• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కథ : కంఫర్ట్ జోన్

విఎల్ నరసింహం శివకోటి by విఎల్ నరసింహం శివకోటి
June 26, 2026
in అనువాద కథలు
0
హిందీ కథ : కంఫర్ట్ జోన్

హిందీ మూలం : శ్రీ రాజేంద్ర రాజన్
తెలుగు అనువాదం :
డా. వి.ఎల్. నరసింహం శివకోటి

 

ఆరోగ్యం బాగోలేక అమ్మని ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన ప్రతిసారీ ‘ఇదే ఆఖరి విజిట్’ అనిపిస్తుంది. ఆమె ఇంక ఎంతోకాలం బతకదు అనిపిస్తుంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పిస్తాను. ఈసారి ఆమె తప్పకుండా తుది వీడ్కోలు పలుకుతుంది అని కాస్త ఊరట కలుగుతుంది. ఆమెకి సుమారు తొంభై ఏళ్ళు. మందు-మాకులు, మంచి-చెడు చూసుకుంటూ ఆమెకి చాకిరీ చేసి-చేసి నాకు విసుగొచ్చేసింది. వీలైనంత తొందరగా ఆమెను తీసుకెళ్ళిపొమ్మని ఆ భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప నాకు మరొక దారి లేకుండా పోయింది. ఆమె ముసలి శరీరం వడిలి మోడువారిపోయింది. ఆమె పట్ల నాకున్న భావోద్వేగాలు అన్నీ క్రమంగా చచ్చిపోయాయి.

ఈసారి అమ్మని ఆసుపత్రి నుండి ఇంటికి పంపుతూ డాక్టర్లు ‘మహా అయితే నెల-రెండు నెలలు’ అనడంతో నేను కాస్త ఊపిరి పీల్చుకున్నాను. ఆమె రోగనిరోధక శక్తి పూర్తిగా హరించుకుపోయింది. అవయవాలు ట్రీట్ మెంటుకు స్పందించడం లేదు. పూర్తిగా మంచంపట్టేసింది. కాళ్ళు-చేతులు కూడా కదపలేని స్థితిలో ఉంది. అమ్మ జీవితాంతం నన్ను ఎంతో ప్రేమగా పెంచి పోషించింది. ఇప్పుడు ఆమెకు నా అవసరం వచ్చేసరికి మాత్రం బాధ్యతల నుండి తప్పించుకుని పారిపోవాలని చూస్తున్నాను. ఒఠ్ఠి స్వార్థపరుడు, పనికిమలిన వెధవలా ఆమె ప్రాణాలు వీలైనంత తొందరగా పోతే బాగుండును అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంట్లో ఉన్నది ఇద్దరం – నేను-అమ్మ! నాకూ సుమారు డబ్బై ఏళ్ళు. నా శరీరం కూడా వంగిపోయింది. మంచం పట్టిన అమ్మకి సేవలు చెయ్యాలన్న ఆలోచన వస్తేనే అప్పుడప్పుడు నాకు వెన్నులో చలి పుట్టుకొస్తుంది.

ఈ కోవిడ్ మహమ్మారి వల్ల నా కష్టాలు మరీ ఎక్కువయిపోయాయి. ఈమధ్య రకరకాల దిగులు మేఘాలు నన్ను కమ్ముకుంటున్నాయి. ఈ వైరస్ ఊళ్ళోకి వ్యాపించక ముందు వరకు జనాలు వచ్చి కనీసం అమ్మని పలకరించి వెళ్తూ ఉండేవారు. సాయం చేసినా-చెయ్యక పోయినా మేం ఉన్నాం అని భరోసా ఇచ్చేవారు. ఇంకా మనుషుల మధ్య ప్రేమలూ-ఆప్యాయతలు, మనసుల్లో తడి ఉన్నాయని ధైర్యంగా ఉండేది. అదైనా పల్లెటూర్లలో. ఇక్కడ జనాలు ఇరుగు-పొరుగు కష్టంలో ఉంటే చేతనైన సాయం చేసి అండగా నిలబడతారు.

ఈ మహమ్మారి పుణ్యమా అని ఇప్పుడు జనాలు పల్లెటూర్లలో కూడా ఇరుగు-పొరుగుతో అంటీముట్టనట్టు ఉంటున్నారు. కలిసి పలకరించడానికి కూడా బెదిరిపోతున్నారు. దూరం నుండే ఒక వెర్రి నవ్వు నవ్వి చెయ్యి ఊపి చక్కాపోతున్నారు. ఈ వైరస్ వల్లనో ఏంటో తెలియదు కానీ ఈమధ్య నాకు ప్రతీ ఒక్కడూ దీనంగా,  ముఖం వేలాడేసుకుని ఉన్నట్టు కనిపిస్తున్నాడు. లోపల లోపల నాకూ బెంగగానే ఉంది. ఈ వైరస్ ఏదో నాకు అంటుకుంటే అమ్మ దిక్కులేనిది అయిపోతుంది. అన్నం-నీళ్ళు లేక అమ్మ అలా మంచం మీదే ప్రాణాలు వదిలేస్తుంది అని కొత్త భయం పట్టుకుంది. ఇంక ఆమె అంత్యక్రియలకి కూడా ఎవరూ గుమ్మం తొక్కకపోవచ్చు. ఈ భయం నన్ను లోపల-లోపల తొలిచేస్తోంది.

ఎక్కడో దూరంగా పట్నంలో ఉంటున్న కొడుకు-కోడలు ఈ లాక్ డౌన్ వల్ల ఊరు వస్తున్నారు అని శుభవార్త అందింది. కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారట. సంతోషం. ఈ లాక్ డౌన్, కర్ఫ్యూ మొదలవడానికి ఒక రోజు ముందే కొడుకు-కోడలు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు. కొడుకు తన నాయనమ్మని చూసుకుంటాడు, కోడలు ఆమెకి సపర్యలు చేస్తుంది అన్న ఆలోచనతో మనసు కాస్త కుదుటపడింది. కొండంత బలం వచ్చినట్టయింది. ఏనుగు ఎక్కినంత సంతోషంగా ఉంది.

మూత్ర విసర్జన చెయ్యాలన్నా అమ్మకి పైప్ వాడవలసిందే. గత కొన్ని రోజులుగా నేనే అమ్మకి డైపర్ మారుస్తున్నాను. కానీ ఇంక ఇదంతా నావల్ల కావట్లేదు. అమ్మకి అన్నం తినిపించడం, మంచి నీళ్ళు, జ్యూస్, టానిక్ అన్నీ చెంచాతోనే. సుమారు నెల రోజుల నుండి అమ్మతో పాటు నేను కూడా నరకం అనుభవిస్తున్నాను. కోపం, చిరాకు, నిస్సహాయతల్లో మునిగిపోయినప్పుడు నాకు తెలియకుండానే నా చెయ్యి అమ్మ గొంతు దగ్గరకి వెళ్ళిపోయేది. ఒక్కసారి గొంతు నొక్కి పడేస్తే, పీడ విరగడయిపోతుంది అనిపించేది. మళ్ళీ అంతలోనే నా చెయ్యి వెనక్కి వచ్చేసేది … పొరపాటున కానీ నేను అమ్మని చంపేస్తే జీవితాంతం కుళ్ళికుళ్ళి ఏడవాలి. త్రివేణీ సంగమంలో మునిగినా ఆ పాపం పోదు.

అమ్మని చూసుకోవడానికి కొడుకు-కోడలుని మానసికంగా సిద్ధం చేస్తూ “ఇక్కడికి వచ్చేసి మంచి పని చేసారు. నాయనమ్మని చూసుకోవడం నాకూ చాలా ఇబ్బందిగా ఉంది. ఎంతైనా కుటుంబం తోడకుంటే ఆ దారి వేరు! నువ్వు నాయనమ్మకి మందులు అవి ఇచ్చి కాస్త చూసుకుంటూ ఉండు, మిగిలిన పనులు కోడలు చూసుకుంటుంది.” అన్నాను.

“డాడీ, ఇదంతా మావల్ల కాదు. నేను పి.హెచ్.డి. కి ప్రిపేర్ అవుతున్నాను. బండెడు పుస్తకాలు మోసుకొచ్చాను. ప్రియ కూడా చాలా బిజీ. ఈ కరోనా వల్ల స్కూళ్ళు-కాలేజీలు మూసేసారని తెలుసు కదా. ఇప్పుడు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాలి. వీటికి తోడు ఇంట్లో వంట, ఇళ్ళు తుడవటం, గిన్నెలు కడగటం ఇవన్నీ ఉండనే ఉన్నాయి. మేం రావడం అయితే వచ్చాం కానీ మాకు అస్సలు టైం లేదు. చాలా టైట్ షెడ్యూల్. మాకు ఒక్కొక్క నిమిషం ఎంతో విలువైనది. ఇలాంటి పనికిమాలిన పనులకి అస్సలు టైం లేదు.”

నేను కట్రాడులా కొయ్యబారిపోయి కొడుకు వైపు చూస్తూ నిలబడిపోయాను. ఏదో ముని శాపం వల్ల శిలలా మారిపోయినట్టు అలాగే ఉండిపోయాను. కోపంతో నా ముఖమంతా కందగడ్డలా ఎర్రబడిపోయింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. కొడుకుని ఆ చెంప ఈ చెంప వాయించాలి అన్నంత కోపం వచ్చింది. అసలే నాకు కోపం ఎక్కువ. అమ్మ అనారోగ్యం గురించి దిగులుగా ఉంటే నాకు మళ్ళీ ఇదొక పిడుగుపాటు. కన్న కొడుకు మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్టు నా కోపాన్ని తారస్థాయికి తీసుకెళ్ళాయి. “మరి అలాంటప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? సుఖంగా అక్కడే ఉండలేకపోయారా? నీ పి.హెచ్.డి. ఏదో అక్కడే వెలగబెట్టాల్సింది. నీ పెళ్ళాం అక్కడి నుండి కూడా ఆన్ లైన్ క్లాసులు తీసుకోగలదు కదా! అంత మాత్రానికి ఇక్కడకి రావడం ఎందుకు?”

“డాడీ, మీకు వంటకి, ఇంటిపనికి ఇబ్బంది అవుతోంది కదా! ఏదో మాకు తోచిన సాయం చేద్దాం అని వచ్చాం.”

“ఈ పనులన్నీ నేను గత ఇరవై ఏళ్ళుగా, మీ అమ్మ పోయినప్పటి నుండి చేసుకుంటూనే ఉన్నాను. నాయనమ్మ ఏమన్నా అంటరానిదా? ఆమెకి కాస్త అన్నం తినిపించి, స్నానం చేయించి, బట్టలు, డైపర్ మార్చాలంటే మీకు నామోషీగా ఉందా? మీరేం నాకు వంట చేసి పెట్టక్కర్లేదు. ఇంటిపని కూడా ఏం చెయ్యక్కర్లేదు. నాకు మీ సాయం పిసరంత కూడా అవసరం లేదు.”

కొడుకు ముఖం వేలాడేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. బహుశా కోడలుకి నా మీద పితూరీలు చెబుతూ ఉండొచ్చు. పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే వెధవ!

నేను మంచం మీద వెల్లకిలా పడుకుని ఆలోచిస్తున్నాను. ఈ మనవణ్ణి పెంచి పెద్ద చెయ్యడానికి ఆ నాయనమ్మ ఎన్నెన్ని కష్టాలు పడిందో! భార్య పోయాక అమ్మ పెన్షన్ తో నే ఇల్లు నడుస్తోంది. నాది ఒక మోస్తరు ప్రైవేటు ఉద్యోగం. రిటైర్మెంటు బెనిఫిట్స్ అన్నీ కొడుకు పెళ్ళికి, వాడి కెరియర్ కోసం ఖర్చుపెట్టేసాను. నాలుగైదు ట్యూషన్లు, ప్రూఫ్ రీడింగ్ పని ఉండేది. కానీ వయసు మీద పడే కొద్దీ అవీ మానేసాను. అమ్మకి సుమారు పదహారు వేలు పెన్షన్ వస్తుంది. అదే మా ఇద్దరికీ ఆధారం. ఆ డబ్బుతోనే ఆమె వైద్యం కూడా. ఐదేళ్ళయింది కొడుకుకి ఉద్యోగం వచ్చి. ఇప్పటికి ఒక్క రూపాయి తండ్రి చేతిలో పెట్టిన పాపాన పోలేదు. పెళ్ళయి కూడా రెండేళ్లయింది. మొగుడు-పెళ్ళాం ఇద్దరూ గవర్నమెంటు లెక్చరర్లు. ఇద్దరికీ కలిపి నెలకి సుమారు రెండు లక్షలు జీతం వస్తుంది.

కొడుకు-కోడలు ప్రవర్తన నన్ను బాగా కుంగదీసేసింది. నేను ఎన్నడూ వాళ్ళని ఒక్క రూపాయి అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. ఇంటి ఖర్చులకి, అమ్మ వైద్యానికి కొడుకుని డబ్బులు అడగాలంటే ముఖం చెల్లేది కాదు. కొడుకు  ముందు చెయ్యి చాపాలి అంటే ఆత్మాభిమానం అడ్డొచ్చేది. అసలు ఆ ఆలోచనే నాకు కంపరంగా ఉంది. అలా చెయ్యి చాపితే నాకూ ముష్టివాడికీ ఏం తేడా లేనట్టే. అడిగిన తర్వాత వాడు డబ్బు లేదు అంటే నేను సిగ్గుతో చచ్చిపోవలసిందే.

బహుశా నా ఇబ్బందులు అన్నీ అమ్మ పసిగట్టినట్టు ఉంది. నా మనసులో మెదులుతున్న దిగులు గీతాలు ఆమె చదివేసినట్టు ఉంది. “నాయనా, ఆ చెక్క పెట్టెల్లో ఏదో ఒక పెట్టెలో కాస్త డబ్బులు జాగ్రత్త చేసిన జ్ఞాపకం. ఏ పెట్టె అన్నది గుర్తు రావట్లేదు. కాస్త చూడు అని వణుకుతున్న చేతులతో తాళాల గుత్తి నా వైపు నెట్టింది. అన్నీ తెరిచి చూడు. ఈ కష్టకాలంలో నీకు ఏమైనా ఉపయోగపడొచ్చు.”

వణుకుతున్న చేతులతో తాళాలగుత్తి తీసుకున్నాను. అంతా బాగున్న రోజుల్లో అమ్మ ఆ తాళాల గుత్తిని ఏ దిండు కిందనో లేదా డ్రెసింగ్ టేబులు సొరుగులోనో గుండెల్లో దాచుకున్నంత భద్రంగా దాచేది. ఒక్కొక్కసారి నాలుగైదు మాసిపోయిన రుమాళ్లలో కట్టి నా కంట పడకుండా దాచి పెట్టేది.

సుమారు నలభై ఏళ్ళుగా ఈ చెక్క పెట్టెలు అమ్మ ఆస్తి. నాన్న సైన్యంలో పనిచేసే రోజుల్లో ఆయుధాలు ప్యాక్ చేసిన తర్వాత మిగిలిన చెక్కతో ఈ పెట్టెలు తయారు చేసేవారు. ఒక్కొక్క పెట్టె ఇరవై-ముప్పై రూపాయల చొప్పున లెక్కలేనన్ని పెట్టెలు అమ్మి నా స్కూలు-కాలేజీ ఫీజులు కట్టడం నాకు ఇప్పటికీ జ్ఞాపకమే! సైన్యం నుండి సెలవు మీద వచ్చిన ప్రతిసారీ నాలుగైదు పెట్టెలు మోసుకొచ్చేవారు నాన్న. ఏ పెట్టెలో ఏమున్నాయో బహుశా అమ్మకి ఒక్కదానికే తెలుసు. ఇప్పుడు అమ్మ జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయింది. తాళాలు నాకు ఇచ్చింది అంటేనే జీవన సమరంలో ఓడిపోవడానికి సిద్ధపడిపోయినట్టు. ఇంట్లో ప్రతి వస్తువు పట్ల ఆమెకు ఉన్న మోహం క్రమంగా నిర్మోహంగా మారిపోతోంది.

చాలాసేపటి వరకు పెట్టెలు అన్నీ వెదికిన తర్వాత ఒక పెట్టెలో బాగా మాసిపోయిన పాత తువ్వాలులో నోట్ల కట్టలు! వాటిని లెక్కపెట్టే ధైర్యం కూడా చెయ్యలేకపోయాను. ఎంత లేదన్నా రెండు లక్షల రూపాయలు వరకు ఉండొచ్చు. ఆ కాస్త పెన్షన్ తో ఇంత ఎలా పొదుపు చెయ్యగలిగిందో అర్థం కాలేదు. ఇంత డబ్బు ఒక్కసారి కళ్ళబడినా నాకేం ఉత్సాహం అనిపించలేదు. తను చనిపోయాక అంత్యక్రియలు, కర్మకాండలు చాలా ఘనంగా జరగాలని, దానికి ఎవరి మీద ఆధార పడొద్దు అని అమ్మ చెబుతూ ఉండటం ఇప్పుడు లీలగా గుర్తొస్తోంది. అందుకే ఈ పొదుపు కార్యక్రమం అనుకుంటా! తన కర్మకాండలు ఘనంగా జరగాలన్నది అమ్మ కోరిక. తన చావుని ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని ఎన్ని కలలు కనేదో పిచ్చి తల్లి! కానీ, ఇప్పుడు ఈ సొమ్ము ఆమె చికిత్సకి, ఆమె బాగోగులు చూసుకోవడానికి ఖర్చు పెట్టబోతున్నాడు. చనిపోయాక ఏం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు?

కరోనా మహమ్మారి వల్ల ప్రతి ఇంట్లో, ఊర్లో, పట్టణాల్లో ఒక్కమాటలో చెప్పాలంటే దేశం కాదు ప్రపంచం అంతా చనిపోయిన వాళ్ళ దహన సంస్కారాల మీద విపరీతమైన ఆంక్షలు. ధార్మికమైన నమ్మకాలు, ఆచార-వ్యవహారాలు, కట్టుబాట్లకు నీళ్ళు వదిలేసిన సమయం ఇది. శవాలపట్ల జనాల తీరు చూసి ముక్కున వేలేసుకోవలసినదే. జనాలు శవాల దగ్గరకి వెళ్లడానికి, తాకడానికి, పూడ్చిపెట్టడానికి, దహనం చెయ్యడానికి కూడా పదిసార్లు ఆలోచిస్తున్న కాలం. ఈ మహమ్మారి, భయం నుండి పుట్టిన కొత్త కథలు రాస్తోంది. ఎవరైనా నర్సు, కేర్ టేకర్ లేదా సర్వెంట్ దొరికితే అమ్మ పొదుపు డబ్బులు సద్వినియోగం అవుతాయని నా ఆలోచన. ఎర్రటి ఎండలో ఎడారి ఇసుకలో నడుస్తున్న వ్యక్తి కాళ్ళకి మెత్తటి పచ్చిక తాకిన అనుభూతి. అమ్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక ఏం జరిగినా జరగకపోయినా, కనీసం ప్రాణాలతో ఉన్నప్పుడైనా ఆమెకి ఈ నరకం నుండి కాస్త ఉపశమనం దొరకాలి. ఎంతమందిని వాకబు చేసినా ఇంట్లో ఉండి అమ్మని చూసుకోవడానికి మనిషి మాత్రం దొరకలేదు. నర్సు కోసం ప్రైవేటు ఆసుపత్రిలో అడుగుదాం అంటే ఈ లాక్ డౌన్ వల్ల అవీ మూతబడ్డాయి. వేరే రాష్ట్రాలకు చెందిన స్టాఫ్ నర్సులు అందరూ సొంతూళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అటెండెంటు లేదా నర్సు దొరకడం పెద్ద సమస్య అయ్యి కూర్చొంది.

సుమారు రెండు వారాల తర్వాత ఒక స్నేహితుడి దగ్గర నుండి ఫోను వచ్చింది. అమ్మ ఉన్న పరిస్థితుల్లో ఉచ్చ-దొడ్డిక ఎత్తడం, డైపర్లు మార్చడం, మంచం మీద ఉన్న రోగిష్టి మనిషిని చూసుకోవడానికి మనుషులు దొరకడం ఎంత కష్టమో చెప్పుకొచ్చాడు. అంతా చెప్పి, ఒక ఆడమనిషి ఉన్నట్టు, అయితే ఇక్కడికి పాతిక-ముప్పై మైళ్ళ దూరంలో ఒక పల్లెటూర్లో ఉంది అని చెబుతూ సరిగ్గా స్క్రీనింగ్, టెస్టులు అన్నీ చేయించి తీసుకొచ్చుకోవాలి. ఆమెకి ఈ-కోవిడ్ పాసు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లాక్ డౌన్ వల్ల ఆమె చేస్తున్న చిన్నపాటి ఉద్యోగం కూడా పోయింది. డబ్బుకి బాగా కటకటగా ఉంది. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. కచ్చితంగా ఒప్పుకుని తీరుతుంది అని చెప్పాడు ఆ మిత్రుడు.

నా సంతోషానికి హద్దులు లేవు. కోవిడ్ పాసులు దొరుకుతున్నాయి. అదేం పెద్ద సమస్య కాదు. స్వయంగా కారు పంపి ఆమెను తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. నెలకి 12 వేలు అడుగుతోంది. జనాలు ఎంత కష్టాల్లో ఉన్నా ఎదుటివాడి నుండి డబ్బులు రాబట్టడానికి మాత్రం వెనకాడరు. గత్యంతరం లేక ఒప్పుకున్నాను. అమ్మ మాత్రం ఉండేది ఇంక ఎన్నాళ్ళు! ఆమె పొదుపు డబ్బులు ఆమెకి అక్కరకు వస్తున్నాయి. అంతకంటే కావల్సింది ఏముంది!

ఈ కొత్త పనిమనిషి విషయం ఒకసారి కొడుకు చెవిన వేస్తే నయం అనిపించింది. “డాడీ, మీ నిర్ణయం తప్పు. ఆమెకే వైరస్ ఉంటే? డబ్బు ఇచ్చి తద్దినం కొనుక్కున్నట్టు కాదా! అసలు ఆమె ఎవరో, ఎలాంటిదో, ఏం కులమో ఏం తెలియకుండా ముక్కుమొహం తెలియని మనిషిని ఇంట్లో ఎలా పెట్టుకుంటాం? ఊరి సర్పంచి కూడా ఒప్పుకోడు. ఈ కర్ఫ్యూ వల్ల రెండు కిలోమీటర్లు మించి వేరే ఊరివాళ్ళు ఊళ్ళోకి రావడానికి కుదరదు. చట్టం ప్రకారం, డి.ఎమ్.ఏ. అంటే డిస్ట్రిక్ట్ మేనేజిమెంట్ యాక్ట్ ప్రకారం ఈ మహమ్మారి సమయంలో ఒక ఊరివాళ్ళు మరొక ఊళ్ళోకి రావడం నేరం.”

“అయితే ఇప్పుడు ఏం చెయ్యమంటావు? నాయనమ్మ పీక నొక్కెయ్యమంటావా? మీ మొగుడు-పెళ్ళాలు ఇద్దరూ ఏదో పెద్ద లార్డు గారి అమ్మ మొగుళ్లులా ఇంట్లో తిని కూర్చుంటున్నారు. అసలు మీరే సరిగ్గా ఉంటే ఈ కేర్ టేకర్ అవసరం ఏముంది? మీలో ప్రేమ-ఆప్యాయతలు చచ్చిపోయాయి.”

“డాడీ, ప్లీజ్ ట్రై టు అండర్ స్టాండ్ విద్ ఏ కూల్ మైండ్. వేరే ఏమైనా ఉపాయం ఆలోచిద్దాం. నేను ప్రియతో, వేరే స్నేహితులతో మాట్లాడి వేరే దారి ఏదైనా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను.”

మర్నాడు సాయంత్రం కొడుకు నా గదిలోకి వచ్చాడు. కుర్చీలో కూర్చోబోతూ లైట్ ఆన్ చేసాడు. గది అంతా వెలుగు పరుచుకుంది. నేను గంభీరంగా ఆలోచిస్తూ మంచం మీద పడుకుని ఉన్నాను.

“డాడీ, మనం కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మంచిది. నాయనమ్మ నరకం అనుభవిస్తోంది. చాలా కష్టపడుతోంది. అసలు ఆమె ఒక జీవచ్ఛవంలా ఉంది. ‘మెర్సీ కిల్లింగ్’ కోసం కోర్టులో అర్జీ పెట్టుకోవడం ఉత్తమం. లేదంటే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించవచ్చు… ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి …. నేను నోరు విప్పితే మీరు నొచ్చుకుంటారు.”

కొడుకు మాటలు విని నేను కొయ్యబారిపోయాను. వాడు ఇంతలా ఎలా దిగజారిపోగలడు? సొంత నాయనమ్మ పట్ల ఇంత క్రూరంగా, దుర్మార్గంగా ఎలా ఆలోచించగలడు? అసలు ఇలాంటి సలహాలు ఇవ్వడానికి వాడికి సిగ్గనిపించడం లేదా? అంటే కొడుకు, కోడలు మనసులో ప్రేమ, అనురాగాలు-ఆప్యాయతలు అన్నీ సమాధి అయిపోయాయా?

“డాడీ, ఐ నో యు విల్ టేక్ మై ఒపినియన్ అండ్ సజెషన్స్ ఏజ్ క్రూయాలిటీ. ఈ వైరస్, ప్రపంచంలో లక్షలాది మందిని మింగేసింది. సెంటిమెంట్స్, డిగ్నిటీ, అంత్యక్రియలు, కర్మకాండలు – వీటికి అర్థం లేకుండా పోయింది. ఇవాళ మనిషిని పశువుకంటే హీనంగా చూస్తున్నారు. అసలు మనం ఎంత వరకు సురక్షితంగా ఉన్నామో కూడా అనుమానమే. ఈ మాయదారి వైరస్ మనల్ని ఎప్పుడు చుట్టుకుంటుందో చెప్పలేం. అందుకే బతికినన్ని రోజులు, ఎలాంటి డిప్రెషన్ లేకుండా బతకాలి. ఒకపక్క ఈ మహమ్మారి, మరొక పక్క నాయనమ్మ అనారోగ్యం …. ఇది చాలదన్నట్టు ఈ లాక్ డౌన్ …  అసలు ఇది కూడా ఒక జీవితమేనా? ఇలాంటి పరిస్థితిల్లో నాయనమ్మకి వీడ్కోలు చెప్పడమే సరైన నిర్ణయం. మీరు మనసులో నన్ను ఎంత తిట్టుకుంటున్నారో అర్థం చేసుకోగలను. మా ఇద్దర్నీ ఇంట్లో నుండి వెళ్లగొట్టినా ఏం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మీరు పాత తరం వాళ్ళు. ఎమోషన్స్ అనే శవాన్ని భుజాన వేసుకుని తిరుగుతూ మీ జీవితంతో పాటు మీ తోటి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసేస్తారు. ఇంక మనం ఈ సో-కాల్డ్ సెంసిటివిటీ పీడ వదిలించుకోవాలి.”

నాకు అరికాలి మంట నెత్తికెక్కింది. కోపం ఆపుకోలేక ‘యూ బాస్టర్డ్’ అంటూ కొడుకు చెంప ఛెళ్ళుమనిపించాను. “హౌ యూ డేర్ టు టాక్ దిస్ నాన్సెన్స్. వెంటనే మీరిద్దరూ కోవిడ్ పాస్ తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అండ్ గెట్ లాస్ట్ నౌ. మళ్ళీ ఇంకొక సారి నా ఇంటి గడప తొక్కితే మర్యాద దక్కదు!”

నేను ఒక్కనాటికి ఓటమిని అంగీకరించను. ఊర్లో ఇంటింటికి తిరిగాను. సర్పంచిని కూడా కలిసాను. పెద్దవాళ్లు, ఆడవాళ్ళతో కూడా నా కథ చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాను. అందరూ కపట సానుభూతి చూపిస్తూ – “నాలుగు రోజులు ఓపిక పట్టు. కాస్త పరిస్థితులు చక్కబడగానే అమ్మని చూసుకోవడానికి ఎవరైనా నర్సునో, పనిమినిషినో పిలిపిద్దాం” అని కల్లబొల్లి మాటలు చెప్పేవాళ్ళే. “నీ కొడుకు-కోడలుకి ఆ మాత్రం బాధ్యత లేదా? వాళ్ళేం చేస్తున్నట్టు? వాళ్ళేమైనా పక్షవాతం వచ్చి మంచం పట్టి ఉన్నారా? అలాంటి కొడుకు ఉండి ఏం లాభం? వెళ్ళగొట్టు ఇంట్లో నుంచి” అని ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు.

ఊరంతా బికారిలా తిరిగినా ఒక్కళ్ళు కూడా నా బాధ అర్థం చేసుకున్న పాపాన పోలేదు. అందరూ మొసలి కన్నీరు కార్చేవారే. ఉచిత సలహాలు ఇచ్చి నా బాధ ఇంకా పెంచేవాళ్ళే. వేరే ఊరి నుండి ఆ ఆడమనిషిని తీసుకు రావడానికి మాట సాయం చెయ్యడానికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ముందుకు వస్తే ఒట్టు! ఇప్పుడు ఆమె వస్తే ఊర్లో అందరి ప్రాణాలూ పోతాయి అన్నంత భయపడిపోతున్నారు. నిజంగా చావు భయం, ఎంత భయంకరమైనదో! ఈ మృత్యు భయం బంధాలు-అనుబంధాలని తుత్తినియలు చేసేసింది. జీవితంలో మొట్టమొదటిసారి నా నిస్సహాయత మీద నాకే జాలేసి ఏడుపొచ్చింది. కనీసం భుజం మీద తలవాల్చి మనసారా ఏడవటానికి అంత పెద్ద ఊరులో నా అనుకునే ఒక్క మనిషి కూడా లేడు.

వణుకుతున్న చేతులతో అమ్మ డబ్బులు మూటగట్టి పెట్టిన ఆ నల్ల, పాత పెట్టె తెరిచాను. మూట విప్పి నిస్సహాయత వల్ల వచ్చిన కోపంతో ఆ నోట్ల కట్టలని బయటకి తీసి విసిరేసాను. ఆమె ఎన్నో ఏళ్ళుగా కూడబెట్టిన ఆ నోట్ల మధ్య నేను తల దించుకుని నిలబడ్డాను. నోట్లన్నీ నేలమీద చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. అవి నన్ను చూసి నవ్వుతున్నట్టు, వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. అమ్మకి సంతోషాలు కొనడంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టాను. చెయ్యని తప్పుకు నేరం ఒప్పుకున్న వాడిలా మౌనంగా ఇంటి పైకప్పు వైపు చూస్తూ అలాగే ఆ నోట్ల మధ్య కుప్పకూలిపోయాను.

విఎల్ నరసింహం శివకోటి
విఎల్ నరసింహం శివకోటి
Previous Post

రష్యన్ కథ: భయం

Discussion about this post

ఈ సంచికలో…

  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం
  • ఆంగ్ల కవిత : విడిచిన బాట
  • కన్నడ కథ:  నిర్ణయం
  • వాయిదా పడిన కలయిక!
  • ఆంగ్ల కవిత : విరామం
  • కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • బెంగాలీ కవిత: కాగితపు పడవలు
  • కెనడా కవిత : My heart soars
  • ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )
  • హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ
  • తుళు కథ : నాకూరు
  • కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు
  • రష్యన్ కథ : దైవ సంకల్పం
  • జర్మన్ కథ : రొట్టె
  • ఇంగ్లిషు కథ : వెన్నుపోటు
  • ఇంగ్లాండ్ కథ : విషవలయం
  • ఆంగ్ల కవిత : బందీ 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com