హిందీ మూలం: హరీష్ చంద్ర పాండే
తెలుగు సేత: ఆర్ శాంత సుందరి
సీతాకోకచిలుకకేం
ఎక్కడైనా వాలుతుంది అది
అగ్ని పర్వతాలూ, ఆటుపోట్లూ, కఠినమైన వజ్రాలూ
దానికి పనికొచ్చే పదాలు కావు
దానికోసమేనేమో అన్నట్లుంటాయి
పువ్వులూ , పరాగమూ , చిగురాకులూ లాంటి పదాలు
అది విహరించేది కూడా భూమికి జానెడు ఎత్తునే
ఇప్పుడే వచ్చి వాలింది ధ్యానంలో ఉన్న ఒక యోగి జడలమీద
అక్కడినుంచి ఎగిరి వెళ్లి ఆరవేసి ఉన్న ఒక చీర అంచుల మధ్య వయ్యారాలు పోయింది
తరవాత వెళ్లి కూర్చుంది ఒక ఎద్దు వీపుమీద
అది వీపు విదిలించేసరికి
వెళ్లి వాలింది నిద్రపోతున్న ఒక పిల్లవాడి చెవి మీద
పారిపోయింది మళ్ళీ వాడి వేలు తాకే లోపల
సీతాకోకచిలుకకేం ఎక్కడైనా వాలుతుంది
మళ్ళీ ఒకసారి వెళ్లి యోగి తలమీద వాలింది
గిరిధరుడి తలమీది నెమలి పింఛమా అన్నట్లుంది
బూడిద మీద ఎంత అందమైన రంగుల వర్షమో !
వైరాగ్యం మీద అనురాగం ఎంతగా శోభిల్లుతోందో !!
యోగి పరలోకం ధ్యాసలో ఉన్నాడు పరధ్యాన్నంగా ! ***
హిందీ కవి హరీష్ చంద్ర పాండే ఎన్నో కథా సంపుటాలూ , కవితా సంపుటాలూ , బాలసాహిత్యం రాసారు. 1952 లో ఉత్తరాఖండ్ లో పుట్టారు . సాహితీ పురస్కారాలు అందుకున్నారు . అలహాబాద్ లో సీనియర్ మోస్ట్ అకౌంటెంట్ గా పదవీ విరమణ చేసారు.































