కన్నడ మూలం: కేశవరెడ్డి హంద్రాళ
తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు
భార్య అమెరికాలో ఉన్న కొడుకు ఎంఎస్ గ్రాజుయేషన్ అటెండ్ చెయ్యడానికి వెళ్ళింది. జైలు డిజిపి పెద్దింటి రంగారావుగారు తన ఇంటి ముందరి విశాలమైన తోటలో కూర్చుని విస్కీ గుటకరిస్తూ ఏదో లోతైన ఆలోచనలో మునిగి ఉన్నారు.
ఆర్డర్లి భీమరాజు విస్కీని, ఆయనకు చాలా ఇష్టమైన వేయించిన పల్లీలను తయారుగా ఉంచి, ఆయన అడిగినప్పుడు భోజనం ఇవ్వడానికి రెడీగా ఇంటి ముందు భాగం తలుపుకు ఆనుకుని తన మామూలు సీటులో కూర్చున్నాడు. ఏదైనా అర్జెంటు విషయాలంటే జైలు సూపరింటెండెంట్, జైలర్ మొదలైన అధికారులు ఆయనను ఎప్పుడైనా కలవవచ్చు. అలాంటి సమయాల్లో ముందుగా భీమరాజే రంగారావ్ గారికి కబురు అందించేది. ఆయన ఎడిజిపి అయ్యి, రెండు సంవత్సరాలకు డిజిపిగా ప్రమోషన్ పొంది ఒక సంవత్సరమయ్యింది. ఆయన ఈ జైలుకు వచ్చినప్పటినుండి, ఈ రోజుదాకా ఉదయం నుండి ఆయన పడుకునేదాకా రంగారావ్ గారి అవసరాలు చూసుకునేది భీమరాజే. కాబట్టి భోజనం, టిపెన్లు వేళకు సరిగ్గా తీసుకోవాలని భీమరాజు బలవంత పెట్టేవాడు. కుటుంబ సభ్యులు ఉన్నా లేకపోయినా, ఆయన మాత్రం ఈ మూడు సంవత్సరాల నుండి జైలులోని ఖైదీలకు పెట్టె భోజనాన్నే మూడుపూటలా తింటున్నారు. కాబట్టి జైలు అధికారులు ఖైదీలకు పెట్టే భోజనాలలో తేడా చేయడానికి వీలయ్యేది కాదు.
అలా చూస్తే మూడు సంవత్సరాల క్రితం, రంగారావుగారు ఎడిజిపిగా భాద్యతలు స్వీకరించినప్పుడు జైలు పరిస్థితి అంత బాగా లేదు. కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో జైలు ఒక అందమైన ఆశ్రమంగా మారిపోయింది. జైలులోని ఖైదీలని ఎంతమాత్రమూ నేరస్తులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా పరిగణించాలని జైలు అధికారులకు ఆజ్ఞ చేశారు. విశాలమైన జైలు ప్రాంగణంలో అనేక కుటీర పరిశ్రమలను ప్రారంభించారు. రెండు పెట్రోల్ బంకులను ప్రారంభించారు. సుమారు వంద ఎకరాల్లో వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఖైదీలను, వీటిలో తమ తమ ఆసక్తులకు అనుగుణంగా పని చెయ్యడానికి ప్రోత్సహించి, అలా వచ్చిన డబ్బును వాళ్ళ ఖాతాలలో నేరుగా జమ అయ్యేట్టు చూసుకున్నారు. ఖోఖో, వాలిబాల్, కబడ్డి మొదలైన ఆటల మైదానాలను తయారు చేయించి, ఖైదీలను తమకిష్టమన ఆటలు ఆడేలా చేశారు. ప్రార్థనా మందిరాలను ప్రారంభించి ఖైదీలు తమకిష్ఠమైన దేవుళ్ళను ప్రార్థించుకునేలా చేశారు. ఆసక్తి ఉన్నవాళ్ళు యోగాభ్యాసం చేసుకోవడానికి కూడా వీలు కల్పించారు. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నగా ఉన్న జైలు క్లినిక్ కు ఆధునిక ఆస్పత్రి స్పర్శనిచ్చారు.
అంతకు ముందు శస్త్రచికిత్సలకు ఖైదీలను బయట ఆస్పత్రులలో చేర్చాల్సి వచ్చేది. ఇప్పుడు నిపుణులైన వైద్యులతో చెరసాల ఆస్పత్రిలోనే జరిగిపోతున్నాయి. ఖైదీలలో విధ్యాభ్యాసం చేయదలచుకున్నవారి కోసం బయట నుండి ఉపన్యాసకులను పిలిపించి బోధన జరిగేలా ఏర్పాటు చేశారు. పరీక్షలకు కూడా కూర్చునే సౌకర్యం కల్పించారు. అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాన్ని ప్రారంభించి ఖైదీలలో పఠనాసక్తిని పెంపొదేలా చేశారు. మొత్తానికి చెరసాలవాసులకు తాము తమ ఇళ్ళల్లోనో లేదా ఏదో ఆశ్రమంలోనో ఉన్నట్తు అనిపించేది. రోజంతా శ్రమ, కడుపునిండా కూడు, కంటినిండా నిద్ర వారికి. చర్లపల్లి సెంట్రల్ జైల్, చంచల్ గూడా జైళ్ళే కాకుండా రాష్ట్రంలోని అన్ని జైళ్ళు ఆయన పరిపాలన క్రిందే వచ్చేవి. చర్లపల్లి జైలులో రెండు వేల ఖైదీలుంటే చంచల్ గూడా జైలులో వెయ్యిన్నర ఖైదీలు ఉండేవారు. రెండూ జైళ్ళలోనూ సౌకర్యాలు సమానంగా ఉండేటట్టు చూసుకున్నారు ఆయన.
రంగారావుగారు రెండు జైళ్ళనూ వారానికొకసారి చూసొచ్చేవారు.
ఇలా ఒక్కోసారి ఒంటరిగా ఉన్నప్పుడు పాత జ్ఞాపకాల్లో పడి అంతర్ముఖులయ్యేవారు. ఆయన ముప్ఫైనాలుగు సంవత్సరాల సర్వీసులో ఇరవై ఎనిమిది సార్లు ట్రాన్స్ ఫర్లయ్యాయి. ‘టెరర్ ఆఫీసర్‘ అనే పేరు గాంచారు. రాజకీయ నాయకుల ప్రభావానికి లోనవలేదు. ఆయన విశాఖపట్టణం రూరల్ ఎస్పిగా ఉన్నప్పుడు ఏదో క్రిమినల్ కేసులో పాలక పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్యేలను ఒకే రోజు అరెస్ట్ చేసి ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. అదొక సంచలన వార్తగా మారి స్వతః సిఎం గారే ఎస్పి ఆఫీసుకు వచ్చి కూర్చున్నారు. ఇంకోసారి హైదరాబాద్ కమీషనర్ గా ఉన్నప్పుడు చిట్ ఫండ్ కేసులో వంద కోట్ల మోసానికి పాల్పడిన ముఖ్యమంత్రి ఆప్తుడైన ఒక వ్యాపారవేత్త, వార్త ఛానల్ యజమాని పైన కేసు దాఖలు చేసి అరెస్ట్ చేయడానికి పూనుకున్న సంగతి తెలిసి ఆ వ్యాపారవేత్త హుటాహుటిగా అందరి డబ్బులూ ఇచ్చేశాడు.
ఈ సంఘటన రంగారావు గారికి చాలా జనాదరణ తెచ్చిపెట్టింది. రెండు నెలల క్రితం జైల్లోని ఆసుపత్రిని ప్రారంభించడానికి వచ్చిన యువ ముఖ్యమంత్రి ఇక్కడి సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయి, తనకంటే పెద్దవాడైన రంగారావుగారికి వేదిక పైనే కాళ్ళకు దండం పెట్టాడు. అదొక జాతీయ వార్తగా ప్రసారమయ్యింది. తన క్రమశిక్షణతో కూడిన సేవకు దొరికిన గౌరవంగా భావిస్తారాయన.
“సార్! మీరు అడ్మినిస్ట్రేషన్ వైపు వచ్చేట్టయితే చెప్పండి. ఈ రోజే ఆర్డర్ వేస్తాను” అని ముఖ్యమంత్రిగారే రంగారావుగారిని అడిగినప్పుడు ఆయన నవ్వుతూ “వద్దులెండి. నేనక్కడ చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నాను. మిగిలిన ఒక సంవత్సరం సర్వీసును ఇక్కడే ముగిస్తాను.” అని సున్నితంగానే అన్నారు.
రంగారావుగారి మొదటి ఐదు సంవత్సరాల ఐపిఎస్ సేవను యాంటి నక్సలైట్ ఫోర్స్ ఎసిపిగా, ఎస్పిగా చేసి రాష్ట్రమంతటి వ్యాప్తిని ఇచ్చారు. దీనికి కారణం ట్రైనింగ్ లో ఉన్నప్పుడే ఆయన చూపిన ధైర్యసాహసాలు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కడే ఐదుగురు నక్సలైట్లని బంధించింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఎక్కడ నక్సలైట్ కార్యకలాపాలు కనిపించినా అక్కడ రంగారావు గారుకనిపించేవారు. ఆయన నక్సల్ కోంబింగ్ ఎక్స్ పర్ట్ అని పేరు పొందారు. ఆయన పేరు వింటే చాలు, నక్సలైట్ల గుండెల్లో దడ పుట్టేది. ఆ అవధిలో జరిగిన అనేక సంఘటనలు రంగారావుగారిని కలత పరుస్తూ ఉంటాయి. ఈ రోజు కూడా అలాంటి ఒక ఘటన గుర్తుకొచ్చి గుండె బరువయ్యింది.
అంతలోనే ఆర్డర్లి భీమరాజు హాజరయ్యి “అయ్యా! నిజాముద్దీన్ రైలు వెళ్ళి పావుగంటయ్యింది. భోజనం ముగించి ఆకాశం చూద్దురుగానీ! ఈ రోజు ఎలాగూ అమావాస్య. చంద్రుడు లేడు కాబట్టి నక్షత్రాలు బాగా అగుపడతాయి” అన్నాడు. రాత్రి పదిగంటలకు అంత దూరంలో నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలు వెళ్ళే ముందే రోజూ రంగారావుగారి భోజనం అయిపోతుంది. కాబట్టి భీమరాజు మెత్తగా హెచ్చరించాడు. అలా సందర్భానుసారంగా మాట్లాడే నేర్పు కూడా భీమరాజుకు కరగతమయ్యింది.
గ్లాసులో మిగిలిన రెండు గుక్కల్ని ఒకే సారి గొంతులో ఒంపుకుని ఇంటివైపు అడుగులు వేశారాయన. సింక్ లో చేయి కడుక్కుని, టేబుల్ కు వచ్చి కూర్చున్నారు. వేడి అన్నం, కాకరకాయ వేపుడు, చారు, గుడ్డు అన్ని ప్లేటులో నింపుకుని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు భీమరాజు. ఆయన జైలు అధికారం చేపట్టిన మరుసటి రోజే ఖైదీల భోజనాల గదికి వెళ్ళారు. వాళ్ళ చేతుల్లో చిన్న చిన్న ప్లేట్లు కనిపించాయి. వాటిలోనుండి అన్నం, చారు ఒలికిపోతున్నాయి. రెండే రోజుల్లో చిన్న ప్లేట్లు మాయమై, వెడల్పు ప్లేట్లు ఖైదీల చేతికొచ్చాయి. రంగారావు గారు కూడా అలాంటి ప్లేట్లోనే భోజనం చేసేవారు.
అప్పుడు జైలర్ తోమలపల్లి రామరాజు వచ్చి సెల్యూట్ కొట్టి నిలబడ్డారు. రామరాజు నలభై సంవత్సరాల యువ ఆఫీసర్. రంగారావు గారికి నచ్చినట్టు జైలులో పని చేస్తున్నారు. అతడి అన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పిఎస్ ఐ గా ఉండేవారు. పన్నెండు సంవత్సరాల క్రితం నక్సల్ ఎన్కౌంటర్లో చనిపోయారు. అతడి భార్యకు పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఎఫ్ డి ఎ పని ఇచ్చారు. రామరాజు నక్సలైట్ల పైన పగ తీర్చుకోవడానికి పోలీస్ శాఖలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు.
రంగారావ్ గారు రామరాజును చూసి “రండి రామరాజూ! కూర్చోండి. ఏమైనా తీసుకుంటారా?” అని నవ్వారు. “లేదు సార్! నేను భోంచేసి వచ్చాను” అన్నారు రామరాజు. రంగారావుగారి వల్ల ప్రభావితులై రామరాజు కూడా జైలులో ఇచ్చే భోజనమే చేస్తున్నారు. వంటవగానే ముందుగా జైలర్ రుచి చూసినాకే ఖైదీలకు పెట్టాలి. ఇది దేశంలోని అన్ని జైళ్ళలోనూ పాలిస్తున్న నియమం. “చెప్పండి. ఏం విశేషాలు?” భోంచేస్తూనే మాట్లాడడం రంగారావుగారికి అలవాటే.
“సర్! గద్దర్ ఒక అర్ధగంట క్రితం చనిపోయాడట.” రామరాజు గొంతులో సంతోషం వినిపించింది. ఒక్కసారిగా రంగారావుగారి ఒంట్లో సంబరం, ఆదుర్దా రెండూ ప్రవేశించినట్టయింది. ఇటీవల గద్దర్ బాగా తగ్గిపోయారు. రెండు నెలల నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
“పోన్లెండి! ఇక్కడ ఎవరు మాత్రం శాశ్వతం? అలా చూస్తే ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఆయన చేతిలో నేనో లేదా నా చేతిలో ఆయనో చావాల్సింది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి వారి నమ్మకమే ముఖ్యమవుతుంది. గద్దర్ కు తను వెళ్తున్న దారే సరైనది అనిపించింది. కానీ ఇటీవల ఆయన ఆలోచనా ధోరణిలో మార్పు కనిపించింది.” రంగారావుగారు సౌమ్యంగా అన్నారు.
“రేపు రెండూ జైళ్ళలోనూ స్వీటు, నాన్ వెజ్ భోజనాలు చేయించాలని…” అంటున్న రామరాజు మాటను మధ్యలోనే ఆపుతూ
“వ్యక్తిగత ద్వేషం సార్వత్రికం కాకూడదు రామరాజూ! అలా చూస్తే గద్దర్ ఈ సీమ లక్షల కొద్దీ జనాలకు ఆరాధ్య దైవంగా వెలిగినవారు. ఏదో ఒక గురికోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసిన మనిషి. కాలుతున్న బులెట్ ని తన భుజంలో పెట్టుకుని ఆకలితో, నిద్రలేక అరణ్యాలలో తిరిగిన మనిషి. ఆయన తలచుకునుంటే ఈ రాష్ట్రంలో ఒక మంత్రి పదవిని అలంకరించి ఉండేవారు. ఆయనలోని నిబద్ధత, నిరాకరణ శక్తి అగాధమైంది. అసాధారణమైంది. ఖైదీలకు మంచి భోజనం ఇవ్వడానికి నా అభ్యంతరం లేదు. కానీ ఆయన చావును పురస్కరించుకుని ఇవ్వడం అంటే ఒప్పుకోను.” రంగారావుగారు ఎల్లప్పుడూ తన అభిప్రాయన్న ఎవ్వరి ముందైనా నిర్భయంగా, మొహమాటం లేకుండా చెప్పగలిగేవారు.
రామరాజు “సారీ సర్! ఏదో ఆవేశంలో అనేశాను. మీరు సీరియస్ గా తీసుకోకండి. గుడ్ నైట్ సర్” అని సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయారు.
భోజనం ముగించిన రంగారావుగారు భీమరాజును భోజనం చేసి పడుకోమన్నారు. నల్లమల అడవుల్లో ఇరవై మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. ఆ రోజు నక్సలైట్ల ఆచూకీ తెలిసి, పది మంది పోలీసులతో రంగారావుగారు నల్లమల అడవుల్లోకి ప్రవేశించారు. జీపులను రోడ్డుపైన రమ్మని చెప్పి తను మరో తోవలో సాగారు. అదే తోవలో గద్దర్ కూడా తుపాకీ ధరించి వచ్చారు. కానీ తోవలో దట్టమైన పొదలుండి, రెండుగా చీలడం వల్ల ఇద్దరూ ఎదురు కాలేదు. ఒకరినొకరు చూసుకోలేదు. ఆ రోజు మందుపాతర పేలి, నలుగురు పోలీసులు చనిపోతే, పోలీసుల కాల్పులకు ఎనిమిది మంది నక్సలైట్లు చనిపోయారు. గద్దర్ మాత్రం తప్పించుకున్నారు.
ఒక దీర్ఘమైన నిట్టూర్పుతో తన ఎడమ చేతిని చూసుకున్నారు రంగారావుగారు. మోచేతి నుండి వేళ్ళ వరకు అది కృత్రిమం. పోలీసు డిపార్ట్ మెంటులోనే కాకుండా సార్వత్రికంగా కూడా ఆ చెయ్యి ఆయన వర్చస్సును పెంచడమే కాకుండా తొందరగా ప్రమోషన్లు రావడానికి కూడా తోడ్పడింది. నక్సలైట్ల ఎన్కౌంటర్లో రంగారావు గారు చేయి పోగొట్టుకున్నారన్నదే ఒక వార్తగా మారింది. కాని….? ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారాయన.
టెరర్ అనే పేరు పొందిన ఆయన అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో యాంటి నక్సలైట్ ఫోర్స్ హెడ్ గా, ఎసిపిగా పని చేస్తున్నారు. జిల్లాలోని ప్రజలకు నక్సలైట్లంటే జాలి, అభిమానం ఉన్నాయి. ఆ కారణంగా అనేకులు వారి ఇన్ఫార్మర్లుగా పని చేసేవారు. పోలీసులు ఒక్కోసారి అలాంటి వాళ్ళను కూడా బంధించి సమాచారం సేకరించేవారు. అప్పుడు ఆ జిల్లా ఎస్పీగా యర్రగుంట సాంబశివారెడ్డి అంటే వై.ఎస్. రెడ్డి ఉండేవారు. వై.ఎస్. రెడ్డి అంటే నక్సలైట్లే కాదు సామాన్య ప్రజలు కూడా చాలా భయపడేవారు. చిన్నమాటకు కూడా లాఠీ ప్రయోగించేవారు. ఒక్కోసారి ఎసిపి రంగారావు, ఎస్పి రెడ్డి ఇద్దరూ రంగంలో దూకేవాళ్ళు.
ఆ రోజు సంక్రాంతి పండగ ముందు రోజు. ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో ఒక ముఫై ఏళ్ళ యువకుడు ఆఫీసుకులోకి దూసుకొచ్చి ఎస్పి రెడ్డిగారి కాలర్ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించాడు. చుట్టూ ఉన్న పోలీసులు వాణ్ణి పట్టుకుని కట్టివేశారు. వాడొక నక్స్లలైట్ ఇన్ఫార్మర్ అట. పక్క చేంబర్లో ఉన్న ఎసిపి రంగారావు వాణ్ణి జీపులో ఎక్కించుకుని అక్కడ్నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగల్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.
ఆ యువకుడి మొహంలో చిరునవ్వే కాని భయపడ్డ చిహ్నాలు కనిపించలేదు. రంగారావు ఆ యువకుడికి థర్డ్ డిగ్రీ శిక్ష ఇవ్వాలని నిర్ణయించి నోటికి గుడ్డలు కుక్కి, వాడి శిశ్నపు రంధ్రంలో రాగి తంతిని దూర్చారు. భరించరాని నొప్పితో గిలగిలలాడుతూ, అరవడానికి వీలు కాక ఆ యువకుడు మూర్ఛపోయాడు. తరువాత తను చేసింది ఎక్కువైంది అనుకుని, ఆయన పశ్చాత్తాప పడి, ఆ యువకుడికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించమని చెప్పి వెనుతిరిగి వచ్చారు.
ఆ రోజు రాత్రి మొదటి సారిగా నిద్ర పోకుండా బాధపడ్డారు. అయినా నక్సల్ ఇన్ఫార్మర్ ఒకడు ఎస్పి కాలర్ పట్టుకోవడం అంటే? దానికి సరైన శిక్ష ఇచ్చాను అనుకుని సమర్థించుకున్నారు. మరుసటి రోజు జంగల్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి చూసినప్పుడు ఆ యువకుడు తేరుకున్నాడు. కానీ రంగారావును చూసి భయంతో వణికి పోయాడు. ఆ భయం చూసి తను చేసింది సరైనదే అనిపించింది ఆయనకు. ఆ క్షణంలో నేరాల కట్టుబడికి భయపెట్టడమే పెద్ద ఆయుధమని నమ్మారు రంగారావు.
మూడవ రోజు ఉదయం విశాఖపట్టణం నుండి నక్సలైట్ల వకీలైన చిలకలపేట నరసింహ నాయుడు బెయిల్ ఆర్డర్ తో రంగారావుగారి చేంబర్లో కూర్చున్నారు. శ్రీమంతుల కుటుంబం నుండి వచ్చిన నాయుడుగారు రెండేళ్ళ క్రితం తమ బాబాయినే చంపిన నక్సలైట్లకు బెయిల్ మంజూరు చేయించిన మనిషి! నలభై సంవత్సరాల నాయుడు గారి కచేరి పేద రైతులతోనూ, కూలి కార్మికులతోనూ నిండి ఉంటుంది. అతి బీదల కేసులను ఫీజు తీసుకోకుండా నడపడం వల్ల ఆయనకు “పేదల లాయర్” అని ఆ జిల్లాలో పేరుంది. సివిల్, క్రిమినల్ చట్టాల నియమాల క్లాజులను అర్ధరాత్రి లేపి అడిగినా నాలుక చివరన నాట్యమాడించగలరు. అన్ని విభాగాల అధికారులు నాయుడుగారు ఆఫీసులోకి ప్రవేశిస్తే వణికిపోతారు.
“మిస్టర్ రంగారావ్! మీరు నిజాయితీగల ఆఫీసర్ అని నేను విని ఉన్నాను. కానీ నిజాయితీతో పాటు కరుణ, జాలి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం వీలవుతుంది.” బెయిల్ ఆర్డరును ముందుంచి అన్నారు నరసింహ నాయుడు గారు.
“మిస్టర్ నాయుడూ! సమాజ ఆరోగ్యాన్ని పాడు చెయ్యడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అపరాధమే. అలాంటి నేరం జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం నా కర్తవ్యం. నా కర్తవ్యాన్ని నేను నిజాయితీగా చేస్తాను. అలా చేసేటప్పుడు కొంత భయాన్ని కలిగించడం అనివార్యమవుతుంది.” అని నెమ్మదిగానే అన్నారు రంగారావుగారు.
“నాకు తెలుసు మిస్టర్ రంగారావ్! గన్ రెప్రెజెంట్స్ పవర్. మీరు మీ గన్నును సమాజంలోని ఆకలి, అసమానత, లంచగొండితనం మొదలైనవాటిని అణచడానికి ఉపయోగించాలి. అలా కాకుండా మనుషులను చంపడానికి కాదు. Kill the sin, but not the sinner అనే సామెతను మీరు వినలేదల్లే ఉంది. అపరాధాన్ని చంపు, అపరాధిని కాదు అని మహాత్మా గాంధీగారు ఎప్పుడో చెప్పారు. కానీ మన బ్యూరోక్రసి అపరాధాన్ని చంపడానికి బదులుగా అపరాధిని చంపడంలో ఎప్పుడూ బిజీగా ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క పెద్ద లోటు ఇది. నేనొక జమీందారు బిడ్డనై కూడా, నక్సలైట్లకు ఎందుకు మద్దతునిస్తున్నానని ప్రజలు ఆశ్చర్యంతో అనుకుంటుంటారు. మీకు తెలుసో లేదో, రష్యా, ఫ్రాన్స్, అమెరికా మొదలైన దేశాల్లో విప్లవానికి నాయకత్వం వహించింది ఉన్నత వర్గం వారే. వారంతా కులాసాగా జీవితం గడపి ఉండవచ్చు. కానీ సామాన్య ప్రజల ఉన్నతి కోరి వ్యవస్థతోనూ, పాలకులతోనూ ఘర్షణకు దిగారు. అంతెందుకు! మన స్వాతంత్ర సంగ్రామమే తీసుకోండి. గాంధి, నెహ్రూ, పటేల్, తిలక్, గోఖలే, బిపిన్ చంద్ర పాల్, లాలా లజపత్ రాయ్, సుభాష్ చంద్ర బోస్ వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ బానిసలుగా ఉండలేదు. నిజంగా బానిసలుగా ఉన్నది సామాన్య ప్రజలు.
వీరంతా తమ బ్రతుకులను త్యాగం చేసి స్వాతంత్రానికోసం పోరాడారు. అదలా ఉంచండి. మీ దౌర్జన్యం మాత్రం సహించరానిది. దీని గురించి నేను ప్రెస్ వద్దకు వెళ్ళను. ఎందుకంటే మీరు నిజాయితీపరులు అని పేరు పొందారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం దేన్నైతే విసురుతామో అదే తిరిగి మన వద్దకు వస్తుంది. దీన్ని ఇంగ్లీషులో ‘బూమెరాంగ్’ అంటారు.” నరసింహ నాయుడుగారి మాటల్లో తీక్ష్ణత, వాస్తవికత రెండూ కలగలిపి కనిపించాయి. రంగారావుగారు మొదటి సారిగా ఎదుటి మనిషి మాటలకు ఆశ్చర్యపోయారు.
ఇది జరిగిన రెండు నెలలకు ఒక రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎస్పి వై.ఎస్ రెడ్డిగారితో కలిసి రంగారావుగారు ఆఫీసునుండి ఎస్పిగారి జీపులో జంగల్ పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరారు. గన్ మ్యాన్లు కాని, ఇతర సిబ్బంది కానీ జతగా లేరు. రంగారావుగారే జీపు నడుపుతున్నారు. ఇంకో ఐదు కిలోమీటర్లలో జంగల్ పోలీస్ స్టేషన్ వస్తుందనగా రోడ్డుకు ఇరువైపులా దట్టమైన పొదలు ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక యువకుడు పొదల చాటునుండి వచ్చి రోడ్డు మధ్యలో నిలబడ్డాడు. రంగారావుగారు అపాయాన్ని ఊహించి జీపును ఆపి ఆ యువకుడిని పట్టుకోవడానికి దిగారు. తలకు తువ్వాలు చుట్టుకున్న ఆ యువకుడు చేతిలో పదునైన వేటకొడవలి పట్టుకున్నాడు. రంగారావు ఆ యువకుడి తలను పట్టుకుని లాక్ చెయ్యడానికి ప్రయత్నించారు. రెప్పపాటులో ఆ యువకుడు రంగారావు ఎడమ చేతిని మోచెయ్యిదాకా నరికి, నరికిన చేతిని పట్టుకుని పొదల్లో మాయమయ్యాడు.
రంగారావుకు ఆ యువకుడెవరో తెలిసిపోయింది. తను ఆ రోజు జంగల్ పోలీస్ స్టేషన్లో శిశ్నంలో రాగి తీగను దూర్చిన యువకుడే. ఆ యువకుడికి బెయిల్ ఇప్పించిన లాయర్ నరసింహ నాయుడు వాడిన బూమెరాంగ్ పదం మొహానికొచ్చి కొట్టినట్టయి ఆయన స్పృహ తప్పారు. మెలకువ వచ్చినప్పుడు లైఫ్ ఆస్పత్రిలోని ఐసియులో ఉన్నారు. ప్రాణాపాయం తప్పింది.
“నక్సల్ ఎన్కౌంటర్ లో చేతిని కోల్పోయిన టెరర్ ఆఫీసర్ రంగారావు” అని బ్రేకింగ్ న్యూస్ టివి చానళ్ళలో వస్తూ కనిపించింది. డిజిపి మొదలుకుని అందరు పెద్ద ఆఫీసర్లు స్వయంగా వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని విచారించుకుని వెళ్ళారు. ఎస్పి వై.ఎస్ రెడ్డి అయితే “రంగారావ్! వాడిని ముక్కలు ముక్కలుగా నరికేదాకా నేను నిద్రపోను” అని రోషంగా పలికారు. మూడు నెలల తరువాత డ్యూటీకి వచ్చి చేరిన రోజే రంగారావుకు ఎస్పిగా ప్రమోషన్ ఇచ్చి ఆదిలాబాద్ జిల్లాకు వేశారు.
తెగిపోయిన చేయి స్థానంలో కృత్రిమ చెయ్యి అతికించడం జరిగింది. రంగారావు ఆదిలాబాదుకు ట్రాన్స్పర్ అయ్యి వచ్చిన ఆర్నెల్లలో వైఎస్ రెడ్డి హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. ఆ మధ్యలో పది పన్నెండుగురు నక్సలైట్లను, వాళ్ళ ఇన్ఫార్మర్లను ఎన్కౌంటర్ చేశారు. ఒకసారి ఫోన్ చేసి “ రంగారావ్! నీ చెయ్యి నరికినవాణ్ణి వెంటాడి ముగించాను నువ్విక ప్రశాంతంగా ఉండు” అని నవ్వారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ రంగారావు కడక్ ఆఫీసర్ అనే పేరు సంపాదించుకున్నారు. నక్సలైట్లు తమ స్థావరాలను ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మధ్యనున్న దండకారణ్యానికి మార్చుకున్నారు. ఆయన అదిలాబాద్ కు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలైంది. అలాంటి ఒక రాత్రి పది గంటలకు ఆయనకు ఒక ఫోన్ వచ్చింది.
“నమస్కారం సార్…..” ఆవైపు నుంది గద్దర్ గొంతు. ప్రభుత్వం ఆయన పైన నిషేధం ఎత్తివేసింది. ఆయన అజ్ఞాత వాసంనుండి బయటికి వచ్చారు. నక్సల్స్ మరియు ప్రభుత్వం నడుమ సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
“నమస్కారం గుమ్మడి విఠల్ రావుగారికి” రంగారావ్ ప్రతిక్రియగా అన్నారు.
“అది నా పాత పేరు సారూ! నన్ను ప్రేమతో గద్దర్ అనే పిలవండి” అన్న ఆయన గొంతులో ఆయన పేరుకున్నంత ఫోర్స్ కనిపించలేదు. ఆయన మాటలు వినయంలో మునకలేసినట్టు వినిపించాయి.
“చెప్పండి మిస్టర్ గద్దర్! ఫోనెందుకు చేశారు?” రంగారావుగారి మాటలు కూడా మృదువుగా ధ్వనించాయి. “మిమ్మల్ని కలిసి ఒకింత మాట్లాడాలి సారూ” గద్దర్ గొంతులో కోరిక కనిపించింది.
“మీ పైన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. మీకు కుదిరినప్పుడు వచ్చి నన్ను కలవవచ్చు” రంగారావు గొంతు సహజంగా ధ్వనించింది.
“కాని సారూ! మన ములాకాత్ ని రహస్యంగా ఉంచడం మంచిది” గద్దర్ గొంతులో మనవి ఉండింది.
“అలాగే! ఎప్పుడొస్తారో చెప్పండి”
“రేపు రాత్రి తొమ్మిది గంటలకు వస్తాను సారూ! వీలైతే మీతో భోజనం” గద్ధర్ మనిషి హాస్య ప్రియుడనిపించింది.
“అలాగే! భోజనానికి రండి” అంటూ నవ్వుతూ ముగించారు రంగారావు.
“అయితే ధన్యవాదాలు సారూ! నాకు మటన్ అంటే చాలా ఇష్టం” ఫోన్ కట్ అయ్యింది.
మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటలకు రంగారావు గద్దర్ కోసం కాచుకున్నారు. సమయానికి సరిగ్గా ఒక వ్యక్తి అంబాసిడర్ కారులో వచ్చి దిగారు. కానిస్టేబల్ పూర్తిగా తలాషీ తీసుకుని లోపలికి తీసుకొచ్చాడు.
“నమస్కారం సారూ!” వచ్చిన వ్యక్తి చేతులు జోడించారు. అరె గద్దర్! గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. చొక్కా, ప్యాంటు వేసుకుని ట్రిమ్ముగా షేవింగ్ చేసుకున్నారు. ఎర్ర కంబళిని మాత్రం పైన కప్పుకుని, చేతిలో ఎర్ర జెండా పెట్టుకుని కాళ్ళకు గజ్జె కట్టి, గంటల కొద్ది అలుపెరుగక క్రాంతి గీతాలను పాడే గద్దర్ ఈయనేనా అనిపించింది రంగారావుకు.
రంగారావుగారి తల్లే గద్దరుకు భోజనం వడ్డించింది. మటన్ చారు, మటన్ కీమా, అన్నం. గద్దర్ తృప్తిగా భోంచేసి, రంగారావుగారి తల్లి కాళ్ళకు దణ్ణం పెట్టారు. “కాళ్ళకెందుకు దణ్ణం పెడతావయ్యా” అని ఆమె వెనుకకు జరగగా
“అన్నం పెట్టిన ప్రతి ఒక్కరూ కన్నతల్లి సమానమమ్మా” అన్న గద్దర్ కళ్ళలో తడి కనిపించింది.
తన ఎదురుగా కూర్చున్న గద్దర్ తో “ఇంత దయార్ద్ర హృదయులైన మీరు అదెలా హింసకు పాల్పడతారు? ఎందుకు ప్రోత్సహిస్తారు?” అని అడిగారు రంగారావు.
“సారూ! ఒకటి తెలుసుకోండి. ఎవరూ ఎప్పుడూ కావాలని హింసకు ఒడిగట్టరు. మాది హింస కాదు. ప్రతిహింస మాత్రమే. ఎప్పుడైతే అహింస అసహాయకంగా చేతులెత్తేస్తుందో అక్కడ మేము సక్రియులవుతాము. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎక్కడ గాంధీవాదం అంతమవుతుందో అక్కడ మేము మొదలుపెడతాము. మా పోరాటం పోలీసులతో కాదు సారూ! వ్యవస్థతో. ప్రభుత్వంతో. ప్రతి మనిషికి కృషి చేసుకుని బ్రతకడానికి ఒకింత భూమి లేకుంటే ఎలా చెప్పండి. తిండి, బట్ట, ఒక చూరు ఉంటే ఎవరైనా ఎందుకు హింసకు దిగుతారు చెప్పండి?” గద్దర్ మాటలాపి నీళ్ళు తాగారు.
“మీ పోరాటం రాజ్యంగ బద్ధంగా జరగాలి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే ఎలా?” రంగారావు కొద్దిగా గంభీరంగానే మాట్లాడారు.
“మీకు తెలుసు సారూ! చట్టాల్ని తయారు చేసింది సామాజిక న్యాయం ఆధారంగానే. అదొక సాధారణ కామన్ సెన్స్. దాన్ని వదిలేసి పాలకులు చట్టాల్ని, నిబంధనలను తమకు నచ్చినట్టు, తమ స్వార్థానికి ఉపయోగించుకుంటే వాటి పవిత్రత ఎక్కడుంటుంది చెప్పండి. జన సామాన్యుల కష్టాలకు అక్కర రాని, వారి కష్టాలను పరిష్కరించలేని చట్టాలు ఉంటే ఎంత పోతే ఎంత సారూ ? అందుకే నా మిత్రుడు వరవరరావు ఏం చెబుతాడంటే “అపరాధమే అధికారికంగా ప్రజలను అపరాధులుగా చేస్తూంటే కళ్ళుండి, చెవులుండి, నోరుండి ఎదురు చెప్పని ప్రతి వ్యక్తి అపరాధే” అని. ఈ రోజు మిమ్మల్ని కలవడానికి నాతో పాటు అతడు కూడా రావాలసింది. హైదరాబాదులో ఇంకో అర్జంటు పని పడడంతో రాలేకపోయాడు.”
గద్దర్ మాటలను మధ్యలోనే తుంచుతూ “మీరిప్పుడు ఒంటరిగా నాకు దొరికారు. మిమ్మల్ని కాల్చి పారేస్తే?” రంగారావు అదే గాంభీర్యంతోనే అన్నారు.
రంగారావు మాటలకు గద్దర్ కొద్దిగా కూడా విచలితడు కాలేదు. దానికి బదులుగా ప్రశాంతంగా నవ్వుతూ
“కాల్చి పడెయ్యండి సారూ! చావుకు భయపడేవారు పోరాటానికి దిగరు. మీలాంటి నిజాయితీ పరులైన అధికారులు కూడా చావుకు వెరవరు. ఆ రోజు నల్లమల అడవుల్లో పొదలు మన నడుమ అడ్డు రాకపోయుంటే మీరో నేనో కచ్చితంగా చనిపోయి ఉండేవాళ్ళం. భూమ్మీద పుట్టిన ప్రతి ప్రాణి కచ్చితంగా చచ్చి తీరాలి కదా సారూ! కాల్చెయ్యండి. నేను మీ ముంగిలిలో ఉన్నాను. అలా జరిగితే గెలిచేది నేనే. నేను గెలిస్తే మీరు ఓడి తీరాలి. మనం ఎవరికైనా అబద్ధం చెప్పవచ్చు. కానీ మనకు మనమే అబద్ధం చెప్పుకోవడం మాత్రం వీలుకాదు. అద్సరే. మీకు నేనొక ముఖ్యమైన నిజాన్ని చెప్పడానికి వచ్చాను సారూ” గద్దర్ మాటలలో అధ్యాత్మపు పొడ సోకుతున్నట్టు అనిపించింది రంగారావుకు.
“అదేమిటో చెప్పండి “ అంటూ ఆసక్తి చూపారు.
“మీకు ముందే చెప్పాను. మా హింస ఎప్పుడూ ప్రతిహింసే కాని హింస కాదని. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వలన మీరు విచలితులు కాకండి. ఆ రోజు ఎస్పి వై.ఎస్ రెడ్డిగారి కాలర్ పట్టుకున్న వ్యక్తిని ఎందుకలా చేశావని ఒక్క మాట అడిగుంటే నిజం బయటికొచ్చేది. కానీ మీరు ఆ యువకుడిని జంగల్ పోలీస్ స్టేషన్ కు లాక్కుని వెళ్ళి అంత క్రూరమైన శిక్ష విధించి ఉండేవారు కారు. ఆ యువకుడి పేరు పెద్దచెరువు యదునందన్. అది మీకు తెలుసు. అతడు సివిల్ ఇంజనీరింగ్ పాసయ్యి, కేవలం ఒక సంవత్సరం గడిచింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు తన సహపాఠితో ప్రేమలో పడి, ఇద్దరి కులాలూ వేరవడంతో ఆమె తలిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, ఆమె పెద్దచెరువుకు వచ్చేసింది. ఆమె కూడా ఇంజనీరింగ్ చేసుండడం వల్ల ఆ గ్రామంలో ఏదో ఒక చిన్న కుటీర పరిశ్రమను స్థాపించి తమ కాళ్ళ పైన తాము బ్రతకాలని అనుకున్నారు. కానీ పేదలకు పెట్టుబడి ఎలా వస్తుంది చెప్పండి. కాబట్టి విశాఖపట్టణం నౌకా నిర్మాణ కేంద్రంలోని ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకున్నారు. యదునందన్ కు పదిహేను రోజుల్లో వచ్చి చేరమని అపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చింది. అదే రోజు వై.ఎస్ రెడ్డిగారు నక్సల్ ఇన్ఫర్మేషన్ గురించి పరిశీలించడానికి పెద్దచెరువు వచ్చారు. యదునందన్ ఎంతైనా బిఇ గ్రాజుయేట్, కొత్త ఆలోచనల వైపు మొగ్గు చూపిన వాడు అని ఎవరో చెప్పారని యదునందన్ ఇంటికి వెళ్ళాడాయన.
రెడ్డిగారి కళ్ళకు యదునందన్ ప్రేయసి కనిపించింది. అంతే సారూ! తరువాత ఏం జరిగిందని నేను చెప్పను. ఏదో పనికి అన్నవరం వెళ్ళిన యదునందన్ తిరిగొచ్చిన తరువాత సంగతి తెలిసి క్రుంగిపోయాడు. ఎంతైనా ఉడుకు రక్తం కదా! మరుసటి రోజు వచ్చి ఎస్పిగారు కాలర్ పట్టి పట్టుకున్నాడు. తరువాత ఏం జరిగిందని మీకు తెలుసు కదా సారూ……..”
“గద్దర్” అరిచారు పెద్దింటి రంగారావుగారు.
“నిజం సారూ! నేను చెబుతోంది అక్షరాలా నిజం. అరణ్యాల అంచుల్లో ఉన్న గ్రామాలో ఇవన్నీ సర్వసామాన్యం. మీ చేయి నరికినాక యదునందన్ చివరికి ఊరు వదలి, అరణ్యంలో అన్నలతో కలిసిపోయాడు. కొండపల్లి సీతారామయ్య మావోయిస్ట్ గుంపులో ఉన్నాడట. కానీ, మీ చెయ్యి నరికినందుకు పశ్చాత్తాపపడ్డాడట. కానీ ఏం చేద్దాం సారూ! పేదవాడి గొంతు భగవంతుడిక్కూడా వినబడదు. భూమాత గాలి, నీరు, వెలుగు, ఖనిజం ఇలా తన సమస్త సంపదలనూ జీవజగత్తుకంతా ఇచ్చింది. కానీ కొంతమంది బలవంతులే వాటిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అసమానతలు ఈ భూమి పైన ఉన్నంతవరకూ ఘర్షణలు తప్పవు. యదునందన్ ప్రేయసి ధైర్యం కోల్పోకుండా తన అత్త మామలను చూసుకుంటోంది. మీరు ఇటు వైపు వచ్చిన తరువాత వైఎస్ రెడ్డి పెద్దచెరువుకు వెళ్ళి దౌర్జన్యం చేయబోయాడట. కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు పెద్దచెరువుకు వచ్చి విచారణ జరిపి ఎస్పీ రెడ్డిగారిని ఛీకొట్టి ఆయనను హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ చేయించారట. ఇప్పుడు పెద్దచెరువుకు ఏ పోలీసూ రాడు. ఇదే సారూ, ప్రభుత్వమే ప్రజలను నేరస్తులను చేయడమంటే….. మీకు వాస్తవం తెలపాలనే నేను ఈరోజు ఇంత రహస్యంగా వచ్చింది.” అని చెప్పి రంగారావుగారికి చేతులు జోడించి చీకట్లో కనుమరగయ్యారు.
అర్ధరాత్రి ఒంటి గంట గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు కూతకు మేలుకున్న రంగారావుగారు జ్ఞాపకాలను విదిలించుకుని వాస్తవానికి వచ్చి పడ్దారు. ఆ సంఘటన తరువాత గద్దర్ మళ్ళీ కలవలేదు. కాని రంగారావుగారు మాత్రం తన వృత్తిలో అదే నిజాయితీని, ముక్కుసూటి తనాన్ని, ధైర్యాన్ని వదిలిపెట్టలేదు. గద్దర్ మరణవార్త విని ఇన్ని జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొచ్చాయి ఆయనకు. లేచి పడుకోవడానికి తన గదికి బయలుదేరారు. అనాలోచితంగా టివి ఆన్ చేశారు. అన్ని ఛానెళ్ళలోనూ గద్దర్ దే మరణవార్త.
ఆయన చివరి చూపుకోసం బారులు తీరిన లక్షలాది జనాలు. గద్దర్ గురించి దుఃఖంతో మాట్లాడుతున్న ఆయన సన్నిహితులు, సంఘటనల నాయకులు, రాజకీయ నాయకులు, అభిమానులు. తెలుగు రాష్ట్రాలనుండే కాక దేశం నలుమూలల నుండి గద్దర్ దర్శనానికి వస్తున్న జన ప్రవాహం! మైగాడ్!
గద్దర్ పైన విధించిన సామాజిక నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు జననాట్య మండలి, మావోయిస్ట్ పార్టీవాళ్ళు అన్ని చోట్లా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పరిచినప్పుడు ప్రతి కార్యక్రమానికి లక్షల కొలది అభిమానులు వచ్చినట్టు నివేదికలు వచ్చేవి. గద్దర్ పాటలు, నాట్యాలు సామాన్య ప్రజలనే కాకుండా భూస్వాములను, రాజకీయ నాయకులను, పోలీసులను కూడా ఆకర్షించేవి. పోలీస్ శాఖలోనూ ఎందరో అభిమానులు ఉన్నట్టు ఒక నివేదిక తెలిపింది. గద్దర్ పార్థివ శరీరాన్ని చూడడానికి వచ్చిన గుంపును అదుపు చేయడానికి పోలీసులు కష్టపడుతున్నారు.
నవ్వుకున్నారు రంగారావుగారు. “రియల్లీ గద్దర్ ఈజ్ ఎ లెజెండ్. ఎ డెవిల్ అండ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్ అట్ అ టైమ్” అని తమలో తామే అనుకుంటూ టివి కట్టేసి పడుకుని నిద్రలోకి జారుకున్నారు.
ఇదైన తరువాత ఒక రోజు ఉదయం పదకొండు గంటలకు జైల్ సూపరింటెండెంట్ వజ్రంపేట వెంకటేశ్వరులు ఆఫీసుకు వచ్చారు. సెల్యూట్ కొట్టి ఎదురు కుర్చీలో కూర్చున్నాడు.
వెంకటేశ్వర్లు వజ్రాల వ్యాపారం ఉన్న ఆగర్భ శ్రీమంతుల కుటుంబానికి చేరినవాడు. సికింద్రాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు మొదలైన పట్టణాలలో వాళ్ళ వజ్రాల వ్యాపారాలున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ కోసం వాళ్ళ ఇంటికి వెళతారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళ స్వంత ఊరైన వజ్రంపేట గ్రామంలోని వరి పండే రెండువందల ఎకరాల పంట భూమిని వాళ్ళ కుటుంబం చుట్టుపక్కల ఊళ్ళలోని వ్యవసాయ కార్మికులకు పంచిపెట్టారు. కాబట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళను “దానవంతులు” అన్న విశేషణాన్ని పేరుకు చేర్చి పిలుస్తారు. వీరి కుటుంబంలోని మిగతా వారంతా వ్యాపారం, వ్యవహారాల్లో ఉన్నా వెంకటేశ్వర్లు మాత్రం ప్రిజన్స్ సర్వీసెస్ లో చేరి ప్రస్తుతం సూపరింటెండెంట్ గా పని చేస్తున్నాడు. ఒకింతైనా అహంలేని కరుణామూర్తి. ఎన్నో ఖైదీల కుటుంబాల్లోని పిల్లలు చదవడానికి లక్షల కొలది సొమ్మును దానం చేస్తాడు. జైలులో ఆయన రౌండ్లకు వెళ్ళీనప్పుడు ఆయనను “తండ్రీ” అని పిలుచుకుని చేతులు జోడిస్తారు.
రంగారావుగారిలాంటి జైలర్, వెంకటేశ్వర్లు లాంటి సూపరింటెండెంట్ ఉండడం వల్ల జైలు సజావుగా నడుస్తోంది. తన ఎదుట కూర్చున్న వెంకటేశ్వర్లును ఉద్దేశించి “హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్?” అని రంగారావుగారు అడిగారు.
“గోయింగాన్ ఫైన్ సార్” అని నవ్వుతూ బదులిచ్చిన వెంకటేశ్వర్లు కొనసాగిస్తూ ‘‘బై ది బై ఈ సంవత్సరం స్వాతంత్రోత్సవ దినోత్సవానికి అన్ని జైళ్ళనుండి మంచి నడవడిక ఉన్న ఖైదీల శిక్షను తగ్గించి విడుదల చేయడానికి ఎనభై ఖైదీల లిస్టు తయారుగా ఉంది.మీ అంతిమ నిర్ణయం, సంతకం కోసం ఖైదీల ఫోటోలు, వ్యక్తిగత వివరాలతో ఆ లిస్టు మీ ముందుంచుతున్నాను సర్. మీ సంతకమవగానే నేనే స్వయంగా వెళ్ళి హోం సెక్రెటరి, జైలు మంత్రిగార్ల సంతకం తీసుకొస్తాను ఇంకా రెండు నెలల సమయం ఉందనుకోండి” అని చెప్పి ఫైలు టేబుల్ పైన పెట్టి “మనిషికి తప్పు చేసేటప్పుడు విచక్షణ ఉండదు. తరువాత ఎప్పుడో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆకలి, కామం, ద్వేషం, అసూయ, ప్రేమ, స్వార్థం మొదలైన Natural instincts మనిషిని సామాజిక, నైతిక సీమలను ఉల్లంఘించేటట్టు చేస్తాయి. జంతువులకు లేని బుద్ధి, విచక్షణ, ప్రజ్ఞ మొదలైన పాజిటివ్ గుణాలు మనుషులలో ఉన్నప్పటికీ ఒక్కోసారి Natural Instincts తీవ్రత, ఒత్తిడి పెరిగినప్పుడు మెదడు, శరీరం తమ నియంత్రణను కోల్పోయి అతడు నేరాల్ని చేసేట్టు ప్రేరేపిస్తాయి. నేను సైన్సుతోపాటు హ్యూమన్ సైకాలజీ చదువుకున్నందున మనిషి ప్రవర్తన గురించి నాకు ఎప్పుడూ ఆసక్తి, కుతూహలం. ఖైదీలు, వారి కుటుంబ సభ్యులను చూసినప్పడు మనసు కరుగతుంది సార్. కానీ మన జైలులోని ఖైదీల జీవితాల్ని చూసిన వారి కుటుంబ సభ్యులు తృప్తితో, ఊరటతో వెనుదిరుగుతారు. ఇక్కడ పని చేసే ప్రతి ఒక్కరికీ అదొక గర్వ కారణం సార్. ఇదంతా మీ నిష్ఠ, నిజాయితీల ఫలితం సార్. కార్యక్రమానికి ఎవరిని పిలవాలని మీరు నిర్ణయిస్తే అలా మేము కార్యోన్ముఖలమవుతాం సార్.” అంటూ సెల్యూట్ కొట్టి ఛేంబర్ నుండి వెళ్ళిపోయాడు.
వెంకటేశ్వర్లు అన్న మాటలకు రంగారావు గారి హృదయం ఉప్పొంగింది. మధ్యాహ్న భోజనం తరువాత ఆ ఫైలును చూద్దాం అని దాన్ని పక్కన పెట్టి మిగతా ఫైళ్ళను చూడసాగారు. మధ్యాహ్నం రెండు గంటల షిప్టుకు హాజరైన ఆర్డర్లి వెంకయ్య జైలు వంటగదినుండి భోజనం క్యారియర్ తీసుకొచ్చి యాంటీ చాంబర్ లో భోజనం వడ్డించాడు. మొలకల ఉలవల మసాలా చారు, మునక్కాయల ఫ్రై, ఉడికించిన గుడ్డు, అన్నం, పెరుగులతో భోజనం రుచిగా ఉండింది.
శిక్ష ముగిసిన కొందరు ఖైదీలు ఇళ్ళకు వెళ్లడానికి ఇష్టపడక మరి కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలని అంటారని జైలర్, సూపరింటెండెంట్ చెప్పినప్పుడు రంగారావుగారు తృప్తిగా నవ్వేవారు. భోజనం ముగించి గెస్ట్ హౌస్ ముందు పది నిమిషాలు వాక్ చేసి, ఛేంబర్లోకి వచి వెంకటేశ్వర్లు ఇచ్చి వెళ్ళిన ఫైలును తీశారు. ఒక్కొక్క పుటలో ఒక్కొక్క ఖైదీ ఫోటో చూసి, వారి వివరాలను చదువుతూ పోతున్న రంగారావుగారికి ఐదు పేజీలు ముగించి ఆరవ పేజీవైపు చూసినప్పుడు పైనున్న ఫోటో ఆశ్చర్యం కలిగించింది.
గుబురు మీసాలు, గడ్డం, తీక్ష్ణమైన కళ్ళు, ఎక్కడో దగ్గరనుండి చూసిన మొహం. ఫోటో కింద పేరు పెద్దచెరువు యదునందన్. క్షణకాలం రంగారావుగారికి చెమటలు పట్టాయి. వెంటనే సర్దుకుని వివరాలను చూశారు. అదే వ్యక్తి అని నిర్ధరించుకున్నారు. బిఇ పదవీధరుడు. పదవి తరువాత ఊరికి వచ్చినాక నక్సలైట్లకు ఇన్ఫార్మర్. కొద్ది రోజుల్లోనే సక్రియ నక్సల్ గా అరణ్యంలో అజ్ఞాతవాసం. పీపుల్స్ వార్ గ్రూప్ కమాండర్ గా మందుపాతర పెట్టి ముగ్గుర్ పోలీసుల చావుకు కారణం. తూర్పు గోదావరి జిల్లా జమీందారు మద్దిలోటి భూమారెడ్డి ఇంటికి బాంబు విసిరి భూమారెడ్డిని, ఆయన ఇద్దరు కుటుంబ సభ్యులను చంపడం. నక్సల్ కోంబింగ్ సమయంలో పోలీసుల చేతికి చిక్కి, జీవిత ఖైదు శిక్షతో రాజమండ్రి జైలులో ఉన్నది, అక్కడ పద్డెనిమిది సంవత్సరాలు గడిపి గత మూడు సంవత్సరాలుగా చర్లపల్లి జైలుకు వచ్చింది అన్నీ చదివారు. గత పది సంవత్సరాలుగా అత్యంత మంచి నడవడికగల ఖైదీగా జైలులోని ఇతర ఖైదీలకు పాఠ ప్రవచనాలను బోధిస్తున్నాడని, జైలులో ఉంటూనే ఎం.ఎ (చరిత్ర) చదువుకుని “స్వాతంత్ర పోరాటంలో గాంధీగారి శాంతి అడుగుల ముద్ర” అనే వ్యాసాల పుస్తకానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పురస్కారం పొందాడని ఉన్నాయి.
రంగారావుగారు వెంటనే జైలర్ కు ఫోన్ చేసి ఖైది పెద్దచెరువు యదునందన్ ను రాత్రి ఎనిమిది గంటలకు తన ముందు హాజరు పరచవలసిందిగా చెప్పారు. అటువైపునుండి ఎస్ సర్ అనే గొంతు ప్రతిధ్వనించింది.
రాత్రి ఎనిమిది గంటలకు సరిగ్గా జైలర్ రంగరాజు యదునందన్ ను రంగారావుగారి ముందు హాజర్ పరచాడు. చేతులకు బేడీలు తొడిగించి ఉన్నారు. వాటిని తొలగించమని రంగరాజుకు చెప్పగా “క్షమించండి సార్! పద్ధతి ప్రకారం మేము అలా చేయకూడదు” అని అంటూ జైలరు వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యాడు.
“పద్ధతి పాటించక పోతే మీకు అగౌరవం చూపినట్లవుతుంది. యదునందన్ తన మంచి నడవడిక వలన విడుదలకు అర్హుడైనా కానీ అతడు ఇంకా ఖైదీనే. మీరు అతనితో ఏం మాట్లాడాలన్నా నా ఎదురుగానే మాట్లాడాలి సార్. దయచేసి అన్యథా భావించకండి. నేను సైకాలజి విద్యార్థిని. మనిషి ఆలోచనలు ఏ క్షణంలో ఎలా ఉంటాయో చెప్పలేము. మెదడు ఒక విచిత్రమైన ఆయుధం లాంటిది. మీరు ఇతడిని కలవాలని చెప్పినప్పుడే దీనికేదో నేపథ్యం ఉందనిపిస్తుంది. ఇతడు భోంచేశాడు సార్. మీరింకా భోంచేయాలి” వెంకటేశ్వర్లు మాటలలో తీవ్రమైన ఆదుర్దా కనిపించింది. యదునందన్ నిలబడిన చోటనుండే రంగారావుగారికి నమస్కరించాడు.
“నువ్వెవరివో నాకు తెలుసు. నేనెవరో నీకు తెలుసా?” రంగారావు యదునందన్ మొహం చూస్తూ అడిగారు.
“తెలుసు. మీరు భగవంతుడు. ఈ జైలులో ప్రతి ఒక్కరికీ మీరు భగవంతుడే” యదునందన్ మొహం, గొంతుల్లో ప్రశాంతత కనిపించింది.
“నీ వివరాల్ని చూశాను. వచ్చే ఆగస్ట్ పదిహేనుకు అంటే ఇంకో రెండు నెలలకు నువ్వు విడుదల కానున్నావు.”
“నాకు జీవిత ఖైదు విధించబడింది సార్. దయచేసి నేను చనిపోయేదాకా ఇక్కడే ఉండేలా చేయండి సార్”
రంగారావుగారి మాటలను మధ్యలో తుంచుతూ అన్న యదునందన్ మాటలలో భావుకత నిండి ఉంది.
“నీ కుటుంబం ఎలా ఉంది? ఎక్కడుంది?” నిర్భావుకంగా అడిగారు రంగారావు.
“అన్నీ నేను చెప్తాను సార్!” అంటూ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, రంగారావుగారి దగ్గర కూర్చున్నాడు. రంగారావ్ ఆశ్చర్యంగా అతడి వైపు చూశారు.
“నేను మూడు సంవత్సరాల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఈ యదునందన్ నన్ను ఆకర్షించాడు. కాబట్టి నేను అతడి క్రైం హిస్టరీని కూలంకషంగా పరిశీలించాను. అతడికి సంబంధించిన అన్ని వివరాలను మైక్రో విచారణ గావించాను. ఆ సంఘటన తరువాత అతడు భూగతమయ్యాడు. కాని అతడిని నమ్మి వచ్చిన అమ్మాయి, తల్లి అతడిని కలచివేయసాగారు. వైజాగ్ నౌకా నిర్మాణ కేంద్రంలో ఉన్న తన స్నేహితుడితో మాట్లాడి ఆ అమ్మాయిని అప్పచెప్పాడు. ఇప్పుడా అమ్మాయి తన భర్తతో పాటు ఆ కేంద్రంలో ఇంజనీర్ గా పనిచేస్తోంది. వాళ్ళకో బాబు ఇప్పుడు. పేరు యదునందన్. తన కొడుకును ఐపిఎస్ చదివించాలని ఆ అమ్మాయి ఆశ. ఆ బాబు కూడా ప్రతిభావంతుడే. ఈ యదునందన్ తల్లిని ఆ దంపతులిద్దరూ తమ తల్లికంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. మీకు ఉదయం వీళ్ల లిస్ట్ ఇచ్చి వెళ్ళినప్పుడే మీరు వీడిని కలవాలనుకుంటారని నాకు తెలుసు. నాకు చెప్పమని రంగరాజుకు చెప్పాను.
ఒక్కోసారి కొందరి బ్రతుకుల్లో విచిత్ర సంఘటనలు జరుగుతాయి సార్. దాన్నే ఫేట్ అని అంటారు…”అంటూ వెంకటేశ్వర్లు ఆగారు.
యదునందన్ వెక్కెక్కి ఏడుస్తున్నాడు. రంగరాజు కళ్ళు చెమ్మగిల్లాయి. వెంకటేశ్వర్లు రంగరాజుకు యదునందన్ ను తీసుకెళ్ళమని చెప్పాడు. యదునందన్ వెళ్ళిపోవడాన్నే చూస్తున్న రంగారావు మెల్లిగా “వీడు చాలా సంవత్సరాలుగా దైహికంగా జైలులో ఉన్నాడు. నేను చేసిన తప్పుకు నేను నిరంతరంగా మానసిక జైలు వాసం అనుభవిస్తున్నాను.” అంటూ నిట్టూర్చారు.
“అలా చూస్తే ఈ ప్రపంచం కూడా ఒక జైలే సార్. ఇక్కడ నివసించే ప్రతివాడూ జైల్లో ఉన్నట్టే. బీ కూల్ సార్” అంటూ వెంకటేశ్వర్లు రంగారావుగారిక్ సెల్యూట్ కొట్టి బయలుదేరాడు.
ఇంటి ముందు భాగంలోని తాము రోజూ జాగాలో కూర్చుని రంగరావుగారు ఆకాశంవైపు చూడసాగారు.
![]()

నివృత్త బ్యాంకు అధికారి. హైదరాబాద్ శివార్లలో ఉంటున్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. మాతృభాష కన్నడం.
ఆయన భాషల అభిమాని. బళ్ళారిలో పుట్టినందువల్ల ఆయనకు కన్నడం, తెలుగు రెండూ భాషల పరిచయం కలిగింది. రెండు భాషల్లోనూ సాహిత్య రచనలు చేశారు. ఆయన అనువదించిన కథలు అటు తెలుగు పత్రికలలోనూ, కన్నడ పత్రికలలోను ముద్రణకు నోచుకున్నాయి.
ఆయన కన్నడంలో “మనదర్పణ, అనిసిద్దెల్ల అక్షరదల్లి” అనే రెండు కవితా సంకలనాలను తీసుకువచ్చారు. తెలుగు నుండి “తూర్పుగాలి, మంచుపువ్వు, తపన” నవలలను కన్నడంలోకి అనువదించారు. దేవరకొండ బాలగంగాధర తిలక్ “అమృతం కురిసిన రాత్రి”, మామిడి హరికృష్ణ “ఒంటరీకరణ” కవితలను కన్నడంలోకి అనువదించి పుస్తకాలుగా తీసుకొచ్చారు. ఆయన కన్నడం నుండి అనువదించిన కస్తూర్ బా గారి ఆత్మచరిత్ర “నేను కస్తూర్ బా ని”, అనువాద కథా సంకలనాలు “అత్తర్” “నలుగురికి చేరిన కథలు” “గుడిగంట” “మండే మంటకు ఒళ్ళంతా నోరు”, నవల “వేర్లు” వెలువడ్డాయి.
“గీతలోని మార్గదర్శకాలు” అనే శీర్షికన “కర్తవ్య బోధన, స్థితప్రజ్ఞత, త్రిగుణాలు, నిత్య జీవన గీత ” అనే నాలుగు పుస్తకాలను స్వంతంగా రాశారు. వాటిలో “స్థితపజ్ఞత. త్రిగుణాలు” గుంటూరు నుండి వెలువడుతున్న ఆధ్యాత్మిక పత్రిక “విశ్వధర్మ వాణి” పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. ”ఉపనిషత్తుల సారం” అనే పుస్తకాన్ని కన్నడం నుండి అనువదించారు. అనువాద కృషికి గాను 2019 లో గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం పొందారు. స్థానిక ఓం భం ట్రస్ట్ వారు ఆయన అనువాద కృషిని గుర్తిస్తూ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.






























