హిందీ మూలం : సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా (పోస్టర్ ఔర్ ఆద్మీ)
అనువాదం : డా. దండిభొట్ల నాగేశ్వరరావు
భారీ ఆకారంలోని పెద్ద- పెద్ద పోస్టర్ల ముందు..
పొట్టిగా, కుదించుకుపోయినిల్చుని-
వాటితో నన్ను నేను పోల్చి చూసుకుంటున్నా!
ఒక పెద్ద గుంపు- ఆ పోస్టర్లవంకకు కదలిపోతోంది.
ఏడుస్తూ, నవ్వుతూ – ఎగిరిగంతులేస్తూ,
ఏదో వేగం, ఏదో తోపులాట.. ఆ పోస్టర్లకు నలుదిక్కులా!
కానీ అవి మాత్రం మౌనంగా…
వాటన్నిటి ముఖాల పైనా ఒకే తరహా భావాలు..
రంగులు నిండుగా నింపుకుని, హొయలు పోతూ, తుళ్లిపడుతూ,
అందరికీ ఆకర్షణ కేంద్రాలై,
అవన్నీ ఒక్క చోటనే నిలబడి ఉన్నాయి.
పోస్టర్లు – భారీ ఆకారంలోని పోస్టర్లు !!
జనం వాటిని చూసి నవ్వుకుంటున్నారు,
మొగమింత చేసుకుని ఈలలేస్తున్నారు… మళ్లీ అంతలోనే చింతిస్తున్నారు!
ఆడవాళ్ళు వాటిని చూసి చిరునవ్వులు రువ్వుతూ, మునిపంట పెదవి కొరుకుతున్నారు.
వాటితో కళ్లతోనే ఊసులాడుతున్నారు!
పిల్లలు వాటిని చూసి గీ పెడుతూ గోల చేస్తున్నారు.
కేకలేస్తూ చిలకపలుకులతో వాటిని పిలుస్తున్నారు.
ఇక నేను మట్టుకు వాటికెదురుగా పొట్టిగా.. కుదించుకపోయి నిల్చున్నా!
ప్రాణం లేనట్టుగా, గుర్తింపు లేనట్టుగా.. పొరపాటున ఎపుడైనా..
ఎవరి చూపైనా నా పై నిలుస్తుందేమోనని నిరీక్షిస్తూ,
ఎవరైనా నన్ను పిలుస్తారా?
ఎవరి శూన్యపుచూపైనా నా మీద చిలిపిగా నిలుస్తుందా?’ అని…
కానీ లాభం లేదు! ఊహూ( !!!
ఈ కాలంలో మనిషి కన్నా పోస్టర్లనే జనం ఎక్కువగా గుర్తుపడుతున్నారు!
చూస్తున్నానుగా, అవి మనిషి కన్నా యథార్థమైనవి.
అయితే.. అవి వేరేవాళ్ల గురించి చెబుతాయి…
వాటిలో ఆకర్షణ ఉంటుంది కానీ జీవం కాదు!
అవి కూడళ్లలో నిలుస్తాయి,
అందరి దారినీ అడ్డగిస్తాయి,
అందరినీ ఎత్తి పొడుస్తాయి…
అయితే ఎవ్వరితోనూ వాటికి సంబంధాలుండవు!
గుండె, ఆత్మ, తెలివి- ఏమీ లేనివి!!
ఒట్టిరంగు — నిండైన ముద్ద రంగు–
హృదయం లేకపోయినా ప్రేమసందేశాన్నిచ్చేవి!
ఆకారాలు…అవన్నీ ఏ హద్దులూ లేని ఒట్టి ఆకారాలు అంతే!!
కానీ వీటి భావాలు ఇంకొకళ్లవి….
ఏ పోస్టర్ల భంగిమలు, చేతులు, కాళ్లు, ముక్కులు-చెవులు, కళ్లు, ముఖం, హృదయం, బుద్ధి –
ఇవన్నీ వేరెవరివో!! అవడానికి కేవలం పోస్టర్లు…ఒట్టి పోస్టర్లు…
అయితేనేం – ఇవాల్టి యుగంలో మనిషి కంటే అవే యథార్థమైనవి!!
అవును… వాటినే అందరూ గుర్తు పడతారు!!
చెప్పక తప్పదు— అవే గొప్పవి!! అవును గోడమీద పోస్టర్లే గొప్పవి!
![]()
నేపథ్యం :-
సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా (1927-1983) హిందీలో మానవతావాద- ప్రగతిశీలయుగానికి ప్రతినిధి కవి, పత్రికాసంపాదకులు, రేడియో ప్రయోక్త. పిల్లలకు విడిగా బాలసాహిత్యం అనే ప్రక్రియ ఉండాలని తపించి, విలువలతో కూడిన బాలసాహిత్యాన్ని వెలువరించిన సృజనశీలి. సక్సేనా కవితలు ప్రధానంగా ఉత్తరాది పల్లెటూళ్ల వాతావరణాన్ని-సామాన్య జనజీవన మాధుర్యంతో నిండినవి- స్వచ్ఛమైన నిజాయితీ- విలువల పట్ల నిబద్ధతతో కూడుకున్నవి. హిందీలో అలతి పదాలతో సామాన్య జనుల వాడుక భాషలోనే కవితలు రాసి మెప్పించినవాడు. సామాన్యుల కష్టాలను ఏకరవు పెడుతూ రాసిన ‘ఖూంటియో పర్ టంగే లోగ్’ (చిలక్కొయ్యలకి వేలాడే మనుషులు) అనే కావ్యసంపుటికి 1983లో కేంద్ర సాహిత్యఅకాడెమీ అవార్డు అందుకున్నాడు.
70 వ దశకంలో రాసిన ఈ ‘పోస్టర్ ఔర్ ఆద్మీ’ కవితలో మనిషి ఉనికిని మింగడానికి పుట్టుకొస్తున్న మార్కెట్ సంస్కృతిని గమనించి హెచ్చరికగా పోస్టర్ల ప్రతీకను వాడారు కవి. మార్కెట్ విరాడ్రూపానికి మనిషి మరుగుజ్జుగా మారాడని చెప్పే ఈ కవితలో ఆ కాలానికి అప్పుడప్పుడే వస్తున్న మార్కెటింగ్ జిమిక్కులు, వాణిజ్య ప్రకటనలకు ప్రతినిధిగా ‘పోస్టర్లు’ కనిపిస్తాయి. మానవసంబంధాల్ని దెబ్బతీస్తున్న ఈ ‘వర్చ్యువల్ మార్కెట్’ కాలంలో- వ్యాపార పోటీప్రకటనల మాయాజాలానికి, మనిషి అస్తిత్వమే ప్రమాదంలో పడుతూన్న నేటి పరిస్థితిని ఆనాడే ఊహించడం ఈ కవిత గొప్పదనం!

తెలుగు నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగుకి వందకు పైగా కథలను అనువదించారు. ఇప్పటికి ఆరు అనువాద పుస్తకాలు ప్రచురించారు. విజయవాడ లొయోలా కాలేజీ, తమిళనాట కంచి విశ్వవిద్యాలయంలో హిందీ లెక్చరర్ గా సేవలందించి, ప్రస్తుతం కేంద్రప్రభుత్వ తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీశాఖలో సహాయక ఆచార్యులుగా పనిచేస్తున్నారు. తిరువారూర్ లో నివాసం. పాత లిపి అంటే మక్కువ. వివిధ శాసనాలు చదవటం, చరిత్ర పరిశోధన, అనువాదం అంటే ఇష్టం. తాళపత్రాల సంరక్షణలో అనుభవం. తిరుమల రామచంద్రగారంటే వల్లమాలిన అభిమానం!































