మూలం : ఆంటన్ పావ్లోవిచ్ చెహోవ్
తెలుగు సేత: చింతకుంట్ల సంపత్ రెడ్డి
అది క్రిస్మస్ ముందు రోజు. వాంక ఝుకోవ్ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు. మూడు నెలల నుండి బూట్లు తయారు చేసే ఆల్యాహిన్ దగ్గర పని నేర్చుకుంటున్నాడు. రాత్రి ప్రార్థనలకు వెళ్లిన యజమాని, ఆయన భార్య, మిగతా పనివారి కోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉన్నాడు. యజమాని అల్మారాలో నుండి ఓ తుప్పుపట్టిన పాళీ ఉన్న పెన్ను, సిరాబుడ్డి తీశాడు. ఓ నలిగిపోయిన కాగితాన్ని తన ముందర పరచుకుని రాయడం మొదలుపెట్టాడు.
మొదటి అక్షరం పూర్తయేలోపునే భయం భయంగా ఎన్నోసార్లు తలుపులు, కిటికీల వైపు చూశాడు. రహస్యంగా ఓసారి గోడపై ఉన్న నల్లటి శిలువ వైపు చూశాడు. దానికి రెండు వైపులా అరల్లో బూట్ల తయారీలో వాడే కర్ర అచ్చులు ఉన్నాయి. బెంచి మీద పరచిన కాగితం పైకి వంగాడు.
“తాతయ్య కాన్ స్టంటిన్ మకరిచ్,
నేను నీకో ఉత్తరం రాస్తున్నాను. నేను నీకు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపుతున్నాను. దేవుడు ఆయన ఆశీస్సులు నీకు పంపిస్తాడని ఆశిస్తున్నాను. నాకు అమ్మా, నాన్న లేరు. ఉన్న ఒక్కడివి నువ్వు నన్ను వదిలేశావు.”
కళ్లు పైకెత్తి మళ్లీ ఓసారి ఆ నల్లటి శిలువ వైపు చూశాడు. కొవ్వొత్తి దీపపు వెలుతురులో అది మెరిసిపోతున్నది. తాతయ్య కాన్ స్టంటిన్ మకరిచ్ చేసే పనులన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆయన ఝివారెవ్ కుటుంబం కోసం రాత్రి చౌకీదార్ గా పనిచేస్తూ ఉంటాడు. అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడు. బక్కపలచగా ఉన్నప్పటికీ, చాలా చురుగ్గా, తాగి ఉబ్బిపోయిన కళ్లతో, చెరిగిపోని చిరునవ్వుతో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. పగలంతా నౌకర్ల వంటశాలలో పడుకుంటాడు. లేదంటే, ఆ వంటవారితోనే హాస్యాలాడుతూ సమయం గడుపుతాడు. రాత్రిళ్లు వీలైనంత మేరకు గొర్రెతోలు కప్పుకుని తన కర్రను దాటిస్తూ శబ్దం చేస్తూ గస్తీ తిరుగుతాడు. ముసలి కష్తాంకా తల ఊపుకుంటూ అతన్ని అనుసరిస్తూ ఉంటుంది. దానితో పాటు మరో కుక్క ఈల్ కూడా అలాగే చెవులు కిందకి వాల్చి అతని వెనకాలే వెళుతూ ఉంటుంది. అది నల్లటి రంగులో ముంగిస ఆకారంలో ఉంటుంది. అందుకే దాన్ని ఆ పేరుతో పిలుస్తారు. పొడవాటి శరీరంతో ఉండే అది అందరితో చాలా మర్యాదగా, ప్రేమగా ఉంటుంది. కానీ దానికి మంచి పేరు లేదు. దాని మర్యాద, నమ్రత వెనక అంతులేని నక్కజిత్తులు దాగివుంటాయి. చాలా నేర్పుగా ఎవరి కాళ్ళ సందులోనో దూరి అది ఏ స్టోర్ రూమ్‌లోకో వెళుతుంది లేదా ఏ రైతుదో ఓ కోడిపిల్లను మాయం చేస్తుంది. ఎన్నోసార్లు దాని వెనక కాళ్లను లాగేసేవారు. ఓ రెండు సార్లు ఉరి వేశారు. వారంలో ఒకటి రెండు సార్లయినా ఎవరో ఒకరు దాన్ని తన్ని తగలేస్తారు. అయినా మొత్తానికి ఎలాగో బ్రతికి బయటపడుతుంది.
అనుమానం లేదు. ఈ సమయంలో తాతయ్య గేటు దగ్గర నిలబడి ఎత్తైన తన ఫెల్ట్ బూట్లు శబ్దం చేస్తూ కళ్లు చికిలించి చర్చికి ఉన్న ఎర్రటి కిటికీలను చూస్తూ నౌకర్లతో పరాచికాలు ఆడుతూ ఉంటాడు. ఆయన బెల్ట్ నుండి కర్ర వేలాడుతూ ఉంటుంది. చలికి వణుకుతూ చేతులు దగ్గరికి ముడుచుకుని గలగలా నవ్వుతూ ఆ ఇంటి పనిమనిషినో, వంటావిడనో గేలిచేస్తూ ఉంటాడు.
“నశ్యం పిలుస్తావా?” అని అడుగుతూ వాళ్లకు నశ్యం డబ్బా ఇస్తాడు.
వాళ్ళు ఆ నశ్యం పీల్చి తుమ్ముతూ ఉండేవారు. వర్ణించనలవి గాని సంతోషం అతనిలో వ్యక్తమయ్యేది. పడిపడి గలగలా నవ్వుతూ “అది గడ్డకట్టింది. పైపొర తీసేయ్” అని అరిచేవాడు.
వాళ్ళు ఆ కుక్కను కూడా కొంచం నశ్యం పీల్చేలా చేసేవారు. కష్తాంకా తల విదిలిస్తూ భయపడి దూరంగా వెళ్లిపోయేది. ఈల్ పీల్చేది కాదు.ఎంతో అణుకువగా తోక ఊపుతూ నిలబడి ఉండేది. వాతావరణం బాగుంది. గాలి ఉండీలేనట్టుగా వీస్తున్నది. అన్నీ స్వచ్ఛంగా స్పష్టంగా కనపడుతున్నాయి. చీకటి పడినప్పటికీ, మంచు నిండిన తెల్లటి ఇళ్ల పైకప్పులు, చిమ్నిలోనుండి పైకి వచ్చే పొగ, మంచుతో మెరిసే చెట్లు, మంచుదిబ్బలు అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. ఆకాశమంతటా పరుచుకుని మిలమిలా సంతోషంగా మెరిసిపోయే నక్షత్రాలు, సెలవు కోసం శుభ్రంగా తోమి మెరుగు పెట్టినట్టు పాలపుంత వెండి రంగులో మెరుస్తూ ఉంది…
వాంక నిట్టూర్పు విడిచాడు. సిరాబుడ్డిలో పెన్ను ముంచి రాయడం మొదలుపెట్టాడు:
“రాత్రి నేను బాగా దెబ్బలు తిన్నాను. మా యజమాని నా జుట్టు పట్టుకుని… బయటకు ఈడ్చుకెళ్ళి… తోలు పటకాతో వొళ్ళు చిరేశాడు. ఎందుకంటే, వాళ్ళ పాపను ఉయల ఉపుతూ నేను నిద్రలోకి జారుకున్నాను. మరింకా… పోయినవారం ఓ రోజు, మా యజమానురాలు చేప తిత్తి తీయమంటే నేను తోక దగ్గర్నుండి మొదలుపెట్టాను. ఆమేమో చేపను తీసుకుని నా మొఖం మీద మోదింది. మిగతా పనివాళ్ళు నన్ను ఆటపట్టిస్తుంటారు. వాళ్ళు నన్ను వోడ్కా తేవడానికి మద్యం దుకాణానికి పంపిస్తుంటారు. వాళ్ళు… యజమాని దోసకాయల్ని దొంగతనంగా తెమ్మంటారు. యజమానేమో ఏది తన చేతికి ముందు దొరికితే, దానితోనే నన్ను కొడతాడు. ఇక తినడానికైతే ఏమీలేదు. పొద్దునా, సాయంత్రం బ్రెడ్ ఇస్తారు. రాత్రి భోజనానికి గంజి పోస్తారు. వాళ్ళు మాత్రం, టీ గానీ క్యాబేజ్ సూప్ గానీ మిగలకుండా జుర్రేస్తారు. కానీ, నాకు మాత్రం ఎప్పుడూ ఇవ్వరు. నన్ను దారిలో పడుకోమంటారు. ఇక వాళ్ళ పాప ఏడిస్తే… నాకు నిద్ర ఉండదు. నేను ఊయల ఊపాలి. ప్రియమైన తాతా, దయచేసి నన్ను ఇక్కడినుండి తీసుకెళ్లు. నన్ను ఇంటికి… ఊరికి తీసుకెళ్లు. నేను ఇక ఎంతమాత్రమూ భరించలేను. ఓహ్! తాతయ్యా, నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను. నేను మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. తప్పకుండా నన్నిక్కడ్నుండి తీసికెళ్ళండి లేదా నేను చచ్చిపోతాను.”
వాంక నోరు తెరుచుకున్నది. మురికి పిడికిలితో కళ్లు రుద్దుకున్నాడు. వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టాడు. “నేను నీకోసం నశ్యం నూరుతాను. నీకోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నేను అల్లరి చేస్తే, నీ ఇష్టమొచ్చినట్టు కొట్టు. ఒకవేళ… నాకోసం ఏమీ పనిదొరకదు అనుకొంటే, స్తీవార్డ్ ను… నామీద దయతలచి బూట్లు తుడిచే పని ఇవ్వమని అడుగుతాను. లేదంటే ఫెద్యా బదులుగా నేను గొర్రెలకాపరి పనిచేస్తాను. ప్రియమైన తాతా, నేను భరించలేను. ఈ పని నన్ను చంపేస్తున్నది. నేను పారిపోయి కాలినడకన మన ఊరికి వొచ్చేద్దామనుకొన్నాను. కానీ, నాకు బూట్లు లేవు. మంచును చూసి భయమేస్తున్నది. నేను పెద్దవాడినయ్యింతర్వాత నిన్ను బాగా చూసుకొంటాను. ఎవ్వరూ నిన్ను భాధపెట్టకుండా చూసుకొంటాను. నువ్వు చనిపోయింతర్వాత నేను అమ్మకు చేసినట్లుగా… నీ ఆత్మశాంతికై ప్రార్థనలు చేస్తాను.
మాస్కో ఎంత పెద్ద పట్టణమంటే… ఇక్కడ ఎన్నో పెద్దవాళ్ళ భవనాలు, మరెన్నో గుర్రాలు వున్నాయి. కానీ గొర్రెలు లేవు. కుక్కలు కూడా భీకరంగా ఉండవు. క్రిస్మస్ వొచ్చినపుడు అబ్బాయిలు… స్టార్స్ తయారు చేయరు. చర్చీల్లో… వాళ్ళు మనల్ని పాడనివ్వరు. ఓసారి ఓ షాపులో పెద్ద చేపల గాలం చూశాను. దానితో ముప్పై పౌన్ల బరువున్న షీట్ చేపనైనా సరే పట్టుకోవొచ్చు. షాపుల్లో… ఇంకా… నేను అనేక రకాల తుపాకులు చూశాను. మా యజమాని దగ్గర వున్న తుపాకి లాంటిది కూడా. అవి ఒక వంద రూబుళ్ళ ఖరీదు ఉండవచ్చు. మాంసం కొట్టులో సీమకోళ్లు, కుందేళ్ళ మాంసం అమ్ముతారు. కానీ వాటిని ఎక్కడ చంపి తెస్తారో చెప్పరు.
ప్రియమైన తాతా, ఈసారి పెద్దింట్లో క్రిస్మస్ చెట్టు పెట్టినపుడు, నాకోసం బంగారు పూతపూసిన బంతిని ఒకదాన్ని తీసి ఆకుపచ్చ పెట్టెలో దాచిపెట్టు. అది వాంకా కోసమని ఓల్గా ఇగ్నాట్ వెవ్నాకు చెప్పు.”
వాంక పెద్దగా నిట్టూర్పు విడిచాడు. మళ్లీ ఓసారి కిటికీ వైపు చూశాడు. యజమాని కోసం క్రిస్మస్ చెట్టు తేవడానికి తాతయ్య ఎలా అడవికి వెళ్తాడో గుర్తుకు తెచ్చుకున్నాడు. తనను కూడా తీసుకెళ్లేవాడు తాతయ్య. ఎంత సంతోషంగా ఉండేవో ఆరోజులు. తాతయ్య గొంతులోని కిచ్‌కిచ్ శబ్దంతో అడవిలోని మంచు పగుళ్ళ శబ్దం జతకూడేది. అది విని తాను కిల కిల నవ్వేవాడు. చెట్టు కొట్టే ముందు తాతయ్య చుట్ట కాల్చేవాడు. నెమ్మదిగా నశ్యం పీలుస్తూ, చలికి వణుకుతున్న వాంక వైపు చూసి నవ్వేవాడు. తమలో చావు ఎవరిదో అనుకుంటూ… మంచు నిండిన లేత దేవదారు వృక్షాలు చలనం లేకుండా నిలబడి ఉండేవి. మంచును విదిలిస్తూ ఎటునుండో బాణంలాగా ఓ కుందేలు దూసుకుపోయేది. “పట్టుకో పట్టుకో ఆ చిట్టి దయ్యాన్ని.” అని అరవకుండా ఉండలేకపోయేవాడు తాతయ్య.
చెట్టు నరికిన తర్వాత తాతయ్య దాన్ని ఆ పెద్ద ఇంటిదాకా లాక్కుపోయి అలంకరించడం మొదలు పెట్టేవాడు. అందరికన్నా ఎక్కువగా ఓల్గా ఇగ్నాట్ వెవ్నా హడావుడిగా తిరుగుతూ ఉండేది. ఆమె అంటే వాంకకు చాలా ఇష్టం. ఇంట్లోనే పనిచేసే వాళ్ళ అమ్మ ఫెలగెయా బ్రతికి ఉన్నప్పుడు వాంకకు ఇష్టమైనవి అన్ని ఇస్తూ ఉండేది. ఆమెకు పని లేనప్పుడు వాంకకు చదవడం, రాయడం, వంద వరకు లెక్కించడం నేర్పింది. రెండు జంటలుగా నలుగురు కలిసి చేసే నాట్యం కూడా నేర్పింది. ఫెలగెయా చనిపోయిన తర్వాత వాంకను పనివాళ్ల వంటశాలలో ఉండే తాతయ్య దగ్గరకు… అక్కడ నుండి మాస్కోలో ఉండే మోచి దగ్గరకు పంపించారు.
వాంక మళ్లీ రాయడం మొదలుపెట్టాడు, “నా దగ్గరకు వొచ్చేయ్ తాతా! నేను నీకు దండం పెడతాను. నన్నిక్కడ్నుండి తీసికెళ్ళు. ఈ అనాథ పిల్లాడి మీద జాలి చూపించు. నన్ను వాళ్ళు ఎప్పుడూ కొడుతూనే ఉంటారు. నాకెప్పుడూ ఆకలిగా ఉంటున్నది. నేనెంత కష్టంలో ఉన్నానో చెప్పలేను. నేనెప్పుడూ ఏడుస్తూనే వున్నాను. యజమాని ఓ రోజు నా తలమీద బూటుచేసే చెక్కతో కొట్టాడు. నేను కింద పడ్డాను. మళ్ళీ ఎప్పుడూ దెబ్బలు తినొద్దనుకొన్నాను. నాది కుక్క బతుకు కంటే హీనమై పోయింది. అల్యోసాను, ఒంటికన్ను యేగోర్ ను, బండివాణ్ని అడిగానని చెప్పు. నా హార్మోని పెట్టె ఎవరికీ ఇవ్వొద్దు. ఇక వుంటాను.”
“నేను-నీ మనవడు, ఇవాన్ ఝుకోవ్ – తాతా తప్పకుండా రా!”
వాంక ఆ కాగితాన్ని రెండు మడతలు పెట్టాడు. ఓ కోపెక్ పెట్టి ఓ రోజు ముందుగానే కొన్న కవర్లో ఆ ఉత్తరాన్ని పెట్టాడు. ఒక్క క్షణం ఆలోచించి పెన్ను ముంచి దాని పైన అడ్రెస్ రాశాడు:
మా ఊరిలోని తాతయ్యకు…
బుర్ర గోక్కుని కాసేపు ఆలోచించాడు కవర్ మీద ‘కాన్‌స్టాంటిన్ మకరిచ్’ అని రాశాడు. ఉత్తరం రాస్తున్నప్పుడు ఎవరూ రాకపోవడం అతనికి ఆనందంగా ఉంది. తలకు టోపీ పెట్టుకుని, పెద్ద కోట్ కూడా తోడుక్కోకుండానే వీధిలోకి పరుగు తీశాడు.
అంతకు ముందు రోజే వాంక ప్రశ్నలకు జవాబిస్తూ కసాయి కొట్టువాడు… పోస్టు బాక్స్ లో వేసే ఉత్తరాలను భూగోళమంతటికీ తాగుబోతు జట్కా బండి వాళ్ళు గంటలు మోగిస్తూ అన్ని చోట్లకు చేరుస్తారని చెప్పాడు. దగ్గర్లో ఉన్న పోస్టు బాక్స్ చీలికలో నుండి ఆ విలువైన ఉత్తరాన్ని పడేశాడు వాంక.
ఓ గంట తర్వాత తీయటి ఆశలతో గాఢనిద్రలోకి జారుకున్నాడు. కలలో తాతయ్య పొయ్యి దగ్గర కూర్చొని, కాళ్లు ఊపుతూ… తన ఉత్తరాన్ని వంటవారికి చదివి వినిపిస్తున్నాడు.
పొయ్యి పక్కనే ఈల్ తన తోక ఊపుతూ వింటూ ఉన్నది.
![]()
73 ఏళ్ల సంపత్ రెడ్డి ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లిష్), పి.జి.సి.టి.ఐ (CIEFL) చదివారు. సాంకేతిక విద్యాశాఖలో ఇంగ్లిష్ లెక్చరర్ గా చేసి… 2011 లో హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ గా రిటైరయ్యారు. పుస్తకాలు చదవడం, అనువాదాలు చేయడం, ఫోటోగ్రఫీ ఆయన వ్యసనాలు
అత్యధికంగా అమ్ముడయే గ్రామర్ పుస్తకాల్లో ఒకటైన English Grammar Fundas (తెలుగు వివరణలతో) ప్రచురించారు. అనువాదాలు.. 1. మనుబెహన్ గాంధీ రచన బాపు-నా మాతృమూర్తి, 2. భిన్న దేశాల విభిన్న ఉత్తరాలు-ఉపన్యాసాలు (32 ఉత్తరాలు-32 ఉపన్యాసాల సంకలనం) 3. భిన్న దేశాల విభిన్న కవిత్వం (అనువాద కవితల సంకలనం) 4. హిందువులకో ఉత్తరం- లియో టాల్స్టాయ్ 5. సామ్యవాదం నుండి సర్వోదయ వరకు- లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వెలువడ్డాయి.
ఫోటోగ్రఫీ ఆసక్తి: తెలుపునలుపు ఛాయాచిత్రపు రోజుల్లో ఏతావాతా తీసిన ఫోటోలు కొన్ని భారతదేశంలోని అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శితమయ్యాయి. 1982 లో ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ (FIP) వారు నెలనెలా నిర్వహించిన మెంబర్స్ మంత్లీ కాంపిటేషన్ ‘బిగినర్స్ సెక్షన్’ ఫోటో పోటీలో “గ్రాండ్ అవార్డ్” (సిల్వర్ మెడల్) అవార్డు. 1984 లో ‘Decade of the Girl Child (1975-85) కార్యక్రమాల్లో భాగంగా UNICEF నిర్వహించిన Focus on the Girl Child ఫోటో పోటీలో 2200 మంది ఫోటోగ్రాఫర్లు పంపిన 6500 చిత్రాలలో మొత్తం 150 చిత్రాలు ఎంపిక కాగా, నా చిత్రాలు మూటికి మూడు (3) “గ్రాండ్ జ్యూరి అవార్డ్” గెలుచుకున్నాయి. అక్టోబర్, 2025 లో ప్రపంచ వన్యప్రాణి సంస్థ (WWF), తెలంగాణా అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో రెండవ బహుమతి.



