బొల్లిముంత వెంకట రమణా రావు
ఉదయం పూర్తిగా మేలుకోకముందే మాల్గుడి రైల్వే స్టేషన్ తన రోజు మొదలుపెట్టింది. ప్లాట్‌ఫామ్ మీద రాత్రి తేమ ఇంకా మెరుస్తోంది. టీ దుకాణం పొయ్యి నుంచి పైకి లేస్తున్న పొగలో అల్లం, టీ ఆకుల వాసన కలిసిపోయి గాలినంతా గుమగుమలతో నింపుతోంది. ఆ వాసనను ఆస్వాదిస్తూ, స్టేషన్ బెంచీపై ఆర్.కె. నారాయణ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. చేతిలో నోట్‌బుక్ ఉంది; కానీ కలం మాత్రం కదలడం లేదు.
అతని చూపు మాత్రం కదులుతూనే ఉంది. సామాన్లు మోస్తున్న పోర్టర్లు, పత్రికల కట్టలు విప్పుతున్న బాలుడు, టీ గ్లాసు కోసం ఎదురు చూస్తున్న వృద్ధుడు, రైలు సమయం కోసం గడియారం చూస్తున్న యువకుడు—ప్రతి ఒక్కరూ నారాయణ్ దృష్టిలోకి వస్తున్నారు. ఎవరి తొందర వెనుక ఏ కథ ఉందో, ఎవరి మౌనం వెనుక ఏ ఆలోచన ఉందో తెలుసుకోవాలన్నట్టు ఆయన వాళ్లను గమనిస్తున్నాడు. మాల్గుడిలో కథలు వెతకాల్సిన అవసరం ఆయనకు ఎప్పుడూ లేదు; అవి మనుషుల రూపంలో ఎదురుగా వచ్చి కూర్చుంటాయి.
ఒకసారి ఆయన తన మాల్గుడి గురించి చెప్పిన మాట గుర్తుకొచ్చింది—అది ఏ మ్యాప్‌లోనూ కనిపించని కల్పిత పట్టణం; కానీ దాని లక్షణాలు ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తాయని. ఆ మాటకు అర్థం ఇప్పుడు ఆయనకు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిన్న రైల్వే స్టేషన్లో కూర్చున్న మనుషుల ముఖాల్లో ఏ పట్టణాన్నైనా చూడవచ్చు.
అప్పుడే వెనుక నుంచి ఒక పరిచితమైన స్వరం వినిపించింది.
“హే, నారాయణ్! ఎలా ఉన్నావు?”
నారాయణ్ హాశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసాడు. ఆర్.కె. లక్ష్మణ్ చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. చేతిలో చిన్న బ్యాగ్, ముఖంలో ఎప్పటిలాగే చిలిపి నవ్వు నిండిన ప్రశాంతత. ఇద్దరూ కాసేపు మాటలేకుండా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.
“లక్ష్మణ్! నువ్విక్కడ?” అన్నాడు నారాయణ్.
“నీ మాల్గుడిని చూడకుండా ఎలా వెళ్తాను? కొద్దిసేపు ఇక్కడ ఆగాను. ఇప్పుడు బొంబాయికి వెళ్తున్నాను. పని ఉంది,” అన్నాడు లక్ష్మణ్. పక్కనున్న టీ దుకాణం వైపు చూసి, “నీ మాల్గుడి చాలా బాగుంది. ఉదయపు ఈ వాసన… టీ వాసన… నాకు చాలా నచ్చాయి. పైగా నిన్న తిన్న స్వీట్లు! చాలా రుచిగా ఉన్నాయి. మాల్గుడి స్వీట్లను మర్చిపోలేను,” అన్నాడు.
“స్వీట్లు నచ్చాయంటే మాల్గుడి నిన్ను అంగీకరించినట్టే,” అని నారాయణ్ నవ్వాడు.
“స్వామిని కలిశావా?” అని లక్ష్మణ్ అడిగాడు.
“ఇంకా లేదు.”
“అయితే నా తరఫున స్వామికి నా ఆశీస్సులు చెప్పు. అతని స్నేహితులకూ చెప్పు. వాళ్లు ఇప్పటికీ నీ మాల్గుడి వీధుల్లో తిరుగుతున్నారో లేదో చూడాలి.”
“వాళ్లను చూస్తే నువ్వే గుర్తొస్తావు,” అన్నాడు నారాయణ్.
“నన్ను కాదు, నా కార్టూన్లను గుర్తు చేసుకుంటారు,” అని లక్ష్మణ్ నవ్వాడు.
లక్ష్మణ్ పక్కనే ఒక చెక్స్ దుస్తుల వేసుకొని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. సాధారణ దుస్తులు, చేతిలో పాత బ్రీఫ్‌కేస్, ముఖంలో అమాయకత్వం. కానీ కళ్లలో మాత్రం చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని గమనించే అలవాటు. అతను లక్ష్మణ్ స్నేహితుడు. నిరంతరం అతనితోనే ప్రయాణిస్తున్న సామాన్యుడు. అతను పక్కన లేకపోతే కుంచె గీత కదలదు.
“ఇతను నీకు తెలుసా అని లక్ష్మణ్ పరిచయం చేశాడు. “ఎక్కడికి వెళ్లినా సమాజం గురించి ఏదో ఒకటి ఆలోచించి నాకు చెప్పకపోతే ఇతనికి నిద్ర పట్టదు.”
నీ’ మిత్రుడు ‘కామన్ మాన్’ నాకు తెలుసు అన్నాడు నారాయణ్.
సామాన్యుడు నారాయణ్ వైపు చూసి నవ్వాడు. “మీ మాల్గుడిలో కూడా మా సమస్యలే కనిపిస్తున్నాయి. ధరలు పెరుగుతాయి. జీతాలు మాత్రం వాటి వెనుక పరుగెత్తుతాయి. క్యూలు పెరుగుతాయి. వేచి ఉండే సమయం పెరుగుతుంది. మనుషులు మాత్రం ‘ఇదంతా ఎప్పటినుంచో ఇలాగే ఉంది’ అని చెప్పుకుంటూ వెళ్లిపోతారు.”
“అందుకే నువ్వు లక్ష్మణ్‌తో తిరుగుతున్నావా?” అని నారాయణ్ అడిగాడు.
“ఆయన గీత గీస్తారు. నేను దాని లోపల ఉన్న మనిషిని గుర్తు చేస్తాను,” అన్నాడు సామాన్యుడు.
అంతలో దూరంగా రైలు విజిల్ వినిపించింది. ప్లాట్‌ఫామ్‌పై ఒక్కసారిగా కదలిక పెరిగింది. పోర్టర్లు పరుగులు తీశారు. ఎదురు చూస్తున్న ప్రయాణికులు తమ సామాన్లు సర్దుకున్నారు. టీ దుకాణం దగ్గర కాసేపటి క్రితం నెమ్మదిగా సాగిన ఉదయం ఒక్కసారిగా వేగం పుంజుకుంది.
“అదిగో, నా రైలు వచ్చేస్తోంది,” అన్నాడు లక్ష్మణ్.
రైలు ప్లాట్ఫామ్లోకి నెమ్మదిగా ప్రవేశించింది. లక్ష్మణ్ బ్యాగ్ తీసుకున్నాడు. సామాన్యుడు తన బ్రీఫ్‌కేస్‌ను సర్దుకున్నాడు.
“మళ్లీ కలుద్దాం, నారాయణ్.”
“తప్పకుండా.”
“మాల్గుడిని జాగ్రత్తగా చూసుకో,” అన్నాడు లక్ష్మణ్.
నారాయణ్ నవ్వాడు. “మాల్గుడిని నేను కాదు. ఇక్కడి మనుషులే చూసుకుంటున్నారు.”
“అదే దాని అదృష్టం,” అన్నాడు లక్ష్మణ్.
బోగీ ఎక్కే ముందు మరోసారి వెనక్కి తిరిగి, “స్వామికి నా ఆశీస్సులు చెప్పడం మర్చిపోకు. అతని స్నేహితులకూ చెప్పు,” అన్నాడు.
“చెబుతాను.”
“బై, నారాయణ్!”
“బై, లక్ష్మణ్!”
సామాన్యుడు కిటికీ దగ్గరకు వచ్చి చేయి ఊపాడు. రైలు కదిలింది. లక్ష్మణ్ ముఖం కిటికీలో కనిపిస్తూ క్రమంగా దూరమైంది. సామాన్యుడు కూడా చివరివరకు ప్లాట్‌ఫామ్ వైపు చూస్తూనే ఉన్నాడు. రైలు మలుపు తిరిగి కనుమరుగయ్యాక నారాయణ్ మళ్లీ తన బెంచీపైకి వచ్చి కూర్చున్నాడు.
స్టేషన్ మళ్లీ తన పాత లయలోకి వచ్చింది.
మర్రిచెట్టు కింద ఒక జ్యోతిష్కుడు పంచాంగం తెరిచి కూర్చున్నాడు. అతని ముందు ఒక యువకుడు ఆత్రుతగా నిలబడి ఉన్నాడు.
“నా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?” అని అడిగాడు.
జ్యోతిష్కుడు అతని అరచేతిని చూసి, “త్వరలో,” అన్నాడు.
“ఎంత త్వరలో?”
జ్యోతిష్కుడు పంచాంగం మూసి, “నువ్వు ఎదురు చూడటం మానేసేలోపు,” అన్నాడు.
యువకుడి ముఖంలో నిరాశా, కోపమా అన్నది అర్థం కాలేదు. అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నారాయణ్ మాత్రం చిరునవ్వు నవ్వాడు. భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆత్రుత మనిషిలో ఎప్పుడూ ఉంటుంది. కానీ తన ముందున్న జీవితాన్ని గమనించడానికి మాత్రం అతనికి సమయం ఉండదు.
అంతలో ఒక ప్రయాణికుడు దారి తెలియక అటూ ఇటూ చూశాడు.
“మాల్గుడిలో మంచి హోటల్ ఎక్కడుంది?” అని పక్కనే ఉన్న యువకుడిని అడిగాడు.
“నేను చూపిస్తాను,” అన్నాడు ఆ యువకుడు. “ఈ మాల్గుడి నాకు బాగా తెలుసు. నేను గైడ్‌ని.”
నారాయణ్ ఆ మాట విని అతని వైపు చూశాడు.
ఆ స్వరంలో ఆయనకు ఒక పాత పరిచయం వినిపించింది.
రాజు.
Railway Raju.
ఇతరులకు మాల్గుడి దారి చూపించే ఆ మనిషి తన జీవితంలో మాత్రం ఎన్ని మలుపులు తిరిగాడో నారాయణ్‌కు తెలుసు. కొద్దిదూరంలో Rosie కనిపించింది. తన కళ గురించి మాట్లాడుతున్న ఆమె ముఖంలో అదే ఆత్మవిశ్వాసం. నారాయణ్ వాళ్లను చూస్తూ మౌనంగా నవ్వుకున్నాడు.
ప్లాట్‌ఫామ్ మరో చివర కొందరు యువకులు వాదించుకుంటున్నారు.
“ముందు ఉద్యోగం.”
“ముందు డిగ్రీ.”
“డిగ్రీ తర్వాత ఉద్యోగం.”
“ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి.”
“పెళ్లి కంటే ముందు ప్రేమ ఉండాలి.”
వాళ్ల వాదనకు అంతు కనిపించలేదు. నారాయణ్ వాళ్లను చూస్తూ The Bachelor of Artsలోని చంద్రన్‌ను గుర్తు చేసుకున్నాడు. కాలం మారిపోయింది. చేతుల్లో పుస్తకాల స్థానంలో మొబైల్ ఫోన్లు వచ్చాయి. కానీ యువకుడి మనసులోని అయోమయం మాత్రం పెద్దగా మారలేదు.
కొద్దిదూరంలో మరో ముగ్గురు వ్యక్తులు డబ్బు గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. ఒకరి చేతిలో లెక్కల పుస్తకం. మరొకరి చేతిలో రశీదుల కట్ట. మూడోవాడు వడ్డీ గురించి ఏదో చెబుతున్నాడు.
“ఇంతకు అసలు లాభం ఎంత?”
“లాభం కంటే ముందు మూలధనం.”
“మూలధనం పెరగాలంటే అప్పు కావాలి.”
మధ్యలో కూర్చున్న వ్యక్తి మాత్రం ఒక్కో సంఖ్యను జాగ్రత్తగా లెక్కపెడుతున్నాడు.
నారాయణ్ ఒక్కసారి చూసి గుర్తుపట్టాడు.
మార్గయ్య.
The Financial Expertలోని మార్గయ్య. డబ్బు గురించి మాట్లాడే ముగ్గురి మధ్య కూర్చున్నా, నిజానికి సంభాషణ మొత్తం తన లెక్కల చుట్టూనే తిరిగేలా చేస్తున్నాడు. నారాయణ్ అతని దగ్గరకు వెళ్లలేదు. కొన్ని పాత్రలను పలకరించకుండా దూరం నుంచే చూడటం రచయితకు మరింత ఆనందం.
ఇంతలో ఒక పిల్లవాడు తండ్రి చేతిని లాగుతూ, “నాన్నా, రైలు ఎప్పుడు వస్తుంది?” అని అడిగాడు.
తండ్రి గడియారం చూసి, “ఇంకా సమయం ఉంది,” అన్నాడు.
“ఎంత సమయం?”
“కొంచెం.”
పిల్లవాడు మళ్లీ పట్టాల వైపు చూశాడు.
నారాయణ్ ఆ దృశ్యాన్ని చూస్తూ తన నోట్‌బుక్ తెరిచాడు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న పేజీపై కలం పెట్టాడు. రాయడానికి ముందు మరోసారి చుట్టూ చూశాడు.
జ్యోతిష్కుడి దగ్గర భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువకుడు.
మాల్గుడికి దారి చూపుతున్న గైడ్.
జీవితానికి దారి వెతుక్కుంటున్న యువకులు.
డబ్బు లెక్కల్లో మునిగిపోయిన మార్గయ్య.
టీ దుకాణం దగ్గర స్వీట్ల రుచి గురించి మాట్లాడుతున్న ప్రయాణికులు.
వీళ్లందరూ ఒకే ఉదయంలో, ఒకే స్టేషన్లో తమ తమ కథలు రాస్తున్నారు.
నారాయణ్ నెమ్మదిగా రాశాడు:
“మాల్గుడి ఒక ప్రదేశం కాదు; మనుషులు తమ జీవితాలను ఆవిష్కరించె ఆత్మకథ.”
అతను రాసిన వాక్యాన్ని కాసేపు చూస్తూ ఉన్నాడు.
దూరంగా మరో రైలు విజిల్ వినిపించింది.
ప్లాట్‌ఫామ్‌పై మళ్లీ కదలిక మొదలైంది.
ఎవరో వచ్చారు. ఎవరో వెళ్లారు. ఎవరో కలిశారు. ఎవరో విడిపోయారు. టీ దుకాణం నుంచి మళ్లీ అదే వాసన వచ్చింది. నారాయణ్ కాసేపు కళ్లుమూసుకుని ఆ వాసనను ఆస్వాదించాడు.
ఉదయం ఇంకా పూర్తిగా ముగియలేదు.
మాల్గుడి ఇంకా మాట్లాడుతూనే ఉంది.
నారాయణ్ మాత్రం తన బెంచీపై కూర్చుని వింటూనే ఉన్నాడు.
మరో కొత్త కథ అతని కోసం ఎదురు చూస్తుంది.
(అక్టోబర్ 10th ఆర్.కే.నారాయణ్ జయంతి)
తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్.ఎమ్) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.
ఇప్పటివరకు 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్సైట్లలో ప్రచురితమయ్యాయి. 2002లో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు.
సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రచనతో పాటు AI ఆర్ట్‌పై ఆసక్తి కలిగి, పజిల్స్‌ను రూపొందించడం, వాటిని సృజనాత్మకంగా మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటున్నారు.
ఆయన విద్యార్హతలు: M.A. (Sociology, English, Psychology), B.Ed., P.G. Diploma in Journalism and Mass Media.































