయనా….నువ్వు కూడా జైలు నుంచి తప్పించుకోవచ్చు …నువ్వెక్కడైనా వాగి అది జైలు  అధికార్లకు తెలిసిందంటే వాళ్ళు నన్ను కొట్టి చంపుతారు …కానీ అంతకంటే ముందు నేను నిన్ను చంపుతాను “

ఎదురుగా నిలబడ్డ శత్రువు పై కోపం తో ఆక్సియోనోవ్ కు వొళ్ళు కంపించింది. తమాయించుకుని అన్నాడు … ”  నాకు బైటికి వెళ్లాలనే కోరిక లేదు , నన్ను చంపే అవసరం నీకుండదు ; చాలా కాలం కిందటే నన్ను చంపేశావు నువ్వు ! ఇక నీ గురించి చెప్పడమంటావా ఆ పని నేను చెయ్యనూ వచ్చు , చెయ్యకపోనూ వచ్చు…దైవ నిర్ణయం అది. “

ఆ తరువాతి రోజు ఖైదీలతో పని చేయించడానికి బైటికి తీసుకెళ్లినప్పుడు , ఒక ఖైదీ తన బూట్లలోంచి మట్టి రోడ్డు మీదకి పోస్తున్నది గమనించారు జైలు సిబ్బంది   . జైల్లోపల వెదికితే త్రవ్వుతున్న బిలం కనిపించింది.  ఆ పని చేసింది ఎవరని జైలు అధికారి వచ్చి ఖైదీల్ని గద్దించాడు. తమకేమీ తెలీదని వాళ్లంతా అన్నారు.  విషయం తెలిసిన కొద్ది మంది ఖైదీలు మాకర్ సెమ్యోనిచ్ కి ద్రోహం చేసి అతడి చావు కి కారణం అవడం దేనికని మిన్నకుండి పోయారు.    చివరగా ఆక్సియోనోవ్ మంచితనం తెలిసిన జైలు అధికారి ”  నిజాయితీ ఉన్న వాడివి నువ్వు . దైవం ఎదుట నిలబడి నిజం చెప్పు , ఎవరు ఆ సొరంగం త్రవ్వుతున్నది ? ”  అన్నాడు.

తనకేమీ పట్టనట్టు మాకర్ సెమ్యోనిచ్ ఇదంతా చూస్తున్నాడు .  పెదవులు కంపిస్తుంటే చాలాసేపు ఒక్క మాటైనా మాట్లాడకుండా ఉండిపోయాడు ఆక్సియోనోవ్ .  ‘ నా బ్రతుకును ధ్వంసం చేసిన అతణ్ణి  నేనెందుకు ఆదుకోవాలి ?  నేను పడ్డ బాధకు మూల్యం చెల్లించాలి వాడు…. నేను చెప్పే సాక్ష్యం తో అధికారులు వాణ్ణి చావగొట్టొచ్చు ; నా అనుమానం నిజం కాకనూ పోవచ్చు . అయినా  , అధికారులు  వాణ్ణి శిక్షించడం వాళ్ళ నాకు ఒరిగేదేమిటి ? ‘

” ఇదిగో పెద్దాయనా , నిజం చెప్పు ఆ గోడకు రంధ్రం చెయ్యడానికి ప్రయత్నించేది ఎవరు ? ”   అధికారి ఆక్సియోనోవ్ ని మళ్ళీ అడిగాడు.

” నేనది చెప్పలేనయ్యా …చెప్పకూడదు అన్నది దేవుడిఅభీష్టం …నన్ను మీరేమైనా చేసుకోండి ”   అన్నాడు ఆక్సియోనోవ్ , సెమ్యోనిచ్  వైపు ఓరగా చూస్తూ .

 ఎంత అడిగినా ఆక్సియోనోవ్ ఏమీ చెప్పకపోయేటప్పటికి ఆ విషయం అక్కడికి వదిలి వెయ్యాల్సి వచ్చింది అధికారికి.

ఆ రాత్రి ఆక్సియోనోవ్ తన పడక మీద పడుకుని కునుకు తీస్తుండగా తన పక్కన ఎవడో  వచ్చి కూర్చున్నాడు. చీకట్లో కళ్ళు సారించి చూస్తే అది సెమ్యోనిచ్  అని గుర్తించాడు . 

” ఎందుకొచ్చావ్ ఇక్కడికి ? ఇంకా ఏం  కావాలి నీకు నానుంచి ” అని అడిగాడు ఆక్సియోనోవ్. 

సెమ్యోనిచ్ బదులు చెప్పలేదు .

 లేచి కూర్చుని , ” ఏం కావాలి నీకు …వెళ్ళు  ఇక్కణ్ణుంచి ..కాదంటే నేను కాపలాదారుణ్ని పిలుస్తాను ”   అన్నాడు ఆక్సియోనోవ్.

ఆక్సియోనోవ్ వైపు తల వంచి , ” నన్ను క్షమించు ” అన్నాడు సెమ్యోనిచ్. 

“దేనికి క్షమించాలి?”  అడిగాడు ఆక్సియోనోవ్

” ఆ రోజు ఆ వ్యాపారిని చంపి , కత్తిని నీ వస్తువుల్లో పెట్టింది నేనే . నిన్నూ చంపుదామనుకున్నాను నేను …కానీ  బైట ఏదోశబ్దం వినిపించి కత్తిని నీ వస్తువుల్లో పెట్టేసి కిటికీ గుండా తప్పించుకున్నాను “

ఏం మాట్లాడాలో తెలీని ఆక్సియోనోవ్ మౌనంగా ఉండిపోయాడు . పడక మీద నుండి కిందకు దిగి సెమ్యోనిచ్   నేల  మీద  మోకరిల్లాడు .” నన్ను క్షమించు ఆక్సియోనోవ్ …దేవుడి ఆనగా నన్ను క్షమించు . ఆ వ్యాపారిని ఆ రోజు చంపింది నేనే నని ఒప్పేసుకుంటాను …నిన్ను జైలు నుంచి విడుదల చేస్తారు ..ఇంటికి వెళ్ళవచ్చు నువ్వు ”                               

“ఇప్పుడు ఈ మాటలు చెప్పడం నీకు తేలికే …కానీ ఇరవై ఆరేళ్ళు నేను అనుభవించిన బాధ కథేంటి ..  ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను …నా భార్య మరణించింది … పిల్లలు నన్ను మరిచి పోయి ఉంటారు …ఎక్కడికీ  వెళ్ళేది లేదు నేను”

సెమ్యోనిచ్  పైకి లేవ లేదు …నేలకేసి తల  బాదుకున్నాడు …”క్షమించు నన్ను ఆక్సియోనోవ్ ” ఏడుస్తూ అన్నాడు. వాళ్ళు కొట్టిన కొరడా దెబ్బలు కూడా నన్నుఇంతగా  బాధ పెట్టలేదు . నా మీద దయ తో నువ్వు వాళ్లకు నిజం చెప్ప లేదు .ఈ నీచుణ్ని క్షమించు ” అంటూ రోదించసాగాడు .

ఇది చూసి ఆక్సియోనోవ్ కి కూడా కన్నీళ్ళొచ్చాయి …

” భగవంతుడు నిన్ను క్షమిస్తాడు …ఎవరికి తెలుసు , నేను నీకంటే నీచుడిని కావొచ్చు …”  ఈ మాటలతో ఆక్సియోనోవ్ హృదయం తేలిక పడింది …ఇంటికి వెళ్లాలనే అతడి కోరిక మటు మాయమైంది.  జైల్లోంచి బైట పడాలనే ఆరాటం అంతమైంది. తన ఆఖరి శ్వాస కై ఎదురుచూపు మొదలైంది. 

ఇదంతా అయ్యాక సెమ్యోనిచ్ తన నేరాన్ని అధికారులతో ఒప్పేసుకున్నాడు.  

ఆక్సియోనోవ్ ని విడుదల చెయ్యాలనే ఆదేశం వెలువడేటప్పటికి ఆక్సియోనోవ్ తనువు  చాలించాడు.

admin
admin
sahityam.adarsini.com
Previous Post

జర్మన్ కథ : రొట్టె

Next Post

కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు

Next Post
కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు

కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు

Discussion about this post

ఈ సంచికలో…

  • బెంగాలీ కవిత: కాగితపు పడవలు
  • కెనడా కవిత : My heart soars
  • ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )
  • హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ
  • తుళు కథ : నాకూరు
  • కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు
  • రష్యన్ కథ : దైవ సంకల్పం
  • జర్మన్ కథ : రొట్టె
  • ఇంగ్లిషు కథ : వెన్నుపోటు
  • ఇంగ్లాండ్ కథ : విషవలయం
  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com