రష్యన్ మూలం : అంతోన్ చేహొవ్
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్
భూముల సర్వేయర్ గ్లేబ్ గవ్రీలవిచ్- గ్నితాష్కి స్టేషన్ కు చేరుకున్నాడు. సర్వేచేసి సరిహద్దులు నిర్ణయించడానికి అతణ్ణి పిలిపించిన ఎస్టేటు చేరుకోడానికి ఇంకా సుమారు ముప్ఫై నలభై వేర్త్స్ లు గుర్రబ్బండిలో ప్రయాణం చేయాల్సి వుంటుంది. (బండి తోలేవాడు తాగకుండా వుంటే, గుర్రాలు బలహీనంగా లేకపోతే సుమారు ముప్ఫై వేర్త్స్ లు వుంటుంది. బండి తోలేవాడు తాగివుంటే గుర్రాలు అలిసిపోయివుంటే కచ్చితంగా యాభై వేర్త్స్ లు వుంటుంది.)
‘‘ఇక్కడ అద్దెకు గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి.. దయచేసి చెప్పండి!’’ అని స్టేషన్ పోలీసును అడిగాడు సర్వేయర్.
‘‘ఏంటీ? అద్దెకు గుర్రాలా? ఈ చుట్టుపట్ల వంద వేర్త్స్ ల వరకూ కనీసం ఒక కుక్క కూడా కనిపించదు. ఇక, అద్దెగుర్రం సంగతి చెప్పనక్కరలేదు… ఇంతకూ ఎక్కడికెళ్లాలి మీరు?’’
‘‘దేఫ్కినో. జనరల్ ఖొఖొతోవ్ ఎస్టేటుకు.’’
‘‘అవునా?’’ పోలీసు ఆవులించాడు. ‘‘స్టేషన్ వెనకాలకు వెళ్లండి. అక్కడ ఆవరణలో అప్పుడప్పుడూ ప్రయాణీకులను తీసుకెళ్లేవాళ్లు వుంటారు.’’
సర్వేయర్ నిట్టూర్చి బయటికొచ్చి స్టేషన్ వెనుకవైపుగా నడిచాడు. చాలాసేపు వెతికి, మాట్లాడి, సంకోచం తీరిన మీదట చిరిగిన కోటు, నారచెప్పులు ధరించి విచారంగా మసూచి మచ్చలున్న ఒక దృఢకాయుడు కనిపించాడు.
‘‘మీ దగ్గర ఎలాంటి బండి వుందో దేవుడికెరుక!’’ బండి ఎక్కుతూ సర్వేయర్ ముఖం చిట్లించి ‘‘ముందు భాగమేదో, వెనక భాగమేదో తెలీటం లేదు’’ అన్నాడు సర్వేయర్.
‘‘తెలుసుకోడానికేముంది? గుర్రం తోక ఎక్కడుందో అది ముందు భాగం. తమరు కూచున్న చోటు వెనుక భాగం’’..
గుర్రం చిన్నది. బక్కగా వుంది. కాళ్లు వంకరగా వున్నాయి. చెవులు కొరికినట్లున్నాయి. బండివాడు కొంచెం నిక్కి తాడుతో పేనిన కొరడాతో కొట్టినప్పుడు అది కేవలం తల వూపింది. తిట్టి మళ్లీ కొట్టినప్పుడు బండి జ్వరమొచ్చినట్టుగా కీచుమని శబ్దం చేస్తూ వణికింది. మూడో దెబ్బకు బండి అటూ ఇటూ వూగింది. ఇక, నాలుగో దెబ్బకు ముందుకు కదిలింది.
‘‘దారి పొడుగునా మన ప్రయాణం ఇలాగే వుంటుందా?’’ అడిగాడు సర్వేయర్. తీవ్రమైన కుదుపులను అనుభవిస్తూ, మెల్లగా నత్తనడకలాంటి ప్రయాణాన్ని కడుపు మెలిపెట్టే కుదుపులతో మేళవించగల రష్యన్ డ్రైవర్ల నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాడు.
‘‘కంగారు పడకండి! మనం వెళ్లాల్సిన చోటుకు చేరుకుంటాం. పిల్ల గుర్రం చురుకైంది. కొంచెం వూపందుకుంటే ఇక దాన్ని ఆపడం మన తరం కాదు. హే.. హెయ్.. హెయ్.. పద.. నీ దుంపదెగ!’’
సంధ్యాసమయం. బండి స్టేషన్ నుంచి బయలుదేరింది. సర్వేయర్ కు కుడివైపు చీకటిగా గడ్డకట్టిన మైదానం అంతులేకుండా విస్తరించి ఉంది… మైదానం గుండా ప్రయాణం చేస్తే ప్రపంచం అంచుకు చేరుకుంటారు. ఆకాశంలో కలిసిపోయి కనుమరుగయ్యే దిగంతంలో శీతల శరత్కాల సూర్యాస్తమయం నీరసంగా వుంది. రహదారికి ఎడమవైపు చీకటి ముసురుకుంటున్న గాలిలో అస్పష్టంగా కొన్ని దిబ్బలు పైకి లేచాయి. బహుశా అవి మునుపటి ఏడాది నాటి గడ్డివాములు కావచ్చు. లేదా గ్రామాలు కావచ్చు. తనకు ముందువైపు ఏముందో సర్వేయర్ కు కనిపించడం లేదు. అతని దృష్టి పథానికి బండితోలేవాడి విశాలమైన వీపు అడ్డంగా వుంది. అంతా నిశ్శబ్దంగా వుంది. కానీ, చలిగా, మంచుతో గడ్డకట్టి వుంది.
‘‘అబ్బా! ఏం అరణ్యం!’’ అనుకుంటూ సర్వేయర్ తన కోటు కాలర్ తో చెవులు కప్పుకున్నాడు. ‘‘ఎక్కడా ఒక ఇల్లూ, వాకిలీ కనిపించడం లేదు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. నా మీద దాడిచేసి దోచుకోవచ్చు. ఫిరంగులు పేల్చినా ఎవరికీ తెలీకపోవచ్చు. ఇక ఈ బండివాడు… నమ్మదగిన మనిషిలా కనిపించడం లేదు. వాడి వీపు చూడు… ముఖం కూడా క్రూరంగా, అనుమానాస్పదంగా వుంది! వాడు మీద చేయి వేస్తే చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.’’
‘‘ఇదుగో మిత్రమా! నీ పేరేంటి?’’- అడిగాడు సర్వేయర్.
‘‘నా పేరా? క్లిమ్!’’
‘‘ఈ పరిసరాలు ఎలాంటివి క్లిమ్? ప్రమాదకరమైన ప్రదేశమా? ఏవైనా జరగరానివి జరుగుతాయా?’’
‘‘ఫర్వాలేదు. దేవుడి దయ! అలాంటివేమీ లేవు. అయినా అల్లరి చేయడానికి ఇక్కడ ఎవరున్నారు?’’
‘‘ఎవరూ అల్లరి చేయకపోవడం మంచిదే. కానీ, ఎందుకైనా మంచిదని ముందుజాగ్రత్తగా మూడు రివాల్వర్లు వెంట తీసుకొచ్చాను.’’ అని సర్వేయర్ అబద్ధం చెప్పాడు. ‘‘రివాల్వర్ అంటే అల్లాటప్పా విషయం కాదు.. తెల్సా? పదిమంది బందిపోట్లనైనా నేను ఎదుర్కోగలను.’’
చీకటి పడింది. బండి హఠాత్తుగా కీచుమని, కిర్రుమని శబ్దం చేస్తూ వణికి ఇష్టం లేనట్టుగా ఎడమవైపు తిరిగింది.
‘‘ఎక్కడికి తీసుకెళ్తున్నాడు నన్ను?’’ సర్వేయర్ బిత్తరపోయాడు. నేరుగా పోతూ పోతూ బండివాడు బండిని ఎడమవైపు మళ్లించాడు. ‘‘సర్వేయర్ మనసులో అనుకున్నాడు. ‘‘ఒకవేళ ఈ దుర్మార్గుడు ఏదైనా దుర్గమ ప్రదేశానికి తీసుకెళ్లి.. ఇలాంటి ఘటనలేమైనా జరిగాయా?’’
‘‘చూడు! ఈ చుట్టు పట్ల ప్రమాదమేమీ లేదంటున్నావు కదా! ప్చ్..! బందిపోట్లతో పోరాటమంటే నాకు సరదా. నేను బక్కగా బలహీనంగా కనిపిస్తున్నాను. కానీ ఎద్దులా బలిష్టుణ్ణి! ఒకసారి ముగ్గురు బందిపోట్లు నా మీద దాడి చేశారు. నీకేమనిపిస్తోంది? నేను వాళ్లలో ఒకణ్ణి చితకబాదాను. వాడు సరాసరి పైకి ప్రయాణం కట్టాడు. అర్థమైందా? తక్కిన ఇద్దరూ నా కారణంగా సైబీరియాలోకఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మరి నాకు బలం ఎక్కణ్ణించి వస్తుందో తెలీదు. నీలాంటివాణ్ణి ఒకణ్ణి ఒంటిచేత్తో పట్టుకుని మట్టి కరిపించగలను.’’
క్లిమ్ వెనక్కు తిరిగి సర్వేయర్ ను చూసి, ముఖం చిట్లించి గుర్రానికి కొరడా దెబ్బ రుచి చూపించాడు.
‘‘అవును సోదరా!’’ సర్వేయర్ కొనసాగించాడు. ‘‘నాతో బాహాబాహీ పోరుకు సిద్ధపడేవాణ్ణి దేవుడే కాపాడాలి. కాళ్లూ చేతులూ పోగొట్టుకోవడమే కాదు. ఆ దొంగ న్యాయస్థానానికి కూడా జవాబు చెప్పుకోవాల్సి వుంటుంది… న్యాయమూర్తులు, పోలీసు అధికార్లు అందరూ నాకు తెలుసు. నేను ప్రభుత్వోద్యోగిని. ముఖ్యమైన వ్యక్తిని. నేను ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఆ విషయం పై అధికారులకు ఎరుకే! నాకు ఎవరూ హాని తలపెట్టకుండా ఒక కన్నేసి వుంచుతారు. దారి పొడుగునా పొదల చాటున పోలీసు అధికారులు కాపు కాస్తున్నారు. ఆపు.. ఆపు.. ఆపు..!’’ గట్టిగా కేక పెట్టాడు సర్వేయర్ వున్నట్లుండి. ‘‘నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు?’’
‘‘ఏంటి మీకు కనిపించడం లేదా? ఇది అడవి!’’
‘‘అవున్నిజమే! ఇది అడవి..’’ సర్వేయర్ అనుకున్నాడు మనసులో నాకు భయమేసింది. అయినా నా కలవరపాటును బయటికి కనపడనీయకూడదు… నేను కంగారు పడుతున్నానని బండివాడికి ఇప్పటికే తెలిసిపోయింది. ఎందుకు వాడు మళ్లీ మళ్లీ వెనక్కు తిరిగి నా వైపు చూస్తున్నాడు? బహుశా ఏదైనా కుట్ర చేస్తున్నాడేమో!.. ఇంతకు ముందు బండి నెమ్మదిగా నడిపాడు. ఇప్పుడు చూడు ఎలా వురికిస్తున్నాడో!’’
‘‘చూడు క్లిమ్! గుర్రాన్ని ఎందుకలా వేగంగా పరుగెత్తిస్తున్నావు?’’
‘‘నేను దాన్ని తరమడం లేదు. అది వేగం అందుకుంది. ఒక్కసారి వేగం అందుకుంటే దాన్ని ఆపడం సాధ్యం కాదు. పైగా దానికాళ్లు అలా వంకరగా వుండటం దానికిష్టం లేదు.’’
‘‘నువ్వు అబద్ధం చెప్తున్నావు మిత్రమా! నాకు బాగా అర్థమవుతోంది. మరీ అంతవేగంగా వెళ్లొద్దు. వింటున్నావా? గుర్రాన్ని కొంచెం అదుపు చెయ్!’’
‘‘ఎందుకు?’’
‘‘ఎందుకంటే, నా తర్వాత నలుగురు సహచరులు స్టేషన్ నుంచి బయల్దేరి నా కోసం వస్తున్నారు. వాళ్లు మనల్ని అందుకోవాలి. ఈ అడవిలో నన్ను కలుస్తామని మాటిచ్చారు. వాళ్లతో కలిసి ప్రయాణం చేయడం ఇంకా సరదాగా వుంటుంది… వాళ్లు ఆరోగ్యంగా దృఢంగా వున్నారు. వాళ్లలో ఒక్కొక్కరి దగ్గరా ఒక పిస్తోలు వుంది. ఎందుకు నువ్వు మాటిమాటికీ వెనక్కు తిరిగి చూస్తూ ముళ్లమీద కూచున్నట్లు కంగారు పడుతున్నావు? ఏంటి? నావైపు వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. నా దగ్గర పిస్తోళ్లు వున్నాయి తప్ప నేనేమీ వింత మనిషిని కాదు.- వాటిని బయటకు తీసి చూపించమంటావా? … నీకు ఇష్టమైతే..’’
సర్వేయర్ తన జేబులు వెతుకుతున్నట్టు నటించాడు. ఆ క్షణంలో అతడు వూహించనిది జరిగింది. క్లిమ్ హఠాత్తుగా బండిలోనుంచి బయటకు దూకాడు. మోకాళ్లు మోచేతుల మీద వేగంగా పొదలవైపు పాకుతూ వెళ్లాడు.
‘‘హెల్ప్! హెల్ప్!’’ అంటూ అరిచాడు. ‘‘దుర్మార్గుడు! కావాలంటే బండిని, గుర్రాన్ని తీసుకెళ్లు.. నన్నేం చేయొద్దు’’
వేగంగా అడుగులు వెనక్కు వేస్తున్నట్లు పొదల్లోంచి సరసరమని శబ్దం వినిపించింది. తర్వాత అంతా నిశ్శబ్దం… అలా జరుగుతుందని వూహించని సర్వేయర్ ముందుగా గుర్రాన్ని ఆపాడు. తర్వాత బండిలో సౌకర్యంగా కూచుని ఆలోచించడం మొదలెట్టాడు. బండివాడు పారిపోయాడు… వెర్రోడు- భయపడ్డాడు. సరే! ఇప్పుడు నేనేం చేయాలి? ఒంటరిగా ముందుకు వెళ్లలేను. నాకు దారి తెలీదు కదా! పైగా నేను వాడి గుర్రాన్ని దొంగిలించానని భావించవచ్చు. ఇప్పుడేం చెయ్యాలి?’’
‘‘క్లిమ్! క్లిమ్!’’
‘‘క్లిమ్!’’ జవాబుగా ప్రతిధ్వని వినిపించింది.
రాత్రంతా చీట్లో అడవిలో తోడేళ్ల అరుపులు, ప్రతిధ్వనులు, బక్క గుర్రం సకిలింపులు తప్ప మరేమీ వినిపించవు అన్న ఆలోచనే ఒళ్ళు జలదరింపజేసింది- సర్వేయర్ కు.
‘‘క్లిమూష్క!’’ అతడు అరిచాడు.,. ‘‘ఎక్కడున్నావు మిత్రమా?’’
సర్వేయర్ రెండుగంటలపాటు అరిచాడు. గొంతు బొంగురుపోయింది. ఆ రాత్రి అడవిలోనే గడపాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక బలహీనమైన వాయుతరంగం ఎవరో మూలుగుతున్న శబ్దాన్ని మోసుకొచ్చింది.
‘‘క్లిమ్! నువ్వేనా మిత్రమా? పద వెళ్దాం!’’
‘‘నువ్వు నన్ను చంపేస్తావు!’’
‘‘నేను కొంచెం తమాషాకు చేశాను. దేవుడా! నన్ను క్షమించు. నేను.. తమాషాకు చేశాను- నా దగ్గరేవో పిస్తోళ్లు వున్నట్లు.. నేనుభయంతో అబద్ధం చెప్పాను- నాకు సాయం చెయ్… పద పోదాం! చలికి గడ్డకట్టుకపోతాను!’’
నిజమైన దొంగ అయితే తన బండితో సహా గుర్రాన్ని మాయం చేసి వుండేవాడని గ్రహించిన క్లిమ్ అడివిలోంచి బయటికొచ్చి సంకోచిస్తూ సర్వేయర్ ను సమీపించాడు.
‘‘ఏమైందిరా వెధవా! ఎందుకు భయపడ్డావు. నేను.. నేనేదో సరదాగా అన్నాను. నువ్వు భయపడ్డావు. రా.. లోపలికొచ్చి కూచో!’’
‘‘అయ్యా! దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.’’ బండెక్కుతూ క్లిమ్ గొణిగాడు. నాకు ముందే తెలిసుంటే వంద రూబుళ్లిస్తానన్నా మీకు బండి కట్టేవాణ్ని కాదు. భయపడి చచ్చాను.
క్లిమ్ గుర్రాన్ని కొరడాతో కొట్టాడు. బండి వణికింది. క్లిమ్ మళ్లీ కొట్టాడు. బండి వూగింది. మూడో దెబ్బ పడగానే బండి ముందుకు కదిలింది. సర్వేయర్ కోటు కాలర్ తో చెవులు కప్పుకుని ఆలోచనలో పడ్డాడు. అతనికి ఆ దారి గానీ, క్లిమ్ గానీ ఆ తర్వాత ప్రమాదకరంగా కనిపించలేదు.
![]()
1885లో ప్రచురితం
వివరణ :
వెర్త్స్ : పూర్వం రష్యాలో దూరాన్ని తెలిపే యూనిట్. 1 వెర్త్స్ 1.6 మైళ్లకు సమానం.

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.
అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం



Discussion about this post