హిందీ మూలం : మున్షీ ప్రేమ్ చంద్ కథ ‘బడే భాయ్ సాహిబ్’
అనువాదం : తిరువాయపాటి రాజగోపాల్
మా పెద్దన్నయ్య నాకంటే ఐదేళ్లుపెద్ద. నాకు తొమ్మిదేళ్లు, వాడికి పద్నాలుగు. ఐదేళ్లు పెద్దవాడైనా బడిలో మాత్రం మూడు తరగతులే ముందుండేవాడు. నేనే వయసులో చదువు మొదలెట్టానో వాడూ అదే వయసప్పుడే బడికెళ్ళడం ఆరంభించాడు. ‘చదువు’ అనే అతి ముఖ్యమైన వ్యవహారాన్ని అంత సులువుగా దాటేసుకుంటూ వెళ్లడం వాడికి ఇష్టం ఉండేది కాదేమో! భవిష్యత్తులో నిర్మించబోయే మహా భవనానికి పునాది గట్టిగా ఉండాలి కదా అనుకున్నట్టు ఏడాది చదువును రెండేళ్లు సాగించేవాడు; కొన్నిసార్లు మూడు సంవత్సరాలు కూడా పట్టేది.
వయసులో పెద్దవాడు కదా– ఆ హక్కుతో నన్ను కనిపెట్టుకుని ఉండడం, నాకు బుద్ధులు చెప్పడం తన బాధ్యతగా భావించేవాడు. వాడు చెప్పిన ప్రతి మాటను నేను ఆజ్ఞలా పాటించాల్సిందే.
అదేదో వాడి నైజం అన్నట్టు చదువు విషయంలో బాగా శ్రమించేవాడు నిత్యం ఒక పుస్తకం ముందేసుకుని కూర్చునే ఉండేవాడు. చదివి చదివి అలసిపోయిన మెదడుకు కాస్త విశ్రాంతి ఇవ్వడానికేమో, అప్పుడప్పుడూ తన నోటుపుస్తకం పేజీ అంచుల్లో పక్షుల బొమ్మలు, కుక్కల బొమ్మలు, పిల్లుల బొమ్మలు గీస్తుండేవాడు. ఒక్కోసారి ఏదో ఒక పేరు, పదం, వాక్యం పది ఇరవైసార్లు రాస్తుండేవాడు. ఏదైనా పద్యపాదాన్ని అందమైన అక్షరాలతో మళ్లీ మళ్లీ రాసేవాడు. కొన్నిసార్లు అర్థమూ, పొంతనా లేని కొత్త కొత్త పదాలను సృష్టించేవాడు.
ఇక నా సంగతైతే— చదువంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పుస్తకం తీసుకుని గంటసేపు దాని ముందు కూర్చోవడమే నాకు మహా కష్టంగా ఉండేది.
అవకాశం దొరికితే చాలు హాస్టల్ నుంచి బయటకు జారుకుని ప్లే గ్రౌండ్ కు వెళ్లిపోయేవాడిని. గోళీలాట , గాలిపటాలు ఎగరేయడం, లేదంటే ఏ స్నేహితుడినైనా కలవడం—ఇంతకంటే సరదా ఇంకేముంటుంది?
కానీ, గదికి తిరిగొచ్చినప్పుడు కోపంగా మా పెద్దన్నయ్య ముఖం కనిపించగానే నాకు దడ పుట్టేది.
వచ్చీ రాగానే వాడి మొదటి ప్రశ్న- “ఎక్కడికి వెళ్లావు?”
ఎప్పుడూ అదే ప్రశ్న; అదే గద్దింపు.
మౌనం తప్ప నా దగ్గర మరే సమాధానమూ ఉండేది కాదు దానికి.
‘బయటికి వెళ్లి ఆడుకుని వస్తున్నాను’ అని చెప్పడానికి నా నోరు ఎందుకు పెగిలేది కాదో నాకు ఇప్పటికీ అర్థం కాదు.
చేసిన తప్పుకు అంగీకారమా అన్నట్టుండేది నా మౌనం . దానికి మా అన్నయ్య దగ్గర ఉన్న ఏకైక చికిత్స- కోపం గా బారెడు ఉపదేశం:
“ఇంగ్లీషు ఇలా చదివితే జీవితాంతం చదువుతూనే ఉంటావు. ఒక్క మాట కూడా సరిగ్గా నేర్చుకోలేవు! ఇంగ్లీషు అంటే నవ్వులాట కాదు. ఎవడుపడితే వాడు నేర్చేసుకునే విషయం కాదు. రేయింబవళ్లు నిద్ర లేకుండా చదవాలి. నీ శక్తినంతా ధారపోయాలి. అప్పుడు గానీ ఆ భాష కొద్దిగా పట్టుబడదు. అంత కష్టపడ్డా నీకు అబ్బేది కేవలం ఇంగ్లీషు వచ్చునని చెప్పుకోవడానికి సరిపడేంత మాత్రమే!
బాగా చదువుకున్నవాళ్ళైనా తప్పుల్లేకుండా ఇంగ్లీషు రాయలేరు; ఇంగ్లీషు లో మాట్లాడ్డం సంగతి అలా వొదిలెయ్….
నన్ను చూసైనా నేర్చుకోలేవా? చదువులో నేను ఎంతగా కష్టపడుతున్నానో నీ కళ్లతో చూస్తున్నావు కదా! బుద్ధిలేనితనం కాదా నీది.
నాటకాలు, జాతరలు ఎన్ని జరిగినా నేను వాటికి వెళ్లడం ఎప్పుడైనా చూశావా?
క్రికెట్, హాకీ మ్యాచ్‌లు ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి. నేను వాటి దరిదాపుల్లోకైనా వెళ్లను. ఎప్పుడూ చదువుతూనే ఉంటాను. అయినా ఒక తరగతి పూర్తి చేయడానికి నాకు రెండేళ్లు, కొన్నిసార్లు మూడేళ్లు పడుతోంది.
మరి నువ్విలా సమయమంతా ఆటల్లో వృథా చేస్తూ ఉంటే ఎలా పాసవుతావు? నాన్నగారు కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా వృథా చెయ్యొచ్చా?”
ఇలాంటి చివాట్లు తినేసరికి నాకు ఏడుపొచ్చేది.
హితబోధ చేయడంలో మా అన్నయ్యకు అసాధారణమైన నేర్పు ఉండేది. వ్యంగ్యంతో కూడిన మాటలు అలవోకగా విసిరేవాడు; ఎంత మంచి సలహా ఇచ్చినా అది నా మీద అలా కూలిపోయేది. నా ఉత్సాహం చచ్చిపోయేది. ధైర్యం ఆవిరైపోయేది.
“ఇక ఈ చదువు నా వల్ల కాదు. స్కూలు వదిలేసి ఇంటికి పారిపోతే పోలా? శక్తికి మించిన పనితో జీవితం ఎందుకు పాడుచేసుకోవాలి?” అనిపించేది.
గంటలోనో , కాకుంటే రెండుగంటల్లోనో ఆ నిరాశ తొలగిపోయేది. శక్తివంచన లేకుండా చదవాలని నిర్ణయించుకునే వాడిని.
అంతే .. వెంటనే ఒక టైమ్‌టేబుల్ తయారు చేసేవాడిని. ఏ పనినైనా ఒక ప్రణాళిక, రూపురేఖ ఉండాలిగా? నా టైమ్‌టేబుల్‌లో ఆట అనే పదానికే చోటు ఉండేది కాదు.
తెల్లవారుజామున లేవాలి.. ఆరు గంటలకు ముఖం కడుక్కుని, కాస్త తినాలి. వెంటనే చదువుకు కూర్చోవాలి.
ఆరు నుంచి ఎనిమిది- ఇంగ్లీషు.
ఎనిమిది నుంచి తొమ్మిది- లెక్కలు.
తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర- చరిత్ర..
ఆ తరువాత భోజనం చేసి స్కూలుకు వెళ్లాలి.
ఇక సాయంత్రం మూడున్నరకి స్కూలు నుంచి తిరిగి వచ్చాక అరగంట విశ్రాంతి.
నాలుగు నుంచి ఐదు- భూగోళశాస్త్రం.
ఐదు నుంచి ఆరు- వ్యాకరణం.
ఆరు నుంచి ఆరున్నర- హాస్టల్ ముందు కాసేపు నడక.
ఆరున్నర నుంచి ఏడు- ఇంగ్లీషు వ్యాసరచన.
ఆ తరువాత భోజనం..
ఎనిమిది నుంచి తొమ్మిది- అనువాదం.
తొమ్మిది నుంచి పది- హిందీ.
పది నుంచి పదకొండు- ఇతర పాఠాలు. తరువాత నిద్ర.’’
అయితే టైమ్‌టేబుల్ తయారు చేయడం వేరు, దాన్ని పాటించడం వేరు కదా!
మొదటి రోజునుంచే దాన్ని బేఖాతరు చెయ్యడం ఆరంభం అయ్యింది.
ఆహ్వానిస్తున్నట్టున్న ఆటస్థలంలోని పచ్చిక బయలు, ఆహ్లాదకరంగా వీచే గాలి, ఫుట్‌బాల్ మైదానంలోని సందడి, ప్రిజనర్స్ బేస్ ఆటలోని ఉత్కంఠభరితమైన ఎత్తుగడలు, వాలీబాల్లోని వేగం, హడావిడి- ఇవన్నీ నన్ను ఏదో మాయలో పడేసి తమవైపు లాగేసేవి.
అక్కడికి వెళ్లగానే అన్నీ మర్చిపోయేవాడిని. ప్రాణాలు తీసేంత కఠినమైన ఆ టైమ్‌టేబుల్, కళ్లకు అలసట కలిగించే ఆ పుస్తకాలు, ఏవీ గుర్తుండేవి కావు.
ఇక మా అన్నయ్యకు ఉపన్యాసాలు ఇవ్వడానికి, చివాట్లు పెట్టడానికి మళ్లీ ఒక అవకాశం దొరికేది.
నేను వాడికి కనిపించకుండా ఉండేందుకు జాగ్రత్తపడేవాడిని. సాధ్యమైనంత దూరంగా తిరిగేవాడిని. గదిలోకి కూడా అతనికి తెలియకుండా పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లే వాడిని. వాడి కంట పడ్డానో నా పని అయిపోయినట్టే!
ఏడాది చివరి పరీక్షలు వచ్చాయి. మా అన్నయ్య ఫెయిల్ అయ్యాడు. నేను పాసయ్యాను. అంతేకాదు- నా తరగతిలోనే మొదటి స్థానం సంపాదించాను.
అంటే , స్కూల్లో ఇప్పుడు మా అన్నయ్య కీ నాకూ రెండు తరగతులే తేడా. నాలో కాస్త గర్వం పొడసూపడం సహజమే కదా! నిజం చెప్పాలంటే నా అహంకారం కాస్త పెరిగింది. మా అన్నయ్య నాపై చెలాయించే అధికారం ఇక ముగిసినట్టేలే అనిపించింది.
ఆటల్లో స్వేచ్ఛగా పాల్గొనడం మొదలుపెట్టాను. ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఒకరోజు ఉదయం మొత్తం కర్రా బంతీ ఆట ఆడి, సరిగ్గా భోజనం వేళకి గదికి తిరిగి వచ్చాను.
మా అన్నయ్య మాత్రం ఒక కత్తీ డాలూ పట్టుకుని నాపైకి దూకబోతున్న వీరుడిలా నా వైపు చూసి అన్నాడు-
‘‘నువ్వు పాసై ఉండొచ్చు, క్లాసు లో ‘ఫస్టు’ వచ్చి ఉండవచ్చు.. దాంతో నీకు పొగరు పట్టుకుంది. చూడు తమ్ముడూ- ఎంతటి గొప్పవాళ్లయినా తమ అహంకారానికి పశ్చాత్తాప పడే రోజొకటి వస్తుంది.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత? రావణాసురుడికేమైందో చదవలేదా? పరీక్ష పాసవడం మాత్రమే గొప్ప విషయం కాదు. అంతకన్నా కావాల్సింది నీ బుద్ధిని పెంచుకోవడం. నువ్వు చదివేదాని అర్థం ఏమిటో తెలుసుకోగలగడం. రావణుడు ఈ భూమండలానికే అధిపతి. అలాంటి రాజులను లోకాధిపతులు అంటారు. భూలోకంలోని రాజులందరూ అతనికి కప్పం కట్టేవారు. గొప్ప గొప్ప దేవతలు సైతం అతని సేవకులుగా ఉండేవారు- అగ్నిదేవుడు, వరుణుడు కూడా అతని ఆధీనంలోనే! మరి చివరికి అతనికి ఏమైంది? అహంకారం అతన్ని పూర్తిగా నాశనం చేసింది. అతని పేరును కూడా మిగలనివ్వలేదు. చివరికి అతని అంత్యక్రియలను సరిగ్గా నిర్వహించడానికి కూడా ఎవరూ మిగలలేదు. పాపం చేసినా చెయ్యొచ్చు గానీ తల పొగరు మాత్రం కూడదు. అహంకారం తలకెక్కితే ఈ లోకాన్నీ పోగొట్టుకుంటాడు, పరలోకాన్నీ పోగొట్టుకుంటాడు.
నువ్వు ఒక్క తరగతి పైకి వెళ్లావు. అంతే- దానికే నీకు పొగరెక్కింది నేను ఫెయిల్ అయ్యాను కదా అని నేను తెలివితక్కువవాడిననీ, నువ్వు తెలివైనవాడివనీ అనుకోకు.
నువ్వు నా తరగతికి వచ్చినప్పుడు చూడు- బీజగణితం, రేఖాగణితం, ఇంగ్లీషు చరిత్ర… వీటితో నీకు చుక్కలు కనిపిస్తాయి.
రాజుల పేర్లు గుర్తుపెట్టుకోవడం అంత సులభమని అనుకుంటున్నావా? హెన్రీలు ఎనిమిది మంది ఉన్నారు. ఎనిమిది మంది హెన్రీల కాలంలో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోవడం అంత తేలికా? ఏడవ హెన్రీ బదులు ఎనిమిదవ హెన్రీ అని రాసావంటే- సున్నా!
జేమ్స్‌లు ఎంతమంది ఉన్నారో తెలుసా? విలియమ్స్ ఎంతమంది! చార్లెస్‌లు లెక్కే లేదు!
వాళ్ల పేర్లు వింటూ ఉంటే మెదడు గిరగిరా తిరుగుతుంది. రాజులందరికీ పేర్లు సరిపోలేదేమో! ఒక పేరు పెట్టేసి ఊరుకోకుండా, దాని వెనక రెండవవాడు, మూడవవాడు, నాలుగవవాడు, ఐదవవాడు అంటూ తగిలించాల్సిందే!
ఎవరైనా నన్ను అడిగితే వేల పేర్లు వరుసగా చెప్పగలను.
ఇక Geometry సంగతా? దేవుడే దిక్కు! ‘A B C’ రాయాల్సిన చోట ‘A C B’ అని రాశావనుకో- నీ సమాధానం మొత్తం తప్పే! ఈ లంబరేఖను మరో రేఖకు ఆనిస్తే అది ఆధారరేఖకు రెండింతలు అవుతుందట! అసలు దానివల్ల ప్రయోజనం ఏమిటో చెప్పు! రెండింతలు కాకపోతే నాలుగింతలు అవుతుందా? సగం అవుతుందా? మనకెందుకు ! కానీ ఏం చేస్తాం.. పరీక్ష పాసవ్వాలంటే ఇవన్నీ కంఠస్థం చేసుకోవాల్సిందే.
ఇంకా ఏమంటారో తెలుసా? ‘సమయపాలన అనే అంశంపై కనీసం నాలుగు పేజీలకు తగ్గకుండా వ్యాసం రాయండి.’
అంతే! నువ్వు నోటుపుస్తకం తెరిచి ముందుంచుకోవాలి. కలం చేతిలోకి తీసుకోవాలి. ఇక ఆ వ్యవహారం మీదే కూర్చోవాలి. సమయపాలన మంచిదని ఎవరికి తెలీదని? మనిషి జీవితం సమయపాలనతో క్రమబద్ధంగా సాగితే అతని పనులు కూడా సక్రమంగా సాగుతాయి, దాని వల్ల ఇతరులు అతన్ని ఇష్టపడతారు.. మరి అంత చిన్న విషయాన్ని నాలుగు పేజీల్లో ఎలా రాయాలి? ఒక వాక్యంలో చెప్పగలిగిన విషయానికి నాలుగు పేజీలు అవసరమా? అది సమయాన్ని ఆదా చేయడం కాదు- సమయాన్ని వృథా చేయడం! మనిషి చెప్పాల్సినది త్వరగా చెప్పేసి, తన పనిలోకి వెళ్లిపోవాలి కదా !
ఒకవైపు ‘సంక్షిప్తంగా రాయండి’ అంటారు. మరోవైపు ‘కనీసం నాలుగు పేజీలు రాయండి’ అంటారు. అదెలా? ‘సమయపాలనపై సంక్షిప్త వ్యాసం రాయండి- కనీసం నాలుగు పేజీలకు తగ్గకుండా!’ ఇదంతా గందరగోళం కాదంటావా? నువ్వు నా తరగతికి వచ్చినప్పుడు అసలు సంగతేమిటో తెలుస్తుంది. అప్పుడు నిజంగా నీకు చుక్కలు కనిపిస్తాయి.
ఈసారి నువ్వు ఫస్ట్ డివిజన్లో పాసయ్యావని ఇంతగా ఉబ్బిపోతున్నావు. నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను. నేను ఫెయిల్ అయ్యాను- అవును. కానీ నీకంటే పెద్దవాడిని కదా! ఈ ప్రపంచం గురించి నీకంటే నాకు ఎక్కువ అనుభవం ఉంది. నేను చెప్పే మాటలను మనసులో పెట్టుకో. లేకపోతే తరువాత బాధపడతావు.”
ఇంతలో స్కూలుకు వెళ్లే టైమైంది.. లేకపోతే ఆ ఉపన్యాస పరంపర ఎప్పుడు ముగిసేదో దేవుడికే తెలియాలి!!
ఆ రోజు నాకు భోజనం మీద కూడా పెద్దగా ఆసక్తి లేకపోయింది. నేను పాసయ్యాకే ఇంతగా చివాట్లు తింటే, ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే నా ప్రాణాలకే ముప్పు వచ్చేదేమో!
తొమ్మిదో తరగతి చదువు గురించి మా అన్నయ్య చేసిన భయంకరమైన వర్ణన నన్ను బాగా భయపెట్టింది. ఆ రోజు నేను స్కూలు వదిలేసి ఇంటికి పారిపోకపోవడం నిజంగా ఆశ్చర్యమే! అయితే ఇంతటి చివాట్లు తిన్నప్పటికీ పుస్తకాల మీద నాకు ఉన్న అయిష్టం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.ఆడుకోవడానికి ఒక్క అవకాశం కూడా వదిలిపెట్టలేదు.
నేనూ బాగానే చదువుతాను.. కాకపోతే చాలా తక్కువ.. ఏదోలా ఆ రోజు ఒప్పజెప్పాల్సిన పాఠం పూర్తిచేసి, తరగతిలో పరువు పోకుండా ఉండటానికి సరిపడా మాత్రమే చదివేవాడిని. అయితే అప్పటివరకు నాలో ఉండిన ఆత్మవిశ్వాసం మాత్రం అడుగంటి పోయింది. ఆ తరువాత నా జీవితం ఒక దొంగ జీవితం అయిపోయింది- ఎప్పుడూ ఏదో ఒకటి దాచిపెట్టుకుంటూ, అన్నయ్య కంటపడకుండా జాగ్రత్తపడుతూ!
మళ్లీ ఏడాది చివరి పరీక్షలు వచ్చాయి. ఏం జరిగిందో ఏమో- మళ్లీ నేను పాసయ్యాను. అన్నయ్య మళ్లీ ఫెయిల్ అయ్యాడు. నేను పెద్దగా చదివిందేమీ లేదు. అయినా ఎలాగోలా ఫస్ట్ డివిజన్లో పాసయ్యాను. నాకే ఆశ్చర్యం వేసింది. మా అన్నయ్య మాత్రం చచ్చేలా చదివాడు.. సిలబస్‌లోని ప్రతి పదాన్నీ కంఠస్థం చేసేవాడు. రాత్రి పది గంటల వరకు చదివి, మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి చదవడం మొదలుపెట్టేవాడు. స్కూలుకు వెళ్లే ముందు ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు కూడా చదువుతూనే ఉండేవాడు.
అయినా పాపం మళ్లీ ఫెయిల్ అయ్యాడు. అతని మీద నాకు చాలా జాలేసింది. ఫలితాలు తెలిసిన వెంటనే అతను కుంగిపోయి ఏడ్చాడు. నేను కూడా ఏడ్చాను. నేను పాసైన ఆనందం సగానికి సగం తగ్గిపోయింది.
ఇక మా ఇద్దరి మధ్య ఒకే ఒక్క తరగతి తేడా మిగిలింది. అప్పుడొక రాకూడని పాడు ఆలోచన నా మనసులోకి వచ్చింది- “ఇంకోసారి అన్నయ్య ఫెయిల్ అయితే, నేను అతని తరగతిలోకే వచ్చేస్తాను. అప్పుడు నన్ను మందలించడానికి అతనికి ఏ హక్కుంటుంది?”
అయితే ఆ నీచమైన ఆలోచనను వెంటనే విదిలించేశాను. ఏది ఏమైనా వాడు నన్ను మందలించేది నా మేలు కోసమే కదా! తిడుతున్నప్పుడు వాడి మాటలు బాధ కలిగించినా, నేను ఇంత సులభంగా, ఇంత మంచి మార్కులతో పాసవ్వడానికి వాడిచ్చిన సలహాలే కారణమేమో.
అటు తరువాత మా అన్నయ్య నాతో చాలా సున్నితంగా వ్యవహరించసాగాడు. నన్ను మందలించడానికి సందర్భం వచ్చినా, చాలాసార్లు కోపం తెచ్చుకోకుండా చెప్పేవాడు. బహుశా తనకు ఇక మునుపటిలా నాపై అధికారం లేదని అతనికే అర్థమవుతుండొచ్చు. కనీసం, గతంలో ఉన్నంత అధికారం లేదని.
దాంతో నా స్వేచ్ఛ పెరిగింది. అతని సహనాన్ని నేను కూడా కొంచెం దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాను.
“ఇక నేను చదివినా చదవకపోయినా వచ్చే పరీక్షలో పాసైపోతాను. నా అదృష్టం బాగుంది!” అన్న భావన నాలో మెల్లగా బలపడింది. దాని ఫలితంగా, ఇంతకుముందు అన్నయ్య భయంతోనైనా కాస్త చదివే వాణ్ణి కదా- అదికూడా మానేశాను.
ఇప్పుడు నా కింకో కొత్త సరదా దొరికింది- గాలిపటాలు ఎగరేయడం! నా సమయమంతా గాలిపటాలకే అంకితం.
అన్నయ్య దగ్గర మాత్రం నా పద్ధతులు మర్యాదగానే ఉండేవి. గాలిపటాలు ఎగరేస్తున్న సంగతి వాడికి తెలీకుండా జాగ్రత్తపడేవాడిని.
గాలిపటాల పోటీకి సిద్ధమవుతూ రహస్యంగా ఎన్నో పరిశోధనలు చేసేవాడిని- దారాన్ని ఎంత బలంగా కట్టాలి, ఎలా బిగించాలి, ఎదుటివాడి గాలిపటాన్ని తెంచేందుకు గాజు పొడి కలిపిన మాంజాను దారానికి ఎలా పూయాలి… ఇలాంటి విషయాల మీదే నా ఆలోచనంతా. అన్నయ్య మీద నాకు ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గలేదని అతనికి అనిపించాలి. అది మాత్రం నాకు చాలా ముఖ్యం.
ఒకరోజు హాస్టల్‌కు చాలా దూరంగా, ఒక గాలిపటాన్ని పట్టుకోవడానికి పిచ్చివాడిలా పరుగెత్తుతున్నాను.
నా వెనక ఒక పెద్ద సైన్యంలా పిల్లల గుంపు పరుగెత్తుకొస్తోంది. చేతుల్లో పొడవాటి, లావాటి వెదురు కర్రలు. గాలిపటం ఎక్కడ పడుతుందో, ఎవరు ముందు ఉన్నారో, ఎవరు వెనక ఉన్నారో- ఎవరికీ పట్టడం లేదు.
అంతలో ఒక్కసారిగా- మా అన్నయ్యతో ఢీకొన్నాను!
బహుశా మార్కెట్ నుంచి తిరిగి వస్తున్నాడేమో వాడు. నా చెయ్యి పట్టుకుని కోపంగా అన్నాడు-
“ఒక్క పైసా విలువ చేసే గాలిపటం వెంట ఇలా వీధుల్లో పరిగెత్తడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు ఇప్పుడు చిన్న తరగతిలో లేవన్న సంగతి మర్చిపోయావా? ఇప్పుడు ఎనిమిదో తరగతిలో ఉన్నావు. నా కంటే ఒక్క తరగతి మాత్రమే వెనక. తెలివైనవాడివి- అందులో సందేహం లేదు. కానీ ఆ తెలివి నీ ఆత్మగౌరవాన్నే నాశనం చేస్తే దాని ప్రయోజనం ఏమిటి?
‘అన్నయ్య కంటే నేను ఒక్క తరగతి మాత్రమే వెనుక ఉన్నాను. ఇక నన్ను ఏమీ అనడానికి ఆయనకు హక్కు లేదు.’ అని బహుశా నీ మనసులో అనుకుంటున్నావేమో.
అక్కడే ఉంది నీ తప్పటడుగు — నేను నీకంటే ఐదేళ్లు పెద్దవాడిని. ఈరోజే నువ్వు నా తరగతిలోకి వచ్చేసినా, మన మధ్య ఉన్న ఆ ఐదేళ్ల వయసు తేడాను- దేవుడే కాదు, నువ్వు కూడా- తొలగించలేవు. నేను నీకంటే ఐదేళ్లు పెద్దవాడిని. ఎప్పటికీ అలాగే ఉంటాను.
జీవితం గురించి, ప్రపంచం గురించి నాకు ఉన్న అనుభవాన్ని నువ్వు ఎప్పటికీ అందుకోలేవు. నువ్వు ఎం.ఏ. చేసినా, డి.లిట్ చేసినా, పీహెచ్.డి. చేసినా సరే. అనుభవం పుస్తకాలు చదవడం వల్ల మాత్రమే రాదు.
మన అమ్మ ఏ తరగతీ పాసవ్వలేదు. నాన్నగారు కూడా బహుశా ఐదో తరగతి దాటి ఉండరు. కానీ మనం ప్రపంచంలోని జ్ఞానమంతా చదివేసినా, మన అమ్మానాన్నలకు మాత్రం మనకు బుద్ధి చెప్పి, మన తప్పులు సరిదిద్దే హక్కు ఎప్పటికీ ఉంటుంది. కేవలం వాళ్ళు మన తల్లి దండ్రులు అయినందుకు కాదు- ప్రపంచాన్ని మనకంటే ఎక్కువగా చూసి, అనుభవించారు కాబట్టి. అమెరికాలో ఏ ప్రభుత్వం ఉందో వాళ్లకు తెలియకపోవచ్చు. ఆకాశంలో ఎన్ని నక్షత్ర సమూహాలున్నాయో తెలియకపోవచ్చు. కానీ మనకంటే వాళ్లకు బాగా తెలిసిన విషయాలు వెయ్యి ఉంటాయి.
ఖర్మ కొద్దీ నాకు ఈరోజు ఏదైనా జబ్బు చేసిందనుకో , అప్పుడు నీకు ఏం చేయాలో తోచదు. నాన్నగారికి టెలిగ్రామ్ పంపడం తప్ప నీకు మరో ఆలోచన రాదు. కానీ నీ స్థానంలో నాన్నగారు ఉంటే? టెలిగ్రాములూ గట్రా ఆయన చెయ్యరు; కంగారుపడరు, గందరగోళానికి గురికారు. ముందుగా వ్యాధి ఏమిటో తనకుతానే అంచనా వేసి, ఏదైనా మందు ప్రయత్నిస్తారు. అది పనిచేయకపోతే డాక్టర్ని పిలుస్తారు.
మరి మనిద్దరి సంగతి చూడు! నాన్నగారు పంపే డబ్బు నెలాఖరు వరకూ ఎలా సరిపెట్టుకోవాలో కూడా మనకు తెలియదు. ఆయన పంపినదంతా ఖర్చు చేసేసి, చేతులు ఖాళీ చేసుకుని కూర్చుంటాం.
కానీ మనం ఈరోజు ఎంత ఖర్చు చేస్తున్నామో అంతకంటే ఎంతో తక్కువతోనే నాన్నగారు తన జీవితంలో ఎక్కువ భాగాన్ని గౌరవంగా, మంచి పేరుతో గడిపారు. అంతేకాదు, ఆ ఆదాయంతోనే ఒక కుటుంబాన్ని పోషించారు. అందుకే రా తమ్ముడా- నాతో సమానమైపోయానని, స్వతంత్రుడినైపోయానని గర్వపడకు. నువ్వు దారి తప్పకుండా చూసే బాధ్యత నాదే. ఇదంతా నీకు నచ్చకపోతే… ఇది నాకు ఉపయోగించడం వచ్చు!”
అంటూ తన పిడికిలిని చూపించాడు.
కానీ ఈసారి వాడు మాట్లాడిన తీరు నన్ను సిగ్గుపడేలా చేసింది; నేను ఎంత అల్పుడినో నాకు అర్థమైంది. మా అన్నయ్య పట్ల నా హృదయంలో ఒక కొత్త గౌరవం పుట్టింది.
కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అన్నాను- “లేదు, లేదు… నువ్వు చెప్పింది పూర్తిగా నిజం. ఆ మాటలు చెప్పే హక్కు నీకు ఉంది.”
మా అన్నయ్య నన్ను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నాడు.
“నిన్ను గాలిపటాలు ఎగరేయొద్దని నేను అనడం లేదు. నాకూ గాలిపటాలు ఎగరేయాలని ఉంటుంది. కానీ ఏం చేయను? నేనే దారి తప్పిపోతే, నిన్ను ఎలా కనిపెట్టుకుంటాను? నిన్ను కనిపెట్టుకుని ఉండడం నా బాధ్యత.”
అంతలో అనుకోకుండా ఒక తెగిపోయిన గాలిపటం మా మీదుగాగాలిలో ఎగురుతూ వెళ్లింది. దాని దారం కిందకు వేలాడుతోంది. దాని వెంట ఒక గుంపు పిల్లలు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. మా అన్నయ్య బాగా పొడగరి. ఎగిరి ఆ దారాన్ని పట్టుకున్నాడు వాడు. ఆ వెంటనే హాస్టల్ వైపు తన శక్తినంతా ఉపయోగించి పరుగెత్తడం మొదలుపెట్టాడు.
వాడి వెనకే నేనూ పరుగు మొదలెట్టాను….
![]()

కవిత్వం, కథలు, అనువాదాలు (కథలు కవితలు) రాస్తుంటారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికల ఎడిట్ పేజీల్లో, ఆదివారం అనుబంధాలలో వ్యాసాలు రాస్తుంటారు. 2013 లో ‘వెన్నెల్లో మంచుపూలు’ (కవితా సంపుటి), 2024 లో ‘ఆఖరి స్నేహితుడు’ (కథా సంపుటి), 2025లో ‘100 కబీర్ కవితలు’ ప్రచురించారు. 1975 లో SV University నుండి MA English Literature పట్టా అందుకున్నారు. 1977 నుండి 2013 దాకా State Bank of India లో
ఉద్యోగం. కడప, తిరుపతి, శ్రీకాళహస్తి తదితర ఊళ్లలో పనిచేశారు.































